Friday, December 21, 2018

ఇ-జనరేషన్ పెద్దవాళ్ళు

ఒక పాతిక ముప్ఫై ఏళ్ల క్రితం వయసులో పెద్ద వాళ్ళు అంటే సాయంత్రం అలా ఏ గుడికో, వాకింగుకో వెళ్ళేవారు లేదా పార్కుల్లో అక్కడా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకునేవారు. మహా అయితే పేపరులో వార్తలని అక్షరం వదలకుండా చదివేవారు.

జియో ధర్మమా అని ఫోనులో డేటా లభ్యత సులభతరం కావడంతో అందరిలాగే వీరి జీవన శైలి కూడా మారిపోయింది.గుడిలో వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది అనడంలో సందేహం లేదు.ఫోనుల్లో యాక్టివిటీ వల్ల మన అందరిలో ఉన్న అపరిచితుడు బయటకి రావడం మొదలుపెట్టాడు.దీనికి పెద్దవారు కూడా మినహాయింపు కాకపోవడమే విచిత్రం.ఫేస్ బుక్కు, వాట్సాపుల్లో పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజీలతో రోజు మొదలు.అక్కడితో ఆగితే ఫరవాలేదు,శుభ మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అదనంగా జీవిత సత్యాలు బోధించే వ్యాఖ్యలు, పండగ అడ్వాన్స్ విషెస్, పండగ రోజు విషెస్, దేశం భ్రష్టు పట్టిపోతోందనే వేదన పంచే మెసేజిలూ, అసలు ధనవంతులు తమకున్న డబ్బు ఎలా నీళ్ళళ్ళా ఖర్చు పెడుతూ పేదలకి దానం ధర్మం అనేది చెయ్యకుండా ఎలా పెళ్ళిళ్లకోసం తగలేస్తున్నారో అని బాధ పడే పోస్టులు ఒకటా రెండా..

సరే వాళ్ళెవరో పెళ్ళిళకో ఇంకో ఆర్భాటాలకో ఖర్చు పెట్టారనుకుందాము, కానీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, మీకు ఆర్ధిక స్తోమత ఉంది, అయినా  కూడా మీరు పనమ్మాయికి ఒక్క ఐదు వందలు ఇవ్వగలరా? 

ఫేస్‌బుక్కులో వీళ్ళు షేర్ చేసే జోకులు చూస్తే ఒక్కోసారి జాలి వేస్తుంది, ఇంత వయసొచ్చి ఇదేమి పైత్యం అని.కానీ ఇవన్నీ వీళ్ళ అసలు స్వభావానికి అద్దం పడతాయనడంలో సందేహం లేదు. పైగా "మెమొరీస్" ఫీచర్‌తో మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి డబుల్ కోటా.నేను పోయిన సంవత్సరం, లేదా కొన్ని ఏళ్ళక్రితం ఇది పోస్టు చేసాను అంటూ, మళ్ళీ దానికి లైకులు పెద్ద హైలైట్.

కానీ కొంత మంది పెద్దవారు వారి అనుభవసారాన్నో లేదా వారికి తెలిసున్నదానినో షేర్ చేస్తూ, విఙానం  పంచుతూ రాసే పోస్టులు చూస్తే ఎన్ని వేల మైళ్ళు ఆవల ఉన్నా, వారెవరో తెలియకపోయినా గౌరవం కలుగుతుంది.

అబ్బెబ్బే ఫోను, టీవీల వల్ల సమాజం చెడిపోతోంది అంటూనే ఆ పిచ్చిలోంచి బయటకి రాలేకపోవడం చూస్తే అనిపిస్తుంది, ఇంత పెద్దవారే ఈ లంపటంలోంచి బయటపడలేకపోతే ఇంక పిల్లల పరిస్థితి ఏమిటీ అని.

అసలు పిల్లలకి కధలు, కబుర్లు చెప్తే ఈ జనరేషన్ పిల్లలు వినరు అంటారు కానీ చెప్పే పెద్దవారు ఎంత మంది ఉన్నారు అసలు?ముందు ముందు ఇంక అసలు ఉండరేమో కూడా. ఎక్కడ నలుగురు పెద్దవారు చేరినా మా పిల్లలు అదీ, మా పిల్లలు ఇదీ, ఫలానా ఫోను వాడుతున్నాను, కేబుల్ తీసేసి ఫలానా బాక్సు వాడి అన్ని ఛానెల్స్ ఫ్రీగా చూడచ్చు ఇంతే కదా. ఒకళ్ళకి పాటల ప్రోగ్రాముల పిచ్చి, ఇంకొకరికి వెకిలి కామెడీ షోల వెర్రి.

