
బ్రేక్‌ఫాస్ట్ కి ఇడ్లీ,సాంబారు తో పాటు ఇంకో నాలుగైదు రకాలు,మధ్యాహ్నం భోజనం లో టమాటా పప్పు,నెయ్యి,ఆలూ పరాఠా,పిజ్జా,మటర్ పనీర్,రసం,క్యాబేజీ కూటు,ఫ్రైడ్ రైస్,రాత్రికి ఇంచుమించు గా ఇదే తరహా భోజనం,అదనం గా సలాడ్లు,భోజనానంతరం కేకులు,పేస్ట్రీలు,కట్ చేసి పెట్టిన ఓ నాలుగైదు రకాలా ఫలాలు,మధ్య మధ్య లో కావాల్సిన "పానీయాలు"..ఈ మధ్య జరిగే పెళ్ళిలళ్ళో ఇదే తరహా భోజనం ఉంటోంది కదా...
ఇలాంటి భోజమే నాకు నడి సముద్రం లో దొరికందంటే నమ్ముతారా ఒక్క రోజు కాదు వరుసగా ఐదు రోజులు.ఈ మధ్య అదు రోజులపాటు క్రూజ్ లో ప్రయాణించాను.అధ్భుతం అంతే ఆ అనుభవం. అంతకుమించి మాటలు లేవు దాని గురించి వర్ణించాలంటే.
బాల్కనీ ఉన్న క్యాబిన్ బుక్ చేసుకోవడం తో,హాయిగా బయటకి వచ్చి కూర్చుంటే,చుట్టూ అనంత సాగరం,పైన ఆకాశం తప్ప ఏమి కనిపించనప్పుడు టార్గెట్లు, ఇతరత్రా అన్నీ మర్చిపోయినప్పుడు మనసుకి కలిగే ప్రశాంతత,అంతలోనే ఆ అనంత సాగరాన్ని చూసి కలిగే చిన్న గగుర్పాటు,ఈ అనంత స్రుష్టి లో మనమెంత అల్పులము అనే "టెంపరరీ" వేదాంతం ఇవీ నా మనసులో మెదిలిన భావాలు అలా బాల్కనీ లో కూర్చుని సముద్రాన్ని చూస్తే.ఎవర్ గ్రీన్ అధ్భుతాలయిన సూర్యోదయ సూర్యాస్తమయాలని నా మొద్దు నిద్ర,ఇతర వ్యాపకాల వల్ల ఓ రెండు సార్లు మాత్రమే చూసాను.
శ్రీ పాదవారినో పాల గుమ్మి వారినో చేతిలో పట్టుకుని కూర్చుంటే బాగుంటుంది ఉదయం సాయంకాలాలలో..ప్చ్చ్ కానీ నేను ఒక్క పుస్తకం కూడా వెంట తీసుకెళ్ళలేదు.ఈ సారి వెళ్తే కనుక ఓ నాలుగైదు పుస్తకాలు పట్టుకుని వెళ్ళాలి.
1600 మంది ప్రయాణీకులలో దాదాపు సగం మంది "దేశీ" లు.తెలుగువారే కాకుండా వివిధ రాష్ట్రాలవాళ్ళున్నారు.
మన దేశీలతో అన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నట్లు ఉండటం ఓ "గమ్మత్తయిన" అనుభవం.నడి సముద్రం లో అంత దేశీ భోజనం దొరకడమే అద్రుష్టం అనుకోకుండా రుచుల మీద కామెంటే కాంతారావులు,తాను రోజుకు ఒక్క సారి "తాజ్ మహల్" టీ మాత్రమే తాగుతానని,క్రూజ్ లో టీ చెత్తలా ఉందని సణిగే "సక్కుబాయిలు" మంచి టైంపాస్ డైనింగు హాలు కి వచ్చినప్పుడల్లా.
బిర్యానీ బావార్చీలో లాగ లేదనో,చికెన్ కర్రీ కి మసాలా బొత్తిగా లేదనో మొహం మాడ్చుకునే మహానుభావులు/భావురాళ్ళు కూడా ఉన్నారండోయ్.గమ్మత్తేమిటంటే,వీళ్ళు సణుగుతూనే అన్ని రకాలూ ప్లేటు లో వడ్డించుకోవడం.
అబ్బే,అస్సలు ఉప్పు కారాలు లేవంటూ భోజనం దగ్గర మొహం మాడ్చుకున్న అత్తగారిని ఓ రెండు రోజులపాటు పట్టించుకుని విసుగెత్తిన మరాఠీ కోడలు పిల్ల,మూడోరోజు తన మానాన తను ప్లేటు నిండా రకరకాల పదార్ధాలని నింపుకు రావడం మాత్రం హైలైట్.
