Monday, September 21, 2015

Cheap Baby Sitters

ఈ మధ్య ఫేస్ బుక్ లో చూసిన ఒక ఆర్టికల్ మీదే ఈరోజు టపా.

దానిలో రిటైరైన ఇద్దరు దంపతులు మొదట పెద్దబ్బాయి దగ్గరకి వెళ్ళి కోడలి డెలివరీ అయ్యి పుట్టిన మనవరాలి బాగోగులు చూసుకుని వస్తారు. ఇంతలో చిన్న కొడుకు ఫోను చేస్తాడు తన భార్య కి సాయం గా రమ్మని. పెద్దాయన ఉలుకూపలుకూ ఉండదు. ఆవిడ తరచి అడిగితే చెప్తాడు, "బేబీ సిట్టర్స్" గా వెళ్ళడం తనకి ఇష్టం లేదనీ, ఏదో అలా వెళ్ళి చూసి రావడానికయితే వస్తాననీను.

ఇది విని చిన్న కొడుకు మండిపడతాడు, అన్నయ్య దగ్గరకి వెళ్ళి తన దగ్గరకి రావట్లేదని అవసరమయినప్పుడు.అయినా ఇదేమీ పట్టించుకోని ఆ తల్లి తండ్రులు హాయిగా తమకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకుని గుళ్ళూ గోపురాలూ తిరుగుతూ ఆనందంగా ఉంటారు ఎవ్వరేమన్నా పట్టించుకోకుండా..

ఈ ఆర్టికల్ చాలా బాగుంది, అందరూ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండు అనిపించేంతగా.

అవన్నీ పక్కన పెడితే అసలు ఈ పరిస్థితి కి కారణాలు చూద్దాము .


1)కొడుకు ఇంజనీరవ్వాలి, చదువు అయిపోతుండగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం రావాలి. రాలేదా ఇక వాడి పని ఆఖరే. అమెరికా లాంటి దేశాల్లో పిల్లల్ని పద్ధెమిదేళ్ళు రాగానే వదిలెస్తారుట అని వింతగా చెప్పుకుంటాము. మనము అలా వదలాలేము పిల్లాడు సెటిల్ కాకపోతే చూడాలేమూ.పిల్లాడు సెటిల్ అవ్వలేదంటే కారణాలు వెతికే తీరిక ఉండదు వీళ్ళకి.వాడికి ఇష్టం లేని చదువు లేదా తలకి మించిన భారమయిన చదువు చదివించామా అని.

 ఫలానా వాడికి ఇన్ని లక్షల జీతం ,ఫలానా వాళ్ళబ్బాయి అమెరికా కూడా వెళ్ళాడుటా ఉద్యోగం లో చేరి.. ఇలా ఆ పిల్లాడీ బుర్ర తినచ్చా??


ఇలా కాదంటే లక్షలు కుమ్మరించి ఏదో ఒక కాలేజీలో ఎమ్మెస్ చెయ్యడానికి అమెరికా యో ఇంకో దేశమో పంపించడం.

నా ఉద్దేశ్యం లో రెండూ కరెక్ట్ కాదు. అసలు ఆ వయసొచ్చాకా ఏమీ చెయ్యలేము మోరల్ గా సపోర్ట్ చెయ్యడం తప్ప, అలా అని జులాయిగా తిరుగుతున్నా వదిలెయ్యమని కాదు.ఉద్యోగం రాక పిల్లాడు లెక్చరర్ గా చేరతానంటే నామోషీ మళ్ళీ.

బాండెడ్ లేబర్ లాగ ఓ రెండు సంవత్సరాలపాటు బాండ్ రాయించుకుని నెలకి పదివేలు  చేతిలో పెట్టే ఉద్యోగమయినా సరే తెచ్చెసుకోవాలి.

అసలు వాడికి ఏది ఇష్టం అని ఇంటర్ నుండీ ఆలోచిస్తే ఈ తిప్పలుండవు కదా.వీటన్నింటికి తోడు నేనూ నా కుటుంబం అని గిరి గీసుక్కూర్చోవడం వాడు మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నాడని మర్చిపోవద్దు.

2)సరే ఉద్యోగం వచ్చింది పో, ఊరుకుంటామా??? ఏమిట్రా నీ హోదా, జీతం  పెరగవా, ఫలానా వాళ్ళబ్బాయి వాళ్ళ నాన్న కి ఇల్లు కట్టించాడుట అనో, అమెరికా నుండి డబ్బులు పంపాడనో దెప్పి పొడుపులు నువ్వేమీ చెయ్యట్లేదని.

3)వీళ్ళకి ఇప్పుడు తెలీదు లెండి,విదేశీ మోజు, పక్క వాళ్ళతో పోటీ మాయలో పడి.

4)పిల్లాడికి ఆన్ సైట్ ఆఫర్ రాగానే ఆవకాయ జాడీలు సర్ది, అరిసెలు, చెక్కలు ప్యాకెట్లలో నింపి, వీడుండే ఏరియా లో
తమ చుట్టు పక్కల వాళ్ళ పిల్లలెవరయినా ఉంటే వాళ్ళకీ సర్ది, ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తారు.

5)నాన్నా,  ఏమన్న కావాలా కావాలంటే చెప్పు రా, నేనూ అమ్మా ఉన్నాము కదా అని పదే పదే చెప్తుంటే ఇంక వాడికి బేబీ సిట్టర్స్ ని వెతకాలనో భార్య ని ఉద్యోగం మానిపించాలనో ఆలోచనెందుకు వస్తుంది?? ఏ విత్తు నుండి ఆ చెట్టే వస్తుంది కదా మరి.

