Monday, June 28, 2021

వేయిశుభములు కలుగు నీకు

 
కొన్ని వారాలుగా మా ఇంట్లో పెనుమార్పులొచ్చాయి.వర్క్ ఫ్రం హోం, లెర్న్ ఫ్రం హోం లో భాగంగా మా ఇంటిపెద్ద(ఇం.పె.), యువకిశోరం(యు.కి.) చెరొక గదిలో ఉంటున్నారు.ఏదో నేను బయటకెళ్ళి తెచ్చిన శాకాలూ, ఫలాలూ తినేవారే కానీ ప్రత్యేకముగా ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు.

ఒకానొకరోజు నేను మొదటిడోసు టీకా వేయించుకుందామని వెళ్ళినప్పుడు,వేల మైళ్ళ దూరములో ఉన్న మా అక్క కూతురు చక్కగా ముక్కలు కోసిన బంగినపల్లి మామిడి ఫోటో పెట్టగానే బయట నాకు తోడుగా వచ్చి కూర్చున్న మా ఇం.పె.కి పూనకం వచ్చేసింది.

అసలే పోయిన సంవత్సరం బంగినపల్లి మామిడి తినలేదు.మా ఊరికి వాటిని ఆకాశ మార్గం ద్వారా తెప్పించారని పోయినసారి మామిడిపళ్ళ ధరలని కూడా ఆకాశంలోనే పెట్టేసరికి మేము వాటి వైపు కూడా చూడలేదు.పోనీ ఒక నాలుగు పళ్ళైనా తెచ్చుకుందాము అనుకుంటూనే రజనీకాంత్ రాజకీయ ప్రవేశంలా అయ్యింది పోయిన సంవత్సరం మేము ఆంధ్రా మామిడిపళ్ళు కొనడం.కో.పూ.(కోవిడ్ పూర్వ శకం)లో తిన్న మామిడి రుచినే గుర్తుచేసుకుని గడిపేసి, వేసవిలో ఆంధ్రా మామిడిపండు రుచి చూడని పాపుల జాబితాలోకెక్కేసాము.

ఈ సంవత్సరం పరిస్థితులు కాస్త చక్కబడటముతో, మామిడిపళ్ళు మా ఊరికి ఆకాశమార్గం ద్వారానే వచ్చినా, ధరలు మాత్రం ఆకాశములో లేవు కానీ, నేలని ఆనీ ఆనకుండా దేవతల పాదాల్లా కొంచెం ఎత్తులో తేలుతున్నాయి.

టీకా పూర్తయ్యి నేను బయటకి రాగానే క్యాబ్ మాట్లాడి మా ఇం.పె.నన్ను పొదివి పట్టుకుని ఇంటికి తీసుకెడతారనుకుంటే "మామిడిపళ్ళు వచ్చాయేమో ఇండియన్ స్టోర్లో కనుక్కుందాము" అని తీసుకెళ్ళారు.

అంటే అన్నానంటారు కానీ, నాకు నర్సయ్య(పుంలింగ నర్సు)టీకా పొడిచాకా, నేను కటకటాల రుద్రయ్యలా కళ్లెర్రచేయటమో, యండమూరి నవలా హీరోలా దవడ కండరాలు బిగించడమో,వానపాటల్లో హీరోయిన్లా వణకడమో చేస్తానేమో అని, అవి కాకపోతే వంశగౌరవాలని గుర్తు చేసుకుని కొట్టుకున్న తొడలమీద తేలిన తట్టుల్లాంటివేమైనా వస్తాయేమో చూద్దామని నన్ను కాసేపు ప్రక్కన కూర్చోపెట్టిన టైములో మా ఇం.పె.వెళ్ళి కొనుక్కొచ్చేసి, మామిడిపళ్ళతో నాకు స్వాగతం పలికి ఉంటే ఎంత బాగుండేది?.

పైన చెప్పిన చిత్ర విచిత్ర విన్యాసాలేవీ నేను చెయ్యకపోవడముతో నన్ను బయటకి పంపగానే మా అడుగులు ఇండియన్ స్టోర్ వైపు పడ్డాయి.

