ఇంకో ఆడపిల్ల బలైపోయింది. మన ఉద్యమకారులకి ఆయుధం దొరికింది తమ "ప్రతాపం" మళ్ళీ చూపించడానికి. ఆ అమ్మాయి అంత్యక్రియలు అయ్యేవరకు నిరసనలు, ఆందోళనలతో మాస్ హిస్టీరియా ఇచ్చిన కిక్కు తో వీరావేశంతో ప్లకార్డులు ప్రదర్సిస్తారు.
ఎలాగూ చేతిలో పనే కాబట్టి ఫేస్ బుక్ లో మెసేజిలు,డిస్ప్లే పిక్చర్ గా ఓ నల్ల వ్రుత్తం పెట్టేసుకుంటారు. అన్నా హజారే ఉద్యమం అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఫేస్ బుక్ లో.
డిశంబరు 31 సాయంత్రానికి అంతా గపుచుప్ సాంబార్ బుడ్డి.వీరావేశంతో నిరసన తెలిపే వాళ్ళలో ఎంత మంది అబ్బాయిలు "నిజం" గా అమ్మాయిలని ఏడిపించకుండా ఉంటారు ఆ తరువాత? ఎంత మంది అమ్మాయిలు డిస్కోలకీ పబ్బులకీ వెళ్ళడం ఆపెస్తారు?
ఈ సంఘటన తరువాత కొంతమంది ఫేస్ బుక్ లో ఆ సంఘటనని, ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ గాయాలయ్యాయో ఫోటో లతో(ఫేక్ వే లెండి)సహా వివరిస్తోంటే ఒక ఆడపిల్ల కి ఇచ్చే గౌరవం ఇదేనా అనిపించింది. ఆ అమ్మాయి బతికున్నప్పుడే ఎన్ని సార్లు చంపేసారో మన వాళ్ళు ఫేస్ బుక్కు, ట్విట్టర్ ద్వారా.
ఈ నిరసనలు జరుగుతున్నపుడు నాయకులు పరామర్శించటానికి వస్తే అడ్దుకుంటారు రాకపోతే రాలేదంటారు. అసలు వీళ్ళకి ఏమి కావాలి? సరే ఆ ఆరుగురినీ ఉరి తీద్దాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు అని వీళ్ళు హామీ ఇస్తారా??
నేను ఆ నిందితులని సమర్ధించట్లేదు.వాళ్ళు చేసినది హేయమైన చర్యే.ఉన్న చట్టాలు పక్కా గా అమలు చేయండి,అవసరమయితే శిక్షలు కఠినతరం చెయ్యమనాలి.మూల కారణాన్ని ఇప్పుడైనా అన్వేషించాలి.
కానీ ఈ నిరసన కారుల్లో ఆవేశమే తప్ప అసలు మూల కారణమో లేదా ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించో ఒక్కరూ మాట్లాడరేమి?? ఇప్పటి మనం ఉన్న సమాజ పరిస్థితులని చూస్తే ఇలాంటి సంఘటనలు అస్సలు జరగకుండా చర్యలు తీసుకోమనడం సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసు.
అడ్డొచ్చిన పోలీసులని కొట్టి, బ్యారికేడ్లని తొలగించుకుని అలా గుడ్డెద్దుల్లాగ పోవడమేనా వీళ్ళకి నిరసన అంటే అనిపిస్తోంది. ఒకరోజు టీవీ లో ఓ కర్ర పట్టుకుని ఓ వాహన అద్దాలని కసితీరా కొడుతున్న యువత ని చూస్తే జాలేసింది. ఆ నిందితులు చేసినది ముమ్మాటికీ క్షమించరాని నేరమే..మరి వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ఇంత ఉద్రిక పరిస్థితులు స్రుష్టించాల్సిన అవసరం ఉందా??
ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఈ కేసులో నిందితుల్లో పెద్ద తలకాయల పిల్లలు ఉంటే కూడా ఇలాగే నిరసన చేసేవాళ్ళా?? మన మీడియా ఇంత కవరేజ్ ఇచ్చేదా?? ఈ ఆందోళన సర్కారు ని కదిలించింది అనడం లో సందేహం లేదు కానీ నిరసన తెలిపిన పద్ధతి మాత్రం సరైనది కాదు.
"మహిళా" నాయకురాళ్ళమని చెప్పుకుని లేచిన దగ్గరనుండీ తమ వాగ్ధాటి పదును తగ్గకుండా చూసుకోవడానికా అన్నట్లు చర్చల్లో రెచ్చిపోయే మహిళలని చూస్తే జాలేస్తోంది.ఈ ఘటన కి నిరసన గా "అర్ధరాత్రి మార్చ్" నిర్వహిస్తారుట మహిళలతో. అసలు వీళ్ళ బుర్రల్లోకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి రా దేవుడా అనిపిస్తోంది.
నా ఇష్టం వచ్చినట్లు నేను బట్టలు వేసుకుని తిరుగుతాను , వాళ్ళని మా జోలికి రావద్దని చెప్పండి అనే అమ్మాయిలని చూస్తే ఏమనాలో అర్ధం కావట్లేదు. సరే మీరడిగినట్లే రక్షణ ఇస్తాము అమ్మా...మీ మీద ఎవ్వరి చేతులూ పడనీయము రెచ్చగొట్టే బట్టలు వేసుకుని ఓ సీ క్లాస్ సినిమా హాలు కి వెళ్ళమ్మా అంటే వెళ్తారా ఆ ఆడపిల్లలు??
బట్టలు ఒక్కటే ఇలాంటి సంఘటనలని ప్రేరేపిస్తాయి అనడం కూడా సమంజసం కాదు. అవి "కూడా" కారణమవుతాయేమో అంతే. నిండుగా కాటన్ చూడిదార్ వేసుకుని అమ్మాయి నడచి వెళ్తోంటే కూదా కావాలని వచ్చి ఢీకొట్టే మగాళ్ళకి కొదవలేదు.
సంతాప సందేశాలు తమ ట్విట్టర్,ఫేస్బుక్ లో పోస్ట్ చేసే హీరోయిన్లలో ఎంత మంది తమ వంతు కర్తవ్యం గా సినిమాల్లో రెచ్చగొట్టే ప్రదర్శనలని ఆపెస్తామని నిర్ణయించుకుంటారు?
కర్ణుడి చావు కి కారణాలనేకం అన్నట్లు అసలు కొంత మంది మగ వారు ఇలా మారడానికి ఎన్నో కారణాలు. ఈ కేసు నిందితుల్లో ఓ మైనర్ బాలుడుండటం చూస్తే ఎటు పోతున్నాము మనము అనిపించక మానదు. మగ పిల్ల వాడు పుట్టడమే తాము చేసుకున్న అద్రుష్టమని భావించే మూర్ఖ శిఖామణులు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. ఆ పిల్లవాడి తల్లి, తండ్రి,బామ్మ/అమ్మమ్మ ఎవరైనా కావచ్చు ఇలా అనుకునే వాళ్ళు.
"వాడు మగాడు" అనే మాట వాడికి కవచం లా పని చేసి చిన్నప్పుడు, టీనేజీ లో వాడు చేసే చిన్నా చితకా తప్పులని కాస్తుంది.తన కొడుకు పదో తరగతి పాసవ్వగానే ఆ కుర్రాడికి ఆ రోజుల్లోనే అత్యంత ఖరీదైన బైక్ కొనిచ్చి పిల్లాడు సకల దుర్గుణ సంపన్నుడయ్యాకా తీరిగ్గా విచారించే తల్లిని చూస్తే జాలేసింది.
అసలు ఆవిడ పుత్ర వాత్సల్యానికి పరాకాష్ట ఏమిటి అంటే ఇప్పటికీ తన కొడుకు బయట పిచ్చి తిరుగుళ్ళు తిరిగొచ్చి ఇంటికి చేరగానే,"నానా అలా సందులో నుండి వెళ్ళి తల స్నానం చేసి రా" అని చెప్పే ఆ తల్లి ని ఏమనాలి??
ఆడపిల్లల గురించి తీసుకున్న జాగ్రత్త మనము మగ పిల్లల విషయం లో ఎందుకు తీసుకోవట్లేదు? వాడేమీ తప్పు చెయ్యడని ధీమానా, ఏమి చేసినా చెల్లుతుంది లే అనా?? ఇలా పెరిగిన పిల్లవాడు 18-20 యేళ్ళు వచ్చేసరికి ఎలా తయారవుతాడు?
మన పిల్లాడు డాక్టరో, ఇంజనీరో అయిపోయి డబ్బులు సంపాదించెయ్యాలి అనే ఒకే ఒక్క గోల్ తో ఆ ట్యూషను ఈ కోచింగు అంటూ వేలకి వేలు ఖర్చుపెడుతున్నాము. మంచి నడవడి,విలువలు నేర్చుకోవడం కోసం అసలు మన నోటి మాటనైనా వెచ్చిస్తున్నామా?
సరే ఇవేవీ లేకుండా పిల్లాడిని బాగానే పెంచారు అనుకున్నాము,అంతటితో వాడు మంచి పౌరుడయిపోటాడా? ఖచ్చితం గా కాదు. టీవీ,సినిమాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి వీరిని రెచ్చగొట్టడానికి. మనము చూడటం మానెస్తే తప్ప తీసేవాళ్ళు ఆపరు,దర్శకులని మారండి అని చెప్పడం చెవిటి వాడి ముందు శంఖమూదినట్లే.
ఒకప్పుడు సినిమాల్లోనే హీరోయిన్లు అలా చాలీ చాలని బట్టల్తో కనడే వారు. ఇప్పుడు టీవీలు, ఇంటర్నెట్ వాడకం పుణ్యమా అని ఎక్కడ చూసినా రెచ్చగొట్టే భంగిమల్లో అమ్మాయిలు. అసలు టీనేజీ కుర్రకారు ఎంత ఉద్రేకపడతారు ఇలాంటివి చూస్తే?ఎవరికి కావాలండీ సమాజం ఎటు పోతే.మనం తయారు చేసే ప్రోడక్ట్ ఎలాగోలా జనాన్ని రీచ్ అయ్యి సేల్ అవుతోందా లేదా ఇదే ముఖ్యం.
డ్యాన్స్ పోటీల్లో చాలీ చాలని బట్టలతో డ్యాన్సులేసే ఆడ పిల్లలని చూస్తే వీరికీ పత్రికల్లో అప్పుడప్పుడు కనిపించే "కన్న పిల్లల్ని అమ్మకానికి పెట్టిన తండ్రి" లాంటి వారికీ తేడా ఏమన్నా ఉందా?? 10-12 ఏళ్ళ వయసులో అలా ఆడపిల్లలతో కలిసి దగ్గర దగ్గరగా మసిలిన మగడపిల్లాడి పరిస్థితి ఏమిటో తల్లి తండ్రులు కానీ, నిర్వాహకులు కానీ ఎవరైనా ఆలోచిస్తారా??
ఆడపిల్లల విషయానికి వద్దాము.వీరి తప్పు ఉండట్లేదా అంటే వీరిదీ ఉంటోంది.స్నేహితుడితో ఏకాంతం కోసమని జన సమూహానికి దూరం గా వెళ్ళి ఆకతాయిల చేతిలో భంగ పడ్డ కేసులు ఎన్ని చదవలేదు మనము? Dr.Alban's It's my Life వినడానికి మాత్రమేకానీ నిజ జీవితం లో ఇలా కుదరదు అని వీళ్ళకి ఎలా చెప్పాలి??ఇన్ని సంఘటనలు జరిగిన/జరుగుతున్న సమాజం లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనీసం కొన్ని సంఘటనలైనా నివారించగలము అని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో?
అబ్రకదబ్ర గారు ఈరోజు తన బ్లాగు లో చెప్పిన ఒక మాట బాగా నచ్చింది నాకు.
>>నేనెలాంటి బట్టలేసుకోవాలో నువ్వు చెప్పక్కర్లేదు’ తరహా ప్లకార్డులు పట్టుకునే హైసొసైటీ అమ్మాయిలు హాయిగా కార్లలో తిరుగుతూ కులాసాగా బతికేస్తుంటారు. వాళ్లు రేపెట్టే వాంఛలకి రెచ్చిపోయే చిత్తకార్తె కుక్కల పాలిట పడేదేమో బస్సుల్లో తిరిగే ఇతరులు.
ఇది ముమ్మాటికీ నిజం.
ఇక చట్టాలు వాటి అమలు దారుల గురించి మాట్లాడుకుందాము ఇలాంటి famous కేసుల్లో తప్ప మిగతా వాటికి ఫైళ్ళు ఎందుకు కదలవు??
మన దగ్గర కింది స్థాయి పోలీసులు సమర్ధం గా తమ డ్యూటీ నిర్వహిస్తే సగం నేరాలు అదుపులో ఉంటాయి. కానీ నిర్వర్తించాలి అంటే ఆర్ధిక అవసరాలు గుర్తొస్తాయి. అంతే..డ్యూటీ అటకెక్కుతుంది.వీరు సరిగ్గా పని చెయ్యాలి అంటే వీరి జీత భత్యాలు పెంచాలి.
అవి పెంచాలి అంటే అమాత్యులకి చిత్తశుద్ధి ఉండాలి అది జరగాలి అంటే మనం అలాంటి వారిని ఎన్నుకోవాలి..అలా ఎన్నుకోవాలి అంటే మనము ప్రలోభాలకి లొంగకూడదు.మనము లొంగకూడదు అంటే ఏమి చెయ్యాలి??
రాజుగారు ఏడుగురి కొడుకుల కధలో చేప ఎందుకు ఎండ లేదో మనకి సమాధానం దొరుకుతుంది కానీ ఇది మాత్రం సమాధానం లేని ప్రశ్న..