6)వెళ్ళిన ఓ ఐదారేళ్ళ వరకూ అంతా బాగుంటుంది ఇక్కడ తల్లి తండ్రులకి. వాడు పంపించే డాలర్లు,గిఫ్టులు,వీళ్ళ
విదేశీ యానం, కొడుకు దగ్గరుండి మరీ చూపించే ప్రదేశాలూ.. ఓహ్.. వర్ణించలేని అనుభూతి.తిరిగొచ్చాకా
అబ్బే మన దేశం అలా అవ్వాలంటే ఇప్పట్లో సాధ్యం కాదండీ అంటూ తుపుక్కున రోడ్డు మీద ఉమ్ముతూ కబుర్లు.

7)ఇప్పుడు అసలు కధ మొదలు. కోడలి పిల్లకి డెలివరీ టైము, అమ్మా సాయం కావాలనగానే అమ్మ మనసు ఉరకలు వేస్తూ తయారు. ఆ నాకు పోయేదేముంది అంటూ ఈయనా తయారవుతారు.వెళ్ళాకా కానీ తెలీదు. తాము ఇక్కడ కేవలం బేబీ సిట్టర్స్ మాత్రమే అని.


డెలివరీ అయిన కోడలేమో పాపం విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది మరలా ఆఫీసులో జాయినవ్వాలని. చంటిపిల్ల/పిల్లాడి ఆలనా పాలనా చూసుకుంటూ పెద్దావిడ అలసిపోతుంటే ఇంక పెద్దాయనని పట్టించుకునేదెవ్వరు?? వీళ్ళ వంతు అయిపోగానే పాపం ఆ అమ్మాయి తల్లి తండ్రుల వంతు.

8)ఓ సంవత్సరం రెండేళ్ళు గడిచాకా రెండో కానుపు కి సేం సీన్ రిపీట్.మనవలు అలా సంవత్సరానికో రెండేళ్ళకో వచ్చి వెళ్తుంటే ఇవన్నీ మర్చిపోతారు. ఇంకో ఐదేళ్ళు గడిచేసరికి వయసు మీద పడుతోంది, ఇదివరకటిలా కాదు ఓపిక లేదు. దగ్గర ఎవరైనా ఉంటే బాగుండనిపిస్తుంది.
ఇంకా ఎన్నాళ్ళురా అక్కడ అంటూ ఇంక వెనక్కి రమ్మని నస మొదలు.ఒక్కసారి ఎల్లలు దాటాకా వెనక్కి రావాలంటే బోలెడు విషయాలు చూసుకోవాలి. ఆ ఆ మాత్రం ఉద్యోగం ఇండియాలో లేవా ఏమిటీ అని వీళ్ళకనిపించచ్చు కానీ ఉద్యోగం ఒక్కటే కాదు సౌకర్యం,భద్రత ఇలా బోలెడు ఆలోచొస్తారు వెనక్కి రావాలంటే. వచ్చి చూసి నచ్చక పోతే వెళ్ళిపోదాము అని ట్రయల్ వెయ్యాలన్నా భయం గానే ఉంటుంది డబ్బూ, సమయం వృధా అని.


అంచేత ఇంజనీరింగ్ చదువుతున్న లేదా ఉద్యోగం లో జాయినవ్వబోతున్న కొడుకుల తల్లి తండ్రులూ.. 

హాయిగా ఇండియాలో ఉద్యోగం చేస్తున్న వాడిని నస పెట్టి విదేశాలు పంపకండి.వాడంతట వాడే వెళ్తానంటే నీ ఇష్టం అని చెప్పండి. ఇప్పటివరకూ పిల్లలకోసం ధారపోసిన శక్తి చాలు. హాయిగా మీరిద్దరూ ఇదివరకు ఆర్ధికం గా అనుకూలించకో సమయం సరిపోకో చెయ్యలేని పనులని ఇప్పుడు మొదలు పెట్టండి. 

పిల్లలు ఇంకా చిన్నగా ఉన్న తల్లి తండ్రులూ:


ఒక వయసు వరకే పిల్లలకి చెప్పాలి, చెప్పగలము కూడా. ఎవరి రాతకి ఎవరు బాధ్యులు చెప్పండి?? వినకపోతే వారి మానాన వారిని వదిలెయ్యండి. ఆశకి అంతేదీ?? మొదట ఉద్యోగం కావాలనిపిస్తుంది, ఆ తరువాత విదేశీ యానం, ఆ తరువాత చక్కటి కోడలు, మనవలు, మళ్ళా వాళ్ళొచ్చేసి మీతో ఉండటం.. ఇవన్నీ సాధ్యం కాదు కానీ హాయిగా భార్యా భర్తా మీరిద్దరూ రిటైరయ్యే సమయానికి  తగిన వ్యాపకం ఉండేలా చూసుకోండి.  


మా అబ్బాయి మమ్మల్ని బేబీ సిట్టర్స్ లాగ చూస్తున్నాడని వాళ్ళని నిందించే ముందు మీరే ఆ చనువు ఇచ్చారని మరవద్దు.మెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుద్ధేస్తుంది అన్న సామెత ఊరికే రాలెదు కదా.

అబ్బే మేము వాడిని మంచి విలువలతో పెంచాము, అయినా వాడు నేనూ నా కుటుంబం అంటున్నాడా, వదిలెయ్యండి అంతే. బాధ పడి ఏమి ప్రయోజనం చెప్పండి??


ఈరోజు ఉన్నట్లు రేపు ఉంటామో లేదో తెలీదు. హాయిగా ఓపికున్నప్పుడే మీరిద్దరూ చెయ్యాలనుకున్న పనులనీ, చూడాలనుకున్న ప్రదేశాలనీ చూసి రండి.