Sunday, January 1, 2012

2012 నా మొదటి సినిమా- రాజన్న

అసలు ఈ లాంగ్ వీకెండు లో ఎక్కడకీ కదలకూడదని నిర్ణయించేసుకుని శనివారం అమలుచేసేసాను. ఆదివారం కూడా విజయవంతంగా ముగించెయ్యబోతున్న నాకు నాలుగున్నరి కి వచ్చిన ఓ ఎసెమ్మెస్సు అడ్డుపుల్లేసింది. ఆ మెసేజ్ సారాంశం సాయంత్రం ఆరింటికి "రాజన్న" సినిమా కి వెళ్తున్నాము అని.


వాళ్ళు వెళ్తోంటే నాకు చెప్పారు అంటేనే అర్ధం అవుతోంది కదా, చీజ్ వేసి జెర్రీ ని టాం కలుగులోంచి బయటకి లాగినట్లు నాకు "రాజన్న" ని ఎరగా వేసారు ఎస్సెమెస్సు రూపం లో అని .


ఎక్కడ ఏమిటీ అని ఓ నాలుగైదు ఎసెమెస్సులు పంపానే కానీ మనసు లో రాజన్నని చూడాలనే ఉంది. పైగా 3.5 రేటింగు ఇచ్చారాయే దానికి. "దూకుడు" కి కూడా అంత ఇవ్వకుండా ఈ సినిమా కి ఇచ్చారంటే "లగాన్" తరహా లో కాకపోయినా దానికి దగ్గర్లో ఉండచ్చేమో అనుకుని బయలుదేరాను.

ధియేటర్ లో ఎక్కడా పోస్టర్ లేదు. అంతకుముందొచ్చిన "డర్టీ పిక్చర్" రాబోతున్న "ప్లేయర్స్","అగ్నీపధ్" మొదలైన పోస్టర్లున్నాయే కానీ ఎక్కడా చడీ చప్పుడు లేడు మన రాజన్న. పోనీ జనమున్నారా అంటే అదీ లేదు. ఆరవుతోందే కానీ మేము నలుగురము తప్ప ఎవ్వరూ కనపడట్లేదు. "రాజన్న" సినిమా కే తీసుకున్నావా అని అడిగాను టికెట్ట్లు కొన్న ఫ్రెండు ని. నేను కొన్నప్పుడు ఇంకో నాలుగైదు సీట్లు ఫిల్ అయ్యాయి అంతే అని కబురు చల్లగా చెప్పాడు.

లోపలకి వెళ్ళాము.ఓ 15 మంది కూడా లేరు.

అనారా(అక్కినేని నాగేశ్వర రావు) వ్యాఖ్యానంతో సినిమా మొదలు.సినిమా చూస్తున్నంత సేపూ ఆర్ నారాయణమూర్తి సినిమా మల్టీప్లెక్సు లో చూసినట్లుంది.

ఒక వారసుడు కంటి చూపుతో చంపెస్తే రాజన్న తన పాటలతో చంపేసాడు.

దాదాపు ప్రతీ 5-10 నిమిషాలకీ ఓ చిన్న పాట పెట్టి బుర్ర కధ ని తలపించారు.

చిత్రీకరణ చాలావరకూ క్రుతకం గా అనిపించింది. ఎంచితే లోటు పాట్లు బోలెడు. ఆ అమ్మాయి కాలినడకన ఢిల్లీ వెళ్లడం దగ్గర నుండీ నెహ్రూ కి తెలుగు అర్ధమయ్యే వరకు.

అలవోకగా బ్రిటీష్ సేనలని చీల్చి చెండాడెస్తున్న రాజన్న ని చూస్తోంటే "లెక్క ఎక్కువైనా ఫరవాలేదు,తక్కువ కాకుండా చూడు షేర్ ఖాన్" డైలాగ్ గుర్తొచ్చింది.

నాగార్జున సహచరులుగా నటించిన వారు బాగున్నారు నాగార్జున కంటే కూడా.

ఈ సినిమా కి 3.5 రేటింగిచ్చిన వెబ్సైటు వారు "క్షేత్రం" సినిమా ని అందులో జగపతిబాబు ని ఏకి పారేసారు దారుణం గా.

అలాంటి వారికి "రాజన్న" నచ్చడం మాత్రం వింతే. ఎంత డబ్బులిస్తే మాత్రం ఇంత వాస్తవ విరుద్ధం గా రివ్యూ రాస్తారా అని ఆశ్చర్యపోయాను.

కాస్త "కళా పోసణ" ఉన్న డైరెట్టర్లు ఎవరైనా చూస్తే వారి తరువాతి సినిమా కి అవసరమైన మాంత్రికుడి పాత్ర కి "రాజన్న" ని ఎన్నుకోవడం మాత్రం ఖాయం.

కమెడియన్స్ ని అనవసరం గా ఇరికించకపోవడం, ఐటం సాంగు లేకపోవడం,షరా మామూలుగా మన్మధుడి కి ఇద్దరు హీరోయిన్లని పెట్టకపోవడం చాలా పెద్ద ప్లస్ ఈ సినిమా చూసే నా లాంటి వాళ్ళకి.

"బరత మాత" తో చెవులని తుప్పు పట్టించేసిన రాజన్న తన హిందీ డైలాగులతో కమెడియన్స్ ఖర్చు కోసిపారేసాడు. నాలుగైదు హిందీ డైలాగులకే ఇలా ఉంటే ఏకంగా నాలుగ్గంటలపాటు ఈ "బాబు" హిందీ సినిమా ని ఎలా భరించరో అప్పుడెప్పుడో అనిపించింది.


చివర్లో "నెహ్రూ" గా ఎవరొస్తారో అని ఊహించుకున్నాము ఎవరికి వారే. ఈ సినిమా లో నాకు కాస్త నచ్చినవి స్నేహ,ఆ చిన్న పిల్ల.

3.5 ని ద్రుష్టి లో పెట్టుకోకుండా చూసినా ఈ సినిమా నచ్చేది కాదు నాకు, అది ద్రుష్టి లో పెట్టుకుని ఇంకాస్త భంగపడ్డాను. మన బ్లాగర్ల రివ్యూ చదవాల్సింది వెళ్ళేముందు.

ఎవ్వరూ రాయలేదా నేను మిస్స్ అయ్యానా ఈ రివ్యూ ని బ్లాగుల్లో?

తన స్టార్ డం ని పక్కన బెట్టి ఇలాంటి సినిమా చేసిన నాగార్జున అభినందనీయుడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదని ఆగిపోకుండా ఇంకా కొత్త కధలతో ప్రయోగాలు చేస్తే బాగుంటుంది. తన వయసుకి తగ్గ హుందాతనమూ వస్తుంది.

ఇంకా ఇద్దరమ్మాయిలతో డ్యూయెట్లు పాడి వయసైపోయాకా రామారావు,నాగేశ్వరరావు తమ సినిమాల్లో భయంకరమైన విగ్గు, తోసుకొస్స్తున్న పొట్టతో "అమ్మా,నేను బీయే పాసయ్యాను" అంటే చూడటానికి ఇబ్బంది పడ్డ రోజులు గుర్తుకు తీసుకురాడని చిన్న ఆశ.