అక్కడ బాక్సుల్లో పసుపు పచ్చగా మెరుస్తున్న బంగినపల్లి మామిడిపళ్ళని చూడగానే, 'పగ' ని తింటూ, త్రాగుతూ, పీలుస్తూ ఉన్న కథానాయకుడి తాతయ్య, కథానాయకుడు ఊర్లోకి వస్తున్నాడగానే, ఆ తాత ముఖములో మనకి కనిపించే ఉద్విగ్నత లాంటిదే సరిగ్గా మా ఇం.పె. ముఖములో కూడా కనిపించింది.

మేము మామిడిపళ్ళు కొనుక్కుని ఇంటికి రాగానే మా యు.కి. తన గుహలోంచి బయటకొచ్చి, "ఎలా ఉన్నావు?" అని నన్ను అడిగి, వెంటనే తన చూపు ఇం.పె.చేతిలో ఉన్న డబ్బా మీదకి త్రిప్పాడు.

ఇక్కడ మామిడిపళ్ళు విడిగానూ లేదా 5 కేజీల బాక్సు( డబ్బా)లలో అమ్ముతారు.కాయ సైజుని బట్టి 8-10 కాయలుంటాయి ఒక్కో డబ్బాలో.ఆరోజునుండీ వంటింటి గట్టుకి భూషణమయ్యి కూర్చుంది మామిడిపళ్ళ డబ్బా.

డబ్బా తెరవగానే ఇది నాది, అది నీది అని ఇం.పె.&యు.కి. వాటాలేసేసుకున్నారు.పళ్ళు ఇంకా మగ్గలేదేమో రోజూ భోజనం తరువాత చెయ్యి కడుక్కుని, వేసవిశలవల్లో పుట్టింటికొచ్చిన ఆడపిల్లని చూసినంత సుకుమారముగా డబ్బా తెరిచి పళ్ళు మగ్గాయేమో చూసుకునేవారు మా ఇం.పె.

ఎదురుచూసిన రోజు రానే వచ్చింది, ఇం.పె, యు.కి. ల రసాస్వాదన మొదలు. నేను కూడా పోటీలోకొచ్చేసరికి మా త్రిశూల వ్యూహానికి అల్లాడిపోయిన బాక్సులో మామిడిపళ్ళు మా గుండ్రటి బొజ్జల్లోకి దూరెస్తే, మామిడిపపళ్ళ డబ్బా రీసైకిల్ బిన్‌లోకి ఎగిరేది.

ఇక అది మొదలు, మా ఆర్డర్లు చూసిన ఆ స్టోర్ యజమానులు "మీరు రావక్కర్లేదు, ఫోనులో చెప్పండి, పంపించెస్తాను" అని వరం ఇచ్చేసారు.

డబ్బాలో పళ్ళ సంఖ్య 2-3 కి పడిపోగానే ప్లేట్లెట్స్ పడిపోయినట్లు కంగారు పడిపోయి "మామిడిపళ్ళ వాళ్ళకి ఫోను చేసావా?" అని అడిగేవాడు మా యు.కి.ఒకోసారి డబ్బా ఖాళీ అయ్యేసరికి అభిమాన హీరో సినిమా టిక్కట్లు దొరకని అభిమానిలా దిగులుగా నిద్రపోయేవాడు పాపం.

వంటింటి గట్టు మీద మామిడిపళ్ళ డబ్బా కనపడక, నేనేమైనా రహస్య నేల మాళిగలోనో, ఫ్రిజ్జులోనో, ఇంకెక్కడో పెట్టానేమో అని వెతికేసుకుని "మామిడిపళ్ళు అయిపోయాయా" అని మా ఇం.పె. నన్ను అడిగి, "అ...యి...పో...యా....యి...." అని నా నోట్లోంచి రాగానే, రేప్పొద్దున్న లేచేసరికి టీపొడి లేదంటే టీ ప్రియులైన మా అక్క, బావగార్ల మొహములో కనిపించే దిగులు కంటే ఎక్కువ దిగులు కనిపించేది మా ఇం.పె. ముఖములో.

ఫోను చేసి చెప్పగానే, జీ హుజూర్ అని నిమిషాల్లో మామిడిపళ్ళు తెచ్చి నా ముందర పడెయ్యడానికి నేనేమన్నా ప్రధానమంత్రినా?వాళ్ళకి వీలైనప్పుడు తెచ్చిచ్చేవారు.ఒకోసారి మేమే వెళ్తే, "మేడం, మామిడిపళ్ళు ఈరోజు రాలేదు, నేను ఇంటికి పంపిస్తానని చెప్పాను కదా" అనడంతో వెళ్ళడం మానేసాము.

