Friday, December 30, 2011

తిరుమల

ప్రతీ సారీ లాగే ఈ సారి కూడా డిశంబరు లో ఇండియా వెళ్ళాను. ఈ సారి ట్రిప్ లో తిరుమల వెళ్ళి శ్రీ వారిని దర్శించుకున్నాము కుటుంబ సమేతంగా.దాదాపు 7-8 యేళ్ళ తరువాత అనుకుంటా నడిచి కొండెక్కాను.మొదట్లో కాస్త అలసట అనిపించిన్నా దారిలో దొరికిన వేడి వేడి దోశలు,ఆంధ్ర వారి ఆల్ టైం ఫేవరెట్ ఉప్పూ కారం రాసిన మామిడి ముక్కలు,


జామ కాయలు,


రేగి పళ్ళు


తింటూ మూడున్నర గంటలలో కొండపైకి చేరుకున్నాము. ప్రతీ మెట్టు కీ పసుపూ కుంకుమ అద్దుతూ మొక్కు తీర్చుకునే వారు కొందరైతే, ఆరు వందల ఇరవై రెండో మెట్టు కి కుడి వైపున ఉన్నాను అని అరిచి సెల్ ఫోను లో మాట్లాడే వారు ఇంకొంతమంది. సెల్ ఫోను లో భక్తి గీతలు పెట్టుకుని కొందరు నడిస్తే, షీలా కీ జవాని ఇంకొందరి ఫోనల నుండి జాలువారింది.

నడక దారి గురించి చెప్పాలంటే సౌకర్యాలు చాలా మెరుగుపడ్దాయి ఈ దారిలో అని చెప్పొచ్చు.. ముఖ్యం గా పరిశుభ్రత.


ఇండియాలో డస్ట్ బిన్స్ అందుబాటులో పెట్టరు అనుకునే నా లాంటి వాళ్ళు తిరుమల మెట్ల దారి చూడాలి. దేవస్థానం వాళ్ళు ఎంత చక్కగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసారో.దాదాపు 15-20 మెట్లకి ఒకటి చొప్పున పెట్టారనుకుంటా.


అయినా సరే అలా చెట్ల మధ్యలోకే విసిరెస్తున్నారు చాలా మంది కవర్లు బాటిల్స్ ని. అలా కింద పడ్డ వాటిని కూడా(మరీ లోయలోకాదు లెండి) క్లీన్ చేస్తున్న వారిని చూసాకా దేవస్థానం వాళ్ళు తీస్కుంటున్న శ్రద్ధ కి ముచ్చటేసింది.

తిరుమలలో ఆలయం పరిసరాలలో కూడా నిత్యం క్లీనింగ్ జరుగుతూనే ఉంది. ఎంత చేసినా కాస్త మన నుండి కూడా కాస్త తోడ్పాటు ఉండాలి అన్నదానికి ఉదాహరణ క్యూ లైనులు. కంపార్ట్మెంటులలో డస్ట్ బిన్ చుట్టూ తాగి పారేసిన ఫ్రూటీ ప్యాకులు,వాటర్ బాటిల్సు వగైరా వగైరా.

కూర్చోవడానికి అదీ బెంచీలు అవీ ఉన్నాయి వేచి ఉన్నప్పుడు కానీ ఏమి లాభం గేటు తియ్యడం ఆలశ్యం సినిమా టిక్కెట్ల కోసం ఎగబడ్డట్లు వెనకాల ఎక్కడో ఉన్నవాడు కూడా "గోవిందా" అనుకుంటూ మోచేతులతో పొడిచేసి ముందుకెళ్ళిపోతాడు. ఒకటి రెండు సార్లు అనుభవం అయ్యాకా కూర్చోవడం చాలమంది మానేసారు పాపం నిల్చునే ఓపిక లేని వృద్ధులు,చంటి పిల్లల తల్లులు తప్ప.

