Thursday, July 28, 2011

ఫేస్ బుక్

మాకు ఇక్కడ సింగపూర్ లో టీవీ పెట్టగానే "రక్తమోడిన రహాదరులు" అనో " కీచక టీచర్" అనో మరింకోటనో గాట్ఠిగా అరుస్తూ ఢఢన్ ఢఢన్ అనే బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ తో భయంకర ద్రుశ్యాలని చూపే ఛానెల్స్ లేవు. అసలు తెలుగు ప్రసారాలే లేవు. ఎప్పుడైనా తెలుగు చానెళ్ళని నెట్ లో చూడటమే.


దాని లోటు ఫేస్ బుక్ తీర్చేసింది ఈరోజు నాకు. ఈ మధ్య నేనూ ఫేస్ బుక్ ఖాతా తెరిచాను. కానీ దానిలో నేను రాసేది తక్కువ చూసేది ఎక్కువ అన్నమాట. అసలు నిమిష నిమిషానికీ అప్డేట్స్ ఎలా ఇస్తారెండీ బాబూ. అదో టాలెంట్ అనుకోవాలేమో. సరే ఇక విషయం లోకి ఈరోజు అప్డేట్స్ చూస్తోంటే ఓ ఫొటో కనపడింది. ఏమిటిది, తప్పు చూసానా అనుకుంటూ మళ్ళీ చూసాను. ఛా,ఇలాంటి ఫొటో అయ్యుండదులే అనుకున్నా. కానీ మెసేజ్ చూస్తే నేమో "కండోలెన్స్" వగైరా వగైరాలున్నాయి.వెంటనే దానిని క్లిక్ చేసి చూస్తే ఏముంది, ఓ చిన్న బాబు అంత్యక్రియల ఫోటో.ఆ ఫోటో పెట్టిన వ్యక్తి మేనల్లుడు మరణించాడుట. అతని ఆత్మ శాంతి కలగాలని వ్యాఖ్య రాసి ఫోటో పెట్టాడు. ఇంకేముంది,వ్యాఖ్యలు వెల్లువెత్తాయి,అయ్యో ఎలా జరిగింది,మీకు నా సంతాపం,ఆ దేవుడు కఠినాత్ముడు లాంటి సంధర్భానుసార వ్యాఖ్యలతో.


అయినవారు మరణించడం ఎవరినైనా కలచివేసే సంఘటన. కానీ ఏమో...ఎలా రాయాలో అర్ధం కావట్లేదు. ఆ బాబు ఫొటో పెట్టాడనా ఇంత బాధ అంటే,అవును,కాదు అనే సమాధానం వస్తుంది నా నుండి.

అసలు ఏ ఫోటో లు పెడుతున్నారో కూడా తెలీని మైకం లో వ్యాఖ్యల కోసం పెడుతున్నారేమో అనిపిస్తోంది కొంతమంది పెట్టే ఫోటో లు చూస్తోంటే.


అబ్బా ఎంత బాగున్నారో నీ పిల్లలు,చో చ్వీట్,అసలు నీకు అంత వయసున్నట్టే కనపడట్లేదు,లుకింగ్ యంగ్ ఇవేగా వ్యాఖ్యలు ఏ ఫొటో చూసినా.

అసలు అంతకుమించి ఏమి వ్యాఖ్యానిస్తాం లెండి ఎదుటి వారి ఫోటో మీద :)). కొంతమంది పెట్టే ఫొటోలలో అంత "చ్వీట్" ఏమిటో నాకు అర్ధం కాదు. భావుకత్వం లేదు కాబట్టి నాకు కవితలు అర్ధం కానట్లు ఇదీ అంతే నేమో లే అని సరిపెట్టేసుకుంటాను.

ఏ మనిషికైనా పొగడ్త టానిక్ లాంటిది. కానీ ఫేస్ బుక్ లో సగం అతిశయోక్తులే ఉంటాయి.

