Tuesday, September 13, 2016

బామ్మ

ఎన్నెన్ని టెరా బైట్ల ఙాపకాలు బామ్మా నీతో.. వాటిల్లోంచి ఓ నాలుగు ముక్కలు


బామ్మ..ఇప్పుడొక ఙాపకం మాత్రమే.బామ్మ ట్రేడ్ మార్క్ తొక్కుడు లడ్డూలూ,వేసవి కాలంలో తన చేత్తో కలిపిన ఆవకాయ సాయంత్రం తులసి కోట దగ్గర కూర్చుని తిన్న గుర్తులు, నేను కాలేజీలో ఉండగా రాసిన ఉత్తరాలు,వంటింట్లో దండెం మీద ఆరేసిన చీరని ముట్టుకుంటా ముట్టుకుంటా అని అడిగి తిన్న తిట్లు, అందరూ ఎంత ఎగ్జైట్ అయిపోతున్నా కానీ తొణక్కుండా బెణక్కుండా అలా నిండు కుండలా ఉండే వ్యక్తిత్వం ఒక్కటేమిటీ అన్నీ ఇక ఙాపకాలు మాత్రమే.వేసవి కాలంలో మామిడికాయ పులుసు పెట్టి టెంక వద్దు వద్దు మొర్రో అంటోంటే కంచంలో వేసి ఇలా జుర్రుకోవాలీ, ఆ జుర్రెయ్యి అంటూ అంటూ నువ్వు అప్పుడు చెప్పిన మాటలు అవీ తలచుకుంటే ఇంకా నువ్వు విసనకర్రపట్టుకుని విసురుకుంటూ మాకు వడ్డిస్తున్నట్లే ఉంటుంది.నువ్వు మజ్జిగా లాంటి వాటిని డైనింగ్ టేబుల్ మీద ఎందుకు పెట్టవో తెలిదేసి కాదు.డైనింగ్ టేబుల్ అంటే నీ దృష్టిలో "అంట మంగళం" కదా..నవ్వొస్తుంది తలచుకుంటే.నిలువెత్తు నువ్వు అలా వంటింట్లో విసనకర్రతో విసురుకుంటూ మడిగా నిల్చుని వంట చెయ్యడాన్ని ఎలా మర్చిపోగలను బామ్మా??


 నేనిప్పుడు ఖమ్మం వస్తే బామ్మ దగ్గరకి వెళ్ళాలి అన్న తొందరుండదు, ఆ ఇంటికి వస్తే గుర్తొచ్చే గుర్తులు తప్ప ఏముందక్కడ ఇప్పుడు??  తేలు మంత్రం నాకు నేర్పించవూ అని చిన్నప్పుడు అడిగితే కసురుకునే దానివి,కాస్త పెద్దయ్యాకా చెప్పావు అది నేర్చుకోవడం ఎంత కష్టమో, నేర్చుకుంటే ఎలా పాటించాలో వగైరా వివరాలతో.ఇప్పటికీ నాకు పజిలే బామ్మా తేలు మంత్రం ఎలా పని చేస్తుందో కదా అని.

ఎన్నడూ అలా అచేతనంగా పడుకోని నువ్వు హాస్పిటల్లో చేరావని తెలియగానే దేవుడా బామ్మని ఇబ్బంది పెట్టకు అని కోరుకున్న నేనే నువ్వు లేవని తెలిసిన మరుక్షణం అలా ఏడ్చానెందుకు??

నీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కంచం ముందు కూర్చున్నానే కానీ ఛీ నేను అన్నం తింటున్నానా అని నా మీద నాకే కోపం వచ్చింది బామ్మా.. కానీ నువ్వే చెప్పేదానివి కదా ఈశ్వరుడు తనకి దూరంగా జరగమని ఎప్పుడూ చెప్పడమ్మా, సమయానికి కొన్ని చెయ్యాలంతే, వీలు పడకపోతే నాలుగు పాల చుక్కలు తాగి పూజ చేస్తే తప్పు లేదు అని..అప్పుడనుకున్నాను..లేదు నేను తప్పు చెయ్యట్లేదు ఇక్కడ నా రోజు వారీ కార్యక్రమాల కోసం తినాలి అనుకుని నాలుగు ముద్దలు తిన్నాను.


అంత మంది పిల్లల్ని పెంచావు అంతా బాగానే ఉంది కానీ బామ్మ నీకు మనవలలో మగ పిల్లలంటేనే ఎందుకు ఇష్టమో కదా అని చిన్నప్పుడు కోపం ఉండేది అది ఇప్పటికీ పోలేదు తెలుసా.పోయిన వాళ్లతోటే కోపాలూ అన్నీ వదిలేయ్యాలి అంటారు కదా వదిలెస్తాలే బామ్మా..అలాగే నువ్వు చేసిన కొన్ని పనులు చూస్తే కోపం కూడా వచ్చేది అన్నీ తెలిసీ ఇది తప్పు అని తప్పు చేస్తున్న వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు అని.అది అతి ప్రేమో లేక మరేమిటో ఇప్పటికీ అర్ధం కాదు ఇక కాబోదు కూడా. కానీ ఒక్కటి మాత్రం నిజం బామ్మా నువ్వు లేని ఆ ఇల్లు మూల విరాట్టు లేని గర్భ గుడే.ఎక్కడున్నా హాయిగా తాతగారితో కలిసి ఉండు.