Sunday, July 19, 2020

మేలిమి వజ్రం

(ఈనాడు ఆదివారం అనుబంధములో ఎగిరే వృక్షాలు  

కధ చదివాకా దుమ్ము దులిపిన కధ )

సాయం సంధ్యా సమయం. నీరెండలో అలా వాకింగ్ చేసొద్దామని రోజూలాగానే పార్కుకి బయలుదేరాను. ప్రతీరోజూ నా కంటే ముందే పార్కుకి వచ్చి గేటు దగ్గర నా కోసం ఎదురుచూసే నా మిత్రుడు శ్రీనివాస్ కనపడలేదు. 

కాసేపు వేచి చూసి,"వచ్చాకా వాడే ఫోను చేస్తాడులే" అనుకుంటూ లోపలకి వెళ్ళి, పరిసరాలని గమనించడం మొదలుపెట్టాను. సగం మంది స్క్రీన్లలో తల దూర్చేసి బిజీగా ఉన్నారు, జీవన సంధ్యలో ఉన్న కొంత మంది పెద్దవాళ్ళు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ వాకింగు చేస్తున్నారు.పిల్లలకి రెక్కలొచ్చి ఎగిరిపోయాకా మిగిలేది స్నేహితులే కదా,వీడింకా రాలేదేమిటని అనుకుంటూనే వాకింగు పూర్తి చేసాను.   

ఎప్పుడయినా నేను వాకింగ్ కి బద్ధకించి ఇంట్లో ఉన్నా కానీ  మా ఇంటికొచ్చి మరీ నన్ను పార్కుకి లాక్కెళ్ళే శ్రీనివాస్ ఈ రోజు వాకింగుకి రాకపోవడమేమిటి,కొంపదీసి వాడికి అనారోగ్యం కానీ కాదు కదా అనుకుంటూనే నా అడుగులు వాడింటివైపు పడ్డాయి. 

నన్ను చూడగానే, 'రండన్నయ్యా...' అంటూ శ్రీనివాస్ శ్రీమతి ఆహ్వానించి కప్పుతో కాఫీ తెచ్చిచ్చింది.  

"ఏడమ్మా వీడు,వాకింగుకి రాలేదేమిటి?" అని అడుగుతుండగానే శ్రీనివాస్ లోపలనుండొచ్చాడు. ఏదో తీవ్ర వేదన పడుతున్నట్లు వాడి మొహమే చెప్తోంది. "ఏమిట్రా, ఏమయ్యింది?"అని అడిగేలోపే ఒక కవరు నా చేతిలో పెట్టాడు.కవరుని పరిశీలిస్తే విదేశాలనుండి వచ్చిన ఉత్తరం అని స్టాంపులని చూస్తే అర్ధమవుతోంది.వీడి పెద్ద కొడుకు రాసాడేమో అనుకున్నాను,కానీ ‘ఇంకా ఈరోజుల్లో ఉత్తరాలు రాసేదెవరూ’ అనుకుంటూనే తెరిచి చదివాను. 

నా ఊహ నిజమే,శ్రీనివాస్ పెద్ద కొడుకు రాహుల్ రాసిన ఉత్తరమే అది.చదవడం అయ్యి ఉత్తరం కవర్లో పెట్టగానే  అందుకున్నాడు,శ్రీనివాస్. 

“చూడరా మాధవా,వాడి సుఖం కోసమే కదా వాడిని పోరి పోరి విదేశాలకి పంపాను.ఏవో కొన్ని డబ్బులు సంపాదించుకుని సుఖంగా ఉంటాడనే కదా నా ముందు చూపు. తండ్రిని నన్ను అర్ధం చేసుకోలేదురా వాడు. బలవంతంగా పంపించానుట,మొదట్లో ఇబ్బందిగా ఉన్నా మెల్లిగా అక్కడే అలవాటయ్యింది కాబట్టి, పిల్లలల చదువులూ అవీ మధ్యలో ఆపి వెనక్కి రాలేడుట. ఒక్క ఐదేళ్ళు ఆగితే పిల్లల చదువులు అయిపోతాయి కాబట్టి అప్పుడు వెనక్కి వచ్చి మాతోనే ఉంటారుట కొడుకూ కోడలూనూ.ఏమిట్రా ఇది న్యాయమేనా చెప్పు, నేను అడిగినప్పుడు రాకపోవడం" అంటున్న శ్రీనూ ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు నాకు. 

