Wednesday, June 1, 2011

పిల్లలు తెలివైనవాళ్లయితే 15-16 ఏళ్ళకే వాళ్ళు లక్షలు సంపాదించెయ్యచ్చు...పదండి తోమెద్దాము వాళ్ళని

రోజు టైంస్ ఆఫ్ ఇండియా లో ఒక న్యూసు ఐటం చదివి కాసేపు షాక్ అయ్యాను. దాని సారాంశం ఏమిటయ్యా అంటే ఐఐటీ,ఇంటర్,ఎంసెట్ లలో మంచి మంచి ర్యాంకులు సాధించిన పిల్లలకి రేటు కట్టి కొనుక్కుపోతున్నారుట కాలేజీ యాజమాన్యాలు తమ సంస్థ లోనే చదివాడు అని ప్రకటించుకోవడానికి.

అంతలోనే అప్పుడెప్పుడో ఈనాడులో చదివిన కధ గుర్తొచ్చింది. ఆ కధ లో మంచి ర్యాంకు సాధించిన పిల్లాడిని,తండ్రి అటక మీద దాచెస్తాడు,అన్ని కాలేజీలవాళ్ళ గోల భరించలేక.

అప్పుడు అది చదివి నవ్వుకున్నా గానీ ఇప్పుడు ఈ న్యూసు చదివాకా అసలు మనము పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాము అనిపిస్తోంది. ఆ న్యూసు లో రాసినట్లు 15-20 లక్షలు కాకపోవచ్చు కానీ ఒక లక్ష కి అయినా పిల్లలని అలా అమ్మెయ్యడం దారుణం కదూ. ఆ పసి వయసు మీద ఇప్పటికీప్పుడు ఏమీ ప్రభావం చూపకపోవచ్చు కానీ భావి అవినీతి అధికారిని మన చేతులతో తయారుచెయ్యట్లేదూ?

అవినీతి అదీ పక్కన పెడితే పిల్లల మీద ఎంత ప్రెషర్ ఉంటుంది ఎక్సెల్ అవ్వాలి అంతే నువ్వు అని హుకుం జారీచెసే తల్లితండ్రులున్న పిల్లలకి?

అయినా తల్లితండ్రుల అత్యాశ ఉన్నంతవరకూ ఇలాంటివి తప్పవు. తమ పిల్లల కెపాసిటీ ఇంట్రస్టు తెలుసుకోకుండా వాతలు పెట్టుకోవాలని చూస్తే చక్కగా వేలకి వేలు క్షవరం తప్ప ఏమీ ఒరగదు.

ఆ మధ్య ఒకావిడ ని కలిసాను. ఆవిడ సింగపూర్ లోనే ఉంటారుట తన భర్తతో కలిసి వ్యాపారం చూసుకుంటూ. తమ అమ్మాయిని చెన్నై లో ఏదో బోర్డింగు స్కూల్ లో వేసారుట. అక్కడ అందరూ జర్మనీ,లండన్,సింగపూర్ etc ఇలా బయట దేశాలలో ఉన్న వాళ్ళ పిల్లలే ఉంటారండీ,స్విమ్మింగు,యోగా,డ్యాన్సు,స్పోర్ట్స్ అన్నీ కంపల్సరీ.అంత చక్కటి స్కూలు కాబట్టే నేను నిశ్చింతగా ఉన్నాను అంది. వీటిలో తమ అమ్మాయికి ఏది ఇంట్రస్టు అని ఆలోచించే తీరిక లేదనుకుంటా పాపం వ్యాపార బిజీ లో.


ఏమిటో ఈ మధ్య నాకు పిల్లలని ప్రెషర్ పెడుతున్న తల్లితండ్రులని చూస్తోంటే కోపం వస్తోంది,వాళ్ళ కెపాసిటీ తెలుసుకోకుండా ఏమిటి మీ ఆశలు,అవి తీరలేదని వాళ్ళని నిందించడం ఎందుకు అని గాట్ఠిగా చెప్పాలనిపిస్తోంది కానీ తన దాకా వస్తే కానీ తెలీదు అని పుటుక్కున ఒక మాట అనెస్తారని....

