Sunday, July 25, 2021

ఆకాశవాణి

 తెలుగు భాషకే వన్నె తెచ్చిన 'ప్రేమించు కామించు పిల్లోడా' లాంటి పాటకి పాతికేళ్ళు, పనికిరాని సినిమాలకి పాతికేళ్ళు, ముప్ఫైయేళ్ళు  అని సెలిబ్రేట్ చేస్తున్న మన తెలుగు ఛానెళ్ళకి ఆకాశవాణి జూలై23 న తొంభైనాలుగేళ్ళు పూర్తి చేసుకుంది అని ఎలా గుర్తుంటుంది?

ఉదయం 5.50కి. మెలకువ రాగానే ఇప్పుడైతే ప్రక్కనే ఉన్న మొబైల్‌ఫోను  చేతిలోకి తీసుకుంటున్నాము కానీ చిన్నతనములో అయితే ముందర మంచం దిగి వెళ్ళి రేడియో పెట్టేవాళ్ళము.ఒకవేళ ఇంకా కార్యక్రమాలు మొదలవ్వక ముందు వచ్చే 'కూ...' అనే సిగ్నల్ వస్తోంటే మాత్రం కాస్త సౌండు తగ్గించి వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసరికి వందేమాతరం మొదలయ్యేది.ఆ తరువాత దేశభక్తి గీతం, సూక్తిసుధ అయ్యేసరికి అమ్మ స్టవ్వు వెలిగించి ఫిల్టర్ వేసే సమయానికి శాంతమ్మ పాలు తీసుకుని వచ్చేది.

ఆరుగంటల ఐదు నిమిషాలకి వచ్చే ఇంగ్లీషు వార్తల్లో "దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో, ద న్యూస్, రెడ్ బై " అనే గంభీర స్వరం వినగానే ఏదో తెలీని ఆనందం, ఆ డిక్షన్ని అనుకరించడానికి చేసే ప్రయత్నం ఒక మధురఙాపకం.

ఇంగ్లీషు వార్తలవ్వగానే భక్తిరంజనిలో శ్రీ చిత్తరంజన్‌గారు ఆలపించిన కీర్తనలు, మల్లాది సూరిబాబు బృందం ఆలపించిన స్తోత్రాలు, మంగళం పల్లి వారి తత్వాలు, శనివారమయితే ఒక బ్రాండుగా స్థిరపడిపోయిన తి.తి.దే. ఆస్థాన పండితుల సుప్రభాతం, ప్రపత్తి, మంగళాశాసనం, ఆదివారమయితే కీ.శే.బాలాంత్రపు వారు రచించిన "శ్రీ సూర్యనారాయణా మేలుకో" గీతమో  లేదా ఆదిత్య హృదయమో వచ్చేది.

భక్తిరంజని అవ్వగానే పొలంపనుల కార్యక్రమం.పొలంపనుల కార్యక్రమానికి ముందు వచ్చే 'ఫ్యాక్టం ఫాస్ ఇరవై ఇరవై, అన్ని పంటలకు ఎరువెయ్ ఎరువెయ్' అన్న యాడ్ ఇప్పటికీ చాలా మందికి గుర్తే, అది కాకపోతే నాగార్జున యూరియా యాడ్.పొలంపనులు అయ్యేలోపు మేము స్నానం చేసి స్కూలు డ్రెస్సు వేసుకునేవాళ్ళము.

స్నానం గట్రా చెయ్యకుండా ఇంకా వాకిట్లో ఆడుకుంటోంటే మా ప్రక్కన ఉండే అత్తయ్యగారు "పొలం పనులైపోయాయి, స్కూలుకెళ్ళట్లేదా ఈరోజు" అనేవారు. అంటే సమయం ఆరూ నలభై ఐదన్నమాట.

పొలంపనులు ముగియగానే కొప్పుల సుబ్బారావుగారో, ప్రయాగవారో ప్రాంతీయ వార్తలని అరవకుండా  వార్తని వార్తలా చదివి వినిపించడానికి సిద్ధముగా ఉండేవారు.'అల్పపీడనం', 'ఈదురుగాలులతో కూడిన భారీవర్షం' లాంటి పదాలని మా తరానికి పరిచయం చేసింది రేడియోనే కదా.వాళ్ళు వార్తలు ముగించే సమయానికి కుక్కరు మూడు కూతలు పెట్టేసేది.ఆ వెంటనే బలదేవానంద్ సాగర్ గొంతులోంచి సంస్కృత వార్తలు, వార్తలు అర్ధం కాకపోయినా 'సంప్రతి వార్తాహ షూయంతాం, ప్రవాచిక బలదేవానంద్ సాగరః' అన్న వాక్యం మాత్రం పిల్లలందరికీ కంఠతః వచ్చి ఉండేది.  

