Friday, September 25, 2020

మాటే రాని........

 

"మీరు కోరిన పాటలు"1970 లు 80 ల పిల్లలకి పరిచయం అక్కర్లేని రేడియో కార్యక్రమం ఇది.

ఆదివారం వచ్చిందంటే ఉదయం పదకొండు గంటలకి వచ్చే పాటల్లో వెయ్యబోయే పాట ఏ సినిమాలోదో చెప్పి గానం అనగానే గాయకుడి పేరు 99.9% "ఎస్పీ బాలు" నే అయి ఉండేది అంటే అతిశయోక్తి కాదేమో. 

40లు 50 ల దశకం వారికి ఘంటసాల ఎలాగో 70 లు ఎనభైల పిల్లలకి ఎస్పీ అలాగ. కెరీర్లో మాస్ మసాలా పాటలున్నా కానీ ఎస్పీ బాలు అనగానే "ఓ పాపా లాలీ" అనో,"చెంత చేరి ఆదమరచి  ప్రేమను కొసరెను చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను" అంటూ ఓ పాపాలాలీ సినిమాలో27-28 సెకన్లపాటు బ్రెత్‌లెస్స్ గా పాడిన ఆ చరణమో గుర్తువస్తుంది."ఇందు వదన కుందరదన" అంటుంటే హీరో స్టెప్పుల వల్ల వింటున్న పాటకి ఆ హుషారు వస్తుందో లేకపోతే ఆయన గళంలో హుషారు వల్ల తెర మీద రంగు పేపర్ల వర్షం కురుస్తోందో తెలిసేది కాదు. 

"ప్రేమ ఎంత మధురం" అనో "ప్రియతమా నా హృదయమా" అని పాడుకోని తెలుగు భగ్న ప్రేమికుడు 80ల్లో లేడేమో. ఉంటే అతనిది ప్రేమే కాదు లేకపోతే అది భగ్నం అయి ఉండదు అని గాట్ఠిగా నమ్మేంతగా భగ్న ప్రేమికుడిలా పాటల్లో జీవించాడు ఆయన.

త్రిదళం త్రిగుణాకారం అంటూ ఆయన పాడిన బిల్వాష్టకం తప్ప ఏది విన్నా నచ్చనంతగా మైండ్ ట్యూన్ అయిపోయింది.

పాడుతా తీయగా అంటూ ఇంట్లో పెద్దవారికి మరింతగా దగ్గరైన ఈ గాన గంధర్వుడు మాత్రం ఆ కార్యక్రమములో రాను రాను ఎందుకో అంతగా నచ్చేవాడు కాదు నాకు. 

రేడియోలో వచ్చే పాత హిందీ పాటలు లేదా లాంగ్ ప్లే రికార్డుల్లో ఉన్న రఫీ కిషోర్‌కుమార్, ముఖేష్ పాటలు మాత్రమే విన్న నాకు మొట్టమొదట కొద్దో గొప్పో నోట్లో ఆడిన హిందీ పాటలంటే మైనే ప్యార్‌కియా పాటలే.

రోజా సినిమా తరువాత సినీ సంగీత ప్రపంచములో ఎన్నో మార్పులొచ్చాయి.ఒకటే సినిమాకి నలుగురు-ఐదుగురు గాయకులతో పాడించే కొత్త ఒరవడి ప్రవేశపెట్టిన రెహ్మాన్ పుణ్యమా అని క్రొత్త గాయకులు వెలుగులోకి వచ్చినా మిగతా సంగీత దర్శకులందరూ కూడా అవసరం ఉన్నా లేకపోయినా పర భాషా గాయకులనీ,ప్రతీ సినిమా అది ఎంత చిన్నదైనా కానీ అందులో పాటలని లెక్కకి మిక్కిలి గాయకులతో పాడించడం వల్ల పాటలన్నీ ఒకరే పాడిన శకం ఎస్పీతోనే ముగిసిపోయింది.

ఆపద్బాంధవుడు,రుద్రవీణ..ఇలా ఎన్నని చెప్పాలి?ఏ హీరోకి పాడితే ఆ గొంతు, హీరో ముఖకవళికలు ఎంత సింక్ అయ్యేవంటే ఆఖరికి శంకరాభరణము లాంటి సినిమా పాటల్లో కూడా మనకి ఒక పేరుమోసిన విద్వాంసుడే కనిపిస్తాడు తప్ప బాలూ  కనిపించడు.అసలు ఆయన పాడిన వేల మెలొడీ పాటల్లో ఒకటి బాగుంది అనగానే వెంటనే ఇంకోటి"మరి నేను?" అంటుంది. ఆయన మెలొడీ పాటల్లో మంచివి ఏరడం అంటే ఇసుక రేణువులని లెక్కించడమే. 

ఇప్పుడంటే హీరో ఇంట్రో సాంగ్స్ ఎవరితో పాడించాలి అని మల్లగుల్లాలు పడి ప్రతీ సినిమాకీ తెలుగు అక్షరాలని పరాపరా కోసి ఖూనీ చేసే గాయకులని పోటీలు పడి తీసుకొస్తున్నారు కానీ అప్పట్లో "జగడజగడం" అంటూ నాగార్జున వచ్చినా, "బంగారు కోడిపెట్ట" అంటూ చిరంజీవి చిందేసినా ఇద్దరికీ ఒక్కళ్ళే పాడారంటే నమ్మలేనంతగా అద్భుతంగా ఉండేది."అటెన్షన్ ఎవ్రీబడీ" అంటూ విక్టరీ వెంక్టేష్ విజిల్స్ వేయించినా "దంచవే మేనత్త కూతురా' అంటూ బాలక్రిష్ణ మరదలని ఆటపట్టించినా  ఆ గొంతుకే చెల్లు.

చిన్నప్పుడు పాటలు ఇంత సులభంగా వినే అవకాశం ఉండేది కాదు. ఎప్పుడో రేడియోలో వస్తేనో, అమ్మో నాన్నో ఒప్పుకుంటే క్యాసెట్టు కొనుక్కోనిస్తే(అసలంటూ టేప్‌రికార్డరు ఉంటే) తప్ప పాటలు వినలేని శకంలో పెరిగిన 70లు-80 ల దశకం పిల్లలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే బాలూ గొంతులోంచి జాలువారిన ఎన్నో ఆణిముత్యాలని సావధానముగా వినే భాగ్యం కలిగింది.  

ఒక శకం వారికి ఎన్నో మధురమైన పాటలని ఇచ్చి దేహం విడిచిపెట్టిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మ సద్గతిని పొందాలని కోరుకోవడం తప్ప ఏమీ చెయ్యలేక...

సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగవు, జీవితపు పరుగూ ఆగదు,కానీ అలా పరిగెడుతూ ఆగి అలసట తీర్చుకోవాలనుకున్నప్పుడల్లా మాత్రం నీ పాట కూడా ఒక సాంత్వన సాధనం అన్నది కాదనలేని నిజం 

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి అని తెలిసినా కూడా ఏదో తెలియని బాధ కోట్ల గుండెలని తొలిచేస్తున్న రోజున....... 

....మాటే రాని కోట్ల అభిమానుల్లో ఒక అభిమాని

No comments: