Saturday, June 27, 2015

బాపూ గారితో నేను

2014 ఆగస్టు 31 దాదాపు మాకు రాత్రి 8 అవుతోంది. రెస్టారెంట్లో కూర్చుని ఉన్నాము ఫుడ్ ఆర్డర్ చేసి.అదేమిటి బాపూ ఇక లేరుట ఫేస్బుక్ చెక్ చేసుకుంటున్న మా వారి  నోటి నుండి ఆ మాట వినగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి.
ఇంతలో మా అక్క మెసేజ్ నువ్వు చాలా లక్కీ అంటూ..ఇంతకీ నేను ఎందుకు లక్కీయో  తెలుసా. అంతకుముందు దాదాపు రెణ్ణెల్లక్రితం అంటే జూలై 4 2014 న బాపూ గారిని కలిసాను. ఆయన దర్శనం అంత సులభం గా ఏమీ అవ్వలేదు. ఎన్ని మలుపులో.. అది తెలుసుకోవాలంటే సుమారు ఓ నాలుగైసంవత్సరాలు  వెనక్కి వెళ్ళాలి.

2009-10  లో అనుకుంటా తెలుగు బ్లాగులు విపరీతం గా చదివే రోజుల్లొ ఫణి బాబు గారు, శంకర్ గారి బ్లాగ్ చదివి బాపు రమణ గార్ల గురించి తెలిసింది. తెలిసింది అంటే ఇంతకుముందు వాళ్ళు తెలీదని కాదు.. వాళ్ళు  చెన్నై  లో ఉంటున్నారనీ సామాన్యులని కూడా కలిసి మాట్లాడతారనీను.

మా వారికి చెప్తే మనము ఎన్ని సార్లు  చెన్నై  వెళ్ళాము, ఒక్కసారైన నాకీ విషయం ఎందుకు చెప్పలేదు అన్నారు. నాకు తెలిస్తే కదూ అనుకున్నా..ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు వీళ్ళని కలవాలి  అని తీర్మానించుకున్నాను.

ఇంతలో రమణ గారు యమా అర్జెంటు గా మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ఇంక ఆలశ్యం చేస్తే భావ్యం కాదని బాపు గారిని కలవాలనుకున్నాను. సడెన్ గా అలా వెళ్ళి ఆయన ముందు నిలబడాలంటే సంకోచం, భయం ఇంకా ఏవేవో...


రమణ గారు రాసిన ఏదో పుస్తకం వెనక ఉన్న "రచయిత అడ్రస్సు" చూసి ఓ ఉత్తరం రాసేసా బాపూ కి.అంతే ఆ సంగతి మర్చిపోయాను. ఓ రెండు నెలలకి ఇండియా వెళ్ళాను.ఓ సాయంత్రం నేనూ అమ్మా బయటకి వెళ్దామని బయలుదేరబోతోంటే "నీకెవరో ఉత్తరం రాసారు" అంటూ ఉత్తరం తెచ్చిచ్చింది.నేను దాదాపు 10 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నాను ఇంటర్మీడియెట్ నుండీ..దాదాపు 2000 సంవత్సరం వరకూ ఫ్రెండ్స్ ఉత్తరాలు రాసేవాళ్ళు.. ఫోన్లొచ్చాకా దాదాపు తగ్గిపోయాయి. 2011 లో ఇంకా ఉత్తరం రాసేదెవరబ్బా అనుకుని కవర్ చూసాను. ఇన్లాండ్ కవర్ మీద చక్కటి దస్తూరీతో మా అమ్మ వాళ్ళ అడ్రస్సు రాసి ఉంది.   

"ఫ్రం" అడ్రస్సు చూడకుండా విప్పాను. రెండు లైన్లు చదవగానే నేను అరిచిన అరుపుకి మా అమ్మ పరిగెత్తుకొచ్చింది హడలిపోయి."అమ్మా నాకు బాపూ ఉత్తరం రాసాడు(అవును, రాసాడు అనే అన్నాను ఏదో మా సొంత మామయ్య అన్నట్లుగా) అనేసరికి మా అమ్మకి ఏమీ అర్ధం కాలేదు. దీనికి మతి కానీ పోలేదు కదా అనుకుంది అనిపిస్తుంది నాకు. ఏది ఇలా ఇయ్యి అని లాక్కుని చదివి అమ్మ కూడా నమ్మలేక పోయింది.బయటకి వెళ్ళే సంగతి దేవుడెరుగు, అర్జెంటు గా నాన్నగారిని బయటకి పంపించి ఆ ఉత్తరాన్ని స్కాన్ చేయించి అందరికీ మెయిల్ లో పంపిస్తే గాని ఆ ఎక్సైట్మెంట్ తగ్గలేదు.కానీ బహు కొద్ది రోజుల ట్రిప్ వల్ల ఆయనని చూడటం కుదరలేదు.ఈ సారి ఎలాగైనా రావాలి అని గాట్ఠిగా తీర్మానించేసుకుని ఫ్లైటెక్కాను.

దాదాపు ఒక సంవత్సరంపాటు  బాపూ గారు ప్రత్యుత్తరం ఇచ్చేవారు నా ప్రతీ జాబుకీ.ఇండియా వెళ్ళే సమయం రానే వచ్చింది. ముందర చెన్నై వెళ్ళి తరువాత పుట్టింటికీ, అత్తింటికీ వెళ్దామనుకున్ననౌ.కాని టిక్కట్లు అలా సర్దుబాటు గాక తిరుగు ప్రయాణం లో చెన్నై ప్లాన్ చేసారు శ్రీవరు.

శ్రీవారికి పనుండటం వల్ల ఆయన హైదరాబాదు నుండి పూణే వెళ్ళేటట్లు అదే సమయానికి మేము చెన్నై విమానమెక్కి చెన్నై లో ఆయనతో ఓ నాలుగు గంటలు గడిపి మళ్ళీ మధ్యాహ్నం ఫ్లైట్లో సింగపూర్.. ఇదీ ప్లాన్.

ఇండియా ట్రిప్ లో బాపు గారిని ఆరాధించే వాళ్ళందరికీ చెప్పాను బాపు గారిని కలుస్తున్నానోచ్ అని.మా అక్క వాళ్ళమ్మాయి ప్రియ  పిన్నీ బాపు గారి ఆటోగ్రాఫ్ తీసుకో అని చక్కటి తెలుగులో రాసిన ఉత్తరం తో పాటు బాపు గారి  బొమ్మ గీసి ఇచ్చింది,  నా చేతికి.

ముందురోజు రాత్రి అస్సలు నిద్ర పట్టదే ఆయనని కలుస్తున్నా అన్న ఉత్సాహంతో. మర్నాడు పొద్దున్నే బయలుదేరి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి చెకిన్ కౌంటర్ కోసం చూస్తే ఎక్కడా చెన్నై కౌంటర్ కనపడదే. అదే డవుటొచ్చి అడిగితే "సారీ మేడం మీ ఫ్లైట్ క్యాన్సిలయ్యింది అని కూల్ గా జవాబిచ్చింది ఒకావిడ ఎయిర్ ఇండియా తరుపున. దాదాపు అరిచినంత పని చేసాను అదేంటి ఆసలు ముందు చెప్పరా మీరు అని. కోప్పడకండి,ఇంకో రెండు గంటల్లో నెక్స్ట్ ఫ్లైటుంది దాంట్లో మిమ్మల్ని పంపిస్తాము అందావిడ.

అసలు మీరు కనీసం ఫోను చెయ్యలేదు, మెయిలూ చెయ్యలేదు, ఇలా ఎలా చేస్తారు అంటే, సారీ మేడం అన్నాడు పక్కనున్న ఇంకో కోటు మనిషి. నాకు కోపం కట్టలు తెంచుకొస్తుండగా అడిగాను, నాకు సింగపూర్ కనెక్టింగ్ ఫ్లైటుంది, మధ్యలో ఇంపార్టెంట్ మీటింగుంది, మీ వల్ల ఇవన్నీ క్యాన్సిల్ అని దాదాపు ఏడుపు గొంతుతో అన్నాను.