ఒక్కోరోజు రాత్రి పదకొండింటికి మా ఇంట్లో లైట్లన్నీ వెలిగేవి.అప్పటివరకూ నిద్ర పోతున్న(నటిస్తున్న) మా యు.కి.లేచి ఏమీ తెలియనట్లు బయటకొచ్చి చూసి, అందరం మంగళహారతులు పాడుతున్నట్టు నిల్చున్నామంటే మామిడిపళ్ళ డెలివరీ అని అర్ధమయ్యి, "అమ్మా! రేపు నాకు పెద్దది కావాలి" అని చెప్పి ‘తియ్యటి’ కలలు కంటూ ప్రశాంతముగా నిద్రపోయేవాడు.

ఈ మామిడిపళ్ళ పుణ్యమా అని భోజనాలు మానేసి కేవలం ఫలాలు మాత్రం ఆరగించి ఉపవాస పుణ్యాలు మూటగట్టుకున్న రోజులెన్నో.ఇంట్లో పాలున్నాయా, పప్పులున్నాయా , బియ్యమున్నాయా, కూరలున్నాయా అని చూసుకోవడం మానేసి "మామిడి పళ్ళున్నాయా?" అని ఎప్పటికప్పుడు చూసుకోవడం సరిపోయింది.

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి, పళ్ళు మాత్రం అద్భుతమైన రుచితో ఉన్నాయి.అంత తియ్యటిపళ్ళలోనూ అప్పుడప్పుడు మాత్రమే వచ్చే మంచి తెలుగు సినిమాల్లా, కాస్త పులుపు కూడా తగిలేది.

అయినా బంగినకి మరీ బడాయి కాకపోతేను, యాప్లీసు కాయలు సంవత్సరమంతా దొరికెస్తున్నాయి, పుచ్చకాయలూ అంతే, ఇది మాత్రం సంవత్సరానికి ఒక్కమారే దొరుకుతుంది.

'ఆల్' ఫోన్సాలు, 'సం' ఫోన్సాలు అన్నీ దిగదుడుపే మా బంగిన ముందు.ఇంక రసాల సంగతి చెప్పకండి, ఒబ్బిడిగా తినడం రానివాళ్ళ దగ్గర ఒక్కసారి కానీ కూర్చున్నారా, జీవితం మీద విరక్తి రావడం ఖాయం.

కానీ బంగినకి ఆ ఇబ్బందులేమీ ఉండవు.మీకు ముక్కలు కోసే కళ చేతనవ్వాలే కానీ అద్భుతంగా ఉంటుంది రంగు, రుచి, రూపు కూడా. బంగినపల్లి వాసనకి ఇక ఎదురేముంది?
అదిగో జూన్ వచ్చేసింది ఇక ఇప్పుడు మామిడిపళ్ళు బాగోవు, అప్పుడే జూన్ నెల సగం అయిపోయింది ఇంక బంగినపల్లి కాపు ఆగిపోతుంది...ఇలా ఎప్పటికప్పుడు ఇంక మళ్ళీ ఈ సంవత్సరానికి దొరకదేమో అనుకుని ఆర్డర్ ఇస్తూనే ఉన్నాము.
జూన్ నెల ఆఖరుకి వచ్చేసరికి వాటి రుచి ఈ మధ్య వస్తున్న మణిరత్నం సినిమాల్లా ఉండటముతో, మొత్తానికి ఈ సంవత్సరానికి బంగినపల్లికి టాటా చెప్పే రోజొచ్చింది అని మైకులూ, బల్లలూ విరగ్గొట్టక్కర్లేకుండానే ఏకగ్రీవముగా నిర్ణయించుకున్నాము.

బేగొచ్చీసీ బంగినా, బెంగెట్టేసుకుంటాను మరి..ఆ..


వేయిశుభములు కలుగు నీకు పోయిరావే బంగినపల్లి మామిడి అని పాడుకుంటూ ఈ సంవత్సరానికి మంగళం పాడెస్తున్నాము

మంగళం ఫలరాజాయ మహనీయ రుచాత్మనే
ఫలచక్రవర్తాయ సార్వభౌమాయ మంగళం


No comments: