Friday, March 18, 2011

మంచు వారమ్మాయికి బహిరంగ లేఖ

అమ్మా తల్లీ మంచు లక్ష్మీ ప్రసన్నా...మీరు మాట్లాడే భాషని తెలుగు అని ఎవరమ్మా అనేది? మీరు చెన్నై లో పుట్టి పెరిగి ఉండవచ్చు కానీ మీరు మాట్లాడితే తెచ్చి పెట్టుకున్న యూఎస్ యాస కనిపిస్తుందే కానీ సాంబారు వాసన తెలుగు అని మచ్చుకైనా అనిపించదు.

మీ షో కి వచ్చిన అచ్చ తమిళ్ అమ్మాయి ప్రియమణి తెలుగు ఎంత బాగా మాట్లాడింది? మరి మీకు ఏమి ఇబ్బందో అర్ధం కాదు తెలుగు సరిగ్గా మాట్లాడటానికి. ఎంతో మంది యాంకర్లుండగా నేను మిమ్మల్నే ఎందుకు పాయింటవుట్ చేస్తున్నాను అంటే,మీ నాన్నగారు విరిచి విరిచి మాట్లాడుతూ తానేదో డైలాగ్ కింగునని ఫీల్ అయిపోతారు,దానికి యధా శక్తి మీరు మీ షో లో ఆయనకి పబ్లిసిటీ ఇస్తారు కదా. అలాంటి "మహానుభావుడి" కూతురిగా మీకు ఇది తగునా?

తెలుగు రాదు రాదు అని చెప్పుకోవడం మీకు ఫ్యాషనో ప్యాషనో అర్ధం కాదు మాకు.

ప్రతీ సారీ మీరు కెమేరా ముందుకి వచ్చినప్పుడల్లా అది ప్రెస్ మీట్ కానీ,మీ షో కానీ,మరింకేదైనా కానీ "నేను అమెరికా లో పదేళ్ళు ఉన్నాను" అని పదే పదే చెపడం అవసరమా? అక్కడ పదేళ్ళు కాదు దానికి మూడు నాలుగు రెట్ల సంవత్సరాలనుండీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళపిల్లలు చక్కగా మాట్లాడతారే.

తెలుగు రాకపోతే తెలుగు షో లు చెయ్యకండి. మేమేమీ గోప్ప యాంకర్ ని మిస్స్ అవ్వము.మొన్నటికి మొన్న దొంగల ముఠా లో " ఆ అమ్మాయి ఎందుకు పారిపోతోంది" అనడానికి,"ఎందుకు ఫారిపోతంది" అన్నారు. ఇక్కడే అర్ధం అవుతోంది మీకు ఒక రకమైన తెలుగు మాండలికం బహు చక్కగా వచ్చని.

మీరు మాట్లాడేటప్పుడు మీరు తరచుగా ఉపయోగించే "చాస్తనాను/చూస్తనాను","ఉప్పుడు"("ఇప్పుడు" కి వచ్చిన కష్టం లెండి)"యనకాల" మొదలగు పదాలు వింటే ఇట్టే అర్ధం అవుతుంది ఎవరికైనా మీ అసలు తెలుగు స్వరూపం.
ఇలాంటి తెలుగు కి యూఎస్ యాస ముసుగేసి తెలుగు రాదని మభ్య పెట్టాలనుకోవడం అవివేకం.


పైగా మీరు "విస్మరించడం",అని వాడాల్సిన చోట "విశ్రమించడం" అని వాడి మా లాంటి వాళ్ళకి ఒక్క నిమిషం ఏది కరెస్టు అని ఆలోచనలో పడేసిన మేధావులు.మీ లెవెల్ కి తెలుగు టాక్ షో లు సరిపోవులెండి.

వీటన్నింటికి తోడు మీ తెలుగు క్యూట్ గా ఉంది అని డబ్బులిచ్చి రివ్యూలో రాయించుకోవడం.

ప్లీజ్, అలాంటి "మహానుభావుడి" కూతురిగా మీకు ఇది తగదు కానీ,మమ్మల్ని వదిలెయ్యండి ఈ ఒక్క జన్మ కీ దయ చేసి.

మీ తెలుగే భరించలేమంటే అసలు మీరు మీ షో లో గెస్టు ని హ్యాండిల్ చేసే విధానం దారుణం. అసలు వాళ్ళకి మాట్లాడే ఛాన్సివ్వారు.వాళ్ళెదైనా చెప్తోంటే మీరు అందుకుని మీ పతి దేవులయిన ఆంజనేయులో ఆనందో (అదే, మీరు ఆండీ అంటారు లెండి)గురించో లేదా అన్నగారి తరువాత తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన "వజ్రం" అయిన మీ నాన్నగారి గురించో సొద.ఈ రెండూ లేకపోతే స్వోత్కర్ష నేను ఆ కోర్సు చేసాను ఇక్కడ ఇన్నేళ్ళున్నాను అని.

భాష ని ఖూని చేస్తూ, స్వోత్కర్ష వినిపిస్తూ ఒక షో చేస్తే అది టాక్ షో కాదని మాత్రం గుర్తు పెట్టుకోండి.

( గమనిక:పైన వాడిన కొన్ని పదాలు ఫలానా మాండలికాన్ని ఎగతాళి చెయ్యడానికి రాసినది కాదు. ఆవిడ తెలుగు రాదు అంటోంటే ఇలా ఉదహరించాల్సి వచ్చింది.ఎందుకంటే తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి, వాళ్ళు పుట్టి పెరిగిన మాండలికం ఉండిపోతుంది,తొలగించాలనుకున్నా అది ఎప్పుడో అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు తొంగిచూస్తూనే ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం.)

Friday, March 11, 2011

ఇలా చేస్తే?

మొదట ఒక చిన్న డవుటు,ట్యాంకు బండు మీద పోతన విగ్రహం ఉంది కదా!ఆ విగ్రహాన్ని కూల్చలేదెందుకో,ఆయన వరంగల్ కి చెందిన వాడనా? అలాగే రుద్రమ దేవి మీద కూడా సేం డవుటు.ఆన్ లైన్ లో లభ్యమైన వార్తల ప్రకారం ఇవి ధ్వంసం కాలేదు.
(కవులు కళాకారులకేనా ప్రాంతీయ తత్వం ఆపాదించడం? మున్ముందు ప్రత్యేక వాదుల పైత్యం ఇంకాస్త ముదిరి సీమాంధ్రులని యాదగిరిగుట్ట,భద్రాచలం రావద్దు అంటారేమో కూడా.)

ట్యాంకు బండు మీద విధ్వంసానికి తెగ బాధ పడిపోతున్నాము కానీ అవసరమా చెప్పండి.మనకి ఇది కొత్తా కాదు మరలా జరగదు అని కూడా చెప్పలేము.మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే పై చేయి చేసుకున్నారు,అంతకముందు నోటికొచ్చినట్లు మాట్లాడారు. నిన్న ఇక సహనాన్ని పరీక్షిస్తూ ఈ విధ్వంసం స్రుష్టించారు.

ఇలాంటి వాటి తరువాత ఏమి జరుగుతుంది?

నిందితలని కఠినం గా శిక్షిస్తాము అనే ప్రకటన యధావిధి గా గ్రుహ మంత్రిణి నుండి వెలువడుతుంది. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే,తక్షణమే రాజీనామా చెయ్యాలి ముఖ్య మంత్రి అని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటాయి.మనము ఇలా టపాలు రాసుకుంటాము,టీవీలలో చర్చలు, రచ్చలు జరుగుతాయి,మండే కల్లా మన గుండె మంట చల్లారుతుంది,మళ్ళా మామూలే.

ఇంత గొడవలో తమని విస్మరించారనుకున్నారేమో ఈరోజు సమైఖ్యాంద్ర ఐకాసా వారు వార్నింగ్ ఇచ్చేసారు విగ్రహాలని పునః ప్రతిష్టించకపోతే ఉద్యమం ఉధ్రుతం చేస్తాము అని. వీళ్ళెప్పుడయినా ఉద్యమం చెయ్యగా ఎవరైనా చూసారా?

అయ్యిందేదో అయ్యింది,అసెంబ్లీ లో తీర్మానం పెడదాము ప్రత్యేక రాష్ట్రం కోసం అని సింపుల్ గా ఓ సలహా పారేసారు ఇంకో ప్రజాప్రతినిధి గారు. తమ మత విశ్వాసాలకి సంబంధించిన కట్టడం మీద ఈగనైనా వాలనీయని ఆ పెద్ద మనిషి,తమ వారిని అదుపులోకి తీసుకున్నారు ని తెలియగానే అర్ధరాత్రైనా స్టేషన్ కి వెళ్ళి విడిపించుకునే మత మూర్ఖత్వాన్ని అణువణువునా జీర్ణించుకున్న ఆ పెద్ద మనిషి కి ఏమి తెలుస్తుంది,ఎలా చెప్తే అర్ధం అవుతుంది సాంస్కౄతిక వైభవం అంటే?


నిన్న న్యాయవాదులని అక్రమం గా నిర్భందించారుట అందుకని అక్కడెక్కడొ న్యాయవాదులు విధుల బహిష్కరణ. ఏమిటిది?పోలీసులు వద్దు అని చెప్పినా కానీ విధులకి డుమ్మా కొట్టి మరీ రావడమే తప్పు,అరెస్టు చేసారని మరలా విధులు బహిహ్కరించి పౌరులని ఇబ్బంది పాలు చెయ్యడమా?మనకి అవసరపడితే కానీ తెలీదు న్యాయవాది విలువ. ఆ న్యాయవాదుల కోసం ఎంత మంది ఎదురుచూస్తూ ఉంటారు పాపం?