"అయినా ఇప్పటికిప్పుడు వాడి సహాయం ఎందుకురా శ్రీనూ? మొన్ననే కదా,చెల్లెమ్మకి ఆపరేషనయితే వచ్చి 20 రోజులుండి వెళ్ళాడు!ఎందుకని వాడిని తట్టా బుట్టా సర్దుకుని వెనక్కొచ్చెయ్యమంటున్నావు,మేమంతా లేమూ?" అన్నాను అనునయంగా. 

"ఏమిటోరా తెలీని భయంగా ఉంది, వాడు వెనక్కి వచ్చే లోపే మాకేదన్నా అనుకోనిది జరిగితే ఎలా?" అంటూనే బావురుమన్నాడు  శ్రీనూ.వాడి మాటలకు కదలిపోయాను నేను.

"ఛ ఊరుకోరా,అలాంటిదేమీ జరగదు" అని ఊరడించి నాలుగు మంచి మాటలు చెప్పి ఇంటికొచ్చాను.    

ఇంటికొచ్చానే కానీ రాహుల్ రాసిన ఉత్తరం, శ్రీనివాస్ ఆవేదన నన్ను  వెంటాదుతూనే ఉన్నాయి.నా మనస్సు కొన్నేళ్ళ వెనక్కి ప్రయాణం చేసింది.

చదువు పూర్తి చేసిన శ్రీనివాస్ పెద్ద కొడుకు రాహుల్, తల్లి తండ్రుల దగ్గరే ఉంటానని ఉన్న ఊళ్ళోనే లెక్చరర్‌గా జాయిన్ అయ్యాడు.తమ స్నేహితుల పిల్లలలో చాలా మంది కంప్యూటర్ ఇంజనీర్ల ఉద్యోగాలంటూ  విదేశాలకి వెళ్ళి తల్లి తండ్రులకి కావాల్సిన సౌకర్యాలన్నీ అమరుస్తూ ఉండేవారు.మధ్య మధ్యలో విదేశాలు చుట్టొచ్చిన స్నేహితులు చూపించే ఫోటోలు చూసి శ్రీనూ పైకి సంతోషించినా ఇంటికెళ్ళి రాహుల్ మీద చిందులు తొక్కేవాడని వాడి భార్య ద్వారా తెలిసింది. తండ్రిగా ఆ మాత్రం ఆశ సహజమని నేనూ పెద్దగా పట్టించుకోలేదు.  

చివరికి  తండ్రి 'నస' భరించలేక రాహుల్ కూడా ఉద్యోగం తెచ్చుకుని అయిష్టంగానే విదేశానికి పయనమయ్యాడు ఒక్క సంవత్సరంలో వెనక్కి వస్తానంటూ. విదేశీ వాతావరణ మహిమ అనుకుంటా, వెళ్ళినవాడు అక్కడే సెటిల్ అయిపోయాడు. ఆ మధ్యలో తమని కూడా తీసుకెళ్ళి అంతా తిప్పి చూపించాడని, కోడలు తమని ఎంతో ఆదరంగా చూస్తుందనీ వాడు స్నేహితుల దగ్గర మురిసిపోయేవాడు. 