కొంత మంది విషయాన్ని చెప్పీ చెప్పకుండా అన్నట్లు ఆ విషయానికి సంబంధించి ఓ ఫోటో పెడతారు. అది వాళ్ళ పిల్లలు చేతికి కట్టు తో ఉన్న ఫోటో కావచ్చు,మేము ఫలానా ఊరెళ్ళాము అని అర్ధం వచ్చేటట్లు ఆ ఊరి పేరు బ్యాక్ గ్రవుండ్ లో ఉన్న ఫోటో కావచ్చు..ఎవరి క్రియేటివిటీకి తగ్గట్లు వాళ్ళు.

ఇంకొంతమంది ని చూస్తే అనుమానం వస్తుంది వీళ్ళు కానీ ఏదైనా సొంతం గా అప్లికేషన్ తయారు చేసుకున్నారా ఏమిటి, ఫలానా వాళ్ళు ఏమి అప్డేట్ చేసినా,ఎక్కడ వ్యాఖ్య పెట్టినా తమ తరపున ఓ "లైకు" కొట్టేటట్లు అని.

కొంత మంది చేసే అతి తట్టుకోలేము అసలు. వాళ్ళకి వాళ్ళు బ్యూటీ క్వీన్ గానో,ఎవర్ గ్రీన్ హీరో గానో ఊహించేసుకుంటూ పెట్టే ఫోటోలని చూస్తే వీళ్ళకి "గ్రేస్ ఫుల్ ఏజింగ్" అంటే తెలీదేమో అనిపిస్తుంది.

ఇన్ని చెప్పినప్పుడు మరి దీనికి దూరం గా ఉందచ్చు గా అంటారేమో,హ్హ్మ్..మానవమాత్రులకి ఎదుటివారి విషయాలమీద తగని ఆసక్తి అని తెలియదా మిత్రమా..:))

సరే ఇక ఈ గోల వదిలేస్తే,భారారే గారు కొత్త హారం ఉత్సాహం లో కవితలు రాసేసరికి నాకూ ఉత్సాహం వచ్చింది. నాకు స్వంతం గా హారం లేకపోతేనేమి బంగారం లాంటి నా బ్లాగుంది గా అనుకుని మొదలెట్టాను. దేనిమీదో ఎందుకు,ఫేస్బుక్ మీదే రాయి అని నా అంతరాత్మ చెప్పింది. రెడీ ఆ?


నువ్వు రెస్టారెంటుకెళ్ళావు
నేను చూసాను
మంచూరియా ఆర్డరిచ్చావు
వాసన పీల్చాను
కానీ..కానీ... మిత్రమా
క్షమించలేని ద్రోహం చేసావు
.
.
.
.
.
మంచూరియా ముందు పెట్టుకుని ఫోటో మరిచావు
ఫేస్ బుక్ లో అప్డేట్ ఆలశ్యం చేసావు

Friday, July 22, 2011

సింఘం

మొదటి రోజు చివరి ఆట లో "సింఘం" నిన్న చూసి ఇవాళ ఇంటికొచ్చాను. సింఘం పంజా కి పడిపోయి లేట్ అవ్వడం కాదు ,ఇవాళ వచ్చానంటే, నిన్న రాత్రి 11.59 కి సినిమా మొదలయ్యి తెల్లవారుఝామున ముగిసింది.

నేను తమిళ్ తెలుగు వెర్షన్లు చూడలెదు కాబట్టి ఫ్రెష్ మైండు తో సినిమాకి వెళ్ళాను.టికెట్ తీసుకునే ముందు పోస్టర్ లో కాజల్ ని చూసినప్పుడు మాత్రం అనిపించింది అజయ్ దేవగణ్ పక్కన అనుష్క అయితే బాగుండేదేమో ఈ అమ్మాయి మరీ చిన్నగా కనపడుతుంది అతని సరసన అని.

