Friday, December 21, 2018

ఇ-జనరేషన్ పెద్దవాళ్ళు

ఒక పాతిక ముప్ఫై ఏళ్ల క్రితం వయసులో పెద్ద వాళ్ళు అంటే సాయంత్రం అలా ఏ గుడికో, వాకింగుకో వెళ్ళేవారు లేదా పార్కుల్లో అక్కడా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకునేవారు. మహా అయితే పేపరులో వార్తలని అక్షరం వదలకుండా చదివేవారు.

జియో ధర్మమా అని ఫోనులో డేటా లభ్యత సులభతరం కావడంతో అందరిలాగే వీరి జీవన శైలి కూడా మారిపోయింది.గుడిలో వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది అనడంలో సందేహం లేదు.ఫోనుల్లో యాక్టివిటీ వల్ల మన అందరిలో ఉన్న అపరిచితుడు బయటకి రావడం మొదలుపెట్టాడు.దీనికి పెద్దవారు కూడా మినహాయింపు కాకపోవడమే విచిత్రం.ఫేస్ బుక్కు, వాట్సాపుల్లో పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజీలతో రోజు మొదలు.అక్కడితో ఆగితే ఫరవాలేదు,శుభ మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అదనంగా జీవిత సత్యాలు బోధించే వ్యాఖ్యలు, పండగ అడ్వాన్స్ విషెస్, పండగ రోజు విషెస్, దేశం భ్రష్టు పట్టిపోతోందనే వేదన పంచే మెసేజిలూ, అసలు ధనవంతులు తమకున్న డబ్బు ఎలా నీళ్ళళ్ళా ఖర్చు పెడుతూ పేదలకి దానం ధర్మం అనేది చెయ్యకుండా ఎలా పెళ్ళిళ్లకోసం తగలేస్తున్నారో అని బాధ పడే పోస్టులు ఒకటా రెండా..

సరే వాళ్ళెవరో పెళ్ళిళకో ఇంకో ఆర్భాటాలకో ఖర్చు పెట్టారనుకుందాము, కానీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, మీకు ఆర్ధిక స్తోమత ఉంది, అయినా  కూడా మీరు పనమ్మాయికి ఒక్క ఐదు వందలు ఇవ్వగలరా? 

ఫేస్‌బుక్కులో వీళ్ళు షేర్ చేసే జోకులు చూస్తే ఒక్కోసారి జాలి వేస్తుంది, ఇంత వయసొచ్చి ఇదేమి పైత్యం అని.కానీ ఇవన్నీ వీళ్ళ అసలు స్వభావానికి అద్దం పడతాయనడంలో సందేహం లేదు. పైగా "మెమొరీస్" ఫీచర్‌తో మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి డబుల్ కోటా.నేను పోయిన సంవత్సరం, లేదా కొన్ని ఏళ్ళక్రితం ఇది పోస్టు చేసాను అంటూ, మళ్ళీ దానికి లైకులు పెద్ద హైలైట్.

కానీ కొంత మంది పెద్దవారు వారి అనుభవసారాన్నో లేదా వారికి తెలిసున్నదానినో షేర్ చేస్తూ, విఙానం  పంచుతూ రాసే పోస్టులు చూస్తే ఎన్ని వేల మైళ్ళు ఆవల ఉన్నా, వారెవరో తెలియకపోయినా గౌరవం కలుగుతుంది.

అబ్బెబ్బే ఫోను, టీవీల వల్ల సమాజం చెడిపోతోంది అంటూనే ఆ పిచ్చిలోంచి బయటకి రాలేకపోవడం చూస్తే అనిపిస్తుంది, ఇంత పెద్దవారే ఈ లంపటంలోంచి బయటపడలేకపోతే ఇంక పిల్లల పరిస్థితి ఏమిటీ అని.

అసలు పిల్లలకి కధలు, కబుర్లు చెప్తే ఈ జనరేషన్ పిల్లలు వినరు అంటారు కానీ చెప్పే పెద్దవారు ఎంత మంది ఉన్నారు అసలు?ముందు ముందు ఇంక అసలు ఉండరేమో కూడా. ఎక్కడ నలుగురు పెద్దవారు చేరినా మా పిల్లలు అదీ, మా పిల్లలు ఇదీ, ఫలానా ఫోను వాడుతున్నాను, కేబుల్ తీసేసి ఫలానా బాక్సు వాడి అన్ని ఛానెల్స్ ఫ్రీగా చూడచ్చు ఇంతే కదా. ఒకళ్ళకి పాటల ప్రోగ్రాముల పిచ్చి, ఇంకొకరికి వెకిలి కామెడీ షోల వెర్రి.