ఇంకొకాయన తన సెల్ఫ్ డిసిప్లిన్ గురించి గొప్పలు, మరొకావిడ తాను చేసే పూజలూ, చేయించగలిగే హోమాల గురించి డాంబికాలు. నేను ఉపనిషత్తులు, వేద వేదాంగాలు చదివాను, అన్ని రకాల యఙాలు, యాగాలు చేయించగలను అన్నారు ఆ మధ్యన పార్కులో పరిచయం అయిన ఒక తెలుగావిడ. మన పెద్దలు చేసిన కట్టుబాటుని అధిగమించి నేను ఇది చేయిస్తాను అని సగర్వంగా పెద్దవారే చెప్పుకుంటోంటే ఏమనాలి?


ఏదైనా ప్రదేశానికో ఇంకెక్కడికో వెళ్ళినా అందాన్ని ఆస్వాదించడం మరచి ఫోనులో ఫొటోలు తీసుకోవడంలో బిజీ. గుడిలో కూడా ఫోటోలు తీసే పెద్దవారిని చూస్తే ఆశ్చర్యం వేసింది . ఆ మధ్య ఒక ఫ్రెండు చెప్పింది, తనతో ఎప్పుడూ మాట్లాడని అత్తగారు  ఒక వాట్సాప్ మెసేజీ ఫార్వార్డ్ చేసిందిట, దాని సారాంశం కొడుకు, కోడలు ఒక అత్తగారికి బంగారు నాణేలతో తులాభారం వేసారుట.ఇంక ఏమంటాము? చదువుకోకపోతే స్మార్టు ఫోను వాడుకోవడం రాదు అనేది ఒకప్పటి మాట, ఏ మాత్రం చదువు లేకపోయినా ఫోనులో వీడియోలు అందరూ చూసెయ్యగలరు ఇప్పుడు అనేది కాదనలేని సత్యం. అదీ చేతకాకపోతే టీవీలున్నాయి కదా.ఇవి పెద్దవారి ఆలోచనా విధానాన్ని కూడా మార్చెయ్యడమే విచారించదగ్గ విషయం. మా మనవలకి సినిమా పాటలూ, డ్యాన్సులూ రావు అని బాధ పడేటట్లు కూడా చెయ్యగలుగుతున్నాయి మరి.

న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయి మమ్మల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు అనేది పెద్దవాళ్ళు చెప్పే మాట. అసలు మీరు ఫోన్లు, టీవీలూ వదిలి చొరవ తీసుకుంటున్నారా? తీసుకున్నా వాళ్లు పట్టించుకోకపోతే మీరు కూడా వారి దారిలో నడవక్కర్లేదు కదా.మీకంటూ ఒక మంచి వ్యాపకం పెట్టుకోవచ్చు. ఒక పెద్దాయన ఒక సభలో చెప్పినట్లు "పిల్లలింటికి వచ్చినప్పుడు మీకు కావాల్సినట్లుగా పూజా మందిరం లేదు అని మీ దైనందిన పూజ మానేసి టీవీలూ, ఫోన్లలో మునిగిపోవడం ఎంత వరకూ సబబు? మీ పిల్లలు మిమ్మల్ని ఏ కారణం చేతనయినా పూజ చెయ్యనియ్యకపోయినా మీరు మనసులో స్మరణ ఆపక్కర్లేదు కదా".

దేవుది మీద నమ్మకం లేకపోతే ఇంకో వ్యాపకం పెట్టుకోండి అంతే కానీ అలా ఖాళీగా కూర్చుని ప్రభుత్వాలనో, ఇతరులనో నిందిస్తోంటే అది మీ వయసుకి అందాన్నివ్వదు అని గుర్తు పెట్టుకోండి. వాన ప్రస్థానికి వెళ్ళకపోయినా అందరి మధ్యా ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ, మార్పులని స్వీకరిస్తూ, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా తన ఆరోగ్య జీవన విధానాన్ని  కొనసాగించి ఓ రెండేళ్ళ క్రితం కాలం చేసిన ఒక పెద్దాయనని  చూస్తే భయం వేసింది అసలు ఈ రోజుల్లో ఇలా ఉండగలగటం సాధ్యమా అని.

ఇన్ని సంవత్సరాలూ పిల్లల కోసం కష్టపడ్డారు కదా,ఇకనైనా ప్రశాంతంగా జీవించండి ప్లీజ్.డబ్బు, నగలు, టీవీ షోల కబుర్లు లేదా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల మనసు ఉద్విగ్నత పొందటం తప్ప ఏమీ ఉండదు. హాయిగా ఒక మంచి పుస్తకం చదవండి లేదా అలా బయటకెళ్ళి కాసేపు కూర్చుని చూడండి, సమాజంలో చెడే కాదు మంచి కూడా ఇంకా బ్రతికే ఉంది అని తెలుస్తుంది.

పెద్ద వారు వారి హుందాతనాన్ని నిలబెట్టుకుంటూ, పిల్లలు వారికి గౌరవం ఇస్తూ ఉండే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అలాంటి కుటుంబాలలో పెరుగుతున్న పిల్లలే మన సమాజం పూర్తిగా పాశ్చాత్య ప్రభావానికి లోనవ్వదు అనే ఆశకి ఆలంబన.


6 comments:

Pavan Kumar Reddy Rendeddula said...

"సరే వాళ్ళెవరో పెళ్ళిళకో ఇంకో ఆర్భాటాలకో ఖర్చు పెట్టారనుకుందాము, కానీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, మీకు ఆర్ధిక స్తోమత ఉంది, అయినా కూడా మీరు పనమ్మాయికి ఒక్క ఐదు వందలు ఇవ్వగలరా?"

ఇది మాత్రం ఖచ్చితంగా నిజం వాత్సల్య గారు. మన జేబు లోంచి వంద కూడా ఇవ్వము కానీ, బాగా డబ్బున్న వాళ్ళు లక్షలు ఇవ్వట్లేదు అని విమర్శిస్తాము.

విన్నకోట నరసింహా రావు said...

వాట్సప్ లో తిరుగుతున్న ఈ క్రింది మెసేజ్ మీరందరూ చూసే ఉంటారు 👇.
--------------
"Forwarded
Someone asked Bill Gates, Is there any person richer than you?

He said, yes, only one. Many years ago, I had been dismissed and I had gone to New York airport. I read titles of newspapers there. I liked one of them and I want to buy it. But I didn't have change (coin). So abandoned the idea, suddenly, a black boy called me and told me, “This newspaper for you.” I said, but I don’t have change. He said, “No problem, I give you free”.

After 3 months, I went there. Coincidentally, that story happened again and that same boy gave me another free newspaper again. I said, I can’t accept it. But he said, “I give you from my profit.”

After 19 years, I had been rich and I decided to find that boy. I found him after one and half month's search. I asked him, do you know me? He said, “Yes, you’re famous Bill Gates.”

I said, you gave me free newspaper 2 times many years ago. Now, I want to compensate it. I am going to give you everything that you want. Black young man replied, “You can’t compensate it!”
I said, why? He said, "Because I gave you when I was poor. You want to give me when you are rich. So, how do you compensate?"

Bill Gates said, I think that black young man is richer than me.

You don't have to be rich or wait to be rich to give......

*Real attitude of giving is when you lack*

Keep the Spirit Alive"
-----------------------
ఇవ్వడం అనేది కలిమి మీద ఆధారపడినది కాదండి. అది ఒక గుణం (సద్గుణం). మనలాంటి సామాన్యులం కూడా పనమ్మాయికి అవసరానికో, పండుగకో, మనింట్లో శుభకార్యం జరిగినప్పుడో మనకు తోచినది ఇవ్వడం లేదా, ఇతర రూపేణా కూడా దానాలు చెయ్యడం లేదా (కాకపోతే దానికి పబ్లిసిటీ చేయించుకోలేం, అంతే ��) ? జనాన్ని లైన్లో నిలబెట్టి డబ్బు పంచిపెట్టరు కదా కలిగినవారు అయినా. కనీసం శుభకార్యం చేసుకున్న సందర్భంగానయినా దానాలు చెయ్యచ్చుగా. పూర్వకాలంలౌ రాజులు, ధనవంతులు అలాగే చేసేవారని చెబుతుంటాయిగా పుస్తకాలు. మరి ఈ అత్యధిక ధనవంతులంటే ఆధునిక రాజులే కదా ఒకరకంగా (ఆ విధంగానే వాళ్లకు వ్యక్తిపూజ నడుస్తోంది కదా నేటి సమాజంలో).