ఎనభయ్యో వంద మందో పట్టే చిన్న స్క్రీన్ అది.పాప్ కార్న్,శీతలపానీయం తో మా సీటుకి వచ్చాను. అదేమి సీటండీ బాబూ,పేరు కి కపుల్ సీటే కానీ కాస్త కాలు మీద కాలు వేసుకుని కూర్చుందామని కాలు అటూ ఇటూ ఏమరుపాటుగా కదిపానంటే నా ముందు సీట్లో నెత్తి మీద ఏరియల్ వ్యూ లో కనపడ్డట్టు అక్కడక్కడ మాత్రమే జుట్టున్న ఆసామి కి నా కాలు తగిలేటట్లు ఉంది.

అయినా సినిమాలో అంత మైమరిచి చూసే సీన్లేమీ లేవు కాబట్టి ఈ సమస్య ఎదురవలేదు.

సినిమా కధ మీ అందరికీ తెలుసు కదా పోలీసు విలన్ మధ్య జరిగే పోరాటం.ఇలాంటి కధలో హీరో ఇంట్రడక్షన్ మామూలుగా ఉంటే బాగోదు కాబట్టి,ఫార్ములా ప్రకారం ఒక గుడి కోనేరు లో మునిగి లేచి తన ఆరు పలకల బాడీ నీ చూపిస్తూ మన సింఘం నడచి వస్తాడు. వచ్చీ రాగానే రెఫ్యూజీ లో అభిషేక్ కి డ్యాన్సులలో పోటీ గా అన్నట్లు ఒకటే స్టెప్పుతో ఓ పాట. ఈ పాట అనవసరం.

మంచివాళ్ళకి మంచివాడూ,ఆపదలో ఆదుకునే వాడు,చెడ్డవారిని చితకబాదే పోలీసు గా ఓ నాలుగైదు సీన్లలో మనకి హీరో ని చూపిస్తారు.

హీరోయిన్ ఇంట్రడక్షన్ లో కళ్ళనో,కాళ్ళనో మొదట చూపించకుండా కాజల్ చెంగున కారు లోంచి దూకి మన ముందుకొచ్చెస్తుంది ఏ ఆర్భాటం లేకుండా.

ఈ అమ్మాయి సినిమా అంతా చుడీదార్ లలో నే కనపడింది ఒక పాటలో చీర లో మెరిసింది. నటన కి పెద్దగా ఏమీ లేదు. మగధీర లో చాలా అందం గా ఉన్న ఈ అమ్మాయి ఎందుకో ఈసారి డల్ గా కనపడింది. మన రాజమౌళి టేకింగ్ డిఫరెంటో లేక ఈ అమ్మాయి లో కళ తగ్గిందో.

హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు.అనవసరం గా ఫార్ములా ప్రకారం ఇరికించిన రెండు పాటలు కూడా వేస్ట్.

ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమా కి హై లైట్ అవుతుంది. పైగా హిందీ సినిమాలలో పెద్ద గా వినిపించని అంత్య ప్రాస డైలాగులు ఇతని కోసమే రాసారా అన్నట్లు ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి, బాలీవుడ్ ప్రేక్షకులకి ఇవి కొత్త కాబట్టి కొన్నింటికి చప్పట్లు పడ్డాయి మల్టీప్లెక్సు లో కూడా.

యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలం ఈ సినిమాలో. బెల్టు తో గూండాలని చితకబాదడం,వట్టి చేత్తో నడి బజార్లో రౌడీలని చావగొట్టడం వంటివి చూస్తే పోలీసు ప్రధాన పాత్రలో వచ్చిన పాత సినిమాలు గుర్తొస్తాయి.