సింగపూర్ ఫ్లైట్ క్యాచ్ చెయ్యగలరు మేడం, మీ లగేజ్ కూడ మేము ఆ ఫ్లైట్ లోకి పంపిస్తాము, వర్రీ అవ్వకండి అని సముదాయించబోయారు. అస్సలు నా బుర్ర పని చెయ్యట్లేదు, నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్తే బాపు గారిని కలవడం కుదరదని తెలుసు సమయాభావం వల్ల.

ఇంతలో మా వారి పూణే ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్ అయ్యింది. వెంటనే ఆయన తన క్రెడిట్ కార్డ్ చేతిలో పెట్టేసి కావాలంటే రాత్రి సింగపూర్ ఫ్లైట్ కి టికెట్ట్ కొనుక్కో చెన్నై నుండి అని చెప్పి గబగబా వెళ్ళిపోయారు.

చేసేదేమీ లేక రెండు గంటల తరువాత చెన్నై వెళ్ళే ఫ్లైట్ కి బోర్డింగ్ పాస్ తీసుకుని లాంజ్ లో కూలబడ్డాను. అమ్మా, బాపు తాతగారిని చూడలేమని కదా ఏడుస్తున్నావు అని మా ఎనిమిదేళ్ళ అబ్బాయి అనగానే కళ్ళల్లో నీళ్ళోచ్చేసాయి..(వాడికి బుడుగు గురించి చెప్పి బాపూ గారిని తాతగారు అనడం అలవాటు చేసాను)"  ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్, అని చెప్తావు కదమ్మా, థింక్ థట్ వే" అని చెప్పి తన పుస్తకం లో మునిగిపోయిన వాడికి చాచి ఒక్కటి ఇవ్వాలనిపించింది. 

చేసేదేమీ లేక చివరి అస్త్రం గా బాపు గారింటికి ఫోన్ చేసాను. తరచూ చేస్తుండటం వల్ల బాపుగారబ్బాయి రమణ గారితో ఫోను పరిచయం మాత్రం ఉంది. మీరే కదా వస్తున్నామన్నారు అన్నారాయన.  లేదండీ ఫ్లైట్ లేటవ్వడం వల్ల
రాలేను, మీరొక హెల్ప్ చెయ్యగలరా అని అడిగాను.చెప్పండి అన్నారాయన. ఒక్కసారి మీరు బాపు గారిని ఎయిర్పోర్టు కి తీసుకురాగలరా అని అడిగాను. ఇప్పుడనిపిస్తుంది అసలు అలా ఎలా అడిగాను, నేనేమన్నా ప్రముఖురాలినా ఆయన నా కోసం రావడానికి.పిచ్చి అభిమానం అలా అడిగించేసింది అంతే.

లేదండీ అలా తీసుకురాము, ప్లీజ్ ఎమీ అనుకోద్దండీ అని పొలైట్ గా చెప్పారు నేనెంత బతిమాలినా కానీ. పిచ్చెక్కిపోయింది నాకు ఇంకెప్పటికి చూస్తాను అన్న ఆలోచనతో.

రెండు గంటలు అలా లాంజ్ లో గడిపి తరువాత అమ్మకి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చేసినా బాధ తీరదే.

శ్రీవారు రాత్రి ఫ్లైట్ కి టిక్కట్టు కొనుక్కో అన్నా కానీ,ఉన్న రెండు టిక్కట్ట్లు   వదిలి ఇంకో టిక్కెట్టు కొనుక్కోవదానికి నా సగటు ప్రవాస భారతీయురాలి మనసు ఒప్పుకోలేదు మేము జస్ట్ వేతన జీవులం మాత్రమే వెనకాల కొండలేమీ లేవు అని గుర్తొచ్చి.ఈ ఎపిసోడ్లో  రిలీఫ్ ఏమి టంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎయిర్పోర్టు లో ఓ పదినిమిషాలు నన్ను కలవడం దాదాపు 7-8 సంవత్సరాల తరువాత.సింగపూర్ ఫ్లైట్ టైమైపోవడంతో ఒక్కసారి అలా కనపడి ఫ్లైటెక్కేసాను. 

అన్య మనస్కం గా సింగపూర్ చేరాను. మరలా బాపు గారికి ఫోన్ చేసి మాట్లాడాను, మిమ్మల్ని కలవలేకపోయానండీ అంటూ. ఫరవాలేదమ్మా ఈసారి కలవచ్చులే, అంత తీరిక లేని మనిషిని కాను ఇప్పుడు నేను అంటూ తన స్టైల్లో మంద్రం గా అని నవ్వేసారాయన. 

గంధం ప్రసాద్ గారు అని బాపు-రమణ ద్వయానికి క్లోజ్ ఫ్రెండయిన ఒక పబ్లిషరున్నారు విజయవాడలో.

ప్రియ గీసిన బొమ్మ ఆయనకి పంపి ఆటొగ్రాఫ్ తీసుకోమన్నాను. బాపూ గారు దాని మీద సంతకం చేసి, రోజుకొక తెలుగు పద్యం నేర్చుకో అంటూ చక్కటి ఉత్తరం కూడా రాసారు.

ప్రసాద్ గారు ఆ ఉత్తరాన్ని, ఆటోగ్రాఫ్ తో పాటు అక్కకి పోస్ట్ చేసారు.అది చూసిన ప్రియ ఆనందానికి అవధుల్లేవు.
ఈ ప్రసాద్ గారి ద్వారానే అంతకుముందు బాపుగారు వేసిన "రామ పట్టాభిషేకం", "లక్ష్మి, సరస్వతి, వినాయకుడు"(ఈ ఆర్ట్ మీద ఆయన ఏమని సంతంకం చేసారో తెలుసా, "శ్రీమతి ABCకి", ఆశీర్వచనములతో బాపు, 28-6-2012(రమణగారి పుట్టిన రోజు)" అని), ఆర్ట్ ఆయన సంతకం చేసినది  పెద్ద పోస్టర్ రూపం లో సంపాదించగలిగాను మా కొత్తింటి గోడలనలంకరించడానికి .

ఇంతలో ఇక్కడ మేము కొనుక్కున ఇంటి గ్రుహప్రవేశం సమీపిస్తోంది.హడావిడి లేకుండా హాయిగా అత్తయ్యగారు, మామయ్యగారు ఇంకో నలుగురితో కలిసి సావధానం గా వ్రతం మాత్రం చేసుకుందాము,తరువాత అందరికీ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చెయ్యచ్చులే అనుకున్నాము.కాని ఇక్కడ కొనుక్కున మొదటి ఇల్లాయె, అస్సలు ఆహ్వాన పత్రిక లేకపోతే ఎలాగ అన్నారు ప్రింటింగ్ ప్రెస్ ఓనరయిన మామయ్యగారు. సరే అని, ఏదో నా ఫ్రెండ్ కి చెప్పినట్లు ఇక్కడ  ఇల్లుకొనుక్కున్నామండీ, ఆహ్వాన పత్రిక కి ఓ డిజైన్ పంపగలరా అని ఓ ఉత్తరం ముక్క రాసి పడేసి రొటీన్ లో పడిపోయాను 

కొన్ని రోజులకి చక్కటి డిజైన్ తో స్వయం గా వేసి రంగులద్దిన బాపు బొమ్మ పోస్ట్ బాక్స్ లో ప్రత్యక్షం. మా ఆనందానికి హద్దులేదు.   

ఆ ఇన్విటేషన్స్ కొన్ని  వేయించి ఇండియా లో మామయ్యలు, అత్తలకి,బాపూగారికి పంపించాము పోస్ట్ లో.

ఇండియా నుండి ఎవ్వరూ రాకపోయినా అందరూ థ్రిల్ ఫీలయ్యారు స్వయం గా బాపు వేసారు అని వినగానే. ఫోన్ చేసి బాపు గారు డిజైన్ చేసిన కార్డు మీకు వేసినది అని  ఫస్టు చెప్పాకే ఇంటి విశేషాలు పంచుకున్నాను.


ఇంకా కజిన్స్ కి మెయిల్లో  పంపాము ఇన్విటేషన్ని, ఇదే విషయాన్ని హైలట్ చేస్తూ. మాకు కంగ్రాట్స్ అని ఒక్క లైన్ మాత్రం రాసేసి అసలు బాపు గారితో ఎలా చేయించుకున్నావు అని అడగటానికే మెయిల్స్ చేసారు కజిన్స్ అనేది వేరే విషయం .
 
దిగ్విజయం గా గ్రుహప్రవేశం అయిపోయింది.బాపు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, నేను ఫోన్ చేస్తే ఆయన అభిమానంతో అడిగినవాటికి మాత్రం సమాధానం చెప్తూ.. ఇలా గడుస్తున్నాయి రోజులు.

అప్పుడే ఇల్లు కొనుక్కోవడం వల్ల ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు ఒక సంవత్సరం పాటు. చెన్నై సంగతి దేవుడెరుగు, ఇండియా వెళ్ళడానికే ఆలోచించలేని పరిస్థితి.

దాదాపు ఒక సంవత్సరం న్నర గడిచింది.ఏ ఆర్ రెహ్మాన్ ప్రోగ్రాం అని సింగపూర్ నిండా యాడ్స్ కనబడ్డాయి. ఎప్పటినుండో ఇది చూడాలని లైవ్ గా.

కాస్త దగ్గరగా కనపడేటట్లు తీసుకుందామంటే ఓ ఐదొందలుంది(డాలర్లు)టిక్కెట్టు.మళ్ళీ మధ్యతరగతి మనసు బ్రేక్ వేసేసింది.

ఫరవాలేదులే, ఒక్కసారే కదా వెళ్ళు, కానీ నేను రాను అన్నారు శ్రీవారు.ఫ్రెండ్స్ ని అడిగినా ఎవ్వరూ ముందుకి రావట్లేదు ఆ ధరలు చూసి , షో చూడాలన్న ఇష్టం ఉన్నా కానీ

ఇంతలో ఇంకో మూలేమో బాపూ ని కలవట్లేదన్న బెంగ. పోనీ ఇదే డబ్బులు అటు పెట్టి చెన్నై వెళ్తేనో..చెన్నై టిక్కట్టు ఇంకా తక్కువకే రావచ్చు...ఇదే మాట శ్రీవారికి చెప్పాను. ఆయన సరే అనడం,టిక్కెట్టు కొనడం  వెంటనే జరిగిపోయింది.


అంతకు కాస్త ముందు నుండే బాపు గారికి బాలేదని తెలుసు.అయినా బయలుదేరాను. వెళ్ళే ముందు రోజు వాళ్ళబ్బాయికి ఫోన్ చేస్తే, అస్సలు నాన్నగారు లేచి ఎవ్వరినీ కలవట్లేదండీ,మీరంత దూరం నుండి రావద్దు ఈయన కోసం. మాకూ ఇబ్బంది గా ఉంటుంది వచ్చి అలా వెనక్కి వెళ్తే కలవకుండా అన్నారు.

శ్రీవారేమో,ఫరవాలేదులే వెళ్ళు,కలిస్తే అద్రుష్టం, లేకపోతే నీ ఫ్రెండ్ తో గడిపి వద్దుగాని అన్నారు.


అంతే, చెన్నై బయలుదేరి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఎయిర్పోర్టుకొచ్చింది. కాస్త తినేసి బాపూ గారింటికి బయలుదేరాను ఫోను చెయ్యకుండానే, చేస్తే వాళ్ళబ్బాయి ఎక్కడ రావద్దంటారో అని. 

కాస్త వెతుక్కుని ఆయన ఇంటికెళ్ళాము ట్యాక్సీలో నేనూ నా ఫ్రెండు.పెద్ద గేటు,వాచ్మన్, హాడావిడి ఊహించుకున్న నాకు ఆ ఇంటి సింప్లిసిటీ చూసి స్టన్ అయ్యాను.  ముచ్చటేసింది.

ఆయన ఇంటి ముందు దిగి గేటు దగ్గరకి వెళ్ళేసరికి వాళ్ళబ్బాయి రమణగారు కారు పార్క్ చేసి గేటు ముయ్యబోతున్నారు.

నేను, బాపు గారి అభిమానిని, సింగపూర్ నుండి అనగానే, ఆయన గుర్తు బట్టి రండి అని సాదరం గా ఆహ్వానించారు.

ఓ అనిర్వచనీయమయిన అనుభూతి ఆ ఇంట్లోకెళ్తొంటే. లోపలకి అడుగుపెడుతోంటే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారిది అరుదైన చిత్తరువు అందం గా ...ఓ పక్కకి అలంకరించి. అప్రయత్నం గా ఓ ఫోటో తీసేసాను కనీసం అడగకుండా.

కూర్చొండి అని మమ్మల్ని హాలులో కూర్చోబెట్టి వాళ్ళబాయి పైకెళ్ళారు. నాకొకటే టెన్షన్, బాపూ గారిని చూడటం కుదరదంటారేమో, కనీసం దూరం నుండి చూస్తాననైనా అడగాలి అనుకుని మనసులో రిహార్సల్ వేసుకుంటోంటే, వాళ్ళబ్బాయొచ్చి రండి అని పైకి తీసుకెళ్ళారు. 

బాపు గారి గదిలోకి గుండెలదురుతుండగా అడుగుపెట్టాను.. ఎదురుగుండా నా అభిమాన దర్శకుడు, చిత్రకారుడు.. బాపు.

నోట్లో నుండి మాట రాలేదు.నమస్కారమండీ అని చెప్పి అలా నిల్చుండిపోయాని షాక్ తో ఆయన కూర్చోండి అనేదాక.

మా క్షేమ సమాచారం అడిగారు ఆప్యాయం గా. అసలు అంత ప్రముఖుడికి మమ్మల్ని అలా ఆదరించాల్సిన  అవసరం లేదు. అయినా ఎంత ఆప్యాయం గా మాట్లాడారో.

ఇంకా ముద్రణ లోకి రాలేదు, నా ఆర్ట్ కలెక్షన్ ఒకటి పుస్తక రూపం లో తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ పుస్తకం తెమ్మని వాళ్ళబాయికి పురమాయించారు.

ఎన్నెన్ని కళాఖండాలో ఆ ఆముద్రిత పుస్తకం నిండా. నేనెప్పుడూ చూడని ఆయన వేసిన జీసస్ బొమ్మ దగ్గర అప్రయత్నం గా ఆగిపోయాను. ఇది ఫోటో తీసుకోవచ్చా అని అడిగి నాలుక్కరచుకున్నాను. ఇంకా ముద్రణ లో లేదు కాబట్టి వద్దు అని ఎంత సున్నితం గా నొప్పించకుండా చెప్పారో ఆయన.

ఒక్కొక్క  పేజీ తిరగేస్తోంటే బాపు మార్కు చమక్కు ఆయన నోటి నుండి. "నేనెదురుగుండా ఉన్నానని ఒకొక్కపేజీ చూడక్కర్లేదు, ఈరోజు సరిపోదు మీకు ఒక్కొక్క బొమ్మా చూడాలంటే" అంటూ.

ఆయననడిగి ఆయనకొక ఫోటొ, ఆయనతో ఒక ఫోటొ తీసుకున్నాము.వాళ్ళబ్బాయిని పిలిచి తను బొమ్మలు వేసుకునే గది కూడా చూపించమన్నారు.

అస్వస్థత గా ఉండటం వల్ల ఆయనని ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించింది.

ఇంతలో ఆయనే, పైన రమణగారిల్లు, ఆయన లేరు కాని  వారి శ్రీమతి శ్రీదేవి గారున్నారు, చూసిరండన్నారు.

పైకెళ్ళి బయట నిలబడ్డాము సంశయంతో. బాపూగారబ్బాయి లోపలకెళ్ళి ఏదో చెప్పగానే ఆవిడ ఎదురొచ్చి సాదరం గా తీసుకెళ్ళారు.

అక్కడే ఇంకోకాయనతో మాట్లాడుతున్నారావిడ. ఈయనెవరో తెలుసా అంటూ మిధునం స్రుష్టికర్త "శ్రీ రమణ" గారిని పరిచయం చేసారు. ట్రిపుల్  ఆఫర్ అంటే ఇదే అనిపించింది నాకు.బాపు గారు, రమణ గారి సతీమణి, శ్రీ రమణ గారిని ఒకేరోజు అలా కలవడం..

ఆవిడతో మాట్లాడుతోంటే సమయం తెలియలేదు.ఏదో మా సొంత మేనత్తతో మాట్లాడినట్లుంది ఆవిడతో ఉన్నంతసేపూ.


శ్రీ రమణ గారు కూడా ఎంత బాగా మాట్లాడారని. ఎన్ని విషయాలు పంచుకున్నారో. మీ ఓపికమ్మ, అడగక్కర్లేదు తీసుకోండి అనగానే ఆ ఇంట్లో అణువణువూ ఫోటొ తీసుకున్నాను.

ఇంక మరీ జిగురు లాగ అతుక్కుంటే బాగోదని శ్రీదేవిగారిచ్చిన కొన్ని పుస్తకాలు తీసుకుని దాదాపు గంటన్నర రెండు గంటల తరువాత మరలా బాపూ గారి దగ్గరికొచ్చాము ఆవిడ భోంచేసి వెళ్ళమంటున్నా, వంటింట్లో ని ఆవకాయ జాడీలు,ఫణి బాబు గారు రాసిన ఆవిడ వంట అవీ గుర్తొచ్చి ఆత్మారాముడు మారాం చేసినా కానీ. 

వచ్చేటప్పుడు ఆవిడ పూలు, కుంకుమ ఇవ్వడం మరచిపోలేని అనుభూతి.శ్రీదేవి గారిని చూస్తే
గుర్తొచ్చింది , "అన్నీ  ఉన్న ఆకు...."సామెత.

కిందకొచ్చి మరలా ఇంకో సారి బాపు గారి గది చూసి కోతి కొమ్మచ్చి లో చదివిన మెహదీ హసన్ గజల్స్ సీడీలూ, ఆయన రంగుల కుంచెలు  వగైరా తనివితీరా చూసాము.

ఒక్క బొమ్మైనా ఇవ్వండి అని అడిగితే బాపూ గారబ్బాయి రమణగారు వెతికి వెతికి ఒక రఫ్ కాపీ ఇచ్చారు.అది వంశీ గారి కధల పుస్తకం కోసం వేసిన చిత్తు ప్రతిట. ఎంత అందం గా ఉందో అది కూడా.

దానికోసం నేనూ మా ఫ్రెండ్తో  అక్కడే పోట్లాడేసుకుని నేను నెగ్గి దానిని భద్రం గా బ్యాగ్ లో పెట్టేసుకున్నాను.

బాపు-రమణ బొమ్మల కధలు అనే పుస్తకం మీద ఆయన సంతకం చేసి రాసిన లైన్ చదివితే బాపు మనసుకి వార్ధక్యం రాలేదు. కొంటే బొమ్మలు, రాతల బాపు ఎప్పటికీ ఇంతే అనిపించింది.

కిందకొచ్చేసాక గుర్తొచ్చింది అయ్యొ వట్టి చేతులతో ఎలా వచ్చాము అని. వెంటనే కాస్త మంచి స్వీట్ షాప్ ఉన్న చోటికి వెళ్ళి స్వీట్స్ కొని తీసుకెళ్ళి ఇచ్చొచ్చాము.

గాల్లో తేలినట్లుందే, గుండే పేలినట్లుందే అన్నట్లుంది నిజం గా నా పరిస్థితి ఆ రోజు.

....... సింగపూర్ రావడానికి ఎయిర్పోర్ట్ లాంజ్ లో కూర్చుని ఉన్నాను..మా అబ్బాయి చెప్పినది కరెక్టే సుమా,Everything Happens for good".

 ముక్కూ మొహం తెలియకపోయినా అంత సాదరం గా ఆహ్వానించి మేము  శలవు తీసుకునేవరకూ  మాతోనే ఉన్న బాపూ గారబ్బాయి రమణ గారికి కోటి ధన్యవాదాలు.
(  ఈ టపా ఈ సంవత్సరం శ్రీరామ నవమి రోజు మొదలెట్టి రమణగారి పుట్టినరోజైన ఈరోజు ముగించాను .. We miss you Bapu and Ramana garu.తెలుగు వాళ్ళ అద్రుష్టం మీరు మాకు దొరకడం. తర్జుమా చేసినా ఆనందించలేని మార్కు కామెడీ మీది. తెలుగు వారికే సొంతం మీరు. మిమ్మల్ని వేరెవరితోనూ పంచుకోము).