Friday, March 1, 2013

చాగంటి వారుదేనికైనా టైము రావాలి అని ఊరికే అనరేమో.చాగంటి వారి ప్రవచనాలు విను అని మా నాన్నగారు గత 2-3 సంవత్సరాలనుండీ చెవిలో ఇల్లు,అపార్టుమెంటు అన్నీ కట్టేసుకుని పోరుతూనే ఉన్నారు..ఆ వింటాను అని చెప్పో, వింటున్నావా అంటే ఆ ఆ అనేసి మాట మార్చేసాను ఇన్నాళ్ళూ.

ఆ మధ్య ఓ సారి మనసు బాలేదమ్మా అంటే సుందర కాండ విను శాంతి కలుగుతుంది మనసుకి అని చెప్పింది అమ్మ. అదొక్కటీ విందామని మొదలుపెట్టి, ఒక్కటి వినగానే ఊహూఒ ఇలా కాదు అని చెప్పి బాల కాండ తో మొదలు పెట్టి రామాయణం 80 భాగాలూ వినడం పూర్తి చేసేసాను. ఇప్పుడు మహాభారతం వింటున్నాను..ఇంకా మరికొన్ని ప్రవచనాలు రెడీ గా పెట్టుకున్నాను వినడానికి.

ఇన్నాళ్ళూ టీవీల్లో అర్ధమయ్యీ అవ్వకుండా చెప్పే స్వామీజీలవి విని అవే ప్రవచనాలు అంటే అనే భావన ఉండేది.ఎప్పుడయితే చాగంటి వారి ప్రవచనం వినడం మొదలుపెట్టానో అసలు అవంటే ఎంత ఇష్టం ఏర్పడింది అంటే ఇంతకుముందు ఆఫీసుకి వెళ్తూ వస్తూ ఫోను లో గేంస్ ఆడుతూనో, సినిమా పాటలు వింటూనో ఉండే నేను వీరి ప్రవచనాలు తప్ప మరేమీ వినడం లేదు. నిజం, అంత ఆసక్తి కరం గా ఉంటున్నాయి ఆ ప్రవచనాలు. ఒకదాన్ని మించి మరొకటి బాగుంటున్నాయి ఆయన ప్రవచనాలు.

ఆ వాగ్ధాటి, విడమరిచి చెప్పే పద్ధతి,మధ్య మధ్య లో ఆయన నేటి సమాజానికి అన్వయిస్తూ చెప్పే ఉదాహరణలు, మహా పురుషుల గురించి వారు గొప్ప అని చెప్పేసి ఊరుకోకుండా ప్రస్తుతమున్న పరిస్థితిల్లో మన కర్తవ్యం, సమయం వచ్చినప్పుడల్లా ఆయన చెప్పే రక రకాల క్రతువుల వెనక ఉన్న గూఢార్ధాలు ఒక్కటేమిటి ఇలా ఎన్నో ఆయన ప్రసంగాలకి అడిక్ట్ అవ్వడానికి కారణాలు. ఒక్కోసారి ఆయన ప్రసంగం ఒక సైకాలజీ ప్రొఫెసర్ ప్రసంగం లా ఉంటుంది. అంతలోనే లాఘవం గా ఆయన చెప్పే పురాణం లోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. ఆయన ప్రసంగం కొన్నాళ్ళు వినగా వినగా మిమ్మల్ని మీరు కనీసం చిన్న తప్పు చేసేటప్పుడైనా ఆత్మ శొధన చేసుకుంటారు.

మన సంస్క్రుతి ని కాపాడండీ అని ఏదో ఫలానా దినాల్లో ప్లకార్డులు పట్టుకునో టీవీల్లో చర్చల్లో పాల్గొనో అరిచి గీ పెట్టకుండా తన వంతు గా ఆయన ప్రయత్నం చెయ్యడం నిజం గా అభినందనీయం. నేటి సమాజం ఇలా తయారవ్వడానికి సినిమాలో మరోటో కారణం కాదు,మనము ఇంట్లో పిల్లల్ని పెంచే పద్ధతే కారణం కాదంటారా అని ఆయన చెప్పిన ఉదాహరణలు వింటే నిజమే కదా అనిపిస్తుంది.ఒక్కోసారి ప్రసంగం లో భాగం గా ఆయన వేసే ప్రశ్నలు నా లాంటి నేటి తల్లితండ్రులకెందరికో చురుక్కు పుట్టిస్తాయి.

"కబంద హస్తాలు" అనే పదం తరచుగా మన తెలుగు వార్తా పత్రికల్లో టీవీల్లో వినడమే గానీ అసలు ఆ కబందుడి కధ, వాల్మికి రామాయణం లో లక్ష్మణ రేఖ ప్రస్తావనే లేకపోవడం,శబరి అంటే ఎంగిలి పళ్ళని రాముడికి తినిపించిన భక్తురాలి గా(వాల్మీకీ రామాయణం ప్రకారం ఈ ఘట్టం కూడా కల్పితమే ట) మాత్రమే తెలిసున్న నాకు ఆవిడ వ్రుత్తాంతం విని శబరి గురించి తెలుసుకున్నాను. అయ్యో ఇంతక ముందు నుండీ విని ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తోంది.

ఇంకా శరభంగుడి గురించి, అగస్త్యుడి గురించి, ఇంకా ఎందరెందరి గురించో తెలుసుకునే అవకాశం వచ్చింది ఈయన ప్రసంగాల వల్ల.

కనీసం నేను రామాయణం సీరియల్ చూసాను సంవత్సరం పాటు టీవీలో. ఆ సౌలభ్యం కూడా లేకుండా పుస్తకాల్లో మాత్రమే చదివిన మా అబ్బాయికి నేను చాగంటి వారి రామాయణం వివరించి చెప్తోంటే ఎంత ఉత్సాహం గా వింటున్నాడో. ఎంతైనా తెలుగులో ఆయన చెప్పినంత అధ్భుతం గా ఇంగ్లీషులోకి నేను తర్జుమా చెయ్యలేకపోతున్నానన్న మాట మాత్రం నిజం. చాగంటి వారి ప్రసంగ ఆంగ్లానువాదాలు దొరుకుతాయేమో అని కనుక్కున్నాను కానీ లేవుట.
ఇప్పటివరకూ కనుక మీరు ఆయన ప్రవచనాలు వినకపోయి ఉంటే ఇప్పుడే మొదలుపెట్టండి.. విని మీకు నచ్చితే కనుక నాకు వచ్చి చెప్పండి.