చాలా మంది ద్రుష్టి లో భోజనం అంటే తాము రోజూ తినేదే.మిగతావన్నీ వేస్ట్ వీళ్ల ద్రుష్టి లో. తమకి ఇంట్లో ఉన్నట్లే, బయట, అందులోను దేశం దాటి బయటకి వచ్చినప్పుడు కూడా ఉండాలని ఎలా ఆశిస్తారో అర్ధం కాదు.
వివిధ దేశాల వారిని ద్రుష్టి లో పెట్టుకుని వండినప్పుడు, మన జిహ్వ కి తగ్గట్లు ఉప్పులు,కారాలు,మసాలాలూ ఉండాలంటే ఎలాగ?
అందరూ క్యూ లో కదులుతోంటే జస్ట్ నేను సాంబారు కోసమో కూర కోసమో మాత్రమే వచ్చానని మధ్యలో దూరేసి,వడ్డించుకుంటున్నవాళ్ళ చేతుల్లోంచి "సుతారం" గా గరిటెలు లాక్కునే ఘనులనీ చూసితీరాల్సిందే.
కాస్త గాలి పీల్చుకుందామని డెక్ మీద స్విమింగు పూల్ పక్కగా ఉన్న కుర్చీలలో నడుం వాల్చిన కాసేపటికి 50-60 ఏళ్ళున్న ఓ ఐదుగురు మగవారు వచ్చి రెండు కుర్చీలలో సర్దుకు కూర్చున్నారు ఆరుబయట నులక మంచాల మీద కూర్చున్నట్లు.వాళ్ళు సర్దుకు కూర్చుంటే నాకేమి బాధ కానీ,కాసేపటికి వాళ్ళ భార్యలు వచ్చారు అని నన్ను పక్కకి జరగమన్నాడు అందులో ఉన్న ఓ పెద్దాయన.అదేదో కాస్త మర్యాదగా చెప్పొచ్చు కదా,ఊహూ... అక్కడికేదో ఆయన జాగా ని అన్యాయం గా ఆక్రమించుకున్నట్టు.అంత వయసొచ్చినా కొంత మంది ఎందుకలా చేస్తారో అనిపిస్తుంది.
అలాగని విదేశీయులందరూ రూల్సు పాటించెస్తారు, ,మర్యాదస్తులు అని కాదులెండి.
ఇక క్రూజ్ విశేషాలో కి వస్తే మీకు గూగుల్ ల్లో బోలేడు సమాచారం దొరుకుతుంది అయినా నాకు నచ్చినవి కొన్ని చెప్తాను.సాయంత్రం అయితే చాలు, ఓ రెండు వందలు పట్టే ఆడిటోరియం లో ఏదో ఒక కార్యక్రమం,70 కెపాసిటీ ఉన్న బుల్లి హాలు లో రోజంతా నడిచే సినిమాలు,లైవ్ బ్యాండ్లు,డిస్కో,లైబ్రరీ,పిల్లల క్లబ్,వీడియో గేం జోన్,దాదాపు 19 గంటలు తెరిచి ఉండే ఫ్రీ రెస్టారెంటు(వాళ్ళిచ్చిన డైనింగు క్రెడిట్ ఉన్నంత వరకే ఫ్రీ!!సరిపోనే ఇచ్చారులెండి పాపం డైనింగు క్రెడిట్ ),కొన్నీ 24 గంటల రెస్టారెంట్లు,పెయిడ్ ఇంటర్నెట్టు,జిమ్ము,వాటర్ స్లైడు,స్విమ్మింగు పూలు..ఒకటేమిటి సకల సౌకర్యాలూ ఉన్నాయందులో.ఆ కార్యక్రమాలో సినిమాలో చూస్తున్నంతసేపూ నిజంగా ఏదో హాల్లో ఉన్నమన్న అనుభూతి తప్ప నీళ్ళ మీద ఉన్నామన్న భావనే రాదు.
ప్రస్తుతం ఫేస్ బుక్ మేనియా నడుస్తున్నట్లుంది..పెయీడ్ ఇంటర్నెట్ అయినా కానీ క్రూజ్ లో ఇంటర్నెట్టు సెంటర్ కి వెళ్ళి ఫేస్ బుక్ ఓపెన్ చేసి అప్ డేట్స్ ఇస్తున్న వారిని చూసాను.
చివరి రోజు జరిగిన "కెప్టెన్స్ టాక్" చాలా బాగుంది. ఒక షిప్ కెప్టెన్‌ని చూడటం అదే మొదటిసారి. ఎంతో అబ్బురమనిపించింది. అతని ప్రసంగం కూడా బాగుంది.కానీ కాస్త లేటు గా లోపలకి వచ్చి పిచ్చి ప్రశ్నలతో అందరికీ విసుగు తెప్పించిన అతి తెలివి "సాంబార్ భాయ్"ని మాత్రం మర్చిపోలేను.
ఇలా జరిగింది నా మొదటి సముద్రయానం.