ఇప్పుడే స్క్రోలింగు చూసా, మన జర్నలిస్టు తమ్ముళ్ళు పాలాభిషేకం చేసేరుట పాక్షికంగా కూలిన ఏదో విగ్రహానికి.
థాంక్యూ తమ్ముళ్ళూ,ఇన్ని రోజులూ నాకు పాలాభిషేకాలు,పెరుగు అర్చనలు ఇలాంటివి రాజకీయ నాయకులని గుడ్డిగా నమ్మే చిన్న చితకా పని లేని నాయకుల ఆధ్వర్యం లోనే జరుగుతాయి కాబోలు అనే భ్రమ ఉండేది. నా భ్రమ ని పటాపంచలు చేసి హుస్సేన్ సాగర్ లో వేసేసారుగా.

జర్నలిస్టులకి ప్రజా గాయకుడు,ప్రొఫెసర్ గారు క్షమాపణ చెప్పారుట వారి మీద దాడి జరిగినందుకు.మరి వారు కూల్చేసిన విగ్రహాల సంగతేంటో?ఎండనకా వాననకా పని చేస్తూ, మదపుటేనుగుల్లా ప్రవర్తించే ఆందోళన కారుల రాళ్ళ వర్షాన్ని,వారి దాడిని కేవలం పాత కాలపు ఆయుధాలతో కాచుకునే పోలీసులు గుర్తుకు రారెందుకో మరి క్షమాపణ అడగడానికి.

(స్వగతం: ఛీ ,వెధవ ఎమ్మెన్సీ లో ఉద్యోగాలు,ఒక్క సమ్మే చెయ్యడానికుండదు,ఒక్కడు సారీ చెప్పడు)

సరే,విగ్రహాలకి ప్రాణం లేదు ఒప్పుకుంటున్నాము భాయ్, మీ గులాబీ భవనం లో ఉన్న విగ్రహానికి ఏమైనా అయితే ఇలాగే అనేవారా?


విగ్రహాల సంగతి వదిలెయ్యండి,జైళ్ళలో మగ్గుతున్న విద్యార్ధుల సంగతి చూడండి అని ఇంకో మేధావి సింపుల్గా శలవిచ్చారు.వెళ్ళి ఉద్యమం లో పాలుపంచుకో నాన్న,నీకు ఉద్యోగం వస్తుంది అని ఏ తల్లీ తండ్రీ చెప్పి పంపరు ఈ విద్యార్ధులని.క్యాంపస్ లో సీటంటే మాటలు కాదు. అసలు విలువ లేకుండా పోతోంది వీళ్లకి చదువంటే. ఏమన్నా అంటే అధ్యాపకులని చితక్కొట్టి హీరోలయ్యామనుకుంటున్నారు.మెల్లిగా చెప్తే తలకి ఎక్కదు కానీ వీరిని ఎంత కాలం వీలైతే అంత కాలం జైళ్ళలోనే మగ్గనిస్తే బాగుటుంది.నేరస్తులకి ఏ మాత్రం తీసిపోరు వీళ్ళు. అప్పుడు కోర్టులనీ వాయిదాలనీ తిప్పేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోయి వీరి చదువు అటకెక్కుతుంది.అప్పుడైనా బుద్ధొస్తుందేమో.

ఈరోజు మనజర్నలిస్టులు రాజకీయ నాయకులని బహిష్కరించారుట అసెంబ్లీ లో. మంచిది. అదే పని మీరు నిన్న ఆ మార్చ్ కవరేజ్ కి చేసుంటే బాగుండేది కదా. మేము లేకపోతే మీకు న్యూస్ ఎలా వస్తుంది అని హూంకరిస్తున్నారా? అక్కడికే వస్తున్నా.పనికిరాని నాయకుల పేర్లు సామాన్య ప్రజానీకానికి తెలిసిందే మీ వల్ల,మీరు వారికిచ్చే అనవసర కవరేజ్ వల్ల.మీడియా మైకులని,కెమేరాలని చూడగానే ఒళ్ళు మరచి మాట్లాడతారు కదా మన నాయకులు. అదే మీరు వారిని పూర్తిగా విస్మరించారనుకోండి,మహా అయితే ఒక ఛానెల్,ఒక పేపర్ లో వస్తుంది ఈ వార్త అంతే కదా. కవరేజ్ రాకపోయేసరికి వీళ్ళకి కిక్కుండదు. ప్రత్యేక వాదులే కాదు,సమస్యలు వదిలి అనవసరం గా రోడ్డెక్కే ఎవరి మీదైనా ఈ అస్త్రాన్ని ప్రయోగించి చూడండి.