మన టాలీవుడ్ కి చెందిన ఒక అగ్రకధానాయకుడి ని మైమరిపించే సీన్ ఒకటుంది.హీరో కొట్టగానే గూండా తన సూమో తో సహా తలకిందులయ్యి గాల్లోకి లేస్తాడు. పైకి లేచిన ఆ సూమో కింద పడుతుండగా గూండా ని మెరుపులా బైటికి లాగి మరలా చితక్కొట్టే సీన్ కి చప్పట్లు,విజిల్సూ ను. ఈ సీన్ కి విజిల్స్ పడ్డాయంటే.. :)

మధ్య మధ్య లో మరాఠీ డైలాగులు నా లాంటి వారికి అర్ధం కావు. మన సాయి కుమార్ పోలీస్ స్టొరీ లో పలికిన డైలాగ్ తెలియకపోవడం వల్ల కావచ్చు అజయ్ దేవ్ గణ్ పలికిన "నాలుగో సిం హం నా బుర్ర లో ఉంది" అనే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా మొదటి కాసేపు Slapstick కామెడీ తో కామెడీ పార్ట్ ని నడిపించెస్తే ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యి విలనీ ని కామెడీ ని తన భుజస్కంధాల పై మోసెసాడు చివరి దాకా.క్లోజప్ సీన్ లలో తన విగ్గు పై కాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేది.


చివరి సీన్ లో అతని నటన బాగుంది. ఎలా నటించినా కానీ "మార్పు" పేరుతో పరాయి నటులని ఆదరించి అందలమెక్కించే మనకున్న సుగుణం హిందీ ప్రేక్షకుల వద్ద లేదు కాబట్టి ప్రకాష్ రాజ్ భవితవ్యం చెప్పలేము.

కానీ ఇతని నటన,డైలాగ్ డెలివరీ ప్రత్యేకం గా ఉన్నాయి కాబట్టి రాణిస్తాడనే అనిపించింది అట్లీస్ట్ కొన్ని సినిమాల వరకూ.

సహాయ నటులు అందరూ బాగున్నారు ఎక్కువ మంది మరాఠీ నటుల లాగ అనిపించారు.

ఇలాంటి సినిమాల ఫార్ములా ప్రకారం విలన్ అంతమయ్యేముందు అనవసర ఆర్భాటపు ఐటెం సాంగ్ లేకపోవడం పెద్ద రిలీఫ్.

చివరికి విలన్ అంతమవ్వాలి కాబట్టి హడావిడి గా పోలీసులందరూ హీరో కి సపోర్ట్ చేసెయ్యడం అనేది నాటకీయం గా ఉన్న స్క్రీన్ ప్లే బాగుండటం వల్ల ఆలోచించే లోపే సినిమా అయిపోతుంది.

ఒరిజినల్ వెర్షన్ చూసి స్క్రీన్ లో అటు సూర్య ని ఇటు అజయ్ దేవ్గణ్ ని ఊహించుకోకుండా ఇది చూస్తే ఓ టైంపాస్ సినిమా చూసామన్న త్రుప్తి మాత్రం గ్యారెంటీ.

Tuesday, July 12, 2011

ఏమిటీ పిచ్చి గోల

ఒకప్పుడు రైళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తోంటే గుట్కాలు,సిగరెట్ల బెడద ఎక్కువ గా ఉండేది. ఇప్పుడు స్మోకింగ్ కాస్త తగ్గినట్లే అనిపిస్తోంది కానీ కొత్త జాడ్యం బయలుదేరింది దాని స్థానే. సెల్ ఫోనులో పాటలు బయటకి వినపడెట్టు పెట్టడం.

ఒకసారి 2007/2008 లో అమలాపురం నుండి కాకినాడ బస్సు లో వస్తోంటే మొదటి సారి ఇది గమనించాను. పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు ఆరోజు అలా పాటలు బయటకి పెట్టినవాళ్ళు.ఏమో లే తెలీక,సెల్ ఫోను మోజులో అలా పెట్టుకున్నారేమో అనుకున్నాను.

2011 లో కూడా సేం సీన్,స్థలం,మనుష్యులు మార్పు అంతే.