అంతకంతకూ పెచ్చుమీరిపోతున్న ఆర్భాటాలతో కూడిన పెళ్లిళ్లు చూస్తుంటే నాకెప్పడూ ఇందిరా గాంధీ గారి ఉదంతం గుర్తొస్తుంది. తన రెండవకొడుకు పెళ్ళి రిజిష్టర్డ్ మేరేజ్ గా జరిపింది. విశేషం ఏమిటంటే అప్పటికి ఆవిడ ప్రధానమంత్రి పదవిలోనే ఉన్నారు. అయినప్పటికీ సింపుల్ గానే చేసింది ... vulgar show of wealth లేకుండా. కానీ ఇప్పడేమో ostentatiousness బాగా ఎక్కువయిపోయింది ... ఈ మధ్య జరిగిన మూడు సెలిబ్రిటీ వివాహాల ఆడంబరం చూస్తే. వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, నీకేమిటి బాధ అని అడిగితే .. సమాజం మీద ప్రభావం పడుతుందని, సామాన్యులు కూడా పులిని చూసి నక్క వాతబెట్టుకుందన్న సామెతగా స్తోమతకు మించిన పనులు చేసే ఉచ్చులో పడే ప్రమాదముందనీ బాధ.

చివరగా ... ఇవ్వడం / దానం చెయ్యడం గురించి IT is more blessed to give than to receive అని బైబిల్ సూక్తి. బైదివే, నేను క్రైస్తవుడిని కాదు, అయినా మతాతీతంగా ఇది నాకు నచ్చిన సూక్తి. Merry Christmas.

వాత్సల్య said...

పవన్ గారు,

ధన్యవాదాలు, మీ బ్లాగ్ ఇప్పుడే చూసాను, ఒక్క పోస్టే చదివాను, మిగిలినవి చదవాలి. ఈ అంధెయ తరచూ బ్లాగులు చూడకపోవడం వల్ల అనుకుంటా మీ బ్లాగ్ మిస్స్ అయ్యాను

వాత్సల్య said...

విన్నకోట గారు,

నమస్కారం. మీ వ్యాఖ్యతో ఎందుకో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. సెలెబ్రిటీల పెళ్ళిళ్ళని ఫాలో అయినప్పుడు వారి విజయాలు, వర్కవుట్లు తదితరాలని సామాన్యులు ఎందుకు ఫాలో అవ్వరు?అత్యంత నిరాడంబరంగా పెళ్ళి చేసుకునే సెలిబ్రిటీలు కూడా ఉన్నారు. కాకపోతే సామాన్యులకి కూడా ఈ మధ్య నాలుగు డబ్బులు ఉన్నాయి కాబట్టి పక్కింట్లో వాడొకడు ఇలా పెళ్ళో పేరంటమో చేసాడు, మనం ఇంకాస్త గొప్పగా చెయ్యాలి అని అంతే. నిజం చెప్పాలంటే సెలెబ్రిటీల బట్టల ఖర్చుతో మన లాంటి వారి ఇళ్ళల్లో పెళ్ళి సగం అయిపోతుందేమో కూడా, మరి అలాంటప్పుడు వాళ్ళతో కంపేరిజన్ అనేదే లేదు అని నా అభిప్రాయం.

వాత్సల్య said...

నీహారిక గారూ,

మీ కామెంటుని ప్రచురించి నా బ్లాగులో యుద్ధానికి తెర తీయదలచుకోలేదు.మీరు చెప్పిన ఆ పెద్దాయన అసహ్య కరమైన రాతలు రాయగా ఎప్పుడూ చూడలేదు మరి.ఆయన పోస్టులు ఎప్పుడూ మన పాత ఆచారాలనో, ఆయన జీవిత అనుభవాలనో సూచించేటట్లు ఉంటాయి.

Anonymous said...

"ఫోనుల్లో యాక్టివిటీ వల్ల మన అందరిలో ఉన్న అపరిచితుడు బయటకి రావడం మొదలుపెట్టాడు". True.