Saturday, December 29, 2012

నిరసనఇంకో ఆడపిల్ల బలైపోయింది. మన ఉద్యమకారులకి ఆయుధం దొరికింది తమ "ప్రతాపం" మళ్ళీ చూపించడానికి. ఆ అమ్మాయి అంత్యక్రియలు అయ్యేవరకు నిరసనలు, ఆందోళనలతో మాస్ హిస్టీరియా ఇచ్చిన కిక్కు తో వీరావేశంతో ప్లకార్డులు ప్రదర్సిస్తారు.

ఎలాగూ చేతిలో పనే కాబట్టి ఫేస్ బుక్ లో మెసేజిలు,డిస్ప్లే పిక్చర్ గా ఓ నల్ల వ్రుత్తం పెట్టేసుకుంటారు. అన్నా హజారే ఉద్యమం అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఫేస్ బుక్ లో.

డిశంబరు 31 సాయంత్రానికి అంతా గపుచుప్ సాంబార్ బుడ్డి.వీరావేశంతో నిరసన తెలిపే వాళ్ళలో ఎంత మంది అబ్బాయిలు "నిజం" గా అమ్మాయిలని ఏడిపించకుండా ఉంటారు ఆ తరువాత? ఎంత మంది అమ్మాయిలు డిస్కోలకీ పబ్బులకీ వెళ్ళడం ఆపెస్తారు?

ఈ సంఘటన తరువాత కొంతమంది ఫేస్ బుక్ లో ఆ సంఘటనని, ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ గాయాలయ్యాయో ఫోటో లతో(ఫేక్ వే లెండి)సహా వివరిస్తోంటే ఒక ఆడపిల్ల కి ఇచ్చే గౌరవం ఇదేనా అనిపించింది. ఆ అమ్మాయి బతికున్నప్పుడే ఎన్ని సార్లు చంపేసారో మన వాళ్ళు ఫేస్ బుక్కు, ట్విట్టర్ ద్వారా.

ఈ నిరసనలు జరుగుతున్నపుడు నాయకులు పరామర్శించటానికి వస్తే అడ్దుకుంటారు రాకపోతే రాలేదంటారు. అసలు వీళ్ళకి ఏమి కావాలి? సరే ఆ ఆరుగురినీ ఉరి తీద్దాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు అని వీళ్ళు హామీ ఇస్తారా??

నేను ఆ నిందితులని సమర్ధించట్లేదు.వాళ్ళు చేసినది హేయమైన చర్యే.ఉన్న చట్టాలు పక్కా గా అమలు చేయండి,అవసరమయితే శిక్షలు కఠినతరం చెయ్యమనాలి.మూల కారణాన్ని ఇప్పుడైనా అన్వేషించాలి.

కానీ ఈ నిరసన కారుల్లో ఆవేశమే తప్ప అసలు మూల కారణమో లేదా ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించో ఒక్కరూ మాట్లాడరేమి?? ఇప్పటి మనం ఉన్న సమాజ పరిస్థితులని చూస్తే ఇలాంటి సంఘటనలు అస్సలు జరగకుండా చర్యలు తీసుకోమనడం సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసు.

అడ్డొచ్చిన పోలీసులని కొట్టి, బ్యారికేడ్లని తొలగించుకుని అలా గుడ్డెద్దుల్లాగ పోవడమేనా వీళ్ళకి నిరసన అంటే అనిపిస్తోంది. ఒకరోజు టీవీ లో ఓ కర్ర పట్టుకుని ఓ వాహన అద్దాలని కసితీరా కొడుతున్న యువత ని చూస్తే జాలేసింది. ఆ నిందితులు చేసినది ముమ్మాటికీ క్షమించరాని నేరమే..మరి వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ఇంత ఉద్రిక పరిస్థితులు స్రుష్టించాల్సిన అవసరం ఉందా??

ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఈ కేసులో నిందితుల్లో పెద్ద తలకాయల పిల్లలు ఉంటే కూడా ఇలాగే నిరసన చేసేవాళ్ళా?? మన మీడియా ఇంత కవరేజ్ ఇచ్చేదా?? ఈ ఆందోళన సర్కారు ని కదిలించింది అనడం లో సందేహం లేదు కానీ నిరసన తెలిపిన పద్ధతి మాత్రం సరైనది కాదు.

"మహిళా" నాయకురాళ్ళమని చెప్పుకుని లేచిన దగ్గరనుండీ తమ వాగ్ధాటి పదును తగ్గకుండా చూసుకోవడానికా అన్నట్లు చర్చల్లో రెచ్చిపోయే మహిళలని చూస్తే జాలేస్తోంది.ఈ ఘటన కి నిరసన గా "అర్ధరాత్రి మార్చ్" నిర్వహిస్తారుట మహిళలతో. అసలు వీళ్ళ బుర్రల్లోకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి రా దేవుడా అనిపిస్తోంది.

నా ఇష్టం వచ్చినట్లు నేను బట్టలు వేసుకుని తిరుగుతాను , వాళ్ళని మా జోలికి రావద్దని చెప్పండి అనే అమ్మాయిలని చూస్తే ఏమనాలో అర్ధం కావట్లేదు. సరే మీరడిగినట్లే రక్షణ ఇస్తాము అమ్మా...మీ మీద ఎవ్వరి చేతులూ పడనీయము రెచ్చగొట్టే బట్టలు వేసుకుని ఓ సీ క్లాస్ సినిమా హాలు కి వెళ్ళమ్మా అంటే వెళ్తారా ఆ ఆడపిల్లలు??

బట్టలు ఒక్కటే ఇలాంటి సంఘటనలని ప్రేరేపిస్తాయి అనడం కూడా సమంజసం కాదు. అవి "కూడా" కారణమవుతాయేమో అంతే. నిండుగా కాటన్ చూడిదార్ వేసుకుని అమ్మాయి నడచి వెళ్తోంటే కూదా కావాలని వచ్చి ఢీకొట్టే మగాళ్ళకి కొదవలేదు.

సంతాప సందేశాలు తమ ట్విట్టర్,ఫేస్బుక్ లో పోస్ట్ చేసే హీరోయిన్లలో ఎంత మంది తమ వంతు కర్తవ్యం గా సినిమాల్లో రెచ్చగొట్టే ప్రదర్శనలని ఆపెస్తామని నిర్ణయించుకుంటారు?

కర్ణుడి చావు కి కారణాలనేకం అన్నట్లు అసలు కొంత మంది మగ వారు ఇలా మారడానికి ఎన్నో కారణాలు. ఈ కేసు నిందితుల్లో ఓ మైనర్ బాలుడుండటం చూస్తే ఎటు పోతున్నాము మనము అనిపించక మానదు.

మగ పిల్ల వాడు పుట్టడమే తాము చేసుకున్న అద్రుష్టమని భావించే మూర్ఖ శిఖామణులు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. ఆ పిల్లవాడి తల్లి, తండ్రి,బామ్మ/అమ్మమ్మ ఎవరైనా కావచ్చు ఇలా అనుకునే వాళ్ళు.