సీన్ 1

పినాకిని ఎక్స్ ప్రెస్: చెన్నై నుండి విజయవాడ బయలుదేరాను. చెన్నై ఎండకి విసిగి పోయి ఉంటే దానికి తోడు రైలు ఆలశ్యం బోనస్సు. రైలెక్కాకా ఏసీ పని చెయ్యలేదు రైలు కదిలేవరకూ. రైలు కదిలి స్పీడందుకుంది. హమ్మయ్య ఇక కునుకు తీదామనుకుంటుండగా ఓ మగానుభావుడు తన ఒడి పరికరం(ల్యాప్ టాప్) లో కంపార్టుమెంటు మొత్తానికి సినిమా వినిపించడం మొదలెట్టాడు. పోనీ చదువు లేని వాడా అంటే అదీ కాదు,రైలెక్కినప్పటినుండీ చూస్తున్నా,సారు ఫోను చెవులకి సూపర్ గ్లూ తో అతికించేసుకుని Unix,Linux,Client,Delivery etc తప్ప వేరే పదాలు వాడటం లేదు. హెడ్ ఫోన్స్ వాడాలి అన్న కామన్ సెన్స్ మాత్రం శూన్యం.ఇది చూసి నా పక్కన వరుస లో కూర్చున్న ఆయనకి మూడొచ్చేసి తన ఫోను లో పాత మధురాలు వినిపించడం మొదలెట్టాడు అందరికీ. నా వెనకాల కూర్చున్నతను నేనేమి తక్కువ అనుకుంటూ కాసేపటికి దేవిశ్రీ ప్రసాదు ని రంగం లో కి దింపాడు. అసలు రైలంటేనే రణగొణధ్వనుల మయం. అంత గోలలో అలా "సెలెక్టివ్" హియరింగ్ ఎలా ఉంటుందో అన్న ఆశ్చర్యం కూడా కలిగింది విసుగుతో పాటు.


నేనూ,నా పక్కనున్న రిటైర్డు ఫిజిక్స్ లెక్చరర్ గారూ ఏమీ చెయ్యలేక నిట్టూర్చాము. నాకు ఆ రూట్ కొత్త కావడం తో నెక్స్ట్ ఏ ఊరు,విజయవాడ ఎప్పుడొస్తుందో ఆయన చెప్తోంటే వింటూ,మధ్య మధ్యలో నా చేతి లో ఉన్న చిలకమర్తి వారి గణపతి గురించి చర్చిస్తూ,మధ్య మధ్యలో ఈ న్యూసెన్స్ గాళ్ళని తిట్టుకుంటూ విసుక్కుంటూ మొత్తానికి విజయవాడ చేరాను. విజయవాడ రావడానికి ఓ రెండు గంటల ముందు మాత్రం ఈ గోల అంతా తగ్గి కాస్త ప్రశాంతత వచ్చింది.

సీన్ 2

నవజీవన్ ఎక్స్ ప్రెస్స్:

పొద్దూన్నే ఖమ్మం లో ఎక్కాను. విజయవాడ చేరుతుండగా మెల్లిగా ఒకోక్కళ్ళే లేచి దంతావధానాలు అవీ కానిచ్చి కాపీలు తాగి టిపినీలు చెయ్యగానే భక్తి భావం ఉప్పొంగి టీ సీరీస్ వారికి అనూరాధా పౌడ్వాల్ పాడిన దేవీ స్తుతులు,పాటలు మొదలు సెల్ ఫోన్లలో. మధ్యాహ్నం అవ్వగానే సల్మాన్ ఖాన్ దమాంగ్ తో తయారయ్యాడు మా కంపార్ట్మెంట్లో.
(పొద్దూన్నే అయితే భక్తి,లంచ్ తరువాత బాలీవుడ్,సెన్స్ బాగానే ఉంది "న్యూ" సెన్స్ గాళ్ళకి)


లంచ్ తరువాత ఇక ఆ న్యూసెన్స్ గాళ్ళు బాలీవుడ్ హిట్స్ ని సెల్ ఫోను లో బిగ్గర గా ప్లే చెయ్యడమే కాకుండా karaoke కూడా మొదలెట్టేసారు. పోనీ లే ఇది నాకు ఓ రెండు వరుసల అవతల కదా జరిగేది అని సరిపెట్టుకున్నాను నిద్రా భంగం అవుతున్నా కానీ.

