Thursday, November 19, 2015

సత్య కంగారు వ్రతం

(జిలేబి గారి టపా చూసి దానిలోంచి శర్కరి గారి బ్లాగులోకి దారి తీస్తే సత్య నారాయణ వ్రతం గురించి గరిక పాటి వారి వీడియోకనిపించింది.. ఓ మూడు నాలుగేళ్ళ క్రితం రాసుకుని డ్రాఫ్ట్ లో ఉంచిన టపా కి దుమ్ము దులిపాను)

ఇంటి ముందు మామిడి తోరణాలు,వరుసలుగా కట్టిన బంతి ఇతర రంగు రంగుల పూలు అదే గృహ ప్రవేశం జరిగే ఇల్లని చెప్తున్నాయి.ఇంటి సింహ ద్వారం ముందు పేరుకున్న చెప్పుల గుట్ట అతిధుల సంఖ్య ని చెప్తోంది. "కలశస్య ముఖే విష్ణు..."..హలో ఆ.. ఆ థాంక్యూ పిన్నీ...ఆ..ఏమిటీ అసలు వినబడ్డం లేదు..సాయంత్రం చేస్తాను,  బాయ్ ..వినాయకుడికి చిన్న బెల్లం ముక్క పెట్టండి...ఆ పూర్తిగా రినోవేట్ చేయించామండీ..మొత్తం ..

అమ్మా హారతి ఇవ్వండి. "బుధ గ్రహం స్థాపయామి పూజయామి..అమ్మా ఇక్కడ ఈ తాంబూలం ఉంచి అక్షింతలు వెయ్యండి "చిల్డ్రన్ రూం డిజైన్ వాళ్ళే చేసుకున్నరండీ..ఆ ఆ...మోడర్న్ కిచెన్ కాన్సెప్ట్ అని కిచెన్ ఇలా ఓపెన్ గా వదిలేసాము".. "సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం"..ఏమండీ స్కైప్ లో వీడియో రావట్లేదుట..ఇండియా నుండి అక్క మెసేజ్ పెట్టింది. కాస్త చూడమని చెప్పండి ఎవరికైనా..మనం పీట్ల మీద ఉన్నాం కదా..   లక్ష్మీ కాంతం కమల నయనం..హెలో బాగున్నారా..జానకీ అటు చూడు మా బాస్ వచ్చాడు ఫ్యామిలీ తో.షీ ఈజ్ మై వైఫ్...హలో అండీ...రండి కూర్చోండి ఆ అక్షింతలు ఇలా వెయ్యండమ్మా..


 "హస్తయో అర్ఘ్యం సమర్పయామి,పాదయో పాద్యం సమర్పయామి"..రేవతీ క్యాటరర్ కి ఫోన్ చేసి కనుక్కో ఎక్కడ ఉన్నాడో, స్వీట్ ఎక్స్ ట్రా తెస్తున్నాడో లేదో,లేదంటే సారధి ని పంపించి తెప్పించు "సర్వాణ్యంగాని పూజయామి.." అయ్యో పదకొండున్నర అయిపోయిందండీ..ఇంకా కధ మొదలవ్వలేదు.అందరికీ లేటయిపోతుందేమో. "అమ్మా ఈ అక్షింతలు పట్టుకుని అందరూ కధ శ్రద్ధ గా వినండి..రేవతీ కనుక్కున్నావా..హమ్మయ్య తెస్తున్నాడన్నమాట..ఎందుకైన మంచిది సారధి ని కూడా కాస్త తెమ్మను. "ప్రధమోధ్యాయం  సంపూర్ణం..శ్రీ సత్యనారాయణ స్వామి కీ జై"...


