Saturday, October 1, 2011

నేను నా రాక్షసి, ఫోర్స్

దూకుడు నిన్న టిక్కెట్లు దొరకలేదు. సరే అని రాత్రి కూర్చుని నేను నా రాక్షసి చూసాను.రానా సినిమాలు ఏమీ చూడలేదు ఇంతకముందు. ఎలా నటించాడో చూడాలని ఉత్సాహం గా అనిపించింది.

రానా నటన శూన్యం.డైలాగ్ డెలివరీ బాగా మెరుగు పరచుకోవాలి.మంచమ్మాయి టాక్ షో లో ఇతనిని చూసి నత్తి లేకుండా మాట్లాడే వారసుడు దొరికాడే అనుకున్నాను.కొన్ని కొన్ని డైలాగుల్లో ఇతను కూడా "పెల్లి,కల్లు" బ్యాచేనేమో అనిపించాడు.

డైలాగులు కొన్ని వింటే నవ్వొచ్చాయి.డైలాగు కాదు అది పలికిన తీరు. "డబ్బులు నాయి(డబ్బులు నావి)","బ్యాగ్గులెయ్యి(బ్యాగులు ఏవి)" మచ్చుకు కొన్ని. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం టీవీలో చూస్తే బాగానే అనిపించి అయ్యో ఎందుకు ఫ్లాపయ్యిందో అనిపిస్తాయి. కానీ ఇది ఇంట్లో కూర్చుని చూసినా అయ్యబాబోయ్ అనే అనిపించంటే అది ఖచ్చితంగా దర్శకుడి ప్రతిభే.

ఆ ఆత్మహత్యల గోలేంటో,వాటిని రికార్డు చేసే హీరోయిన్నేంటో ఆ దర్శకుడికే తెలియాలి. కొన్ని డైలాగులు వింటే సెన్సార్ ఉందా అనిపించింది. హాల్లో చూసినవారికి జోహార్లు. ఇంతకు మించి దీనిలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఈరోజు మరలా దూకుడు కి ప్రయత్నిచాము.ఖలేజా సినిమాకయితే సినిమా తెచ్చాము రండి అని మెయిల్సు,మెసేజీలు వచ్చాయి.ఈ సినిమాకేమో మేమే ఫోను చేసినా టిక్కెట్లు లేవు.ఇండియా కాదాయే గేట్లు దూకి వెళ్ళి టిక్కెట్లు తెచ్చుకుని "దూకుడు" పేరు ని సార్ధకం చేస్తూ సినిమా చూడటానికి.వచ్చేవారమే ఇంక చూడటం అని నిరణయించేసుకుని(ఈటీవీ వారి నుండి ఈ మాట అప్పుతీసుకున్నా)ఫోర్స్ సినిమాకి వెళ్ళాము.

నిజం చెప్పొద్దూ, ఆరెంజ్ సినిమా టీవీలో చూసినప్పటినుండీ జెనీలియా అంటే విరక్తి వచ్చింది.ఆ తింగరితనం, వెర్రి వేషాలు చూసి.సూర్య నటించిన తమిళ్ వెర్షన్ చూడలేదు. కానీ చాలా అందం గా అనిపించాడు సూర్య ఆ సినిమా పాటల్లో. వెంకటేష్ కూడా బాగా చేసాడు.రెండూ చూసిన వాళ్ళు మాత్రం సూర్యకే ఎక్కువ మార్కులేసారు.

ఒక్కమాటలో చెప్పలంటే సినిమా అంతా తెగ బోర్ అనిపించింది. ద్వితీయార్ధం కాస్త ఫరవాలేదు స్పీడందుకుని.
సినిమా మొదలైన కాసేపటికి అనిపించింది జెనీలియా తింగరితన్నాన్ని జాన్ అబ్రహం కి అప్పుగానీ ఇచ్చిందా అని.ఏంటో ఆ తింగరి చూపులు అతనూ.మొదటి సగం అయితే పరమ బోర్.జాన్ అబ్రహం కి కండలు మరీ ఎక్కువయినట్లనిపించాయి.అందరూ పొట్ట తగ్గించడానికి శ్రమ పడ్డట్లు ఇతను బైసెప్స్ తగ్గించాలేమో. తెలుగు లో ఉన్నంత పవర్ఫుల్ గా ఒక్క క్యారెక్టరూ లేదు.టైటిల్స్ లో మొయినీష్ బెల్ అని చూసి ఏ సీనియర్ పోలీసు ఆఫీసరో అనుకున్నా.చూద్దును కదా ఇతను కూడా నలుగురు పోలీసుల ఫోర్సు టీం లో ఒక భాగం.

తెలుగు లో వెంకటేష్ పోలీసు టీం లో అందరూ బాగున్నారు. ముఖ్యం గా శ్రీకాంత్ గా నటించిన బాలాజీ లో అయితే ఆ రఫ్ లుక్ చాలా బాగుంది సినిమాలో. తెలుగులో ఆశిన్ లాగానే జెనీలియా కూడా "ఏసీపీ సర్" అంటూ చంపేసింది. కాకపోతే జెనీలియా మార్కు తింగరితనం లేకపోవడంతో "ఏసీపీ సర్" ని భరించడం కష్టమనిపించలేదు.ఇది తొలిమెట్టు గా జెనీలియా ఇక పైన అయినా కాస్త నటిస్తే బాగుండు.

ముఖేష్ రిషి పాత్ర తక్కువే. ఇతన్ని మన తెలుగు సినిమాల్లో మీసం మెలేస్తూ అరచి డైలాలుగు చెప్పే పంచెకట్టు వేషధారణ తో చూడటం అలవాటుపడి ప్యాంటూ షర్టుల్లో చూస్తే ఏమిటో లా అనిపించింది


తెలుగు విలన్ సలీం పండా కే మార్కులెక్కువిస్తాను హిందీ విలన్ కంటే కూడా. మాత్రుక కధనానికి కాస్త మార్పు చేసారు. పాటలు చెలియ చెలియ తప్ప అన్నీ కొత్తగా కపోజ్ చేసినవే కానీ ఒక్కటీ బయటకొచ్చాకా సంగతటుంచి హాల్లో చూస్తున్నప్పుడే బాగోలేవు.

సినిమా మధ్య మధ్యలో బ్యాక్ గ్రవుండ్ లో వినపడే "చెలియ చెలియ" ఒక్కటే కాస్త రిలీఫ్.

హిందీ చెలియ చెలియ పాటని కూడా కేకే నే పాడాడు కానీ సాహిత్యం లో తెలుగులో ఉన్నంత ఫీల్ మిస్సవ్వబట్టి అనుకుంటాను పెద్దగా పండలేదు. జాన్ అబ్రహం ఈ పాటలో జరీ అంచు చొక్కాతో కామెడీ గా ఉన్నాడు.

హీరో గారు సినిమ మొదట్లోనే ఓ పెద్ద బైకు ని ఎత్తి విలన్ మీదకి విసిరెస్తాడు. సీన్ డిమాండ్ చేసింది కాబట్టి అలా చేసానని ఈరోజే హీరో గారి ఇంటర్వ్యూ లో చదివి ఆశ్చర్యపోయాను, రాసుకున్న సీన్లు డిమాండ్ చెయ్యడమేమిటి అని.సినిమా నుండి బయటకొస్తూ మనసులో ఓ ఆలోచనొచ్చింది,పైన ఫోటో లో జాన్ అబ్రహం స్థానం లో మన బ్రహ్మీ ని ఊహించుకోండి