మా దగ్గర సైడు బెర్తు లో ఉన్న ఇంకో కుర్రాడు తనూ మొదలెట్టాడు. హాయిగా పాటలు అలా బయటకి ప్లే చెస్తూ సెల్ ఫోను ని కుండ లాంటి బొజ్జ మీద బోర్లించేసి తాళాలూ,దరువులూ మొదలెట్తాడు పాటకి అనుగుణం గా.

అసలే రైలు లేటు కా పరుగెడుతోంది(running late),నా లక్కు యధా ప్రకారం గా ఉండి ఏసీ పని చెయ్యడం మానేసి అప్పటికి ఓ గంటయ్యింది.

అన్నీ కలిపి విసుగు తన్నుకొస్తున్నా కానీ వీలైనంత మ్రుదువుగా చెప్పా ఆ అబ్బాయికి హెడ్ ఫోన్స్ పెట్టు కో అని. అంతే కయ్యి మని లేచాడు నా మీద, నీకేమి ఇబ్బంది అసలు,నా ఫోను నా ఇష్టం అంటూ.


ఏటి సేత్తాం,ఏటీ సెయ్యలేము ఇలాంటి వాళ్ళని. అప్పటి వరకూ ఇదంతా చూస్తున్న నా ఎదురు సీటు తమిళియన్ లేచి ఆ అబ్బాయి ని వాయించేసాడు, ఆ నిర్లక్ష్యం,పొగరు ఏమిటి అంత పొలైట్ గా అడిగితే అంటూ. అంతే వాడు ఈయన మీద కూడా పడి కరవడం మొదలెట్టాడు.

కాసేపు వాదించి విసిగిపోయి ఆయనా కూర్చున్నారు పాపం.

ఈ అబ్బాయీ చదువుకోని వాడేమీ కాదు. హిందీ,తమిళ్,గుజరాతీ,ఇంగ్లీషు అనర్గళం గా మాట్లాడుతున్నాడు.

చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏమి చెయ్యాలి,మీకెప్పుడైనా ఎదురయ్యారా?

ఇలాంటి డాక్టర్లు ఇంకా ఉన్నారండోయ్ ఈరోజుల్లో కూడా

ఈ మధ్య ఓ పదిరోజులు కాకినాడ వెళ్ళాను నాన్నగారిని చూడటానికి. ఓ ఆరు నెలల క్రితం బాగా అనారోగ్యం పాలైన ఆయన ఇప్పుడు కాస్త కులాసా. ఇక మేమందరమూ వెళ్తే ఎక్కడ ఆగుతారు ఆయన? హడావిడిగా తిరిగేసి అక్కడికీ ఇక్కడికీ అంటూ దగ్గర దగ్గర ఊర్ల ట్రిప్పులు పెట్టారు.

అందులో భాగం గా అయినవిల్లి వినాయకుడి గుడికి వెళ్ళాము. దర్శనం అయ్యాకా దూరపు బంధువలావిడ ని చూడటానికి అమలాపురం వచ్చాము.అప్పటికి మధ్యాహ్నం అయ్యింది.

కాస్త మంచి భోజన హోటల్ ఎక్కద ఉందో అని కనుక్కుంటే ఆ ఏదరకెళ్ళి రైటు కి తిరగండి,మాంచి డీలక్సు హోట్లు ఉన్నాదండీ అని చెప్పారు. డీలక్స్ లు అవీ కాదు కానీ అని,కాస్త ముందుకి కదలగానే సుబ్బారావు హోటల్ అన్న బోర్డు కనపడింది. కాకినాడ లో సుబ్బాయ్య లాగ అమలాపురం లో సుబ్బారావు మంచి భోజనం పెడతాడేమో అనుకుని వెళ్ళాము.

లోపలకి వెళ్ళగానే ఎక్కువ మంది టిపినీలు తింటూ కనిపించారు. ఏమో లే మధ్యాహ్న భోజనానికి బదులు డిఫరెంట్ గా ఇవి తింటున్నారేమో అనుకుని భోజనాలు ఆర్డరిస్తే ఏముంది కబురు చల్లగా చెప్పాడు సర్వారాయుడు(సర్వరు),టిఫిన్లు తప్ప భోజనం లేదండెఅంటూ..

నీరసం వచ్చేసింది,అయినా కానీ పచ్చని అరిటాకులలో పక్క వాళ్ళ ప్లేట్లలో కనపడుతున్న దోశ,రెండు మూడు చట్నీలు నన్ను అక్కడ నుండి కదలనీయలేదు.

నాన్నగారికి నాకూ ఉల్లి దోశ చెప్పాము. మిగిలిన వాళ్ళు ఇడ్లీ తో సరిపెట్టేసుకున్నారు. ఇలాంటి హోటళ్ళలో భోజనం అదుర్స్ అనుకుంటూ మా దోశల కోసం ఆశ గా ఎదురు చూసాను. తిన్న ప్లేట్లు తీయడానికి చేతిలో ఓ బకెట్టు,క్లీన్ చెయ్యడానికి ఓ పాత బట్ట తీసుకొచ్చిన క్లీనర్ ని,సర్వారాయుడు చేతిలో నాలుగు వేళ్ళతో టీ గ్లాసులు పట్టుకు రావడం చూస్తే చిన్నతనపు రోజులు గుర్తొచ్చాయి.

మొత్తానికి మా దోశలు వచ్చాయి. ఊహూ,అనుకున్నంత రుచి గా లేవసలు. అయినా ఇంకోటి ఆర్డర్ చేసాను ఆకలి దంచెస్తుంటే.

ఇంటికి రావడం మొదలు,పొట్టలో ఏదో తేడా అనిపించింది.నాన్నగారికేమో అర్ధరాత్రి నుండీ మొదలు.

నేను ఎలాగో మేనేజ్ చేసేసాను పాపం నాన్నగారికి ప్రయాణపు అలసట కూడా కలిపి ఇంకా నీరసించిపోయారు.

అసలే అనారోగ్యం నుండి అప్పుడే కోలుకుంటున్నారేమో కాస్త భయం వేసింది. సరే,మొదట ఒక ఫిజీషియన్ దగ్గరకి తీసుకెళ్దామని దగ్గర్లో ఎవరున్నారని వాకాబు చేస్తే అందరూ సాయంత్రమే ఉంటారుట.

ఇంతలో అమ్మకి గుర్తొచ్చింది,ఫలానా వీధిలో ఒకాయన ఉన్నారు ఆయన ఉంటారిప్పుడు అని. ఇంతకీ ఆయనేవరో కాదు,తెలుగు వారికి బాగా చిరపరిచితమైన వ్యక్తి సోదరుడే.

ఆ,ఏముంది,ఇలాంటి వాళ్ళందరూ బాగా హడావిడిగా ఉంటారు అనుకుంటూ వెళ్ళాను నాన్నగారిని తీసుకుని. అస్సలు హంగూ ఆర్భాటం ఏమీ లేదు. పేషంట్లు కూడా పెద్ద గా లేరు. ఓ పది నిమిషాలు వెయిట్ చేసామేమో అంతే.


స్టమక్ అప్సెట్ అండీ,నిన్న బయట తిన్నాము అని చెప్పాను. Let Nature Take Its Course ,శరీరం అక్కరలేని వాటిని బయటకి తోసేస్తుంది,దాని పని అది చెయ్యనివ్వకుండా మనకేమో అర్జెంటు గా తగ్గిపోవాలి,వెంటనే నానా చెత్తా తినెయ్యాలి అన్న ఆరాటం తగ్గించుకుంతే సగం రోగాలు రావు,అసలు మందులతో పనిలేదు అన్నాడాయన.