మా బాస్ కి కూల్ డ్రింక్ కూడా ఇచ్చినట్లు లేరు ఎవ్వరూ.. సురేష్, ఆ బ్లూ లాల్చీ ఆయనే మా బాస్. కాస్త ఆయనని చూసుకో.." "ద్వితీయోధ్యాయం సంపూర్ణం"..ఆ అవునండీ కర్టెన్లు అక్కడే కొన్నాము కాస్త ఖరీదయినా కానీ..వాకిన్ వార్డ్ రోబ్ మా డిజైనర్ అయిడియానే, బెడ్ రూం లో అడ్డం లేకుండా" పంతులు గారూ భోజనాలు తయారు,మీదే ఆలశ్యం. "త్రుతీయోధ్యాయం సంపూర్ణం"..ఒక్క పది నిమిషాల్లో అయిపోతుంది..ప్లీజ్ వచ్చెస్తున్నాను.. యా యా.. ప్లీజ్ బీ సీటెడ్. "చతుర్ధోధ్యాయం సంపూర్ణం.." రేఖా బెడ్ రూం లో ఏసీ లు ఆన్ చేసేసి పిల్లలు బయటకి వెళ్ళిపోయినట్లున్నారు కాస్త ఆఫ్ చెయ్యి. పంతులు గారు, కాస్త త్వరగా ముగించండి అందరికీ ఆకళ్ళవుతున్నాయి..


"పంచమోధ్యాయం సంపూర్ణం"..ఆ ఆ పెట్టెయ్యండి ఐదు నిమిషాల్లో మొదలుపెట్టెయ్యచ్చు. అబ్బా...మొన్న రంగారావు గారింట్లో వాళ్ళింట్లో హోమం,వ్రతం కలిపే గంట లో ముగించేసారే, ఈయనేంటో వ్రతానికే గంట తీసుకున్నాడు. నేను ఖచ్చితం గా 12 గంటలకి భోజనం చెయ్యల్సిందే అండీ..లేటయితే అస్సలు ఊరుకోను.మా వాళ్ళకి ఈ సంగతి తెలుసు అందుకే నన్ను పిలిస్తే అన్నీ 12 కల్లా ముగించేటట్లు చూసుకుంటారు ఇంకొకాయన సెల్ఫ్ డబ్బా.. పంతులు గారూ ఆ పళ్ళెం ఇటివ్వండి మేము ఇస్తాము అందరికీ అక్షింతలు, మీరు మంత్రాలు చదవండి.


బ్రహ్మ గారు మాత్రం తన కేమీ పట్టనట్లు మంత్ర పుష్పం సావధానం గా చదువుతూ అందరికీ తన చేత్తోనే అక్షింతలు ఇచ్చి దాదాపు 20 నిమిషాల తరువాత వ్రత మంటపానికి తిరిగి వచ్చేటప్పటికి అందరి కళ్ళల్లో &కాళ్ళల్లో నీరసం. ఏమీ చెయ్యలేరు, పైగా అప్పుడే కధ విన్నారాయే, వ్రతం చేసి ప్రసాదం తీసుకోకపోతే జరిగే పర్యావసానాలు. మంత్ర పుష్పం అయ్యీ అవ్వగానే అక్షింతల జల్లు స్వామి ప్రతిమ మీద మూకుమ్మడిగా కురిసింది.బ్రహ్మ గారి చేతిలోంచి ప్రసాదం పళ్ళెం లాక్కుని వెళ్ళి భోజనాల దగ్గర పెట్టేసారెవ్వరో.అంతే అందరికీ వంటకాలతో పాటు ప్రసాదం కాస్త కాస్త వడ్డిస్తూ భోజనాలు మొదలయిపోయాయి. పోనీ అక్కడయినా సావధానం గా తింటారా అంటే అదీ లేదు. అక్కడా కంగారే,చెయ్యి కడుక్కునే దగ్గరా కంగారే.హోస్ట్ లకి గిఫ్ట్ ఇచ్చి ఫోటో లకి ఫోజులు ఇవ్వటానికి మాత్రం సహనం గా వేచి ఉంటారు.

తరువాత ముఖ పుస్తకం లో మనల్ని ట్యాగ్ చేసి ఫోటో పోస్ట్ చేస్తారు కదా. ఫోటో బాగోక పోతే ఎలాగండీ..ఆ.. ఎలాగ అని అడుగుతున్నా. అందుకే మరి చక్కగా సావధానం గా నిలబడి ఓపికగా ఫోటోలకోసం నిల్చునేది.  దాన్ని కూడా తప్పు పడుతున్నారే మీరు..భలేటోళ్ళే సుమా.