గేటు తియ్యగానే అసలు ఎంత భయంకరమైన తోపుడు అంటే,ఏ మాత్రం క్యూ లైను లో నడుదామని ప్రయత్నించినా కింద పడిపోవడమో లేదా అలా పక్కకెళ్ళిపడి గోడకి అతుక్కోవడమో జరుగును కావున ఎవ్వరూ క్యూ పద్ధతి పాటించకుండా తిరుమ వెళ్ళే ముందు మోచేతి యుద్ధాలు ఇంట్లో ప్రయతించి ఆరి తేరిన పిదప మాత్రమే తిరుమల దర్శనానికి వెళ్ళ ప్రార్ధన.

ఇంతకుముందు నాకు అనిపించేది అబ్బా,తిరుమల క్యూ లైను ఇరుకు అని. ఈ సారి అంతా బాగా పరికించి చూసాను.ఇరుకు కంటే కూడా ఈ తోపులాట వల్ల ఇరుకు గా మారుతోంది ఏమో అనిపించింది. కంపార్ట్ మెంట్లలో ఈజీ గా లైను కి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నడవచ్చు.అబ్బే అలా ఎలా కుదురుతుంది. తిరుమల లైనులో తోసుకోవలెను అని మైండు లో ఫిక్స్ అయిపోయి అలా బ్లైండుగా వెనకాల నుండి తోసెయ్యడమే.

ఈసారి ఒక దర్శనం దాదాపు 7 గంటలు పట్టింది. దాదాపు ఎక్కడా బోరు అనిపించలెదు అందరి మాటలూ వింటూ వారిని పరిశీలిస్తూ ఉండటం వల్ల. గాలి జనార్ధన రెడ్డి బెయిలు గురించో , సచిన్ సెంచరీ గురించో మగవారు డిస్కస్ చేస్తే లేటెస్టు చీరల గురించో, లేదా ఆడపడచు లాంఛనాల గురించో ఆడవారి కబుర్లు.

గేటు తియ్యడానికి గేటు కీపర్ రాగానే అందరికీ ఒక్కసారి గోవిందుడు గుర్తొచ్చి రకరకాలుగా ఆయనని స్తుతించి చివరికి "గోవిందా గోవింద" అని పరుగెత్తి వేరొక కంపార్ట్మెంటుకి చేరుతున్నారు. ఈ పరుగులో కింద పడటమో, చెయ్యి పొరపాటున తమ ఆడవారి మీద పడటమో జరగడం మామూలే. ఓపిక ఉన్న వాళ్ళు గొడవ పెట్టుకోవడం మొదలెట్టారు, ఇదే సందనుకుని వాళ్ళని దాటుకుని(తోసుకుని) వెనకాల వారు ముందుకెళ్ళిపోయారు. ఇంకాస్త ఓపిక ఉన్న వాళ్ళు తెలుగు నుండి అనంగ్ల మాధ్యమం లోకి మారి మరీ గొడవలు పెట్టేసుకున్నారు.

వేరొక కంపార్ట్మెంటుకి చేరి మరలా అందరూ తమ రోటీన్ మొదలెట్టేసారు.


అంతే అక్కడ మళ్ళీ కబుర్లు మొదలు మరలా గేటు తీసేవరకూ.ఒక నాలుగైదు కంపార్ట్మెంట్స్ లో సేం సీన్ చూసాకా మా అబ్బాయి "రిషి" అన్నాడు, " I think "Govinda" is a magic word "అని. ఎందుకు అలా అన్నావు అన్నాను. "గోవిందా" అనగానే అందరూ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు కదా అంటాడు.

మహాద్వారం దగ్గరకి రాగానే "గోవింద" స్మరణ మార్మోగిపోతుంది. తోపుడు కూడా ఎక్కువగును. పోనీ గుడిలో ఉన్నంతసేపూ ఆయనని దర్శించుకోవడానికి తోసుకున్నారు అని సరిపెట్టుకున్నా, గర్భ గుడి నుండి బయటకి వచ్చాకా తీర్ధం దగ్గర కూడా తోపులాట ఎందుకో అర్ధం కాదు. తీర్ధం తీసుకుని ఎలాగో ఆ మోచేతి పొడుపులు ఒడుపుగా తప్పించుకుని వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి ని చూద్దామంటే అక్కడా ప్రజల తోపుడు దూకుడు ప్రదర్శనే. పాపం అందరూ అలా చెయ్యరు లెండి.