                         ***

కాలం ఎప్పుడూ ఒకలాగ ఉండదు కదా, శ్రీనూని, అతని భార్యను చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టడం ప్రారంభించాయి. దూరంగా ఉన్నవాడిని బాధ పెట్టడం ఎందుకని వాడికి అన్నీ తెలియనిచ్చేవాడు కాదు.  దగ్గరున్న స్నేహితులమే అందరం తలో సాయం చేసేవాళ్ళం, అవసరంలో కాకపోతే స్నేహితులు ఎందుకూ అని మా భావన. కానీ శ్రీనివాస్ మాత్రం "ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా మీరు ఎంత సహాయం చేస్తున్నార్రా, కన్న కొడుకు కేవలం డబ్బులు మాత్రం పంపుతున్నాడు" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు

ఓ సారి నేనూ, నా శ్రీమతి ఏదో పెళ్ళికని ఊరెళ్ళాము. మా అబ్బాయి భరత్ మాత్రం తనకి పరీక్షలని ఇంట్లోనే ఉన్నాడు.

అర్ధరాత్రి శ్రీనివాస్ బాత్రూములో జారిపడితే, సమయానికి మా అబ్బాయి వెళ్ళి దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్‌చేసి, మూడ్రోజులు కన్న కొడుకులా చూసుకున్నాడని శ్రీనివాస్ భార్య మాకు చెప్పి దాదాపు ఏడ్చినంత పని చేసింది.  వచ్చిన తరువాత విషయం తెలిసిన నేను మా భరత్ ని చూసి చాలా ఆనందంగా ఫీలయ్యాను.

ఆ మధ్య మాత్రం శ్రీనివాస్ భార్యకి ఆపరేషన్ అంటే రాహుల్ భార్యతో సహా వచ్చి ఇరవై రోజులుండి వెళ్ళలేక వెళ్ళాడు. అవసరమయినప్పుడు కూడా కన్న కొడుకు అలా చుట్టపు చూపుగానే వచ్చి వెళ్ళాడని శ్రీనూ నొచ్చుకున్నాడు.

"పోనీ లేరా, వాడూ వాడి కుటుంబ భారం మొయ్యాలి కదా" అని శ్రీనివాస్‌కి నచ్చచెప్పాను. కానీ  అప్పటినుంచీ వాడికి మాత్రం కొడుకు ఉన్న పళంగా తమ దగ్గరికొచ్చేసి ఉండాలనే కోరిక తీవ్రమయిపోయింది.

ఒక రోజు అదే మాట నాతో అంటే రాహుల్‌తో చెప్పి చూడమని చెప్పాను. చెప్పి ఉంటాడు, దాని  పర్యవసానమే ఈ ఉత్తరం అన్నమాట. 

రాహుల్ వైపు నుండి ఆలోచిస్తే తను చెప్పేది కూడా నిజమే అనిపిస్తోంది. శ్రీనూ వైపు నుండి చూస్తే వీడి కోరికా సమంజసమే. కానీ అసలు ఈ పరిస్థితికి కారణం మాత్రం ఖచ్చితంగా  వీడే. దగ్గరున్న కొడుకుని చెవిలో ఇల్లు కట్టుకుని పోరి పోరి చేజేతులా దూరం చేసుకున్నాడు. ఇప్పుడు వగచి ఏమి లాభం?       

"నువ్వు మాత్రం ఏమి చేస్తున్నావు?" అని నా అంతరాత్మ నన్ను ప్రశ్నించటంతో ఉలిక్కిపడ్డాను. 

లేక లేక పుట్టిన మా అబ్బాయి భరత్ విషయంలో నేనూ అదే తప్పు చేస్తున్నానని తెలియగానే మనసు అవమాన భారంతో కృంగిపోయింది.

                          ***

విదేశాలకెళ్ళిన నా స్నేహితుల పిల్లలందరినీ చూసి నాకు కూడా భరత్ విదేశాల్లో స్థిరపడితే బాగుండు అనిపించింది. వాడు మాత్రం కంప్యూటర్స్ కాకుండా తనకి ఇష్టమైన కామర్స్ గ్రూపుతో డిగ్రీ పూర్తి చేసాడన్న కోపంతో నేను వాడితో రెణ్ణెల్లకి పైగా మాట్లాడలేదు. 