మనం ఇలా ఉన్నాము, శాస్త్రోక్తం గా చేయించే వారూ కరువయ్యారు.


అందరూ ఇలా చేసుకుంటారని కాదు, ఈ మధ్య చూసిన ఓ రెండు మూడు  పూజలు గమనించి రాసిన టపా ఇది.

Thursday, November 12, 2015

ఒక మధుర ఙాపకం -ముప్ఫై ఐదేళ్ళనాటి కార్తీక మాస వన భోజనాలు
దీపావళి తరువాత కొన్ని రోజులకి పిక్నిక్ కి వెళ్తామని చిన్నప్పుడు ఎంత ఉత్సాహం గా అనిపించేదో. వాటినే కార్తీక వన భోజనాలంటారని చాలా యేళ్ళు తెలీదు.

చిన్నప్పుడు మేము మోతుగూడెం అనే ఒక చిన్ని ఊర్లో ఉండేవాళ్ళము.ఊరిలో ముప్పావు మంది  మంది ఆం. ప్ర. విద్యుత్ సంస్థ ఉద్యోగులే.మిగతా పావు వంతు జనాభా అక్కడ ఉన్న ఒకటి రెండు బట్టల కొట్లు, ఒక స్టేషనరీ షాపు, ఒక హోటల్, ఒక పాన్ షాప్,ఒక ఫోటో స్టూడియో లాంటి దుకాణాల  యజమానులన్నమాట.

అక్కడ ఆం. ప్రా. విద్యుత్ సంస్థ ఆధ్వర్యం లో నఢిచే  ఒక ప్రాజెక్టు హై స్కూల్,హాస్పటలు, అప్పుడే ఇంగ్లీషు మీడియం , ఆంగ్లో ఇండియన్ టీచర్లు అన్న కాన్సెప్టుతో ఆ ఊరిలో వెలసిన శ్రీ సీతారామా పబ్లిక్ స్కూలు, ఒక రామాలయం, రెండు అమ్మవారి గుళ్ళు, ఒక మశీదు, చర్చి ఉండేవి.

అప్పట్లో కార్తీక మాసం అన్న లెక్క్ఖ తెలీదు కానీ దీపావళి అవ్వగానే పిక్నిక్ కి వెళ్తామ ని మాత్రం తెలుసు. ఆరు రోజుల పని దినాలు కాబట్టి అందరికీ శెలవు రోజైన ఆదివారం వెళ్ళేవాళ్ళము.

ఫలానా రోజు వెళ్తున్నాము అంటే ఎంత ఎదురు చూసే వాళ్ళమో ఆరోజు కోసం పిల్లకాయలందరమూను.

ఆరోజు రానే వచ్చేది. ఇంకేముంది స్కూలు ఫస్టు బెల్లు కొట్టారు తెమలండర్రా అని అరిచి గీ పెట్టినా వినిపించుకోని పిల్లలు ఆరోజు మాత్రం ఏడింటి కల్లా తయారయ్యి లారీ కోసం ఎదురు చూసుండేవాళ్ళము. అవును లారీ లో నే వెళ్ళే వాళ్ళము.

ఆం.ప్ర. విద్యుత్ సంస్థ వారి సిమెంటు రంగు లారీ ఒకటి ఉండేది.ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయినా, పిక్నిక్కులకి వెళ్ళాలన్నా దాంట్లోనే మా ప్రయాణం.

పిక్నిక్ కి వెళ్ళే రోజు లారీ రాగానే మొదట అక్కడ వండటానికి కావాల్సిన డేగిసాలు, గిన్నెలు, గరిట్లు, చాపలు, జింభఖానాలూ ఎక్కించాకా, పిల్లల్ని ఎక్కించేవాళ్ళు.ఆడవాళ్ళు కూడా ఎక్కాకా లారీ బయలుదేరేది.