వీళ్ళెందుకిలా తయారవుతున్నారు?

ఈ మధ్య ఒక డవుటు వచ్చింది.నేను ఆ వయసు దాటొచ్చేసా కాబట్టి అలా అనిపిస్తోందా లేక నిజంగానే ఇప్పటి టీనేజీ/ఆ పై వయసు పిల్లల ప్రవర్తన విసుగు కలిగించేదిగా ఉంటోందా?

ఈ మధ్య టీనేజీ, ఆ పై వయసున్న (మన రాష్ట్రం లో )పిల్లలని గమనించి రాస్తున్న టపా ఇది. కొంత మందికి తమ లక్ష్యం మీద చక్కటి అవగాహన ఉండి పేరెంట్సు,స్నేహితులు,అంతర్జాల సహాయంతో తమ బంగారు భవిష్యత్తు కి బాటలు వేసుకుంటున్నారు.వీరికి సరదాలు,స్నేహితులూ ఉండనే ఉంటాయి అయినా సరే దేని దారి దానిదే.ఇలాంటి పిల్లలు ఈ కాలం లో ఉన్న తల్లి తండ్రులు నిజం గా అద్రుష్టవంతులు.

ఇంకొంతమంది పిల్లలు పూర్తి వ్యతిరేకం. వీరికి అమ్మ నాన్నలు, తమ శ్రేయస్సు కోరే వారు తప్ప అందరూ మంచివారు వీళ్ళ కళ్ళకి.

ఎంత సేపూ అమ్మా నాన్నలని తమ జీవితాలకి ప్రతిబంధకాలు గా భావిస్తున్నారే తప్ప వారు చెప్పేది ఏమిటో ఒక్క నిమిషమయినా ఆలోచించే తీరిక లేదు.పైగా ఫేసు బుక్కు ఇతర నెట్వర్కింగ్ సైట్లలో భారతీయ అమ్మ నాన్నలని సంత్రుప్తి పరచడం ఇంపాజిబుల్ అంటూ వీడియోలు,కార్టూన్లు,వాటికి వీరందరి ఆహా ఓహో లు,శభాష్ లూ ను.

జనరేషన్ గ్యాప్ అనేది నిరంతర స్రవంతి. అమ్మ నాన్నలకి,పిల్లలకీ మధ్య ఎప్పుడూ వంద శాతం అభిప్రాయాలు కలవవు.అంత మాత్రాన తల్లి తండ్రులని శత్రువులు గా చూస్తే ఆ తల్లి తండ్రులు తమ ఘోష ని ఎవరితో పంచుకుంటారు?అత్తగారో భర్తో,అల్లుడొ,ఆడపడుచో,కోడలో సాధిస్తే ఆ బాధ పంచుకోవడం తప్పు కాదు మన సమాజం లో కానీ పిల్లల గురించి ఎవరితోనైనా మనసు విప్పి చెప్పుకుంటే ఏమన్నా ఉందా...

పాపం ఇలాంటి బాధ ని తమలోనే దాచుకుని కుమిలిపోయే తల్లి తండ్రులని చూసి ఏడుపొచ్చినంత పనయ్యింది నాకు.

ఆ మధ్య టీవీలో చూసాను,ఒక 18-19 సంవత్సరాల ఆడపిల్ల పోలీసు స్టేషన్ కి వెళ్ళి తమ తల్లి తండ్రుల మీద ఫిర్యాదు. నాకు వాళ్ళు వద్దు,నా మానాన నేను ఉంటాను అంటే నన్ను వదిలేయట్లేదు అని.

అసలు కంటికి రెప్పలా కాపాడే తల్లి తండ్రులని వదిలి బయటకి వచ్చిన మరుక్షణం కాటెయ్యడానికి సదా రెడీ గా ఉండే తోడేళ్ళ గురించి ఎలా చెప్తే అర్ధం అవుతుంది ఇలాంటి ఆడపిల్లలకి?