డిగ్రీ అయిపోగానే ఇక పైన ఏమి చెయ్యాలి అన్న విషయంలో ఇంట్లో ప్రతీ దినమూ వాడికీ,నాకూ  రామ రావణ యుద్ధమే. 

వాడేమో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతానంటే నేనేమో "ఠాఠ్ వీల్లేదు ఏదో ఒక కంప్యూటర్ కోర్సు చేసి విదేశం వెళ్ళాల్సిందే,అధమ పక్షం చదువుకోవడానికైనా వెళ్ళు" అని పోరగా అయిష్టంగానే ప్రవేశ పరీక్ష రాసి ఎమ్మెస్ చెయ్యడానికి వెళ్ళాడు. 

వాడి కోర్సు  పూర్తి అయిందో లేదో,అక్కడ అకస్మాత్తుగా మారిన  విధానాల కారణంగా వాడికి ఉద్యోగం రాకపోవడంతో వెనుతిరగక తప్పింది కాదు. 

పాపం వచ్చినరోజు వాడి మొహం ఎంత దిగులుగా ఉందో. కొడుకుని విదేశాల్లో సెటిల్ చెయ్యలేకపోవడం ఒక తండ్రిగా నా ఫెయిల్యూర్ అనిపించింది. బోలెడంత డబ్బు ఖర్చు చేసి అక్కడికి చదువుకని పంపిస్తే ఉద్యోగం సంపాదించుకోలేకపోవటం వాడి అసమర్థతగానూ తోచింది. క్రమంగా ఆ భావన ఎక్కువై, నా కోపమంతా భరత్ మీద మౌన వ్రతం రూపంలో ప్రదర్శించడం మొదలుపెట్టాను.ఎంత మాట్లాడించినా మాట్లాడేవాడిని కాదు. 

వాడు నన్ను ఆఫీసులో దింపడానికి వచ్చినా వాడు డ్రైవ్ చేస్తున్నంత సేపూ మా మధ్య మాటలుండేవి కాదు. వాడిని ఒక డ్రైవర్ లాగ చూసానంతే. చదువులో అంతంత మాత్రంగా ఉండే నా స్నేహితుల పిల్లలు కూడా విదేశాలకి ఎగిరిపోతోంటే నా దృష్టిలో వీడు పనికిమాలినవాడు అని మరింత స్పష్టంగా ముద్రించుకుపోయింది.

"అయ్యో నాన్నా, వాడు డబ్బులు ఎదురు కట్టి ఏదో అనామక యూనివర్సిటీకి వెళ్తున్నాడు, దానివల్ల ఉపయోగం లేదు" అని వాడెన్నిసార్లు చెప్పాడో, అయినా వాడు చెప్పేది అర్ధం చేసుకుని ఆలోచించే తీరిక,ఓపిక ఉండేది కాదు నాకు.నా దృష్టిలో వాడొక పనికిరాని వాడు. అదే మాట అంటే వాడు ఎదురు చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండానే అలా తలవంచుకుని వెళ్ళిపోయేవాడు. అది నా కోపాన్ని మరింత రాజేసేది.కానీ "కన్నానుగా తప్పదు, నా రాత ఇంతేనేమో" అన్న భావనలోకి వచ్చేసాను.

మళ్ళీ పోటీ పరీక్షలకి చదువుతున్నాడని తెలిసిన నేను, నాకు తెలిసిన  ఉద్యోగాలకన్నింటికీ అప్లై చెయ్యమని పోరేవాడిని.  

"ఇన్ని ఉద్యోగాలకి ఒక్కసారి అప్లై చేస్తే, ఇన్ని రకాల సిలబస్ ఒక్కసారే చదవాలంటే కుదరదు",అని ఒకసారి నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తే ,చేతకాని మాటలు మాట్లాడవద్దని చెప్పి వాడిని దాదాపు కొట్టినంత పని చేసాను. 