మా పక్కూరు  పొల్లూరు దగ్గర అడవిలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర మా పిక్నిక్. అక్కడకి చేరి ఆడవాళ్ళు ముందర చెట్లకి ఉయ్యాలలూ అవీ కట్టి వంటల్లోకి దిగి పోయేవారు. కాస్త పెద్ద పిల్లలు పొయ్యి అమర్చడానికి రాళ్ళు తెస్తే చిన్న పిల్లలం కర్రలూ అవీ ఏరుకొచ్చేవాళ్ళము.


ఇప్పట్లో లాగ ఆట బొమ్మలు, పాం టాప్, ల్యాప్ టాప్ లు అవీ లావు కనుక హాయిగా పిల్లలందరమూ వయసులవారీగా ఆడుకునేవాళ్ళము. టెంత్ క్లాస్ చదువుతున్న దినేష్ అన్నయ్య మ పిల్లల గ్యాంగు కి పెద్ద దిక్కు లాంటివాడు. ఆ వాటర్ ఫాల్ కి మధ్యలో ఉన్న పెద్ద బండ రాయి మీదకి ఎక్కడం, వాటర్ ఫాల్ల్ నుండి  పారుతున్న నీటిలో నడుస్తూ అటు నుండి ఇటు వెళ్ళడం మర్చిపోలేని అనుభూతులు.

ఉయ్యాలలు ఊగడమో, కాస్త పక్కన ఉన్న కొండ ఎక్కడమో చేసి అలసి పదకొండున్నరా పన్నెండింటికి తిరిగొచ్చేసరికి వంటలు తయారు.లారీ సెకండ్ ట్రిప్ లో అక్కడకి చేరుకున్న మగవాళ్ళు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.

భోజనాల వేళకి వరుసలో అందరినీ కూర్చోపెట్టి విస్తరాకులు వేసి వడ్డించేసేవారు ఆడవాళ్ళు.

అన్నాలు తినీ మళ్ళీ ఆటలు మొదలు. మూడింటికి మా అమ్మమ్మ చేసిన చేగోడీలు అమ్మ బయటకి తీస్తే, పాపారత్నం అత్తయ్యగారు తన ట్రేడ్ మార్క్ కారబ్బూందీ తలా పిడికెడు పిల్లల చేతుల్లో పోసేవారు.
కారబూందీ చేగోడీలే కాదు ఇంకా ఎన్ని రకాలుండేవో స్నాక్స్ మాకు.

టీలు అవీ తాగి, వంట గిన్నెలు  ఆ వాటర్ ఫాల్ లో కడుక్కుని, అన్నీ సర్దేసి మూడున్నరకల్లా ఆడవాళ్ళు కూడా పిల్లల ఆటల్లో భాగమయ్యేవారు. చాకలి బాన(అందరూ గుండ్రం గా కూర్చుని రుమాలు ఎవరి వెనకాల వేస్తే వాళ్ళు లేచి దొంగ వెనకాల పడటం), తాడాట(అటూ ఇటూ రెండు జట్లు నిలబడి తాడు లాగడం), రాముడూ సీతా లాంటి ఆటలన్నమాట.

ఆశ్చర్యం వేస్తుంది నాకు, ఇప్పటికీ హోటల్లో తిని ఎరుగని అమ్మమ్మ కూడా ఉత్సాహం గా ఎలా పాల్గొనేది అప్పట్లో, తను ఇబ్బంది లేకుండా ఎలా తినేదో అని.

కులమతాలు ఏవీ అడ్డు లేవు మాకు అప్పట్లో. క్రిస్టియన్ అయిన ఏయత్తయ్యగారు(ఆవిడ భర్త ప్రసాదరావు గారు మా మోతుగూడెం క్యాంప్ కి A.E. అన్నమాట,అందుకని ఆవిడ A.E. అత్తయ్యగారు.అది కాస్త మా పిలుపులో ఏఅత్తయ్యగారయ్యింది) కూడా మాతో కలిసి చక్కగా ఆ పిక్నిక్ కి వచ్చే వారు.  మా డ్రైవరు సులేమాన్ కూడా తన కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఆనందం గా గడిపేవాడు మాతో.

