Tuesday, February 12, 2019

ఏదేమైనా సఖా విడువను నిన్నే...లతా రజనీకాంత్ గారి ఈ పాట విన్నారా

ఒక్కోసారి మనకి అర్ధం అయ్యీ కాని భాష ఛానెల్స్ చూస్తే కూడా ఉపయోగమే. నిన్న అలాగ ఒక తమిళ్ ఛానెల్లో లతా రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటే ఆవిడ పాటలు కూడా పాడతారని తెలిసింది. ఆ కార్యక్రమంలో ఆవిడ పాడిన పాట ని యూ ట్యూబులో వెతికితే  ఈ పాట గురించి తెలిసింది. సాధారణంగా రెహ్మాన్ మ్యూజిక్ అంటే సినిమా ఎలా ఉన్నా పాటలన్నీ వింటాను ఒక్కసారైనా. ఎందుకంటే మిగతా పాటలెలా ఉన్నా కనీసం ఒక్క పాటలో లేదా బిట్ లో అయినా రెహ్మాన్ తన మ్యాజిక్ చూపిస్తాడన్న నమ్మకం. కానీ ఎందుకో ఈ సినిమా యానిమేషన్ సినిమా కాబట్టి, ఏముంటాయిలే పాటలు అని వినలేదు. ఇదిగో ఇన్ని సంవత్సరాలకి ఈ ఆణిముత్యం దొరికింది.

విక్రమసిఁహ పేరుతో తెలుగులో విడుదలయిన రజనీకాంత్ యానిమేషన్ సినిమాలోది ఈ పాట. వేటూరి గారు కాలం చేసాక రెహ్మాన్ సంగీతానికి సిరివెన్నెల గారే తెలుగులో రాస్తున్నారని తెలుసు. ఈ పాట వింటున్నంతసేపూ రచయిత ఎవరన్న కుతూహలం పెరిగిపోయింది, ఎందుకో శాస్త్రిగారు కాదేమో అన్న చిన్న అనుమానం కూడా. అది నిజమే, దీనిని రాసినది అనంత్ శ్రీరాం గారు.

తను ట్యూన్ ఇచ్చాకా అందులోకి పదాలు కూర్చడమే గానీ ఇసుమంతయినా రెహ్మాన్ ట్యూన్ మార్చడని వేటూరిగారే అన్నట్లు ఒకసారి చదివాను. అయినా ఆ అడ్డంకిని అధిగమించి, సందర్భానుసారం పదాలల్లిన శ్రీరాం గారు అభినందనీయులు.అంతా బాగుంది కానీ "పొత్తరు చేయడం" అంటే ఏమిటి?ఈ పదం దేనికైనా వికృతా అని కూడా ఆలోచించా కానీ తట్టలేదు. ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి.


అసలు ఎంత హాయిగా ఉందో ఆ సంగీతం, సాహిత్యం, లతా రజనీకాంత్ గారి కంఠం. పాట మొదట్లో కొమరం పులి సినిమాలో బ్యాక్ గ్రౌండులొ వచ్చే
"నమ్మకమీయరా స్వామీ" లా అనిపిస్తుంది. గాత్రంలో ఒకటి రెండు అక్షర దోషాలని మన్నించెస్తే అధ్భుతమైన పాట ఇది. నిన్నటినుండీ ఒక పాతిక సార్లు విని ఉంటాను ఈ పాటని, ఇంకా వింటూనే ఉంటాను కూడా.

ఈ పాటని తమిళంలో కూడా ఈవిడే పాడారు. కానీ తెలుగు మేల్ వెర్షన్ ఉన్ని క్రిష్ణన్ గారు పాడితే తమిళ్ళో హరి చరణ్ గారు పాడారు. ఒక్కసారి వినండి, ఒక్కసారయినా రిపీట్ నొక్కడం ఖాయం.

ఈ పాట యానిమేషన్ కాకుండా చక్కటి పెళ్ళి పాటగా ఏ మణిరత్నమో చిత్రించి ఉంటే పాట అందం మరింత పెరిగి ఉండేదేమో అనిపించింది.

ఇంత బాగున్న ఈ పాట యే వెడ్డింగ్ ప్రోమోస్ లోనూ ఎందుకు వినిపించట్లేదబ్బా?

6 comments:

sarma said...

నేను జంధ్యాల గారి ”కవి” నండి. పాట లిరిక్ రాస్తే అర్ధం చెప్పగలనేమో

వాత్సల్య said...

శర్మ గారూ,
నమస్కారం. మీరు తప్పక ఈ సందేహం తీర్చగలరు.ఆన్‌లైన్లో దొరికిన సాహిత్యం క్రింద ఇచ్చాను చూడగలరు

పానుపైన పాకమైన పొత్తరు చేస్తా(కొత్త రుచిస్తా ఏమొ కదా ఇక్కడ? )

ఇంకొకటి
ఒక దీపం వోలె ప్రతిబింబం నిన్నె కొలుచుకుందుకై బాసలు చేయుచుంటినె(దీపం వోలే ప్రతిబింబం అంటే ఏమిటో చెప్తారా? )

sarma said...


వాత్సల్యగారు,
పానుపు అనగా మంచం. పొత్తర అంటే దానం అనచ్చు. ఉదాహరణ. భోజనం పెట్టి సత్కారం చెయ్యవలసిన చోట ప్రత్యామ్న్యాయంగా భోజనపదార్ధాలు ఆకులో పెట్టి ఇవ్వడం.

దీపం వోలె ప్రతిబింబం
దీనికో చిన్నమాట చెప్పుకోవాలి. శకుంతల రాజసభలో తన భర్త నీవెవరో నాకు తెలియదని తిరస్కరించినపుడు దుష్యంతునికి కొడుకును చూపుతూ ఒక దీపాన్ని మరో దీపంతో వెలిగించినట్లు ఈ బిడ్డదు ఉన్నాడు చూడు అని చెబుతుంది. అనగా ఈ బిడ్డ నీ బిడ్డడే సుమా అని చెప్పడానికా ఉపమానం వాడుతుంది.

నాకు తోచిన అర్ధాలు చెప్పేను. అవి సరికాకపోవచ్చు కూడా. పూర్తి లిరిక్ ఉంటే మరికొంత అవగాహన కలిగేదనుకుంటాను. పొరబాటైతే మన్నించండి.

Rajeswari said...

👍👌👌

వాత్సల్య said...

మంచి విషయం తెలియచేసారు శర్మ గారూ. ఓపికగా వివరించినందుకు ధన్యవాదాలు.

వాత్సల్య said...

🙏🏿