"వాడు మగాడు" అనే మాట వాడికి కవచం లా పని చేసి చిన్నప్పుడు, టీనేజీ లో వాడు చేసే చిన్నా చితకా తప్పులని కాస్తుంది.తన కొడుకు పదో తరగతి పాసవ్వగానే ఆ కుర్రాడికి ఆ రోజుల్లోనే అత్యంత ఖరీదైన బైక్ కొనిచ్చి పిల్లాడు సకల దుర్గుణ సంపన్నుడయ్యాకా తీరిగ్గా విచారించే తల్లిని చూస్తే జాలేసింది.

అసలు ఆవిడ పుత్ర వాత్సల్యానికి పరాకాష్ట ఏమిటి అంటే ఇప్పటికీ తన కొడుకు బయట పిచ్చి తిరుగుళ్ళు తిరిగొచ్చి ఇంటికి చేరగానే,"నానా అలా సందులో నుండి వెళ్ళి తల స్నానం చేసి రా" అని చెప్పే ఆ తల్లి ని ఏమనాలి??

ఆడపిల్లల గురించి తీసుకున్న జాగ్రత్త మనము మగ పిల్లల విషయం లో ఎందుకు తీసుకోవట్లేదు? వాడేమీ తప్పు చెయ్యడని ధీమానా, ఏమి చేసినా చెల్లుతుంది లే అనా?? ఇలా పెరిగిన పిల్లవాడు 18-20 యేళ్ళు వచ్చేసరికి ఎలా తయారవుతాడు?

మన పిల్లాడు డాక్టరో, ఇంజనీరో అయిపోయి డబ్బులు సంపాదించెయ్యాలి అనే ఒకే ఒక్క గోల్ తో ఆ ట్యూషను ఈ కోచింగు అంటూ వేలకి వేలు ఖర్చుపెడుతున్నాము. మంచి నడవడి,విలువలు నేర్చుకోవడం కోసం అసలు మన నోటి మాటనైనా వెచ్చిస్తున్నామా?

సరే ఇవేవీ లేకుండా పిల్లాడిని బాగానే పెంచారు అనుకున్నాము,అంతటితో వాడు మంచి పౌరుడయిపోటాడా? ఖచ్చితం గా కాదు. టీవీ,సినిమాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి వీరిని రెచ్చగొట్టడానికి. మనము చూడటం మానెస్తే తప్ప తీసేవాళ్ళు ఆపరు,దర్శకులని మారండి అని చెప్పడం చెవిటి వాడి ముందు శంఖమూదినట్లే.

ఒకప్పుడు సినిమాల్లోనే హీరోయిన్లు అలా చాలీ చాలని బట్టల్తో కనడే వారు. ఇప్పుడు టీవీలు, ఇంటర్నెట్ వాడకం పుణ్యమా అని ఎక్కడ చూసినా రెచ్చగొట్టే భంగిమల్లో అమ్మాయిలు. అసలు టీనేజీ కుర్రకారు ఎంత ఉద్రేకపడతారు ఇలాంటివి చూస్తే?ఎవరికి కావాలండీ సమాజం ఎటు పోతే.మనం తయారు చేసే ప్రోడక్ట్ ఎలాగోలా జనాన్ని రీచ్ అయ్యి సేల్ అవుతోందా లేదా ఇదే ముఖ్యం.

డ్యాన్స్ పోటీల్లో చాలీ చాలని బట్టలతో డ్యాన్సులేసే ఆడ పిల్లలని చూస్తే వీరికీ పత్రికల్లో అప్పుడప్పుడు కనిపించే "కన్న పిల్లల్ని అమ్మకానికి పెట్టిన తండ్రి" లాంటి వారికీ తేడా ఏమన్నా ఉందా?? 10-12 ఏళ్ళ వయసులో అలా ఆడపిల్లలతో కలిసి దగ్గర దగ్గరగా మసిలిన మగడపిల్లాడి పరిస్థితి ఏమిటో తల్లి తండ్రులు కానీ, నిర్వాహకులు కానీ ఎవరైనా ఆలోచిస్తారా??

ఆడపిల్లల విషయానికి వద్దాము.వీరి తప్పు ఉండట్లేదా అంటే వీరిదీ ఉంటోంది.స్నేహితుడితో ఏకాంతం కోసమని జన సమూహానికి దూరం గా వెళ్ళి ఆకతాయిల చేతిలో భంగ పడ్డ కేసులు ఎన్ని చదవలేదు మనము? Dr.Alban's It's my Life వినడానికి మాత్రమేకానీ నిజ జీవితం లో ఇలా కుదరదు అని వీళ్ళకి ఎలా చెప్పాలి??ఇన్ని సంఘటనలు జరిగిన/జరుగుతున్న సమాజం లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనీసం కొన్ని సంఘటనలైనా నివారించగలము అని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో?

అబ్రకదబ్ర గారు ఈరోజు తన బ్లాగు లో చెప్పిన ఒక మాట బాగా నచ్చింది నాకు.
>>నేనెలాంటి బట్టలేసుకోవాలో నువ్వు చెప్పక్కర్లేదు’ తరహా ప్లకార్డులు పట్టుకునే హైసొసైటీ అమ్మాయిలు హాయిగా కార్లలో తిరుగుతూ కులాసాగా బతికేస్తుంటారు. వాళ్లు రేపెట్టే వాంఛలకి రెచ్చిపోయే చిత్తకార్తె కుక్కల పాలిట పడేదేమో బస్సుల్లో తిరిగే ఇతరులు.

ఇది ముమ్మాటికీ నిజం.


ఇక చట్టాలు వాటి అమలు దారుల గురించి మాట్లాడుకుందాము ఇలాంటి famous కేసుల్లో తప్ప మిగతా వాటికి ఫైళ్ళు ఎందుకు కదలవు??

మన దగ్గర కింది స్థాయి పోలీసులు సమర్ధం గా తమ డ్యూటీ నిర్వహిస్తే సగం నేరాలు అదుపులో ఉంటాయి. కానీ నిర్వర్తించాలి అంటే ఆర్ధిక అవసరాలు గుర్తొస్తాయి. అంతే..డ్యూటీ అటకెక్కుతుంది.వీరు సరిగ్గా పని చెయ్యాలి అంటే వీరి జీత భత్యాలు పెంచాలి.

అవి పెంచాలి అంటే అమాత్యులకి చిత్తశుద్ధి ఉండాలి అది జరగాలి అంటే మనం అలాంటి వారిని ఎన్నుకోవాలి..అలా ఎన్నుకోవాలి అంటే మనము ప్రలోభాలకి లొంగకూడదు.మనము లొంగకూడదు అంటే ఏమి చెయ్యాలి??

రాజుగారు ఏడుగురి కొడుకుల కధలో చేప ఎందుకు ఎండ లేదో మనకి సమాధానం దొరుకుతుంది కానీ ఇది మాత్రం సమాధానం లేని ప్రశ్న..

రైలా


ఓ హడావిడి వీక్ డే ఉదయం చామనఛాయ లో,సన్నగా పొడుగ్గా ఉన్న ఒక మనిషి చిన్న బ్యాగుతో ఇంట్లోకి అడుగుపెట్టారు.
ఆయన మా మామయ్యగారి ఫ్రెండు. కనీసం ముఖ పరిచయం కూడా లేదు ఆయనతో. బాగున్నారండీ అని పలకరించి మంచినీళ్ళు ఇవ్వడానికి లోపలకి వెళ్ళాను కాస్త అసహనంగానే.