భరత్ కి చిన్నప్పటి నుండీ చిత్రలేఖనం అంటే ప్రాణం అని నాకు తెలుసు కానీ ఎప్పుడూ వాడికి అది నేర్చుకోవటానికి కానీ, ఉన్న విద్యను పదునుపెట్టుకోవటానికి కానీ తగినంత స్వేచ్ఛను ఇవ్వలేదు. ఎప్పుడైనా చదివి చదివి, అలసిపోయి, కాస్త రిలాక్శేషన్ కోసం నాలుగు బొమ్మలు వేసుకుంటోంటే నేను వెళ్ళి గుమ్మంలో నిల్చుని తీక్షణంగా చూసేవాడిని. నా చూపుల భావం అర్ధమయ్యి పాపం వెంటనే ఆపేసేవాడు.    

నాతో కాసేపు మాట్లాడాలని వాడు ఒక వారం రోజులపాటు మరీ మరీ  బ్రతిమాలితే అందుకు సరేనని  వాడితో బయటకు వెళ్ళాను. 

"నాన్నా! నాకు తెలుసు,మీ దృష్టిలో నేనొక ఫెయిల్యూర్ పర్సన్ ని అని. కానీ లెక్కకు మించిన సంపాదన  ఏమి చెసుకుంటాము నాన్నా?,తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అత్యవసరానికి కాసిని డబ్బులు ఇదే కదా కావాల్సినది. అవసరానికి మించిన సంపాదన  మొదట్లో సంతోషాన్నివ్వచ్చు కానీ రాను రాను అది కూడా బోరు కొడుతుంది. ఏదో కోల్పోయాము అన్న దిగులు మొదలవుతుంది. ఏమి కోల్పోయామో తెలుసుకునేసరికి వెనక్కి రాలేని దూరంలో ఉంటాము నాన్నా,నా స్నేహితులు ఎంతో మంది ఇదే మాట అంటున్నారు. 

చిన్నప్పుడు మీరు నాతో వల్లె వేయించిన 'లక్షాధికారైన కాని లవణన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడు' అన్న పద్య పంక్తి మీకు గుర్తుంది కదా? జీవితాన సంతృప్తి అన్నది లేనినాడు,ధనరూపేణా ఎంత సంపాదించినా అది నిరర్థకమే.నేను మీకు దగ్గరలోనే ఉంటూ ఏదో ఒక ఉద్యోగం తప్పక  తెచ్చుకుంటాను,మీకు సహాయం కావాల్సొచ్చినప్పుడు కేవలం డబ్బులు మాత్రం పంపగలిగే దూరంలో,నిస్సహాయతతో ఉండిపోదలచుకోలేదు.

నాకు కొంచెం టైం ఇవ్వండి.చూస్తూనే ఉన్నారుగా కొన్ని ఉద్యోగాల్లో ఆఖరి మెట్టు మీద బోల్తా పడుతున్నాను.నా లోపాలని సరి చేసుకుని ముందుకు వెళ్దామనుకునేలోపే మీరు ఇంకో ఐదారు ఉద్యోగాలకి అప్ప్లై చెయ్యమంటారు. .కొంచెం ఓపిక పట్టండి" అని వాడు చెప్పినది విని ఆలోచించకపోగా ఇవన్నీ చేతకాని కబుర్లనీ,వాడు ప్రతీ వీకెండ్ మురికివాడలకి వెళ్ళి పిల్లలకి  చదువు చెప్పడం లాంటి  దండగ మారి వ్యాపారం పనులు మానేస్తే మంచి ఉద్యోగంలో ఎప్పుడో స్థిరపడిపోయి ఉండే వాడనీ అంటూ వాడికే క్లాస్ పీకాను.పాపం ఏమీ మాట్లాడలేదు వాడు.     

రెండ్రోజుల క్రితం మాత్రం "అమ్మా, మనసు బాగాలేదు అలా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొస్తాను" అని  వాళ్ళమ్మ కి చెప్పి బయలుదేరుతోంటే కనీసం స్టేషనుకి దింపడానికి కూడా వెళ్ళలేదు నేను. 

