Wednesday, October 28, 2015

తెలుగు సినిమా కధా ఎక్కడున్నావమ్మా???

తెలుగు సినిమా కధా ఎక్కడున్నావమ్మా?? అదేంటి ఈ మధ్య కనపడని దానిని వెతుకుతున్నా అని ఆశ్చర్యపోకండి.ఏది ఎక్కువ కాలం కనపడకపొతే  దాని మీదే మనసు పోతుంది కదా అందుకనే ఈ వెతుకులాట.
అసలు చిట్టచివరిగా ఎక్కడ చూసానూ అని ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు.అదేమిటి మరీ విడ్డూరం కాకపోతేను..అది మాయమయ్యి చాలా రోజులయ్యిందా నాకే మతిమరుపెక్కువయ్యిందా?? ఏమో మరి. సరేలే సినిమాలు తీసేవాళ్ళకే తెలుస్తుంది కదా కధ వివరం అని తెలుగు సినీ జగత్తునేలే హీరోలని అడుగుదామని బయలుదేరాను.
అబ్బే అందరూ అదేమిటీ తెలీదన్నవాళ్ళే..అసలు మా ఇమేజ్ తెలిసే దాని గురించి అడుగుతున్నారా అని అంతెత్తున ఎగిరిన వాళ్ళూ ఉన్నారు.

చిన్నప్పుడు అష్టా చెమ్మా ఆడుకోవడానికి మంచి నిగ నిగలాడే చింతపిక్కలని తెచ్చుకునేవాళ్ళము. అవి అలాగే ఉంటే ఆటకి పనికిరావు.వాటిని బాగా గరుకు నేల మీద రుద్దితే ఒక వైపు తెల్లగా అయ్యి ఆట కి పనికొచ్చేటట్లు తయారయ్యేవి.  ఈ హీరోలనీ అలాగే తయారుచేసారనిపిస్తుంది కొంత మందిని చూస్తే.
చూడటానికి ఓ మాదిరిగా ఉన్నా కధ వగైరా సరుకుల గురించి ఆలోచించే తీరిక ఉంటుంది  దర్శక బ్రహ్మలు, ఇంద్రులకి. ఒకరిద్దరు తప్ప చూడటానికి ఎవరు బాగున్నారని అసలు?? బాగున్న ఓ హీరో గారేమో "Constipation" పేషెంట్ లా డైలాగులు ముక్కి ముక్కి చెప్పడం స్టైల్ అయ్యి కూర్చుంది..ఇంకొకరికేమో ఇంకో కష్టాలు..

కొంత మంది "దేభ్యం" మొహాలతో ఉన్నా ఆక్రోబాటిక్ విన్యాసాలు నేర్చేసుకుని వాటినే "డ్యాన్స్" అని మన మీద రుద్దితే దానికి అలవాటు పడిపోయాము.ఈ డ్యాన్సులు, పాటలతో సినిమా ని ఓ ఇరవై
  శాతం నింపచ్చు..మిగతా 80 శాతం?? కధ కావద్దూ??
అమ్మమ్మా...ఆశ దోశ..ఒక కులం మీదో ఒక వ్రుత్తి మీదో కామెడీ లేకపోతే ఎలాగ??అదే "In thing" కూడానూ ఇప్పుడు.ఒక ఇరవై   శాతం అయిపోయింది..మిగతా అరవై శాతం??

"టైడ్" తెల్లదనం మాత్రం ఉండి "నట శూన్య" హీరోయిన్ కి ఒక పది శాతం..పాపం ఈవిడ బట్టలకి పెద్దగా ఖర్చవ్వదు లెండి.అబ్బబ్బ్బా..నాకు అత్యాశ ఎక్కువ..ఇప్పూడైనా కధ దొరుకుతుందా అని ఆశ..
అదిగో అక్కడే కోపం వచ్చేది ,వంశాలు వాటి గొప్పతనాలు, రక్త,విద్యా,కళ్ళు,కాళ్ళ దాన వివరాలతో కూడిన డైలాగులు మర్చిపోతు న్నాను.వెకిలి సంభాషణలు..వద్దన్నా పాటల్లో ఉంటున్నాయి కాబట్టి ప్రత్యేకం అక్కర్లేదు.."యూత్" పేరు చెప్పి వీటిని  చొప్పించెయ్యచ్చు..హీరో గారి ఇమేజ్ ని బట్టి వీటి Placement పాటల్లో మాత్రమేనా డైలాగుల్లో కూడానా అని అధారపడీ ఉంటుంది