ఎవరో తెలీని మూడో మనిషి మనతో ఓ పక్షం రోజులు ఉంటాడు అంటే కలిగే అసహనం అది. నేను ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసు అందుకుని ఏమీ అనుకోకండమ్మా,మీరు తెలీకపోయినా ఇలా వచ్చేసాను అన్నారాయన. "ఫరవాలేదండీ, మాకేమి ఇబ్బంది" అని మొహమాటానికి ఓ మాట అనేసాను అసంకల్పితంగా.

"అసలు నాకు సింగపూరు,మలేషియా చూడాలి అని ఎప్పటినుండో కోరిక.తీరా నేను, మా చుట్టాలతను టిక్కెట్టు కొన్నాకా అనేక అవాంతరాలు. మా చుట్టాల అమ్మాయి ఇక్కడే ఉండేది, సరిగ్గా నేను వద్దాము అనుకునేసరికి వాళ్ళు ఇండియా వచ్చేసారు. వాళ్ళు లేకపోతే నాకు 15 రోజులు హోటల్లో ఉండే స్తోమత లేదు, మన వాళ్ళు లేకపోతే నేను రాను అని మా బంధువు తన టిక్కెట్టు వదిలేసుకున్నాడు.కానీ అలా డబ్బులు వ్రుధా పోతుంటే నేను చూడలేను, మరలా కొనుక్కునే స్తోమత కూడా నాకు లేదు.వెళ్ళకపోతే టిక్కెట్టు డబ్బులు తిరిగి రావు కదా(బడ్జెట్ ఎయిర్ లైన్స్ టిక్కెట్టు)అనుకుని బాధ పడుతోంటే మీ మామయ్యగారేమో మా అబ్బాయి ఇంటికి వెళ్ళండీ అని, మీ వారేమో మీరొక్కళ్ళు అయితే నాకు ఇబ్బంది లేదు వచ్చెయ్యండి అనడంతో వచ్చేసాను" అన్నారు. "ఫరవాలేదండీ" అని ఇంకోసారి అందంగా అబద్ధమాడేసాను.

ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు పడుకుని లేచారు.మా అబ్బాయిని తీసుకురావడానికి స్కూలు కి వెళుతోంటే ఆయన కూడా వచ్చారు. ఇక్కడ రోడ్లు అవీ ఎలా దాటాలో కాస్త చూపించమ్మా అన్నారు.పెడస్ట్రియన్ సిగ్నల్ ని ఎలా ఉపయోగించాలో చూపించాను.

ఆరోజు రాత్రి కబుర్లు చెప్తూ తాను రోటరీ క్లబ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటాననీ,రోటరీ క్లబ్ కార్యక్రమం "రైలా"(RYLA) ని విజయవంతంగా చేయడంతో "రైలా" తన ఇంటి పేరు అయిపోయిందని చెప్పారు. తాను రోటరీ క్లబ్ కార్యక్రమాల వల్ల మన దేశం లో చాలా ప్రదేశాలు చూసానని చెప్పారు.

ఆ...ఏముందిలే !!ఈయనలా గొప్పలు చెప్పేవాళ్ళని ఎంత మందిని చూడలేదు అని తరువాత నేను మా వారు అనుకున్నాము.అది మొదలు ఆయన మాకు "రైలా" అయిపోయారు. ఆయన సమక్షం లో అంకుల్ అని పిలిచినా ఆయన పరోక్షం లో ఆయన మాకు "రైలా" నే.

ఆ మరునాడు ఆయనని సింగపూర్ సైట్ సీయింగు కి తీసుకెళ్ళాను.రైలు మ్యాప్ చూపించి ఎలా వెళ్ళాలో వివరంగా చెప్పాను. అసలు చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టారాయన సింగపూరు వాణిజ్య భవనాల సముదాయాన్ని చూసి. అసలు నేను అనుకోలేదమ్మా ఇలా నిజంగా చూస్తానని చాలా థ్యాంక్స్ అని ఎన్ని సార్లు చెప్పారో. అయ్యో నేనేమి చేసానండీ, మీ టిక్కెట్టు కొనుక్కుని మీరు వచ్చారు అంటే క్యాన్సిల్ అవ్వాల్సిన ప్రోగ్రాం ఇది కానీ మీ వల్ల ఇక్కడకి వచ్చాను అని పదే పదే అంటూనే ఉన్నారు.

ఆరోజు రాత్రి ఇంటికి చేరాకా మా వారితో కూడా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఏమిటీ ఈయనకి ఇంత సంబరం అనిపించింది మాకు.

అంకుల్,రోజూ మీతో నేను బయటకి రావడం కుదరదు ఎక్కడకి ఎలా వెళ్ళాలో మ్యాప్ లో చూపించి రాసి ఇస్తాను,ఇక్కడ భయం లేదు మీరు వెళ్ళండి ,ఎక్కడన్నా ఇబ్బంది అయితే ఫోను చెయ్యండి అని చెప్పాము. సరే అన్నారాయన. అసలు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలేమిటి అని అడిగి ఒక లిస్టు రాసుకున్నారు. 15 రోజులు ఉంటాను కదమ్మా అన్నీ సావకాశం గా చూడచ్చు అని రోజుకో ప్రదేశానికి వెళ్ళేటట్లు పెట్టుకున్నారు.

తాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి టూరిస్ట్ ప్రదేశాలే కాకుండా ప్రజల జీవన శైలి ని కూడా గమనిస్తానని,మ్యూజియం లు అవీ అంటే ఆసక్తి అని కూడా చెప్పారు.

మరునాటి నుండీ ఆయన తన టూర్ ప్రణాళిక ని అమలు చెయ్యడం మొదలుపెట్టారు.పొద్దున్నే లేచి చిన్న కప్పుడు టీ తాగి 2 ఇడ్లీలో 2 దోశలో తినేవారు.అంకుల్ ఇంకా తినండీ అంటే వద్దమ్మా, ఈ వయసులో ఎక్కువ తిని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకు అని సున్నితంగా తిరస్కరించేవారు. భోజనమూ అంతే. వెరీ లిమిటెడ్.భోజనం అయ్యాకా సైట్ సీయింగ్ కి బయలుదేరేవారు, రూట్ మ్యాపు, నేను రాసిచ్చిన డైరెక్షన్స్ కాగితం, ఫోను, కెమేరా పట్టుకుని.

ఇక్కడ ఆకలేస్తే బయట మీరు తినేవి ఏవీ దొరకవు అని బలవంతం గా ఇస్తే కాసిని జంతికలో(అవీ ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడ మాకు చేసిపంపినవే)ఓ నాలుగు బిస్కట్లో పట్టుకుని బయలుదేరేవారు.

చేరగానే ఫోను చేసేవారు, అమ్మా చేరాను అంటూ. ఒకోసారి మధ్యలో కూడా ఫోను చేసి తానెంత ఎంజాయ్ చేస్తున్నాదీ వివరించి చెప్పేవారు. రాత్రి ఇంటికొచ్చి ఆయన చూసిన ప్రదేశం లో తనకు నచ్చినవీ, తను గమనించిన విషయాలని చక్కగా చెప్పేవారు.