స్వామి వారి నిత్య కళ్యాణం గురించి చెప్తే మా అబ్బాయి ఏమన్నాడో తెలుసా,"That means, they marry one day, get divorced same day and re marry next day?"


ఇలా కాదు అని చెప్పి శ్రీ వారు,ఆకాశ రాజు కుమార్తే పద్మావతి ల వివాహం,కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పు కధ చెప్తే
"Ohh!! By this time he might be richer than Kubera. How come he is still repaying?"

మరునాడు దర్శనం బాగానే అయ్యింది ఎక్కువ వేచి ఉండకుండా. వెంటనే ట్యాక్సీ ఎక్కి రేణిగుంట చేరుకున్నాము. గన్నవరం ఎయిర్ పోర్టు లాగ ఉంటుందేమో అనుకున్నాను. అంతకు వెయ్యి రెట్లు నయం రేణి గుంట.గేటు లోపలకి వెళ్ళగానే "మంచు" పితామహుడు,కలక్షన్ కింగు గారి ఫోటో ఇరువైపులా చూసి అర్ధం కాలేదు. ఓ 3-4 చూసాకా అర్ధం అయ్యింది అది వారి విద్యా సంస్తల ప్రకటన అని. విద్యా సంస్థలు పెడితే పెట్టుకున్నారు, యాక్టింగు స్కూలు పెట్టి విష్ణూ బాబు తో యాక్టింగు,లచ్మీ ప్రసన్న "అక్క" తో యాంకరింగు నేర్పించకండి బాబోయ్ అనిపించింది.


విమానాశ్రయం లోపల సీట్లు మాత్రం దారుణాతి దారుణం. ఎమ్మెస్కో వారి "సర్వ సంభవాం" చదువుతూ ఓ గంట సమయ్యాని చంపగానే విమానము అధిరోహించు సమయం ఆసన్నమయినది.అబ్బా...ఎయిర్ ఇండియా నే దారుణం, ఇది ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానము ఇంకెలా ఉంటుందో అని నిట్టూర్చి లోపలకి ఎక్కగానే సంభ్రమం, ఆశ్చర్యం,ఆనందం అన్నీ మూకుమ్మడి గా కలిగాయి.వాటిని అలా కలిగించుకుని ముందుకు పోతా ఉంటే నా సీటు వచ్చింది. ఇంకోసారి మరలా ఇంతకుముందు చెప్పిన సేం ఫీలింగ్స్ సేం టైం లో కలగలిసి వచ్చేసాయి ప్రతీ సీటు కి ముందు అమర్చి ఉన్న "పర్సనల్ వీడియో స్క్రీన్స్" చూసి.


పైన కలిగిన ఫీలింగ్స్ ని తట్టుకునే లోపే విమానవతి తీసుకొచ్చిన ఫుడ్ చూసి మరలా నా ఫీలింగ్స్ విజృంభించేసాయి. చక్కటి చీజ్ సాండ్ విచ్,ఇంకేదో టేస్టీ సాండ్ విచ్, ఒక కేక్, జ్యూస్. తిని బ్రేవ్ మని ఓ సినిమా చూదామనుకున్నానో లేదో హైదరాబాదులో వాలిపోయాను.నిజం చెప్పొద్దూ వెయ్యి డాలర్లు పెట్టి టిక్కట్టు కొనుక్కున్నా కానీ హైదరాబాదు సింగపూర్ విమానం కూడా ఇంత బాగోదు.

ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి మీద నా అభిప్రాయం మార్చేసుకోవచ్చంటారా?