సంస్కృతంలో  అర్ధం కాని వార్తలు వచ్చేసరికల్లా పారాచూట్ కొబ్బరి నూనె సీసా, దువ్వెన్న పట్టుకుని  జడలు వేయించుకోవడానికి (జడలు లేనప్పుడు ఉన్న ఆ పొట్టి క్రాఫింగుని దున్ని దువ్వించుకోవడానికి) అమ్మ కోసం తయారుగా ఉండేవాళ్ళము.అమ్మమ్మ జడ వేస్తానన్నా వేయించుకునేవాళ్ళం కాదు మరీ అత్యవసరం అయితే తప్ప, అమ్మమ్మ కానీ బిగించి జడ వేసిందంటే మా మాస్టారు ఆ రోజుకి కర్ర మర్చిపోయి వచ్చినా నా జడ ఉందికదా అనే భరోస కల్పించేంత గట్టిగా బిగించి వేసేది అమ్మమ్మ.  

జడలు వేయించుకునే కార్యక్రమం అయ్యి టిఫిన్ తినే సమయానికి అద్దంకి మన్నార్‌గారో, ఓంకార్‌గారో లేదా ఏడిద నాగేశ్వరరావుగారో చదివే జాతీయ వార్తలు.

వార్తలయ్యేసరికి  నాకూ అక్కకీ కలిపి నాలుగ్గిన్నెల స్టీలు క్యారేజీ బుట్టలోకి ఎక్కి కూర్చునేది.వయసు మీద పడుతున్నా కానీ హీరోయిన్లని మారుస్తూ ఇప్పటికీ కళామతల్లి సేవ చేస్తున్న హీరోల్లాగ మా స్టీలు క్యారేజీ ప్రక్కన గాజు నీళ్ళ సీసా దగ్గర నుండీ, అప్పుడే మార్కెట్లోకొచ్చిన మిల్టన్ వాటర్ బాటిల్ వరకూ రకరకాల వాటర్ బాటిళ్ళు ఒదిగి కూర్చునేవి, మా స్టీలు క్యారేజీ స్థానం మాత్రం చెక్కుచెదరలేదు.  

వార్తలు అయ్యీ అవ్వకుండానే మా స్కూలు బస్సు డ్రైవర్ హనుమంతరావు ట్రేడ్‌మార్క్ బుల్లెట్టు  సౌండు వినిపించిందంటే ఉరుకులు పరుగులతో బస్టాపుకి వెళ్ళేవాళ్ళము.మహేషు బాబు అయినా ఆగడు సినిమా తరువాత ఆగాడేమో కానీ మా భజరంగబలి( మా డ్రైవర్ హనుమంతరావుని ఆ బుల్లెట్టు మీద చూసి మా అమ్మ ఆయనకి పెట్టిన పేరు ఇది)బయలుదేరి వెళ్ళి బస్సు తీసాకా ఇంక ఎవరికోసమూ ఆగడు.మా స్కూలు బస్సు కానీ మిస్ అయ్యిందంటే ఆర్కియాలజిస్టులు ఈ మధ్యే కనుక్కున్న ఆదిమానవుల గుహలాగ ఎక్కడో మారుమూల ఉన్న మా స్కూలుకి వెళ్ళడం అసంభవం.

స్కూలు లేని రోజుల్లో అయితే వార్తలయ్యాకా వచ్చే  సంస్కృత భాష పరిచయ కార్యక్రమములో నేను నేర్చుకున్న సంస్కృతం ఏమిటయ్యా అంటే అర్ధం తెలియకపోయినా కంఠతః వచ్చేసిన 'కేయూరాని న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా' అనే పద్యం మాత్రమే.

ఆ తరువాత లలిత సంగీత కార్యక్రమం, సినిమా పాటలు, మధ్యలో  "రామయ్యా ఏమిటి దీర్ఘముగా ఆలోచిస్తున్నావు?" అంటూ వచ్చే నాగార్జునా ఆస్బెస్టాస్ రేకుల యాడ్, తళతళలాడే తెల్లదనం కోసం వాడాల్సిన రిన్, వాషింగ్ పౌడర్ నిర్మా, ఇలా ఏవో అవసరమైన సామాన్ల యాడ్స్ తప్ప అనుబంధాలు పెంచే మినపగుళ్ళు, మీరు ఇంట్లో కూర్చుని మాకు మిస్డ్ కాల్ ఇస్తే మీ బంగారం తీసుకుని మీ కొంప కొల్లేరు చేస్తామనే కార్పొరేటు తాకట్టు కంపెనీల యాడ్స్ లాంటి విపరీతాలు ఉండేవి కావు.

రేడియో సిలోన్, వివిధ భారతిలో వచ్చే హిందీ పాటలు మరపురాని ఙాపకాలు.

పన్నెండున్నరకి మాధవపెద్ది సురేష్ గారు స్వరపరచిన కార్మికుల కార్యక్రమం ట్యూన్ వినపడిందంటే నాన్నగారు భోజనానికి వచ్చే టైమైందని గుర్తు.అందులో ఏకాంబరం, చిన్నక్క అని మాట్లాడుకుంటూ మధ్యలో సినీగీతాలు ప్రసారం చేస్తూ కార్మికులకి సంబంధించిన విషయాలని వినసొంపుగా చెప్పడం ఆ నిర్వాహకులకే చెల్లింది.ఆ తరువాత  పాడీపంట కార్యక్రమ వచ్చేది.