ప్రతీ ఆదివారం అత్తయ్యగారు మమ్మల్ని చర్చి కి తీసుకెళ్ళేవారు. అక్కడ పాడిన నడిపించు నా నావ పాట ఇప్పటికీ ఆసాంతం గుర్తుంది నాకు.అమ్మే కాకుండా ఇతర హిందువులు కూడా చర్చికొచ్చేవారు.ఇప్పట్లో లాగ మీ ప్రసాదం తినకూడదు లాంటి మూర్ఖత్వం లేదు ఆనాటి క్రిస్టియన్లలో అనుకుంటాను. కనీసం మా ఊళ్ళో వాళ్ళకి. అబ్బే మీ చర్చి కి మేమేంటి అన్న పంతం కూడా హిందువులకి లేదు.

అలాగే అందరం శనివారం రాత్రి "సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం  శివ శివ సుబ్రహ్మణ్యం" అంటూ భజన కూడా చేసేవాళ్ళము. దానిలో క్రిస్టియన్ మతస్తుల పిల్లలు కూడా వచ్చి మాతో గొంతు కలిపేవారు.

పిక్నిక్ నుండి ఎక్కడికో వెళ్ళిపోయాము కదా, మళ్ళీ వెనక్కొద్దాము.

శీతా కాలం అందునా అడవి ప్రాంతం కాబట్టి త్వరగా చీకటి పడిపోయేది. అందుకే నాలుగున్నర ఐదింటికల్లా అన్నీ సర్దేసి లారీలో ఎక్కించేసేవాళ్ళు.

పొయ్యిలో ఇంకా నిప్పు ఏమన్నా వెలుగుతుంటే నీటితో ఆర్పేసి పొయ్యి  కోసమని అమర్చిన రాళ్ళు మళ్ళీ ఓ వారగా పెట్టి ఏమన్నా తినుబండారాలూ అవీ కింద పడితే వాటిని చీపుళ్ళతో ఓ పక్కగా ఊడ్చేసేవారు.మేము వచ్చినప్పుడు ఎలా ఉందో మేము వెళ్ళేటప్పుడు కూడా అక్కడి నేల అంత శుభ్రం గా ఉండేది. తెలీకుండానే ఎంత ఎకో ఫ్రెండ్లీ గా ఉండేదో జీవితం అప్పట్లో.

పొద్దున్న వచ్చినట్లే పిల్లలు, స్త్రీలు మొదటి ట్రిప్పులో మా ఊరు చేరుకుంటే, పురుషులు సెకండ్ ట్రిప్పులో వచ్చేవారు.


********************************************************************

2010/2011 లో ఓ కార్తీక మాసపు ఆదివారం అత్తగారింట్లో ఉన్నాను.అత్తయ్యగారు మామయ్యగారు వన భోజననాలకి వెళ్దామని తయారవుతున్నారు.ప్రయాణ బడలిక గా ఉండటం తో మమ్మల్ని రమ్మని అత్తయ్యగారు బలవంతం చెయ్యలేదు.మాకు ఇంట్లో వంట కూడా చేసి బయలుదేరబోతుంటే ఏమయ్యిందో కానీ అకస్మాత్తుగా అడిగారు. మీరు కూడా రాకూడదూ అంటూ.

అత్తయ్యగారూ, నాకెవ్వరూ తెలీదు అక్కడ అని తప్పించుకోచూసాను.ఈ మధ్య కార్తీక భోజనాలు ఎలా ఉన్నాయో ఫోటో లు చూసేసి ఉన్నందువల్ల.కొంతమందైనా నీకు తెలిసున్న వాళ్ళుంటారు, వాడికి దాదాపు అందరూ తెలుసు, మనవలని చూళ్ళేదని చాలా మంది అంటున్నారు కూడా. ఓ సారి వచ్చి కనిపించి వెళ్ళండి చాలు అనడం తో కాదనలేక తయారయ్యి వెళ్ళాము.