ఓ నాలుగు రోజులయ్యేసరికి మేమిద్దరమూ ఆయన కబుర్లు వినడానికి ఆసక్తి గా ఎదురుచూసే వాళ్ళము.మొదట్లో ఉన్న అసహనం స్థానే ఆయనంటే గౌరవం పెరగసాగింది.

విడి రోజుల్లో టైం అయిపోయింది అని పరిగెత్తే మా వారు ఆఫీసుకి వెళ్ళేముందు కొంతసేపు మాట్లాడి మరీ వెళ్ళేవారు

ఇండియా ఫోను చెయ్యండి అంటే వాళ్ళావిడకి ఫోను చేసి నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగి ఆయన ఇక్కడ ఎంత సంతోషం గా ఉన్నదీ గడ గడా చెప్పి ఓ రెండు మూడు నిమిషాల్లో పెట్టేసేవారు. మేము బలవంతం చేసి నంబర్ కలిపి ఇస్తే కూడా వాళ్ళ పిల్లలతో ఓ నాలుగు ముక్కలు మాట్లాడి పెట్టేసేవారు, ఎందుకమ్మా ఫోను దండగ అక్కడకి వెళ్ళాకా కలుస్తాను కదా, వాళ్ళమ్మకి తెలుస్తోంది కదా నా క్షేమ సమాచారం అనేవారు.

ఒకరోజు ఆయన ఏదో షో కి వెళ్ళి బయటకి వచ్చేసరికి 9 అయిపోయింది. అంకుల్ క్యాబ్ బుక్ చేస్తాను దానిలో వచ్చెయ్యండి అంటే ఏమీ కాదమ్మా క్యాబ్ అవసరం ఏముంది, నేను వచ్చి ఏమి చెయ్యాలి అని మెల్లిగా రైల్లో ఇంటికి చేరేసరికి పది దాటింది. వస్తూనే ఇంకా మెలుకువగా ఉన్న మా వారిని చూసి అదేమిటి బాబూ నా కోసం ఉన్నావా పొద్దున్నే వెళ్లాలి కదా, చాలా సారీ అన్నారు.ఆయన భోంచేసి వచ్చేవరకు ఉండి ఆయన చెప్పిన కబుర్లు విన్న తరువాత గానీ మా వారు పడుకోలేదంటే చూడండి మేను ఆయనకి ఎలా స్లో గా కనెక్ట్ అయిపోయామో.

ఒక వారం తరువాత ఆయన అడిగారు మలేషియా వెళ్ళాలంటే ఎంత ఖర్చవుతుంది అని. ఖర్చు గురించి ఆలోచించకండి మేము అరేంజ్ చేస్తాము అంటే "మీరు ఇప్పుడు ఇస్తారమ్మా, రేపు నేను ఊరెళ్ళాకా మీకు మరలా పంపద్దూ,ఎన్నో సంవత్సరాల నుండీ అనుకుంటున్న కల ఇది, ఇక్కడకి రావాలి అని.ఉద్యోగం లో ఉండగా పిల్లలూ బాధ్యతలతో గడచిపోయింది.రిటైర్ అయ్యాకా డబ్బులు రాగానే మొదట నేను ఈ ట్రిప్ కోసం ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఖర్చు పెట్టెస్తే రేపొద్దున్న మా ఇద్దరి ఆరోగ్యావసరాలకి ఉండొద్దూ" అన్నారు.

"అధ్భుతం" ఆయన ప్లానింగ్ అనిపించింది.

ఒక్కరోజు మలేషియా వెళ్ళి ముఖ్యమైనవి చూసి వచ్చెయ్యచ్చుపెద్దగా ఖర్చవ్వదు అంటే సరే అన్నారు. టిక్కెట్టు బుక్ చేసి, కౌలాలంపూర్ లో ఉన్న మా ఫ్రెండు నంబర్ ఇచ్చాము అవసరమైతే ఫోను చెయ్యమని. హాయిగా ఆయన ఒక్కరే మలేషియా వెళ్ళి అన్నీ చూసుకుని మూడోనాటి పొద్దున్న కల్లా తిరిగి వచ్చారు. రాగానే ఆయన నిజంగా కన్నీళ్ళు పెట్టేసుకున్నారు నా కల పూర్తిగా నెరవేరింది అంటూ.

చెప్పాను కదా ఆయన రోటరీ క్లబ్ యాక్టివ్ మెంబర్ అని.ఇక్కడ రోటరీ క్లబ్ ఎక్కడుందో కనుక్కోమ్మా అన్నారు. ఆ క్లబ్ కనుక్కోవడం ఇబ్బంది అవుతుందేమో ఆయనకి అనుకుని ఆయనని నేనే తీసుకెళ్ళాను. సింగపూర్ లో కెల్లా ఖరీదైన ప్రాంతం లో ఉంది అది.స్పోర్ట్స్ కార్లు, అత్యాధునికమైన కార్లు అక్కడ ఉండటం చూసి ఇదేదో పెద్ద వాళ్ళ వ్యవహారం లా ఉంది అనుకుని ఆయనని అక్కడ దింపి దగ్గరున్న షాపింగ్ మాల్లో చక్కర్లు కొడుతున్నాను. అరగంట లో వస్తానన్న మనిషి ఇంకా రాడే.ఫోను కూడా చెయ్యలేదు.

ఓ గంటన్నరకి చేసారు తను బయటకి వచ్చాను అని.వస్తూనే తనకి ఇక్కడి క్లబ్ వాళ్ళు ఇచ్చిన ఙాపికని చూపించారు చిన్న పిల్లాడిలా సంబర పడుతూ. ఏమి చేసారు ఇంత సేపు అంటే తాను లోపలకి వెళ్ళాకా ఏదో మీటింగు ప్రారంభం అయ్యింది అని,ఇండియా నుండి వచ్చిన నన్ను రెండు ముక్కలు మాట్లాడమన్నారని. తమ క్లబ్ కార్యకలాపాల గురించి సాధించిన విజయాల గురించి చెప్తోంటే వారు ఆసక్తి గా చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారని,అందరినీ కలిసి పరిచయ కార్యక్రమాలు అవీ అయ్యి బయటకి వచ్చేసరికి లేటయ్యిందన్నారు. వీళ్ళందరినీ కలిసానమ్మా అని చెప్పి ఆయన కి వారిచ్చిన బిజినెస్ కార్డ్స్ చూసిన నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో ఒకాయన సింగపూరు లీడింగ్ బ్యాంకు పెద్ద తలకాయ, ఇంకొకాయన ఏదో ఆస్ట్రేలియా కంపెనీ డైరెక్టరు...

అసలు అంత పెద్దవాళ్ళ ముందు ఏ సెల్ఫ్ గ్రూమింగ్ క్లాసులకి వెళ్ళాడని ఈయన ఎలాంటి బెరుకూ లేకుండా మాట్లాడగలిగాడు?ఓ మధ్య తరగతి కుటుంబరావు లా ఉండే ఈయన లో ఇంత ప్రతిభ దాగుందా అనిపించింది.

