Thursday, April 5, 2012

తెలుగు సినిమా

ఏమిటో ఈ రోజు పొద్దున్న నుండీ ఈ రచ్చ.ఓ మామూలు మాస్ మసాలా సినిమా కి అంత హడావిడి ఏమిటో. అంతే లెండి హిట్టు కొట్టక తప్పదన్న పరిస్థితిలో సినిమా వస్తే ఈ మాత్రం రచ్చ తప్పదేమో. ఆ మధ్య బిజినెస్ మ్యానేమో "...చ్చ" అంటూ హిట్టు కొట్టాడు మెగా వారసుడేమో "రచ్చ" అన్నాడు నెక్స్ట్ హిట్టు కావాల్సిన హీరోలెవారైనా "పిచ్చ"(వీడికి పుట్టింది కచ్చ అనేది ట్యాగ్ లైను ) అని పెట్టుకుంటే సరి.

నాకు అర్ధం కాని విషయం ఒకటుంది. ఏదో కధ డిమాండ్ చేస్తే(మనం రాసుకున్న కధలు డిమాండ్ చెయ్యడమేమిటి అని అడక్కూడదంతే)అమెరికా లోనో రష్యాలో నో తీస్తే ఓకే కానీ పాట కీ ఫైటు కీ విదేశాలేమిటో.90% పాటలు కధానుసారం లోకల్ గా మొదలయ్యి అలా మలేషియా థాయిలాండు మీదుగా హీరోకి చలికోటేసి జేబులో చేతులు పెట్టి నడిపిస్తూ హీరోయిన్ కి ఓ షిఫాన్ చీర కట్టి స్టెప్పులేయించాలనుకుంటే యే రష్యానో ఉజ్బెకిస్తానో వెళ్ళి అలా అమెరికాలోనో తేలతారు.నిజంగా ఇంత అవసరమా?

"ఫేస్ వేల్యూ" లేని హీరోలు డ్యాన్సులని ఉతికి ఆరెస్తుంటారు కాబట్టి ప్రేక్షకుల చూపంతా వాళ్ల మీదే ఉంటుంది.కాస్త చూడటానికి బాగున్న హీరోలు స్క్రీన్ మీదుంటే వాళ్ళనే చూస్తాము.కాబట్టి అసలు విదేశాలలో తియ్యాల్సిన అవసరం ఏమిటి అన్ని కోట్లు ఖర్చు పెట్టి?పోనీ ఈ రెండు తరగతులకీ చెందని హీరోలకి అసలు పాటెందుకు? పెట్టినా ఇండియాలో తియ్యచ్చు కదా.

ఈ మధ్య విలన్లు కూడా కాస్ట్లీ అయిపోయారు. కొంతమందయితే హెలికాప్టర్ లో నుండే దిగుతారు. మొదటి నుండీ చివర్లో హీరో చేతిలో అంతమయ్యేవరకూ హెలికాప్టరే ఈయనగారికి.ఇంకాస్త ఈయన ఖరీదైన లైఫ్ స్టైల్ చూపించాలంటే విదేశీ హోటల్ పూల్ లో అందరూ స్విం వేర్ లో ఉంటే ఈయన మాత్రం సూటూ బూటూ వేసుకుని సిగార్ కాలుస్తూ విదేశీ భామాల నడుమ ఉంటాడు.

పాపం చివర్లో వచ్చే పోలీసుల విషయం లోనూ వివక్షే. హీరో గారు విదేశం వెళ్ళి విలన్ని చంపుతారు కాబట్టి విదేశీ పోలీసులు వచ్చి విలన్ని మాత్రం తీసుకెళతారు.

అదే తొడ కొట్టీ మెడలు విరగ్గొట్టి విలన్ లని లోకల్ గా చంపితే మాత్రం ఇంతకుముందు విజిల్ ఊదుకుంటూ వచ్చి విలన్ లని వ్యాను లో ఎక్కించుకెళ్ళే పోలీసులే కనపడరు.

హీరో గారు పోలీసయితే తప్ప చివర్లో పోలీసు ఊసే ఉండట్లేదు.