ఓ పక్కగా వాడేసిన థర్మో కోల్ గ్లాసులు ప్లేట్లు కుప్పగా పోసి ఉన్నాయి. పోయిన వారం ఫలాన కులం వాళ్ళ వన(కుల) భోజనాలయ్యాయి అని తెలిసింది అక్కడున్న వారి మాటల ద్వారా. ఏదో సభ లాగ ప్లాస్టిక్ కుర్చీలు వేసున్నాయి. అక్కడ అందరూ కలిసేమీ కూర్చోలేదు. ఎవరి సామాజిక స్థాయి ని బాట్టి వారు వర్గాలుగా విడిపోయి కబుర్లలో పడ్డారు.  కుశల ప్రశ్నల కంటే స్థాయీ ప్రదర్శన ఎక్కువయ్యింది అక్కడ.

కుర్చీలకి ముందు అమర్చీన డయాస్ మీద ఓ నేత గారు మన కులాన్ని అభివృద్ధి పధం లో పయనింపచేయడం ఎలా అంటూ ఊగిపోతూ ఉపన్యసిస్తున్నారు. మా పక్కనే ఉన్న స్థలం లో ఇంకొక కులం వారి భోజనాలు కూడా అవుతున్నాయి. అక్కడా సేం సీన్.
పోయిన వారం ఇక్కడ వన భోజనాలకొచ్చిన వాళ్ళ క్యాటరర్ వంటలు బాగా చెయ్యలేదుట అందుకే ఇంకోళ్ళని మాట్లాడి మంచి వంటలు ఆర్డరిచ్చాము అని ఆర్గనైజర్ గారు గర్వం గా చెప్తోంటే వెళ్ళి చూద్దును కదా... ఎందుకు లెండి ఆ వంటల వర్ణన.కాంటినెంటల్, చైనీస్, సూడాన్, ఆఫ్రికా, అంటార్కిటికా వంటలంటూ మన అచ్చ తెలుగు వంటల్ని మర్చిపోయేటట్లు యధా శక్తి కృషి చేసిన టీవీల వాళ్ళని చంపెయ్యాలన్నంత కసి వచ్చింది ఆ క్షణం లో.  


అక్కడి పరిస్థితి, వంటలూ అవీ చూసి కాసేపుండి అందరినీ పలుకరించేసి ఉండబుద్ధి కాక వెనక్కొచ్చేసాము నేనూ శ్రీవారూ.


అపార్టుమెంట్లలో ఇలా కులాల వారీగా విడిపోము, కలిసి చేసుకుంటాము అంటారా?? ఆ సంబరం కూడా చూసాను. పేరుకి కలిసి వెళ్ళినా అక్కడా ఇంచు మించుగా ఇదే సీన్. ఉపన్యాసాలూ వగైరా ఉండకపోవచ్చు కానీ స్థాయీ ప్రదర్శనలు మామూలే.


కుల మత నిర్మూలన అంటూ ఎలుగెత్తి చాటే కొద్దీ అవి మనలో మరింతగా చొచ్చుకుపోయాయి అనిపిస్తోంది నాకు.అన్ని గోడలూ కూల్చేసి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం అనే పెద్ద కార్యం చెయ్య లేకపోయినా మా చిన్నప్పటి లాగ ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఎంత బాగుంటుందో కదా.

దాదాపు ముప్ఫై ఐదేళ్ళయినా మేము మోతుగూడెం లో ఉన్నన్నాళ్ళూ  వెళ్ళిన ఆ పిక్నిక్ ఙాపకాలు ఎప్పుడూ తాజా గానే ఉంటాయి. ఒక్కోసారి కేవలం స్త్రీలూ, పిల్లలు మాత్రమే పిక్నిక్ కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.నిర్భయం గా, భేషజాలు లేకుండా ఆరోజుల్లో  పిక్నిక్ కి వెళ్ళిన వాళ్ళందరిలో కూడా అనుభూతులు తాజా గా నే ఉండి ఉంటాయి అనడం లో సందేహం లేదు.

(మోతుగూడెం వాటర్ ఫాల్స్ అని గూగుల్లో వెతికితే పైన ఇచ్చిన  ఫోటోల్లాంటివే   వస్తున్నాయి. కానీ నాకు గుర్తున్నంతవరకూ ఆ వాటర్ ఫాల్ చాలా ఎత్తు లో నుండి జారి పడేది. నా ఙాపకం తప్పో లేక 35 సంవత్సరాలలో రాళ్ళు నీటి కోతకి గురయ్యాయో. )