రోజూ ఆయనని అడిగేవాళ్ళము అంకుల్ షాపింగ్ ఏమైనా చేస్తారా అని.వద్దనేవారు. వెళ్ళే ముందు మాత్రం నా బడ్జెట్ ఇంత ఉంది మా కొడుకు, కూతురి ఫ్యామిలీ కి ఏమైనా కొందామనుకుంటున్నాము అన్నారు. తన బడ్జెట్లోనే పిల్లలిద్దరి ఫ్యామిలీలకీ బ్యాగులు ఇంకా ఏవో వస్తువులు కొన్నారు.ఆంటీ కి ఏమీ కొనలేదండీ అంటే దానికెందుకమ్మా, నేను ఇక్కడకి వచ్చాను అదే సంతోషం దానికి అంటోంటే మరో అప్పదాసు కనిపించాడు ఆయనలో నాకు.

ఆయన తిరిగి వెళ్ళే రోజు రానే వచ్చింది.ఆయన వెళ్తోంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా అనిపించి నాకే ఆశ్చర్యం వేసింది మొదటి రోజు కనపడ్డ అసహనం ఏమైంది నాలో అని. ఎక్కడికైనా బయటకి వచ్చినప్పుడు ఇంత సంతోషంగా గడపచ్చు అని ఆయనని చూసాకే అనిపించింది.

జీవితం లో ఆయనకున్న త్రుప్తి ని ఆయన మొహం లో ని ప్రశాంతత తెలియచేసేది.

ఇక్కడికొచ్చి దాదాపు రోజూ బయటకి వెళ్తూ కూడా బోరు కొడుతుంది అనేవాళ్ళని చూసాను.పిల్లలు రోజూ బయటకి తీసుకెళ్ళరు కాబట్టి తమకి బోరు అని ఇక్కడకి రావడానికి జంకే వారి గురించి విన్నాను. ఎక్కడకీ ఎవ్వరమూ తీసుకెళ్ళకపోయినా ఒక్కరూ వెళ్ళి ఎంజాయ్ చేసిన మనిషి ని ఈయననే చూసాను.He is the best guest we ever had.

ఇండియా వెళ్ళాకా కూడా ఫోను చేసేవాళ్ళము.వాళ్ళ ఆవిడ తో మాట్లాడాను ఓ రోజు. అంకుల్ చాలా హ్యాపీ అమ్మా తన కోరిక తీరినందుకు అని ఎంతో సంతోషం గా ఆయన సంతోషాన్ని తన సంతోషం గా భావించే ఆవిడ గొంతు వింటే కళ్ళు చెమ్మగిల్లాయి. ఇండియా వెళ్ళి ఆవిడని కలిసినప్పుడు, ఇతరుల వల్ల మాకు తెలిసినది ఏమిటి అంతే ఈయన ఎప్పుడూ బొంగరం లా తిరుగుతూ తోటి వారికి సహాయం చేస్తూ, రోటరీ క్లబ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారని.

సింగపూర్ లో ఆయన చూసిన ప్రదేశాలని ఆవిడ వర్ణించి చెప్తోంటే ఆశ్చర్యమేసింది ఈవిడకి ఇవన్నీ ఎలా తెలిసాయి అని. అంకుల్ కి బయట ఏమీ పని లేకపోతే ఇంట్లోనే ఉండి రోజూ సింగపూరు కబుర్లే నాకు. వినీ వినీ నేను ఇక్కడి నుండే చూసేసా మీ ఊరుని అన్నారు నవ్వుతూ. అంకుల్ ఈసారి అంటీ ని తీసుకుని రండి అంటే తీసుకొస్తానమ్మా వీలు చూసుకుని పాపం దానిని ఎక్క్డకీ తీసుకెళ్ళేదు ఎప్పుడూ అన్నారు.

ఆయన ఇంతలో తన కొడుకు కూతురితో మాట్లాడించారు ఫోను లో. కొత్తవారు ఫోను లో ఏమి మాట్లాడాలి అనుకుంటూ ఫోను తీసుకున్నాను. వాళ్ళ మాటల వల్ల అర్ధమయ్యిందేమిటి అంటే మేమిద్దరము వాళ్ళ నాన్నగారిని చాలా బాగా చూసుకున్నాము, వాళ్ళ నాన్నగారు ఫుల్ హ్యాపీస్. రోజూ రెండు పూటలా కాస్త భోజనం పెట్టాము. ఇంతకుమించి మేమి ఏమీ చెయ్యలెదు. ఓ 20 డాలర్లు పెట్టి కూడా ఎక్కడా మేము ఆయనకి టిక్కెట్టు కొనలేదు.అన్నీ ఆయనే కొనుక్కుని వెళ్ళారు. కానీ మమ్మల్ని ఆయన హీరోల్లాగ చిత్రించటం చూస్తే ఎంత సిగ్గనిపించిందో, ఈ మనిషి కి మా శక్తి కి మించి ఏమి చేసామని ఇలా చెప్తున్నారు మా గురించి అనుకున్నాము.

భోజనానికి రమ్మని ఇద్దరూ ఎంతో పట్టు పట్టారు కానీ పెద్దవారికి ఇబ్బంది ఎందుకు అని ఈ సారి తప్పకుండా వస్తాము అని చెప్పి వచ్చాము. మేము తిరిగి సింగపూరొచ్చిన కొన్నాళ్ళ తరువాత ఫోను చేస్తే తనకి ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో హైదరాబాదు వెళ్ళానని ఇప్పుడంతా బాగానే ఉంది అన్నారు. కానీ మా మామయ్యగారు ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు ఆయనకి వచ్చినది క్యాన్సర్ అనీ, కీమో తీసుకోవడానికి హైదరాబాదు వెళ్ళారని.

వెంటనే ఆయనకి ఫోను చేసాను అంకుల్ ఏమిటి అసలు అంత అనారోగ్యం పాలయ్యి మాటైనా చెప్పలేదు అని.ఏముందమ్మా దీనిలో అని తేలికగా తీసేసారు. మరలా ఇండియా వెళ్ళినప్పుడు ఆయనని చూస్తే కళ్ళ నీళ్ళు ఆపుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది.అసలు మనిషి ఇంట్లో నుండి బయటకి కదలట్లేదుట అనారోగ్యం వల్ల.ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు అనుకున్నాము.

జూన్ లో అనుకుంటా ఫోను చేస్తే నూతి లో నుండి వచ్చినట్లుంది మాట. ఓ రెండు ముక్కలు మాట్లాడి ఇంక సత్తువ లేక ఆవిడకి ఇచ్చేసారు ఫోను. మొన్న దసరాల్లో ఫోను చేస్తే ఆంటీ ఫోను ఎత్తి అస్సలు అంకుల్ లేవట్లేదని చంటి పిల్లల లాగ జావ కలిపి పొద్దున్న సాయంత్రం ఓ నాలుగైదు స్పూన్లు మాత్రం ఇస్తున్నానని వెక్కిళ్ళ మధ్య చెప్తోంటే మాట పెగల్లేదు నాకు.

ఆయన పరిస్థితి క్షీణిస్తోంది అని తెలుసు. కానీ ఫోను చేసే ధైర్యం రావట్లేదు ఏమి వినాల్సి వస్తుందో అని.

