Tuesday, March 10, 2020

"పిల్లలున్నారు" జాగ్రత్త

సాయంత్రం పార్కులో ఆడుకుంటున్న పిల్లలని చూస్తూ కూర్చున్నాను. పిల్లలు ఉత్సాహంగా జారుడు
బల్లలు ఎక్కి దిగుతూ, పరిగెడుతూ ఆడుకుంటున్నారు. కాలనీలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఉన్న చిన్న
చిన్న పిల్లలందరూ పెద్దవాళ్ళయిపోయారు, ఇప్పుడు సెకండ్ జెనెరేషన్ వచ్చేసింది. చిన్న పిల్లలుంటే
అదో కాలక్షేపం, ఆ పార్టీ, ఈ పార్టీ అనో స్కూల్లో ఫలానా ప్రోగ్రాం కోసం అనో ఇతర పిల్లల తల్లులని కలిసే
అవకాశం ఉండేది, ఇప్పుడు ఆ అవసరమే ఉండట్లేదు. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం,
అందుకే సాయంత్రాలు వచ్చి పార్కులో కూర్చోవడం. 

ఇంతలో ఇద్దరు స్త్రీలు తమ పిల్లలతో వచ్చివెనక బెంచీలో కూర్చున్నారు. ఎప్పుడూ వాళ్ళని చూసి
పలకరింపుగా నవ్వడమే తప్ప పెద్ద పరిచయం లేదు. వాళ్ళతో వచ్చిన పిల్ల, పిల్లాడికి దాదాపు
ఏడెనిమిదేళ్ళుంటాయేమో. పిల్లకాయలు మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళగానే
వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు.చేతిలో పుస్తకంలో తల పెట్టినట్లు నటిస్తున్నానే కానీ అసంకల్పితంగా
నా చెవులు వారి మాటల మీద వేసేసాను. మరి వాళ్ళు మాట్లాడుకునేది నాకిష్టమైన పిల్లల టాపిక్కు.

అయినా వీళ్ళిద్దరికీ ఒక్కొక్కరే పిల్లలనుకున్నాను సుమా..ఇంకో చంటి పిల్లో పిల్లాడో కూడా ఉన్నారని
వీళ్ళ మాటల వల్ల అర్ధమయ్యింది. 

“మా చిన్నది ఈ మధ్య మహా పెంకిదయిపోయిందండీ”, అని ఒకావిడంటే “మా వాడూ ఏమీ తక్కువ కాదు,
ఇంట్లో వస్తువులు అన్నీ చిందర వందర చేసేస్తున్నాడని” రెండో ఆవిడ వాపోయింది. “
అసలు ఇంటికి ఎవరైనా రావాలంటే భయపడిపోతున్నారు వీడి అల్లరికి” అని నిట్టూర్చింది. 

చోద్యం కాకపోతే పిల్లల అల్లరికే అయినవాళ్ళ ఇంటికి రావడం మానెస్తారా,మరీను అనిపించింది. 
“పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు చేస్తారా ఏమిటి?” అని అడగకపోయారా అని చెప్పాలనిపించి బలవంతంగా
ఆపుకుని నా చెవులని వారి మాటలమీద వేసేసాను. 

“అసలు మా చిన్నదయితే ఒక్క నిమిషం నేను అలా అడుగు బయటేస్తే చాలు ఇల్లు దద్దరిల్లిపోయేటట్లు
అరుపులు, నేను లోపలకి రాగానే నా కాళ్ళని చుట్టేసి వదల్దే ఎంతకీ. మొన్న మా పక్కింట్లో కరివేపాకు
తీసుకుందామని అలా గోడ దగ్గరకి వెళ్ళానో లేదో ఇదొచ్చేసి గడప దాటలేక గుమ్మం దగ్గరే నేనొచ్చేవరకూ
ఉంది , మరీ ఇలా తయారవుతోందేంటో” అని వాపోయింది.
“ఎంతసేపూ దాని చుట్టే ఉండాలంటే ఎలాగ చెప్పండి?” అంటోంటే పాపం ఇంట్లో పెద్దవాళ్ళు
లేకపోబట్టి కదా ఈ తరం తల్లులకి ఈ సమస్య అనిపించింది. 

చిన్నప్పుడు చెల్లి పాకుతూ గడప దాటినప్పుడు గడప దాటితే గారెలు అంటూ మా బామ్మ వీధిలో
అందరికీ గారెలు చెయ్యడానికి పడ్డ హడావిడి  గుర్తొచ్చి నవ్వొచ్చింది. 

“మా వాడికి గోర్లు బాగా పెరిగాయండీ, అస్సలు ఇంట్లో తీద్దామంటే తీయించుకోడు కుదురుగా కూర్చుని,
స్పా కి పట్టుకెళ్తే మాత్రం మంత్రం వేసినట్ళు కూర్చుంటాడు”.ఈ మాట వినగానే ఆశ్చర్యం వేసింది. 