నేడు ఏదో ఒక ఉద్యోగం దొరకడం గగనం కాదు కానీ కేవలం తల్లి తండ్రుల నుండి "విముక్తి" కోసం చదువు కి సంబంధం లేని ఏదో ఒక ఉద్యోగం లో చేరిపోయే ఆడపిల్లలని ఏమనాలి?

పోనీ వాళ్ళేఅమయినా నిజం గా రాచి రంపాన పెట్తెస్తున్నారా అంటే అదీ కాదు. ఎక్కువ ఫోను మాట్లాడద్దని అని ఉంటారేమో మహా అయితే అంతే. కూర్చుని చర్చించుకుంటే సమసిపోయే విషయాలకి కూడా వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకుని క్షోభ పెట్టే పిల్లలని చూస్తే అనిపిస్తుంది ఎవరిది తప్పు తల్లి తండ్రులదా,వేగం గా విస్తరించిన "నవీన" నాగరికతదా అని.

ఎమతసేపూ ఫ్రెండ్సు,ఇంటర్నెట్టు,పార్టీలు ఇవే తప్ప తల్లి తండ్రుల ఊసు పట్టని వారిని ఏమనాలి?ఈ క్రమం లో ఏదన్న జరగకూడనిది జరిగితే అప్పుడు ఆదుకునేది తల్లితండ్రులు తప్ప మరెవ్వరూ కాదు. దురద్రుష్టం ఏమిటి అంటే ఈ సంగతిని అలా కళ్ళు మూసుకు పోయిన పిల్లలు గ్రహించలేకపోతున్నారు తమ కళ్ళెదురుగా ఉదాహరణలు కనపడుతున్నా కానీ,తమకు అలా జరగదు అన్న గుడ్డి నమ్మకంతో.

అనుభవఙులైన పెద్దవారి మాట కంటే ఆ అనుభవమంత వయసు లేని స్నేహితుల మాట వేదం.దానికి తగ్గట్టే సినిమాలు,అందులో తల్లి తండ్రులని బఫూన్లు గా ప్రెజెంట్ చెయ్యడం.

ఈ హిపోక్రసీలు,అవసరార్ధం ఏర్పడే ఫ్రెండ్సు ఆపద్భాందవులు కాదని కళ్ళు మూసుకుపోయిన ఈ పిల్లలకి తెలిసేదెలా?


ఇక ప్రతీవాడికీ నేను డేర్ అండ్ డాషింగ్,ఎవ్వరికీ భయపడను అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. గట్టిగా పదిమంది ముందు తనని తాను ప్రెజెంట్ చేసుకోలేని వాడు కూడా డేర్ అండ్ డాషింగే అంటోంటే చూసి నవ్వొస్తోంది. చేతకాని తన్నాన్ని కప్పి పుచ్చుకోవడానికి కాకపోతే ఈ హిపోక్రసీ దేనికోసం?

తల్లి తండ్రులు వేలకి వేలు ఫీజులు కట్టి చదివిస్తోనంటే వీళ్లకేమో బైకు కావాలి,ఫోను కావాలి నెలకి వేలకి వేలు పాకెట్ మనీ కూడా ఇవ్వాలి జల్సాలకి.

అంత కష్టపడి చదివిస్తున్నారే,కనీసం తమకి చేతనైనంతలో సాయంత్రాలు ట్యూషన్ చెప్పో మరోటి చేసో కాస్త ఊతమిద్దాము అన్న స్ప్రుహే ఉండదు చాలా మందికి. పాపం, తల్లి తండ్రుల కోసం కదూ వీళ్ళు చదివేది.

చదువవ్వగానే ఉద్యోగం రాకపోతే అదో గోల మళ్ళీ.కోచింగులకి మరలా దోచి పెట్టాలి,విదేశాని వెళ్తానంటే మరలా అదో బోనస్ ఖర్చు.