మొన్న 24 రాత్రి వాళ్ళబ్బాయి నుండి ఫోను. వాళ్ళ అబ్బాయి ని అని చెప్పగానే అంకుల్ కి మాట్లాడాలి అనిపించిందేమో అన్న చిన్న ఆశ చిగురించింది.

కానీ..ఆయన వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారు ఝాము నిద్రలోనే...

ఆయన శరీరానికి బాధ తప్పింది అనుకోవాలో నలభై ఐదు సంవత్సరాల జీవిత సహచరి ని తలచుకుని బాధపడాలో అర్ధం కాక అలా ఉండిపోయాను చాలా సేపు. ఆంటీనీ పలకరించే ధైర్యం లేదు.
ప్చ్చ్హ్..మరో మిథునం.

Wednesday, June 20, 2012

నమ్మకమీయరా స్వామీ

చిన్నప్పుడు,చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు లెండి తొమ్మిది పదీ తరగతుల్లో అనుకుంటా మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉన్న రోజుల్లో అమ్మ సాయంత్రాలు రుద్రం నమకం పెట్టేది.

అప్పుడు అమ్మ అవి పెడీతే విసుగ్గా అనిపించేది కానీ పెద్దయ్యాకా నచ్చే చిన్నప్పటి బెల్లం కూరలు,ఒడియాల పులుసుల్లాగ ఇది కూడా నచ్చడం మొదలయ్యింది.

రకరకాల గొంతుల్లో ఆ నమకం చమకం వినడానికి ప్రయత్నిచాను కానీ చిన్నప్పటి ఆ గొంతు ఉన్న సీడీ మాత్రం దొరకలేదు.

సరే అని ఓ పదిహేను రోజులక్రితం అనుకుంటా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తోంటే ArRehman-Namakam అని కనపడింది.

అయ్యబాబోయ్ ఈయన ఇవి కూడా పాడేసాడా ఏమిటి?? "వందే..ఏ..ఏ...మాతరం" ని,"మా..ఆ..తెలుగు తల్లి కీ..ఈ..ఈ " అని అరిచేసి ఉంటాడులే అనుకున్నాను.

కానీ నాలో ఏ మూలో దాగున్న రెహ్మాన్ అభిమాని పైకొచ్చి అది వినేట్టుగా చేసింది.

కొద్ది సెకన్లు బొంబాయి థీం గుర్తొచ్చింది,గానం మొదలవ్వగానే ఇది స్వర్ణలత పాడిందేమో అనిపించింది,మధ్య లోకి రాగానే జోధా అక్బర్ లో ఓ పాట మధ్యలో వచ్చే ట్యూన్..ఇంతలో చిత్ర గొంతు వినపడింది..మొత్తానికి ఈ పాట అలా వినేసాను.

తీరా చూస్తే అది "కొమరం పులి" లొ "నమ్మకమీయరా స్వామీ" అన్న పాట. అసలు తెలుగు సినిమా రెహ్మాన్ పాటలు ఈ మధ్య బాగోట్లేదు అని నమ్మి ఉండటం వల్ల ఈ పాట మిస్స్ అయిపోయానెమఓ. కొమరం పులి పాటలు రాగానే రెహ్మాన్ కాబట్టి ఓ రెండూ మూడు విన్నాను. అమ్మా తల్లీ ఒకటి, ఇంకోటి "మారాలంటే" అన్న పాట.ఈ రెండూ విని విరక్తి వచ్చి ఆల్బం మొత్తం పాటలు వినలేదు.

ఈ పాట మాత్రం రోజూ ఓ నాలుగైదు సార్లు వినేంతగా నచ్చేసింది. ప్రతీ సారీ విన్నప్పుడల్లా రకరకాల ఆలోచనలు.

బిడ్డ పుట్టినపుడు తల్లి పాడే లాలి పాటేమో అనోసారి, కానీ పాటలో రెండు గొంతులు ఉండబట్టి సినిమా మధ్యలో హీరో కి ఏమైనా అయినప్పుడు హీరోయిన్,హీరో తల్లి పాడే పాటేమో అని ఇంకోసారి ఇలా ఊహించుకున్నాను.

కానీ ఈ పాట లో చిత్ర గొంతు నచ్చలేదు నాకు. ఎందుకో మొదటినుండీ కూడా చిత్ర గొంతు నచ్చదు నాకు. సుశీల గొంతులో ఉన్న మాధుర్యం ఈవిడలో అనిపించదు. ఈ మధ్య విన్న వాళ్ళల్లో ఉష లో వినపడింది ఆ మాధుర్యం,ఈ మధ్యే ఇంకో గాయని గొంతు కూడా నచ్చుతోంది..పేరు గుర్తు లేదు ఆ అమ్మాయిది.

ఈ పాట వింటేనే ఇంత బాగుంది స్క్రీన్ మీద ఎంత బాగుంటుందో అనుకుని ఆ మధ్య ఎప్పుడో టీవీలో వస్తోంటే రికార్డ్ చేసి పెట్టుకున్న సినిమా చూసాను. సినిమా మొదలవగానే బ్యాక్ గ్రవుండ్ లో ఓ రెండూ మూడు లైన్లు వినపడ్డాయి అంతే,అలా ఫార్వార్డ్ చేసుకుంటూ చివరికొచ్చేసా..అయినా ఎక్కడా వినపడదే పాట. ఒక నిట్టూర్పు విడిచా అయ్యో ఇంత మంచి పాట ఎలా తీసేసారు అని..

మొదట రికార్డు చేసి ఆ తరువాత హీరో గారి ఇమేజ్ కి సరిపోదని పెట్టి ఉండరేమో అనిపించింది. కనీసం చివర్న ఆ విలన్ పిచ్చి అరుపుల బదులో లేదా పాటేమిటో ఆ శ్రియ డ్యాన్సేమిటో అర్ధం కాని పాట బదులు ఈ పాట పెట్టచ్చు కదా అనిపించింది.

ఈ పాట దాదాపు రోజూ వినేంతగా నచ్చేసింది నాకు. ఏ పాట కూడా ఇంతగా నచ్చలేదేమో కూడా...

ఇక దీని సాహిత్యం అధ్భుతం. అన్నింటికంటే కూడా చివర్లో వచ్చే "సర్వమందించు నీ ప్రియ గానం స్మరణం ప్రార్ధనకై స్వామీ సమయం స్వచ్చత నీయరా" అనేది ఎందుకో తెగ నచ్చేసింది.

మన హడావిడి జీవితాలలో చేసే హడావిడి ప్రార్ధనలని చాచి కొట్టినట్లనిపించింది.

Thursday, April 5, 2012

తెలుగు సినిమా

ఏమిటో ఈ రోజు పొద్దున్న నుండీ ఈ రచ్చ.ఓ మామూలు మాస్ మసాలా సినిమా కి అంత హడావిడి ఏమిటో. అంతే లెండి హిట్టు కొట్టక తప్పదన్న పరిస్థితిలో సినిమా వస్తే ఈ మాత్రం రచ్చ తప్పదేమో. ఆ మధ్య బిజినెస్ మ్యానేమో "...చ్చ" అంటూ హిట్టు కొట్టాడు మెగా వారసుడేమో "రచ్చ" అన్నాడు నెక్స్ట్ హిట్టు కావాల్సిన హీరోలెవారైనా "పిచ్చ"(వీడికి పుట్టింది కచ్చ అనేది ట్యాగ్ లైను ) అని పెట్టుకుంటే సరి.