కామెడీ ట్రాక్ ఉండాలి కాబట్టి ఏ మాత్రం నవ్వు రాని స్టార్ కమెడియన్ రొటీన్ కామెడీ. ఈయన గారు చొంగ కార్చుకుంటూ నాకు వయసయిపోయి బట్తతల వచ్చేసింది,పెళ్ళెప్పుడవుతుందీ అంటూ చేసే వెకిలి కామెడీ లేదా Slap stick కామెడీ. ఇంతే కదా.

సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండీ ప్రెస్ మీట్లు,ఆ తరువాత ఆడియో ఫంక్షన్,రెండ్రోజుల్లో ప్లాటినం డిస్క్ వేడుకలు,హీరో గారి టూర్లు, ఆ తరువాత టీవీ పబ్లిసిటీ కోసం డబ్బులు అలా వెదజల్లే నిర్మాతలు దొరకబట్టి చాలా మంది తెలుగు సినిమా డైరెక్టర్లు తమ సినిమాలకి కావాల్సిన సామాగ్రి సమకూర్చుకుని సినిమా మొదలెడుతున్నారు.

ఇవే కదా కావాల్సినవి

1)కాసిని డైలాగులు.హీరో గారి వంశాన్ని బట్టి మార్పులూ చేర్పులూ

2)ఓ హీరోయిన్ను(కష్టపడి ఈవిడకి డైలాగులు అవీ రాయక్కర్లేదు)

3)కామెడీ,స్టార్ కమెడియన్లదొకటి,టీచర్లో మీదో తల్లి తండ్రుల మీదో ఇంకొకటి

4)"హై ఓల్టేజ్"( నా భాషలో స్క్రీన్ ఎర్రగా అవ్వడం అని) ఫైట్లు,విదేశీ డాక్ యార్డ్లలో విలన్నిపరిగెత్తించి స్పీడ్ బోట్లో చేజ్ చేసి చంపడం.

5)ఓ వెకిలి ఐటెం సాంగ్

పాపం ఇవన్నీ సమకూర్చుకునే హడావిడి హీరో గారి డేట్లు అయిపోతాయనే తొందరలో "కధ" ని మర్చిపోతున్నారు.

ఎంత డైరెట్రయినా ఒకప్పుడు ప్రేక్షకుడే కాబట్టి చివర్లో వాళ్ళకి తెలుస్తుంది అసలు ingredient మర్చిపోయి వంటకం చేసేసామని.వాళ్ళు మర్చిపోవడం కాదు కానీ ఇంక మనకి మొదలన్నమాట.

నేను ఈ హీరో గారి ని అభిమానిస్తూ పెరిగాను ఇప్పుడు ఈయనని/వీరి వంశాంకురాన్ని డైరెక్ట్ చెయ్యగలిగా అని డైరెక్టరు గద్గద స్వరంతో ఆడియో వేడుకలో హీరో గారి కాళ్ళ మీద పడిపోవడంతో మొదలవుతుంది అసలు పబ్లిసిటీ అంతా.

కాస్త తెలివైన నిర్మాత అయితే "కధ బాగాలేకపోయినా పట్టు సడలని స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని కట్టి పడెస్తుంది" అని రివ్యూ రాయించెయ్యచ్చు

కధ,పబ్లిసిటీ విలోమానుపాతం లో ఉంటాయనిపిస్తూ ఉంటుంది చాలా మటుక్కు.

ఒక హాయి తెలుగు సినిమా ఎప్పుడు చూస్తానో ఏమిటో .

ఇప్పటి పిల్లలు పెద్దవాళ్ళయ్యాకా వాళ్లకి చూపించటానికి అలనాటి ఆణిముత్యాలు, మధ్యలో వచ్చిన "సంతోషం" లాంటి ఓ ఐదారు సినిమాలు తప్ప అసలు క్లీన్ పిక్చర్స్ ఏవి??

నెక్స్ట్ జనరేషన్ కి కూడా కామెడీ కి జంధ్యాల సినిమాలే దిక్కా?