పత్రికలో టీవీలలో ఎక్కడ చూసినా పిల్లలని ఏమీ అనద్దు,స్నేహితుల్లా మెలగాలి అంటూ హితబోధలొకటి. టీనేజీ నుంచే ప్రేమ దోమా అంటున్నా కానీ ఏమీ అనద్దంటే ఎలా?

"కౌన్సెలింగ్" ఏమన్నా ఉపయోగపడుతుందా ఇలాంటి పిల్లలకి అనిపిస్తుంది కానీ మన సమాజం,ఎదగాల్సిన విషయాలలో ఎదగలేదు కదా!. "పిచ్చి" వాళ్ళు మాత్రమే సైకాలజిస్టులని కలుస్తారు అనేది నూటికి 90 మంది ప్రగాఢ నమ్మకం.

అసలు కొంతమంది పిల్లలు ఇలా కొరగాని కొయ్యలుగా అవ్వడానికి కారణం ఏమిటీ అనేది ఎప్పటికీ డిబేటబుల్ అంశమే.కొంత మంది తల్లితండ్రుల వైపు వేలెత్తి చూపిస్తే, మరి కొంత మంది పిల్ల వైపు చూపిస్తారు.


కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్లు కారణం ఏదైనా గానీ ఎక్కువ బాధ పడేది మాత్రం తల్లి తండ్రులు. ఈ పిల్లలు వయసు దాటిపోయాకా తమ తప్పు తెలుసుకున్నా కానీ బాధ పడి ఏమి ప్రయోజనం?


అప్పుడెప్పుడో చూసిన జయసుధ సినిమా గుర్తొస్తోంది. ఆ సినిమాలో జయసుధ వాళ్ళ నాన్న ని నిలదీస్తుంది "నేను చేస్తున్నది తప్పు అని ఎందుకు చెప్పలేదు నాన్నా,ఆనాడే" అని.

హ్హ్మ్..ఈ సమస్య ఆనాడూ ఈ నాడూ ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే రోజురోజుకీ విశ్వరూపం దాలుస్తోంది.

మరీ సెన్సిటివ్ అయిపోతున్నారు పిల్లలు రాను రానూ. ఏమన్నా అంటే ఇళ్ల నుండి వెళ్ళిపోవడం లేదా గర్భ శోకం మిగల్చడం ఆత్మహత్యలు చేసుకుని.

మీడియా కూడా అతి గా చూపించడం ఇలాంటి వార్తలని. ఏమంటే ఏ కొంప మునుగుతుందో అని పాపం తల్లి తండ్రులు కూడా నోరెత్తడం లేదు.

వీటన్నింటికి తోడూ రియాలిటీ షో లు,డ్యాన్సు పాటల పోటీలు. నాలుగు గెంతులు వెయ్యగలిగి,తమ వీధి రామాలయపు పందిర్లలో పాడిన వాళ్ళు అందరికీ కూడా తాము గొప్ప డ్యాన్సర్లు సింగర్లమనే భ్రమ. పైగా తమని టీవీ పోటీలకి పంపకుండా తమ తల్లితండ్రులు తమ "టాలెంటు" ని అణగదొక్కెస్తున్నారని వీళ్ళ ప్రగాఢ నమ్మకం. ఈ అసంత్రుప్తి కి తోడు నీకేమిటే అందంగా ఉంటావు,సూపర్ గా పాడతావు అనో, డ్యాన్సు లో మెగాస్టారు తరువాత స్థానం నీదే,ఏమీ కాదు ట్రై చెయ్యి అని స్నేహితుల ప్రోత్సాహాలొకటి.

అసలు తల్లి తండ్రులు ఎందుకు వద్దన్నారో ఒక్క నిమిషం సావధానం గా ఆలోచించే తీరికెక్కడిది?

ఇప్పటి తరమే ఇలా ఉంటే,రాబోయే రెండు మూడు తరాలు...?బాబోయ్..

TEST POST