ఇంకొకాయన తన సెల్ఫ్ డిసిప్లిన్ గురించి గొప్పలు, మరొకావిడ తాను చేసే పూజలూ, చేయించగలిగే హోమాల గురించి డాంబికాలు. నేను ఉపనిషత్తులు, వేద వేదాంగాలు చదివాను, అన్ని రకాల యఙాలు, యాగాలు చేయించగలను అన్నారు ఆ మధ్యన పార్కులో పరిచయం అయిన ఒక తెలుగావిడ. మన పెద్దలు చేసిన కట్టుబాటుని అధిగమించి నేను ఇది చేయిస్తాను అని సగర్వంగా పెద్దవారే చెప్పుకుంటోంటే ఏమనాలి?


ఏదైనా ప్రదేశానికో ఇంకెక్కడికో వెళ్ళినా అందాన్ని ఆస్వాదించడం మరచి ఫోనులో ఫొటోలు తీసుకోవడంలో బిజీ. గుడిలో కూడా ఫోటోలు తీసే పెద్దవారిని చూస్తే ఆశ్చర్యం వేసింది . ఆ మధ్య ఒక ఫ్రెండు చెప్పింది, తనతో ఎప్పుడూ మాట్లాడని అత్తగారు  ఒక వాట్సాప్ మెసేజీ ఫార్వార్డ్ చేసిందిట, దాని సారాంశం కొడుకు, కోడలు ఒక అత్తగారికి బంగారు నాణేలతో తులాభారం వేసారుట.ఇంక ఏమంటాము? చదువుకోకపోతే స్మార్టు ఫోను వాడుకోవడం రాదు అనేది ఒకప్పటి మాట, ఏ మాత్రం చదువు లేకపోయినా ఫోనులో వీడియోలు అందరూ చూసెయ్యగలరు ఇప్పుడు అనేది కాదనలేని సత్యం. అదీ చేతకాకపోతే టీవీలున్నాయి కదా.ఇవి పెద్దవారి ఆలోచనా విధానాన్ని కూడా మార్చెయ్యడమే విచారించదగ్గ విషయం. మా మనవలకి సినిమా పాటలూ, డ్యాన్సులూ రావు అని బాధ పడేటట్లు కూడా చెయ్యగలుగుతున్నాయి మరి.

న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయి మమ్మల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు అనేది పెద్దవాళ్ళు చెప్పే మాట. అసలు మీరు ఫోన్లు, టీవీలూ వదిలి చొరవ తీసుకుంటున్నారా? తీసుకున్నా వాళ్లు పట్టించుకోకపోతే మీరు కూడా వారి దారిలో నడవక్కర్లేదు కదా.మీకంటూ ఒక మంచి వ్యాపకం పెట్టుకోవచ్చు. ఒక పెద్దాయన ఒక సభలో చెప్పినట్లు "పిల్లలింటికి వచ్చినప్పుడు మీకు కావాల్సినట్లుగా పూజా మందిరం లేదు అని మీ దైనందిన పూజ మానేసి టీవీలూ, ఫోన్లలో మునిగిపోవడం ఎంత వరకూ సబబు? మీ పిల్లలు మిమ్మల్ని ఏ కారణం చేతనయినా పూజ చెయ్యనియ్యకపోయినా మీరు మనసులో స్మరణ ఆపక్కర్లేదు కదా".

దేవుది మీద నమ్మకం లేకపోతే ఇంకో వ్యాపకం పెట్టుకోండి అంతే కానీ అలా ఖాళీగా కూర్చుని ప్రభుత్వాలనో, ఇతరులనో నిందిస్తోంటే అది మీ వయసుకి అందాన్నివ్వదు అని గుర్తు పెట్టుకోండి. వాన ప్రస్థానికి వెళ్ళకపోయినా అందరి మధ్యా ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ, మార్పులని స్వీకరిస్తూ, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా తన ఆరోగ్య జీవన విధానాన్ని  కొనసాగించి ఓ రెండేళ్ళ క్రితం కాలం చేసిన ఒక పెద్దాయనని  చూస్తే భయం వేసింది అసలు ఈ రోజుల్లో ఇలా ఉండగలగటం సాధ్యమా అని.

ఇన్ని సంవత్సరాలూ పిల్లల కోసం కష్టపడ్డారు కదా,ఇకనైనా ప్రశాంతంగా జీవించండి ప్లీజ్.డబ్బు, నగలు, టీవీ షోల కబుర్లు లేదా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల మనసు ఉద్విగ్నత పొందటం తప్ప ఏమీ ఉండదు. హాయిగా ఒక మంచి పుస్తకం చదవండి లేదా అలా బయటకెళ్ళి కాసేపు కూర్చుని చూడండి, సమాజంలో చెడే కాదు మంచి కూడా ఇంకా బ్రతికే ఉంది అని తెలుస్తుంది.

పెద్ద వారు వారి హుందాతనాన్ని నిలబెట్టుకుంటూ, పిల్లలు వారికి గౌరవం ఇస్తూ ఉండే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అలాంటి కుటుంబాలలో పెరుగుతున్న పిల్లలే మన సమాజం పూర్తిగా పాశ్చాత్య ప్రభావానికి లోనవ్వదు అనే ఆశకి ఆలంబన.