స్పా అంటే పెద్దవాళ్ళకే అనుకున్నాను, చిన్న పిల్లలకి కూడా వచ్చేసాయన్నమాట.ఏమోలే,
చిన్న పిల్లల హెయిర్ కటింగ్ షాపులు అంటూ విడిగా రాలేదూ, వీడియోలూ అవీ పెట్టి వాళ్ళవి
చూస్తుండగానే వీళ్ళు జుట్టు  కత్తిరించేస్తారని టీవీలో చూసాను. ఇవీ అంతేనేమో. 

“అసలు చిన్నదానినీ, పెద్దవాడినీ తీసుకుని బయటకి వెళ్ళడం కుదరడం లేదండీ కార్లో అయినా సరే” అని
  మొదటావిడ అంటోంటే చిన్నప్పుడు నలుగురు పిల్లల్ని వేసుకుని, ఆవకాయ క్యారేజీలతో
అమ్మ మాతో వేసవి శలవల్లో అమ్మమ్మ ఊరు నుండి ఎలా ప్రయాణం చేసేదో అనిపించింది. 

“మావాడికి మొన్న ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్లో  మొదటి ప్రైజు వచ్చిందని” ఒకావిడంటే,
“మొన్న బర్త్‌డే  పార్తీలో మా చిన్నదాని అల్లరి పట్టలేకపోయామంటే నమ్మండి” అని ఇంకోకావిడ.

ఆహా..ఎంతైనా తల్లులు కదా, పిల్లల చేష్ఠలు మురిపంగానే ఉంటాయి.నాకూ మనవలున్నారు కానీ
పిల్లల మీద ఉన్నన్ని హక్కులు వాళ్ళమీద ఉండవు కదా అని మనసులోనే నిట్టూర్చాను. 

“మా వాడికి ఈ మధ్య మరీ ముద్దలు నోట్లో పెడితే కానీ తినట్లేదండీ” అని మొదటావిడ మురిపెంతో చెప్తే,
”మా చిన్నది ఫలానా బ్రాండు ఆహారమయితేనే దగ్గరకి రానిస్తుంది’ అని రెండో ఆవిడ బాకా.

పిల్లలంటే ముద్దే కానీ మరీ ఇంతింత గారాబాలా? 

“అయ్యబాబోయ్ రేపొద్దున్న నా కొడుకు మనవరాలిని తీసుకుని వస్తే ఇలాగే ఉంటుందేమో” 
అనుకుని నా ఊహకి నాకే నవ్వొచ్చింది.

ఇంక వీళ్ళు తమ పిల్లల గురించి ఎన్నెన్ని ముచ్చట్లు పంచుకున్నారో.మా అబ్బాయికి ఈ మధ్య
బుజ్జి మంచం తెచ్చి దాని మీద పక్కేస్తేనే బజ్జుంటున్నాడని ఒకావిడంటే, మా చిన్నదానికి కూడా ఆ
అలవాటు చెయ్యాలండీ అని రెండో ఆవిడ.

తమ పిల్లలకి కొన్న బొమ్మలు,బట్టలు, వాళ్ళు ఇళ్ళల్లో  చేసే అల్లర్ల గురించి "మా అబ్బాయి", "మా చిన్నది"
అని చెప్తోంటే వినసొంపుగా అనిపించింది.ఆహా అదృష్టవంతులంటే చిన్న పిల్లలున్న తల్లి తండ్రులే
అనిపించింది.

కానీ వెంటనే మా పిల్లల చిన్నప్పుడు మాకున్న బాధ్యతలు,నెల నెలా ఎప్పుడు ఏ అవసరం వచ్చి
పడుతుందో అని బితుకు బితుకుమంటూ గడిపిన రోజులూ గుర్తొచ్చి వీళ్ళంత బాగా మా పిల్లల
చిన్నతనాన్ని మేము ఆస్వాదించలేదేమో అని కించిత్ అసూయ కలిగింది.  

ఇంతలోనే “ఫలానేదే తింటామని గానీ, ఫలానా మంచం మీదే పడుకుంటామని గాని కనీసం నోరు తెరిచి
అడగని మా బుజ్జాయిలు గుర్తొచ్చి”  గర్వంగా అనిపించింది. అయినా అసలు ఆ రోజుల్లో ఇంత టీవీలూ
హడావిడీ ఏదీ? ఏదో పత్రికల్లో వచ్చే ప్రకటనలో, లేదా దూరదర్శన్ కార్యక్రమాలు వచ్చే నాలుగైదు
గంటల్లో మహా అయితే ఓ పది నిమిషాల పాటు అడ్వర్టైజ్మెంట్లు ఇంతే కదా.ఇప్పట్లాగ పదినిమిషాలకొకసారి
ప్రకటనలు లేకపోవడం మా లాంటి మధ్య తరగతి తల్లి తండ్రులకి అప్పట్లో వరమేనేమో కూడా. 