నాకు అర్ధం కాని విషయం ఒకటుంది. ఏదో కధ డిమాండ్ చేస్తే(మనం రాసుకున్న కధలు డిమాండ్ చెయ్యడమేమిటి అని అడక్కూడదంతే)అమెరికా లోనో రష్యాలో నో తీస్తే ఓకే కానీ పాట కీ ఫైటు కీ విదేశాలేమిటో.90% పాటలు కధానుసారం లోకల్ గా మొదలయ్యి అలా మలేషియా థాయిలాండు మీదుగా హీరోకి చలికోటేసి జేబులో చేతులు పెట్టి నడిపిస్తూ హీరోయిన్ కి ఓ షిఫాన్ చీర కట్టి స్టెప్పులేయించాలనుకుంటే యే రష్యానో ఉజ్బెకిస్తానో వెళ్ళి అలా అమెరికాలోనో తేలతారు.నిజంగా ఇంత అవసరమా?

"ఫేస్ వేల్యూ" లేని హీరోలు డ్యాన్సులని ఉతికి ఆరెస్తుంటారు కాబట్టి ప్రేక్షకుల చూపంతా వాళ్ల మీదే ఉంటుంది.కాస్త చూడటానికి బాగున్న హీరోలు స్క్రీన్ మీదుంటే వాళ్ళనే చూస్తాము.కాబట్టి అసలు విదేశాలలో తియ్యాల్సిన అవసరం ఏమిటి అన్ని కోట్లు ఖర్చు పెట్టి?పోనీ ఈ రెండు తరగతులకీ చెందని హీరోలకి అసలు పాటెందుకు? పెట్టినా ఇండియాలో తియ్యచ్చు కదా.

ఈ మధ్య విలన్లు కూడా కాస్ట్లీ అయిపోయారు. కొంతమందయితే హెలికాప్టర్ లో నుండే దిగుతారు. మొదటి నుండీ చివర్లో హీరో చేతిలో అంతమయ్యేవరకూ హెలికాప్టరే ఈయనగారికి.ఇంకాస్త ఈయన ఖరీదైన లైఫ్ స్టైల్ చూపించాలంటే విదేశీ హోటల్ పూల్ లో అందరూ స్విం వేర్ లో ఉంటే ఈయన మాత్రం సూటూ బూటూ వేసుకుని సిగార్ కాలుస్తూ విదేశీ భామాల నడుమ ఉంటాడు.

పాపం చివర్లో వచ్చే పోలీసుల విషయం లోనూ వివక్షే. హీరో గారు విదేశం వెళ్ళి విలన్ని చంపుతారు కాబట్టి విదేశీ పోలీసులు వచ్చి విలన్ని మాత్రం తీసుకెళతారు.

అదే తొడ కొట్టీ మెడలు విరగ్గొట్టి విలన్ లని లోకల్ గా చంపితే మాత్రం ఇంతకుముందు విజిల్ ఊదుకుంటూ వచ్చి విలన్ లని వ్యాను లో ఎక్కించుకెళ్ళే పోలీసులే కనపడరు.

హీరో గారు పోలీసయితే తప్ప చివర్లో పోలీసు ఊసే ఉండట్లేదు.

కామెడీ ట్రాక్ ఉండాలి కాబట్టి ఏ మాత్రం నవ్వు రాని స్టార్ కమెడియన్ రొటీన్ కామెడీ. ఈయన గారు చొంగ కార్చుకుంటూ నాకు వయసయిపోయి బట్తతల వచ్చేసింది,పెళ్ళెప్పుడవుతుందీ అంటూ చేసే వెకిలి కామెడీ లేదా Slap stick కామెడీ. ఇంతే కదా.

సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండీ ప్రెస్ మీట్లు,ఆ తరువాత ఆడియో ఫంక్షన్,రెండ్రోజుల్లో ప్లాటినం డిస్క్ వేడుకలు,హీరో గారి టూర్లు, ఆ తరువాత టీవీ పబ్లిసిటీ కోసం డబ్బులు అలా వెదజల్లే నిర్మాతలు దొరకబట్టి చాలా మంది తెలుగు సినిమా డైరెక్టర్లు తమ సినిమాలకి కావాల్సిన సామాగ్రి సమకూర్చుకుని సినిమా మొదలెడుతున్నారు.

ఇవే కదా కావాల్సినవి

1)కాసిని డైలాగులు.హీరో గారి వంశాన్ని బట్టి మార్పులూ చేర్పులూ

2)ఓ హీరోయిన్ను(కష్టపడి ఈవిడకి డైలాగులు అవీ రాయక్కర్లేదు)

3)కామెడీ,స్టార్ కమెడియన్లదొకటి,టీచర్లో మీదో తల్లి తండ్రుల మీదో ఇంకొకటి

4)"హై ఓల్టేజ్"( నా భాషలో స్క్రీన్ ఎర్రగా అవ్వడం అని) ఫైట్లు,విదేశీ డాక్ యార్డ్లలో విలన్నిపరిగెత్తించి స్పీడ్ బోట్లో చేజ్ చేసి చంపడం.

5)ఓ వెకిలి ఐటెం సాంగ్

పాపం ఇవన్నీ సమకూర్చుకునే హడావిడి హీరో గారి డేట్లు అయిపోతాయనే తొందరలో "కధ" ని మర్చిపోతున్నారు.

ఎంత డైరెట్రయినా ఒకప్పుడు ప్రేక్షకుడే కాబట్టి చివర్లో వాళ్ళకి తెలుస్తుంది అసలు ingredient మర్చిపోయి వంటకం చేసేసామని.వాళ్ళు మర్చిపోవడం కాదు కానీ ఇంక మనకి మొదలన్నమాట.

నేను ఈ హీరో గారి ని అభిమానిస్తూ పెరిగాను ఇప్పుడు ఈయనని/వీరి వంశాంకురాన్ని డైరెక్ట్ చెయ్యగలిగా అని డైరెక్టరు గద్గద స్వరంతో ఆడియో వేడుకలో హీరో గారి కాళ్ళ మీద పడిపోవడంతో మొదలవుతుంది అసలు పబ్లిసిటీ అంతా.

కాస్త తెలివైన నిర్మాత అయితే "కధ బాగాలేకపోయినా పట్టు సడలని స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని కట్టి పడెస్తుంది" అని రివ్యూ రాయించెయ్యచ్చు

కధ,పబ్లిసిటీ విలోమానుపాతం లో ఉంటాయనిపిస్తూ ఉంటుంది చాలా మటుక్కు.

ఒక హాయి తెలుగు సినిమా ఎప్పుడు చూస్తానో ఏమిటో .

ఇప్పటి పిల్లలు పెద్దవాళ్ళయ్యాకా వాళ్లకి చూపించటానికి అలనాటి ఆణిముత్యాలు, మధ్యలో వచ్చిన "సంతోషం" లాంటి ఓ ఐదారు సినిమాలు తప్ప అసలు క్లీన్ పిక్చర్స్ ఏవి??

నెక్స్ట్ జనరేషన్ కి కూడా కామెడీ కి జంధ్యాల సినిమాలే దిక్కా?