రాయలసీమ బ్యాక్గ్రవుండ్ అయితే ఈ కింది డైలాగులు పెట్టుకోవచ్చు 
1.చెట్టే కదా అని చిన్న చూపు చూస్తే చేతులు కోస్తా
2.నేను చిన్నప్పటి నుండీ గాలి పీల్చి పెరగలేదురా..నీ వంశం మీద పగ నే శ్వాస గా పెరిగాను.
3.నేనే కనక అసలు సిసలు రాయలసీమ బిడ్డనయితే ఈ రాష్ట్రం లో  తిరిగే రైళ్ళన్నీ తక్షణమే వెనక్కి ప్రయాణం చెయ్యలి
(వెంటనే వెనక్కి పోతున్న రైళ్ళలో ఉన్న ప్రయాణీకుల హాహాకారాలు, "బాబు" వచ్చేసాడని తెలిసి పగే శ్వాస గా బతుకుతూ, రైల్లో ప్రయాణిస్తున్న బామ్మగారి పులకింత క్యాప్చర్ చెయ్యాలి)

అదే "రావే రా రా" టైటిల్ ఉన్న ప్రేమ కధలయితే
1.మీ నాన్న నన్ను క్లీనర్ గాడు క్లీనర్ గాడు అని అవమానించాడు, ఈ క్లీనరు ఖలేజా చూపిస్తా
2.నాన్న, ఎంత సేపూ నేను డిగ్రీ కూడా పాస్ అవ్వలేదని నస పెట్టకు.అమ్మా మీ అయన నోరు మూయించవే..
ఈ డైలాగులు ఓ ముప్ఫై శాతం  పోనూ ఇంకో ఇరవై శాతం మిగిలింది..కధ ఉంటుందనుకుంటున్నారేమో..

ఇంత పవర్ఫుల్ డైలాగులూ పెట్టి విలన్ లేకపోతే ఎలాగ??
సూటూ బూటూ వేసుకుని హెలికాప్టర్ లో మాత్రమే దిగే విలన్..చుట్టూ ఎప్పుడూ విదేశీ భామలని పెట్టుకుని మంతనాలు జరుపుతూ..హీరో గారి చేతిలో  చావు దెబ్బలు తినకపోతే హీరో అభిమాన సంఘాలవారికి కోపమొస్తుందంతే.

"సీమ" సినిమాలయితే అవాక్కయ్యే తెల్లదనం తో ఉన్న సూమోలూ, వాటిల్లో చింతమొద్దుల్లా ఉన్న విలన్    అనుచరులు, వారి ఒంటి మీద మిలమలాడే తెల్లని తెలుపు బట్టలు..హీరో గారు కబాబ్ లని గుచ్చినట్టు ఓ త్రిశూలం మీద ఒక పోటుకి పది మంది ని ఆ చివర నుండి ఈ చివర వరకూ త్రిశూలం మీద  వేళాడదీస్తే ఉండే కిక్కే వేరబ్బా అభిమానులకి.
ఒంటి మీదకి నలభై యేళ్ళొచ్చినా ఇంకా "మా హీరో" అంటూ కులాభిమానమో ఇంకోటో పెట్టుకుని అభిమానిస్తున్నారా లేదా??
ఇంట్లో వాళ్ళ మీద పిసరంత కూడా ప్రేమ కురిపించకుండా హోలు మొత్తం 100% హీరో గారిమీదే చూపించే  అభిమానుల కోరికపై ఓ ఐటెం సాగ్..

అంతే..శాతం అంతే 100 యే కదా..మరి ఈ వంద లో మన కధ కి చోటెక్కడుంది చెప్పండి??
పాటలు, కామెడీ(??), పవర్ఫుల్ డైలాగులు, తెల్లటి హీరోయిన్ను, స్ట్రాంగ్ విలన్ ..అవసరమైన ఇన్ని ఎలిమెంట్స్ పెట్టుకుంటున్నారా లేదా?? ఇంకా కధ కధ అని అడిగే సత్తెకాలపు సత్తెయ్యలకిచెప్పండయ్యా బాబూ...

ఇలా సినిమాలు తీసి జనాల మీదకి వదలడం,ఫేస్ బుక్, ఇతర మాధ్యమాల్లో ప్రొమోలూ, రెండు రోజులకి సక్సెస్ మీట్, ఖేల్ ఖతం.. ఇంకొక సినిమా మొదలు. చూసిన మనమూ మర్చిపోయి ఇంకో సినిమా కోసం ఎదురుచూపులు మొదలు పెడదాము. This cycle goes on...