"ఏరా, నిజం చెప్పు, ఏ అఘాయిత్యం చేసుకోవు కదా!" అని వాళ్ళమ్మ వాడి నుండి మాట తీసుకోవడం నా దృష్టి దాటిపోలేదు కానీ కఠినశిల వంటి మనసుతో అలా చలన రహితంగా ఉండిపోయానంతే.

                ***

కాలింగ్  బెల్ మ్రోగడంతో  ఆలోచనల ప్రవాహం నుండి వాస్తవ ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. మా స్నేహబృందంలో సభ్యుడయిన కృష్ణమూర్తి వచ్చాడు. 

"ఒరేయ్, రమణగాడికి గుండెనెప్పి వచ్చింది,అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలిట, సమయానికి పిల్లలెవరూ లేరు కదా దగ్గర, నేనే హాస్పిటల్లో చేర్పించి సంతకం పెట్టి, వాడి శ్రీమతి వసంతకి ధైర్యం చెప్పి వస్తున్నాను.ఏవో పరీక్షలవీ చేస్తున్నారు,ఇంకో రెండు గంటల్లో ఆపరేషన్, వసంత చెల్లెమ్మని రాత్రికి  మీ ఇంట్లో ఉంచుదాము, పాపం ఆవిడెందుకురా అక్కడ,అసలే మనిషి తల్లడిల్లిపోతోంది. నువ్వు మాత్రం త్వరగా బయలుదేరి రా" అని చెప్పి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెళ్ళిపోయాడు.      

అప్పటికప్పుడు నా భార్యతో కలిసి హాస్పిటల్‌కి వెళ్ళాను.సమయానికి తీసుకురాబట్టి గండం తప్పిందని డాక్టర్ చెప్పాడు.కాస్త హడావిడి తగ్గాక, అలా గాలి పీల్చుకుందామని హాస్పిటల్లోంచి కాసేపు బయటకి వచ్చాను. సాయంత్రం నుండీ జరిగిన సంఘటనలు అలా కళ్ళ ముందు కదిలాయి.

నేనెంత అదృష్టవంతుడినో అర్ధమయ్యాక,నా  కర్తవ్యం బోధపడింది.నా కొడుకు మేలిమి వజ్రం, వాడికి కావాల్సినది చిన్న భరోసా,నమ్మకం అంతే,ఇంక వాడి ప్రకాశానికి తిరుగుండదు. 

                                ***

మర్నాడు ఉదయం-

ట్రైన్ వచ్చి ఒకటొ నంబర్ ప్లాట్ ఫారం మీద ఆగింది. యస్ 8 కోచ్ లోంచి దిగిన భరత్ ఎదురుగా నవ్వుతూ నిలుచున్న నన్ను చూడగానే నివ్వెరపోయాడు. వాడి ఆశ్చర్యం క్షణాలలో ఆనందంగా మారింది. వాడి చేతిలోని బ్యాగ్ ను అందుకొని పక్కన పెట్టి, మరో చేత్తో వాడి చేయిని అందుకుని, మనసారా హత్తుకున్నాను. పుత్ర పరిష్వంగంలోని సంతృప్తిని మనసారా అనుభవిస్తూ, వాడిని ముద్దు పెట్టుకుందామంటే అందలేదు.

"ఎంత ఎత్తుకి ఎదిగిపోయావురా నా తండ్రీ!" అంటూ భరత్ తల వంచి ఆనందంతో నుదుట ముద్దాడాను. వాడి కనుకొసలనుండి కన్నీటి ధార... వాడి ముఖం మసగ్గా కనిపించింది. చిత్రం, నా కంటి నుండి కూడా నీటి ధారే... 

కాసేపటి తరువాత, వాడిని ముందు సీట్ లో కూర్చోబెట్టుకొని నేనే కారును నడిపిస్తున్నాను. కబుర్లు కాలవలు కట్టాయి మా మధ్యలో... నాకు తెలుసు ఈ మాత్రం భరోసా చాలు వాడికి!

తేలిక పడిన మనసులతో ఇద్దరం హాయిగా గమ్యం వైపు సాగిపోయాము.

No comments: