Wednesday, June 20, 2012

నమ్మకమీయరా స్వామీ

చిన్నప్పుడు,చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు లెండి తొమ్మిది పదీ తరగతుల్లో అనుకుంటా మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉన్న రోజుల్లో అమ్మ సాయంత్రాలు రుద్రం నమకం పెట్టేది.

అప్పుడు అమ్మ అవి పెడీతే విసుగ్గా అనిపించేది కానీ పెద్దయ్యాకా నచ్చే చిన్నప్పటి బెల్లం కూరలు,ఒడియాల పులుసుల్లాగ ఇది కూడా నచ్చడం మొదలయ్యింది.

రకరకాల గొంతుల్లో ఆ నమకం చమకం వినడానికి ప్రయత్నిచాను కానీ చిన్నప్పటి ఆ గొంతు ఉన్న సీడీ మాత్రం దొరకలేదు.

సరే అని ఓ పదిహేను రోజులక్రితం అనుకుంటా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తోంటే ArRehman-Namakam అని కనపడింది.

అయ్యబాబోయ్ ఈయన ఇవి కూడా పాడేసాడా ఏమిటి?? "వందే..ఏ..ఏ...మాతరం" ని,"మా..ఆ..తెలుగు తల్లి కీ..ఈ..ఈ " అని అరిచేసి ఉంటాడులే అనుకున్నాను.

కానీ నాలో ఏ మూలో దాగున్న రెహ్మాన్ అభిమాని పైకొచ్చి అది వినేట్టుగా చేసింది.

కొద్ది సెకన్లు బొంబాయి థీం గుర్తొచ్చింది,గానం మొదలవ్వగానే ఇది స్వర్ణలత పాడిందేమో అనిపించింది,మధ్య లోకి రాగానే జోధా అక్బర్ లో ఓ పాట మధ్యలో వచ్చే ట్యూన్..ఇంతలో చిత్ర గొంతు వినపడింది..మొత్తానికి ఈ పాట అలా వినేసాను.

తీరా చూస్తే అది "కొమరం పులి" లొ "నమ్మకమీయరా స్వామీ" అన్న పాట. అసలు తెలుగు సినిమా రెహ్మాన్ పాటలు ఈ మధ్య బాగోట్లేదు అని నమ్మి ఉండటం వల్ల ఈ పాట మిస్స్ అయిపోయానెమఓ. కొమరం పులి పాటలు రాగానే రెహ్మాన్ కాబట్టి ఓ రెండూ మూడు విన్నాను. అమ్మా తల్లీ ఒకటి, ఇంకోటి "మారాలంటే" అన్న పాట.ఈ రెండూ విని విరక్తి వచ్చి ఆల్బం మొత్తం పాటలు వినలేదు.

ఈ పాట మాత్రం రోజూ ఓ నాలుగైదు సార్లు వినేంతగా నచ్చేసింది. ప్రతీ సారీ విన్నప్పుడల్లా రకరకాల ఆలోచనలు.

బిడ్డ పుట్టినపుడు తల్లి పాడే లాలి పాటేమో అనోసారి, కానీ పాటలో రెండు గొంతులు ఉండబట్టి సినిమా మధ్యలో హీరో కి ఏమైనా అయినప్పుడు హీరోయిన్,హీరో తల్లి పాడే పాటేమో అని ఇంకోసారి ఇలా ఊహించుకున్నాను.

కానీ ఈ పాట లో చిత్ర గొంతు నచ్చలేదు నాకు. ఎందుకో మొదటినుండీ కూడా చిత్ర గొంతు నచ్చదు నాకు. సుశీల గొంతులో ఉన్న మాధుర్యం ఈవిడలో అనిపించదు. ఈ మధ్య విన్న వాళ్ళల్లో ఉష లో వినపడింది ఆ మాధుర్యం,ఈ మధ్యే ఇంకో గాయని గొంతు కూడా నచ్చుతోంది..పేరు గుర్తు లేదు ఆ అమ్మాయిది.

ఈ పాట వింటేనే ఇంత బాగుంది స్క్రీన్ మీద ఎంత బాగుంటుందో అనుకుని ఆ మధ్య ఎప్పుడో టీవీలో వస్తోంటే రికార్డ్ చేసి పెట్టుకున్న సినిమా చూసాను. సినిమా మొదలవగానే బ్యాక్ గ్రవుండ్ లో ఓ రెండూ మూడు లైన్లు వినపడ్డాయి అంతే,అలా ఫార్వార్డ్ చేసుకుంటూ చివరికొచ్చేసా..అయినా ఎక్కడా వినపడదే పాట. ఒక నిట్టూర్పు విడిచా అయ్యో ఇంత మంచి పాట ఎలా తీసేసారు అని..

మొదట రికార్డు చేసి ఆ తరువాత హీరో గారి ఇమేజ్ కి సరిపోదని పెట్టి ఉండరేమో అనిపించింది. కనీసం చివర్న ఆ విలన్ పిచ్చి అరుపుల బదులో లేదా పాటేమిటో ఆ శ్రియ డ్యాన్సేమిటో అర్ధం కాని పాట బదులు ఈ పాట పెట్టచ్చు కదా అనిపించింది.

ఈ పాట దాదాపు రోజూ వినేంతగా నచ్చేసింది నాకు. ఏ పాట కూడా ఇంతగా నచ్చలేదేమో కూడా...

ఇక దీని సాహిత్యం అధ్భుతం. అన్నింటికంటే కూడా చివర్లో వచ్చే "సర్వమందించు నీ ప్రియ గానం స్మరణం ప్రార్ధనకై స్వామీ సమయం స్వచ్చత నీయరా" అనేది ఎందుకో తెగ నచ్చేసింది.

మన హడావిడి జీవితాలలో చేసే హడావిడి ప్రార్ధనలని చాచి కొట్టినట్లనిపించింది.