షాక్ నేను ఆయన మాట తీరుకి.


కానీండి,పెద్దాయన బాగా నీరసం గా ఉన్నారు కాబట్టి ఈ టాబ్లెట్టు రాస్తున్నాను అంటూ ఓ రెండు మాత్రలు రాసారు అంతే. జ్వరం పెద్దగా లేదు,అయినా అలసట వల్ల వచ్చిందని మీరే చెప్తున్నారు గా,రెస్టు తీసుకోండి ఏమీ మందులు అక్కర్లేదు అన్నారు.

ఆ తరువాత ఆయన నాన్నగారికి కలిగిన అనారోగ్యం ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలు అవీ కనుక్కున్నారు. ఆయన మాట్లాడుతోంటే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడితో మాట్లాడుతున్నట్లే ఉంది.

ఆ పక్కనే కూర్చున్న ఆయన స్నేహితుడి ఫోను మోగగానే కయ్యి మన్నాడీయన,ఓ పది నిమిషాలు ఉండలేవూ ఆ ఫోను లేకుండా అంటూ.

తనకి కలిగిన అనారోగ్యం గురించి నాన్నగారికి ఎంత బెంగగా ఉండేదో. ఈయనతో మాట్లాడిన తరువాత నాన్నగారు కాస్త రిలీఫ్ ఫీల్ అవ్వడం గమనించాను.

అసలు ఆయన తీరు ప్రస్తుత డాక్టర్ల తీరుతో పోలిస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో.చిన్న ఉదాహరణ.మేమున్నప్పుడు ఒకావిడ తన పిల్లాడికి దగ్గు ఇంకా తగ్గలేదు అంటూ తీసుకొచ్చింది.

ఏంటమ్మా,మంత్రం వేసినట్లు తగ్గిపోవాలంటే ఎలాగ,నేను చెప్పిన మార్పులు చేసావా వాడి తిండిలో?లేదు కదా,కాస్త దగ్గు తగ్గేవరకైనా చిరుతిళ్ళు మానిపించు వాడితో అని మందలించారాయన. ఇదిగో ఈ మందు తీసుకెళ్ళు అంటూ తన దగ్గరున్న సాంపిల్ తీసి ఇచ్చారు బయట కొనే పని లేకుండా.

అసలు ఆయన హాస్పిటల్ కి అనుబంధం గా మెడికల్ షాపు కూదా లేదంటే ఊహించుకోండి ఆయన ప్రాక్టీసు ఎంత తక్కువో. ఫీజు కూడా తక్కువే.

గరీబోళ్ళము సారూ,మాకు పట్టాలివ్వాలా,ఇళ్ళివ్వాల అని అరిచి గీ పెట్టే వారెవ్వారూ కూడా ఈయన దగ్గరకి రారుట మంచి డాక్టరు కాదని.

మిగతా చాలా మంది లాగ ఆ పరీక్షలు ఈ పరీక్షలు అంటూ హడావిడి చెయ్యకుండా,ఖరీదైన మందులు రాయకుండా కాస్త అవి తినడం తగ్గించు ఇవి మానేయి అని చెప్పి మందులు కూడా ఉచితం గా ఇస్తే ఈయన "మంచి" డాక్టర్ ఎలా అవుతాడు?

మనము మన చేతులతో అనారోగ్యాలని ఎలా కొని తెచ్చుకుంటున్నామో ఆయన వివరించిన తీరు అమోఘం.

తమ అనుబంధ ల్యాబ్ లో పరీక్షలు చేసి తమ పక్కనున్న మెడికల్ షాపులో మాత్రమే దొరికే బలానికి ఓ పెద్ద స్ట్రిప్పు క్యాప్సూల్సు,రెండు మూడు టానిక్కులు ఇస్తే తప్ప మంచి డాక్టరు కాదన్నమాట.