Sunday, January 1, 2012

2012 నా మొదటి సినిమా- రాజన్న

అసలు ఈ లాంగ్ వీకెండు లో ఎక్కడకీ కదలకూడదని నిర్ణయించేసుకుని శనివారం అమలుచేసేసాను. ఆదివారం కూడా విజయవంతంగా ముగించెయ్యబోతున్న నాకు నాలుగున్నరి కి వచ్చిన ఓ ఎసెమ్మెస్సు అడ్డుపుల్లేసింది. ఆ మెసేజ్ సారాంశం సాయంత్రం ఆరింటికి "రాజన్న" సినిమా కి వెళ్తున్నాము అని.


వాళ్ళు వెళ్తోంటే నాకు చెప్పారు అంటేనే అర్ధం అవుతోంది కదా, చీజ్ వేసి జెర్రీ ని టాం కలుగులోంచి బయటకి లాగినట్లు నాకు "రాజన్న" ని ఎరగా వేసారు ఎస్సెమెస్సు రూపం లో అని .


ఎక్కడ ఏమిటీ అని ఓ నాలుగైదు ఎసెమెస్సులు పంపానే కానీ మనసు లో రాజన్నని చూడాలనే ఉంది. పైగా 3.5 రేటింగు ఇచ్చారాయే దానికి. "దూకుడు" కి కూడా అంత ఇవ్వకుండా ఈ సినిమా కి ఇచ్చారంటే "లగాన్" తరహా లో కాకపోయినా దానికి దగ్గర్లో ఉండచ్చేమో అనుకుని బయలుదేరాను.

ధియేటర్ లో ఎక్కడా పోస్టర్ లేదు. అంతకుముందొచ్చిన "డర్టీ పిక్చర్" రాబోతున్న "ప్లేయర్స్","అగ్నీపధ్" మొదలైన పోస్టర్లున్నాయే కానీ ఎక్కడా చడీ చప్పుడు లేడు మన రాజన్న. పోనీ జనమున్నారా అంటే అదీ లేదు. ఆరవుతోందే కానీ మేము నలుగురము తప్ప ఎవ్వరూ కనపడట్లేదు. "రాజన్న" సినిమా కే తీసుకున్నావా అని అడిగాను టికెట్ట్లు కొన్న ఫ్రెండు ని. నేను కొన్నప్పుడు ఇంకో నాలుగైదు సీట్లు ఫిల్ అయ్యాయి అంతే అని కబురు చల్లగా చెప్పాడు.

లోపలకి వెళ్ళాము.ఓ 15 మంది కూడా లేరు.

అనారా(అక్కినేని నాగేశ్వర రావు) వ్యాఖ్యానంతో సినిమా మొదలు.సినిమా చూస్తున్నంత సేపూ ఆర్ నారాయణమూర్తి సినిమా మల్టీప్లెక్సు లో చూసినట్లుంది.

ఒక వారసుడు కంటి చూపుతో చంపెస్తే రాజన్న తన పాటలతో చంపేసాడు.

దాదాపు ప్రతీ 5-10 నిమిషాలకీ ఓ చిన్న పాట పెట్టి బుర్ర కధ ని తలపించారు.

చిత్రీకరణ చాలావరకూ క్రుతకం గా అనిపించింది. ఎంచితే లోటు పాట్లు బోలెడు. ఆ అమ్మాయి కాలినడకన ఢిల్లీ వెళ్లడం దగ్గర నుండీ నెహ్రూ కి తెలుగు అర్ధమయ్యే వరకు.

అలవోకగా బ్రిటీష్ సేనలని చీల్చి చెండాడెస్తున్న రాజన్న ని చూస్తోంటే "లెక్క ఎక్కువైనా ఫరవాలేదు,తక్కువ కాకుండా చూడు షేర్ ఖాన్" డైలాగ్ గుర్తొచ్చింది.

నాగార్జున సహచరులుగా నటించిన వారు బాగున్నారు నాగార్జున కంటే కూడా.

ఈ సినిమా కి 3.5 రేటింగిచ్చిన వెబ్సైటు వారు "క్షేత్రం" సినిమా ని అందులో జగపతిబాబు ని ఏకి పారేసారు దారుణం గా.

అలాంటి వారికి "రాజన్న" నచ్చడం మాత్రం వింతే. ఎంత డబ్బులిస్తే మాత్రం ఇంత వాస్తవ విరుద్ధం గా రివ్యూ రాస్తారా అని ఆశ్చర్యపోయాను.

కాస్త "కళా పోసణ" ఉన్న డైరెట్టర్లు ఎవరైనా చూస్తే వారి తరువాతి సినిమా కి అవసరమైన మాంత్రికుడి పాత్ర కి "రాజన్న" ని ఎన్నుకోవడం మాత్రం ఖాయం.

కమెడియన్స్ ని అనవసరం గా ఇరికించకపోవడం, ఐటం సాంగు లేకపోవడం,షరా మామూలుగా మన్మధుడి కి ఇద్దరు హీరోయిన్లని పెట్టకపోవడం చాలా పెద్ద ప్లస్ ఈ సినిమా చూసే నా లాంటి వాళ్ళకి.

"బరత మాత" తో చెవులని తుప్పు పట్టించేసిన రాజన్న తన హిందీ డైలాగులతో కమెడియన్స్ ఖర్చు కోసిపారేసాడు. నాలుగైదు హిందీ డైలాగులకే ఇలా ఉంటే ఏకంగా నాలుగ్గంటలపాటు ఈ "బాబు" హిందీ సినిమా ని ఎలా భరించరో అప్పుడెప్పుడో అనిపించింది.


చివర్లో "నెహ్రూ" గా ఎవరొస్తారో అని ఊహించుకున్నాము ఎవరికి వారే. ఈ సినిమా లో నాకు కాస్త నచ్చినవి స్నేహ,ఆ చిన్న పిల్ల.

3.5 ని ద్రుష్టి లో పెట్టుకోకుండా చూసినా ఈ సినిమా నచ్చేది కాదు నాకు, అది ద్రుష్టి లో పెట్టుకుని ఇంకాస్త భంగపడ్డాను. మన బ్లాగర్ల రివ్యూ చదవాల్సింది వెళ్ళేముందు.

ఎవ్వరూ రాయలేదా నేను మిస్స్ అయ్యానా ఈ రివ్యూ ని బ్లాగుల్లో?

తన స్టార్ డం ని పక్కన బెట్టి ఇలాంటి సినిమా చేసిన నాగార్జున అభినందనీయుడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదని ఆగిపోకుండా ఇంకా కొత్త కధలతో ప్రయోగాలు చేస్తే బాగుంటుంది. తన వయసుకి తగ్గ హుందాతనమూ వస్తుంది.

ఇంకా ఇద్దరమ్మాయిలతో డ్యూయెట్లు పాడి వయసైపోయాకా రామారావు,నాగేశ్వరరావు తమ సినిమాల్లో భయంకరమైన విగ్గు, తోసుకొస్స్తున్న పొట్టతో "అమ్మా,నేను బీయే పాసయ్యాను" అంటే చూడటానికి ఇబ్బంది పడ్డ రోజులు గుర్తుకు తీసుకురాడని చిన్న ఆశ.