అయ్యయ్యో స్వగతంలో పడి వీళ్ళ మాటలు వినట్లేదు అనుకుని ఈ లోకంలోకొచ్చిపడ్డాను.
పక్క వాడు ఏమి చేస్తున్నాడో అన్న కుతూహలమే కదా సోషల్ మీడియా విస్తరణకి  నాందీ వాచకం పలికింది.

మొదటావిడ చెప్పుకుపోతోంది... “ఈ మధ్య మా మామగారికి సుస్తీ చేసింది,
డాక్టరు కాస్త రెస్టు తీసుకోమన్నాడుట, అందుకని అత్తగారు, మామగారిద్దరినీ ఇంటికి రమ్మంటే
మా చిన్నదానికి ఇంకా టాయిలెట్ ట్రైనింగ్  అదీ అవ్వలేదు, ఇల్లంతా పాడుచేస్తుంది,
నాకు అసహ్యం నేను రాను అన్నారు మామగారు, చంటిది కదా అని అలా నెత్తినెక్కించుకోకూడదుట,
మా వారికేమో అదంటే గారం. ఏదో ఈసారికి మా మరిది ఆదుకోబట్టి సరిపోయింది
కానీ మా మరిది వచ్చే సంవత్సరం అమెరికా వెళ్తే వీళ్ళు మా ఇంటికి రావాలంటే ఇబ్బందే” అంది.

ఇంకొకావిడేమో, "మీకు మీ అత్తగారూ వాళ్ళతో ఇబ్బంది. నాకు మా తల్లి తండ్రులతోనే ఇబ్బంది.
మా చిన్నదానికేమో మాతో పాటు మంచం మీద పడుకుంటే తప్ప నిద్ర పట్టదు దానికి,
మా నాన్నేమో ఠాఠ్ వీల్లేదు దానిని విడిగా పడుకోబెట్టాల్సిందే అంటారు, ఇలా అంటున్నారనే నేను
అమ్మా వాళ్ళింటికెళ్ళడమే మానేసాను "అంది నీరసంగా.  

నాకు ఒళ్ళు  మండిపోయింది, “అసలు వాళ్ళు నానమ్మ, తాతయ్యలేనా?
గడప దాటడం రాని పసిగుడ్డు ఇల్లు పాడుచేస్తోందంటారా? మీ శుభ్రం తగలెయ్య.
అసలు వాళ్ళు తల్లి తండ్రులేనా? పసి పిల్లని విడిగా పడుకోబెట్టమంటారా?  ” అని పీకల దాకా కోపం
వచ్చింది. ఇంక ఆపుకోలేక వెనక్కి తిరిగి ఆవిడతో “అసలు మనవలని సహించలేని వారు కూడా ఉంటారని
తెలీదు, మరి పిల్లలని అలా అంటోంటే మీరెలా ఊరుకున్నారని” అడిగేసాను. 

“మా అత్తగారు, మామగారి దృష్టిలో కుక్కలెప్పుడూ గడప బయటే ఉండాలంటారండీ,
వీళ్ళ అమ్మా వాళ్ళదీ అదే అభిప్రాయం.కానీ మేము మాత్రం వాటిని  మా పిల్లలతో సమానంగా చూస్తాము,
అక్కడే వస్తోంది తేడా అంతా” అనడంతో ఓహో వాళ్ళు మాట్లాడుకునేది కుక్క "పిల్లల" గురించా
అని ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది.

కానీ వయసు తెచ్చిన పెద్దరికం వల్ల వీళ్ళకి కొంచెం "అమ్మా వేటిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి"
అని ఙానోదయం కలిగించాలిఅని నా మనసు తొందర చేసింది కానీ...
“ఇదిగో టామీ,పప్పీ,వసుధ అమ్మమ్మ,హాయ్ చెప్పండి" అని రేప్పొద్దున్న నా దగ్గరకే  వాళ్ళ పిల్లలని తీసుకొస్తే...
వద్దు బాబోయ్ ..అసలే నాకు కుక్కలంటే పరమ భయం.ఏ వీధిలోనైనా "కుక్క ఉన్నది జాగ్రత్త" అని
బోర్డు చూస్తే చాలు, చూడటమేమిటి "ఫలానా వాళ్ళింట్లో కుక్క ఉందిట" అని ఎవరైనా చెప్పుకోగా విన్నా సరే
ఆ ఛాయలకి కూడా వెళ్లను 

అది సరే కానీ ఇప్పుడు పెంపుడు కుక్కలు కాస్తా  "వాడు" "అది" అయ్యాకా "మా అబ్బాయి ఉన్నాడు జాగ్రత్త",
"మా అమ్మాయి ఉన్నది జాగ్రత్త" అని బోర్డు పెడుతున్నారంటారా?