సాయంత్రం పూట  ఐదున్నరకి యువవాణి యువజనుల కార్యక్రమం వచ్చేది.ఏడుగంటలకి ఇల్లు-వాకిలి కార్యక్రం సిగ్నేచర్ ఫ్లూట్ ట్యూన్ ఇప్పుడు వింటే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో.అందులో ప్రసారమయ్యే పందుల పెంపకం, శాస్త్రీయ పద్ధతిలో గొర్రె పిల్లల పెంపకం లాంటి కార్యక్రమాల పేర్లు  విని నవ్వుకున్నా ఎంతో మందికి లాభాన్ని చేకూర్చిన కార్యక్రమం అది.

రాత్రి పూట ప్రసారమయ్యే బుర్రకథ, ప్రాయోజిత కార్యక్రమం, ఇంగ్లీషు వార్తలు, స్పాట్‌లైట్‌తో ప్రసారాలు ముగిసేవి.మినిట్ టూ మినిట్ అప్డేట్ లేకున్నా కానీ రోజులు హాయిగా సాగిపోయాయి.

శనివారం వస్తే "హైదరబాదు బాలలము రయ్ రయ్ మంటూ వచ్చాము" అనుకుంటూ వచ్చే బాలానందం, అందులో ప్రసారమయ్యే నాటికలు, ఆదివారం ప్రొద్దున్న పదకొండయితే చాలు,  మీరు కోరిన పాటలు వింటూ హోంవర్కు చేసుకోవడం మర్చిపోలేను.

రేడియోలో కొన్నేళ్ళపాటు సినిమా ఆడియోని ప్రసారం చేసేవారు, సినిమాలు చూసే అవకాశం లేని ఊళ్ళో ఉంటున్న మా లాంటి వాళ్ళకి అదొక పెద్ద వినోద కార్యక్రమం.ఆదివారం మధ్యాహ్నం మూడింటికి ప్రసారమయ్యే నాటకం కోసం ఎదురుచూసిన రోజులెన్నో.

మాటల మధ్యలో అడ్డుతగిలి వివాదాస్పదం చెయ్యాలని చూసే యాంకర్లు లేని ప్రముఖుల ఇంటర్వ్యూలు, పరిచయ కార్యక్రమాలు ఒకటేమిటి ఎన్నో మరిచిపోలేని కార్యక్రమాలని అందించిన ఆకాశవాణి ఎంతో మందికి ఒక మధురఙాపకం.

క్రికెట్టు మ్యాచులప్పుడు శ్రోతలని మునివేళ్ళమీద నిలబెట్టిన కామెంటరీని మర్చిపోతే ఎలాగ?

ఈ మధ్యే మళ్ళీ రేడియో వినడం మొదలుపెట్టాను.దాదాపు అవే కార్యక్రమాలు, కానీ కార్యక్రమాల క్వాలిటీ మాత్రం పడిపోయింది.దేశభక్తి గీతాలని రచించేవాళ్ళ, పాడేవాళ్ళ కొరతో మరేమిటో కానీ ఇంకా నలభై యాభై యేళ్ళ క్రితం నాటి గీతాలే వేస్తున్నారు.భక్తిరంజని పరిస్థితి కూడా అదే.ఇంకా దారుణం ఏమిటంటే ఒక కార్యక్రమం ఇంకా పూర్తి కాకుండానే మరొక కార్యక్రమం మొదలవ్వడం,కొంత మంది అనౌన్సర్లు కూడా  ప్రైవేట్ టీవీ యాంకర్లకి తీసిపోని తెలుగు భాషా పరిఙానంతో ఉన్నారు, అస్సలు వినసొంపుగా లేని సంస్కృత వార్తలు...ఇలా ఒకటేమిటి ఏదీ బాగుండటం లేదు.

దాదాపు అన్ని మారుమూల పల్లెలలోనూ టీవీ, ఇంటర్నెట్టు ఉంటున్న ఈరోజుల్లో రేడియో తన అస్థిత్వాన్ని కోల్పోయిందేమో అనిపిస్తోంది.కాకపోతే ఇంకా మొబైల్ ఫోనుకి సిగ్నల్ అందని గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి ఊళ్ళలో ఉంటున్న పిల్లలకోసమైనా ఆకాశవాణి కేంద్రాలు తమ కార్యక్రమాలలో మార్పులు చేసుకుని పాఠాలు తదితర విషయాలు బోధిస్తే కాస్తయినా ఆకాశవాణి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందేమో.  

తన అస్థిత్వాన్ని కోల్పోయిన ఆకాశవాణి గురించి వేటూరి గారి మాటల్లో చెప్పాలంటే గతవైభవ దీప్తులతో వెలిగే కమ్మని కావ్యం.

No comments: