Sunday, March 30, 2014

లెజెండ్ ఎందుకు చూద్దామనుకుంటున్నాను

1)ఇంతకుముందు బాలక్రిష్ణ అంటే వెటకారం తో కూడిన అభిమానం ఉండేది.
సిమ్హా కూడా అలా ఉన్నప్పుడు చూసినదే. బాలయ్యతో పాటు ఆ మధ్య మంచక్కయ్య అంటే కూడా అభిమానం పెరగడంతో, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "సీ కొడతారా సిరాకు పడతారా..అబ్బెబ్బే కాదు కాదు,
"ఊ కొడతారా ఉలిక్కి పడతారా " సినిమా నాకు జంబో కాంబో నే.

2)సినిమా సంగతెలా ఉన్నా బాలయ్య బాబు  నా అంచనాలకి మించి నటించేసాడు. సిగార్ నోట్లోపెట్టుకుని కుర్చీ లో
అటూ ఇటూ ఊగుతూ(కుర్చీని ఊపెస్తూ)ఆలోచించే సీన్ అయితే సూపర్ .

3) ఆ తరువాత ఓ సారి మంచక్కయ్య బాల క్రిష్ణ ని ఇంటర్వ్యూ చేసింది.అందులో,అన్నయ్యా !నువ్వు తప్ప ఈ పాత్ర ని ఎవరూ చెయ్యలేరు అనగానే ఉబ్బి తబ్బిబయిపోయి మాటలు రాని బాలయ్య బాబు ని చూస్తే సన్నగా మొదలైన జాలి నాతో బాలయ్య బాబు సినిమాలని దాదాపు అన్నీ వరసపెట్టి చూడటానికి పురొగొల్పింది.

4)అన్నీ చూసాకా నాకు అర్ధమయినది ఏమిటంటే బాలయ్య బాబు డైరెక్టర్ చేతిలోని మంత్రదండం. ఏది కావాలంటే అది ఎలా కావాలంటే అలా తన నటన రూపం లో  తనలో నుండి తీసివ్వగలడు.మీరిప్పుడు ప్రార్ధన చెయ్యగానే ట్రైన్ వెనక్కి పరిగెడుతుంది సార్ అనో, మీరు కొండలూ గుట్టలూ ఎక్కి మీ ప్రాణాలకి తెగించి శిఖరం అంచు నుండి వేళ్ళాడుతూ చెవులపిల్లిని కాపాడాలి అని కానీ ఏది చెప్పినా  సరే 100% డెడికేషన్ తో చేసేస్తాడు.

5)ధైర్యం ఉంటే నన్ను చూడ్రా అని భీభత్స రౌద్ర రసం ఒలికిస్తూ డైలాగ్ చెప్పగలగడం,దబిడి దిబిడే అంటూ హీరొయిన్ ని ఆట పట్టించడం తెలుగు సినీ జగత్తు కి నాలుగు స్తంభాలలో ఒకడివైన
 నీకే సాధ్యం బాలయ్య బాబూ.

6)తండ్రి కొట్టిన దెబ్బకి కోమాలో కి వెళ్ళిన విలన్, మరలా కొడుకు పాతికేళ్ళ తరువాత కొడితే లేవడం అనే
ట్విస్ట్ తెలుగు సినీ జగత్తు లో అధ్భుతాలలో కెల్లా అధ్భుతం. దానిలో తండ్రీ కొడుకులుగా నువ్వే ఉంటే ఇక దానికి
యాడ్ అయ్యే వేల్యూ నా బోటి వాళ్ళకే "ఆహా(?)" అనిపిస్తే, నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్  కి విందు భోజనం కాదూ..)

7)బాలయ్య బాబూ , నీ  గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు ఆలూ లాంటి వాడివి.దానితో అల్లం పచ్చి మిర్చి దంచి మైల్డ్ గా ఉండే కూర చేసుకోవచ్చు(ఉదా: పవిత్ర ప్రేమ సినిమా),మసాలాలు మాత్రం ఎక్కువ వేసి కాస్త కారం తగిలించిమసాలా కూర వండుకోవచ్చు( ఉదా.లు అక్కర్లేదు )లేదా కారం  దట్టించి  కారానికి తగినె ఉప్పు వేసి కారం  కూర చేసుకోవచ్చు.

అదీ కాదంటే వెరైటీ గా లోపల మసాలా పెట్టి పైన కవరింగిచ్చిసమోసా చేసుకోవచ్చు(నచ్చనివాళ్ళు పోర్న్ రంగడు అంటారు ఆ సినిమాని)

ఇవేవీ కాదంటే రోటీన్ కి భిన్నం గా డిఫరెంట్ గా ఆలూ కట్లెట్(ఆర్మీ గెటప్ లో ఉన్న సినిమా పేరు గుర్తు రావట్లేదు).
.ఇంకా ఎన్నొ వంటలు చేసుకోవచ్చు. ఎన్ని చేసినా అన్నింటా ఉండునది ఆలూ లాగ అన్ని పాత్రలలో నువ్వు
ఒదిగిపోయినా నీ "ఒరిజినాలిటీ" ని మాత్రం పోనియ్యవు చూడు, అక్కడే నచ్చెస్తావు నాకు నువ్వు బాలయ్య.


8) ఇక దర్శకుడు బోయపాటి గారి గురించి చెపాలంటే మాటకు కట్టుబడే మనిషాయన. సిమ్హా సినిమ అప్పుడు ఇది హై ఓల్టేజ్ సినిమా అని ఇంటర్వ్యూ లో చెప్పారు. సినిమా మొదటి ఫైట్ లోనే హీరో విలన్ ని కొడిటే వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కి గుద్దుకోగానే మెరుపులతో కూడిన కరెంట్ బయటకి వస్తుంది.

బోలెడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్  నుండి బయటకి రాగానే అర్ధం అయ్యింది హై ఓల్టేజ్ అంటే ఇదే కదా, ఆహా దర్శకుడు మాట తప్పని మనిషి అని. ఇక ఈ మాట తప్పని మనిషి దర్శకత్వం లో మడమ తిప్పని హీరో హారి సినిమా అంటే ఎలా మిస్స్ అవుతాను??

9)బోయపాటి గారి సినిమా సిమ్హా లో స్క్రీన్ ప్లే   అయితే సూపర్. హీరో ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని గ్లాసులో పొయ్యడం మొదలుపెట్టగానే, నెక్స్ట్ సీన్ లో విలన్ గ్లాసులో పడుతున్న  విస్కీ ధార ని చూస్తాము.ఇంకా ఇలాంటి చమక్కులు చాలానే ఉన్నాయి ఆ సినిమాలో.

అందుకే వచ్చే శనివారం చూస్తున్నాను.