మీరు కవరేజ్ ఇవ్వబట్టే కదా,పాలిటెక్నిక్ కుర్రాడు ప్రేమ విఫలమయ్యిందనో,మరొకడు పక్కింటివాడు గోడ కాస్త పక్కకి జరిపాడనో బిల్డింగులు,టవర్లూ ఎక్కి బెదిరింపులు సాధారణమయ్యాయి.

ఒక్కసారి మానేసి చూడండి ఇలాంటి పనికిమాలిన ఆందోళనలని,ప్రజలకి అసౌకర్యం కలిగించే ధర్నాలు,రాస్తారోకోల కవరేజ్ ని.
(ఇలాంటివి మానెస్తే మీరు,మీ వాహనాలు కూడా సురక్షితం)

నిజంగా మీకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అనేక సమస్యలున్నాయి నిరుపేదలకే కాదు మధ్య తరగతి వారికి కూడా.వాటి మీద మీ ఫోకస్ పెట్టండి.అంతే కానీ ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఇంకా ఆవేశం గా కవరేజీ ఇవ్వడం,రెండు వేలు లంచం తీసుకుంటున్న చిరుద్యోగి మీద కధనం గొప్పతనం కాదు.

Wednesday, March 9, 2011

జర సోచాయించుడ్రి

ఏమిటిదంతా అసలు మార్చ్ లు అదీ ఇదీ అని గొడవ ఓపక్క పిల్లలు పరీక్షలకి సిద్ధమవుతోంటే. అసలే మన చదువులు ఇంటరు పిల్లలకి జీవన్మరణ సమస్య లాంటిది. రెండేళ్ళు కాలేజీల్లో ఎంత తోమినా కానీ పరీక్ష ముందు రోజు ఉండే ఆదుర్దా ఎలాంటిదో మనకి తెలుసు.

రేపు ఏదో మార్చీ ఏప్రిల్లు అంటున్నారు కదా,పిల్లలు పాపం ఎలా వెళ్తారో అని తెలుసున్న ఇద్దరు ముగ్గురిని అడిగాను. ఒకళ్ళేమో పరీక్ష ఉందని తమ పిల్లాడి పరీక్షా కేంద్రం దగ్గరలో గల బంధువుల ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. ఇంకొకళ్లకేమో,పరీక్షా కేంద్రం దగ్గర్లో ఎవరూలేరుట.
వాళ్ళ పిల్ల చదువుతున్న స్కూలు వాళ్ళు ముందు రోజు రాత్రికే వచ్చి ఉండమన్నారు,పొద్దున్నే గంట ముందు పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తారుట ముందు జాగ్రత్త కోసం అని చెప్పారు.

అసలు పిల్లలని పరీక్షలప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం ఏమి భావ్యం?స్కూల్లో పడుకుని మరునాడు వెళ్ళి పరీక్ష రాయడం అనుకున్నంత తేలిక కాదు.

ఇప్పుడంటే ఆ ప్రొఫెసర్ గారు మాట మార్చి శాంతియుతం గా చేస్తాము,మధ్యాహ్నం చేస్తాము అంటున్నారు కానీ అసలు ముందంతా ఎంత హడావిడి,పైగా తమకి పోలీసుల అనుమతి అక్కర్లేదు ప్రజల అనుమతి ఉంది అనే సుభాషితం ఒకటి ఆయన నోటి నుంది జాలు వారింది.

వీళ్ళు ఇంతకుముందు చేసిన ఆందోళనలవీ చూసిన వాళ్ళేవరైనా, మేము ఇప్పుడు శాంతియుతం గా మార్చ్ నిర్వహిస్తాము
అంటే నమ్ముతారా?ఒక పదిహేను ఇరవై రోజులలో పరీక్షలు పెట్టుకుని,ఇలాంటి వాటికి జిల్లా ల నుండి విద్యార్ధులు కూడా వస్తున్నారంటే వాళ్ళు నిజమైన విద్యార్ధులేన అన్న అనుమానం వస్తోంది.

నాదో సలహా ప్రొఫెసర్ గారికి,వారి అధినాయకుడికీ. హాయిగా మీరు ఈ "మార్చ్" ని "మే' గా మార్చెయ్యండి,అదేనండీ మే లో పెట్టుకోండి,ఈరోజుకి ఏదో తూతూ మంత్రం గా చేసేసి. ఎలాగూ మీరు రేపు వంటా వార్పూ అనీ రోడ్ల మీదే అన్నారు కదా, మే లో అయితే ఎంచక్కా వంట త్వరగా అయిపోయి మీకు బోలెడు ఇంధనం ఆదా. భగ భగ మండే ఎండల్లో మీరు కానీ ఈ మార్చ్ నిర్వహిస్తే మీకు సానుభూతి దక్కి,ప్రజలంతా ఈజిప్టు లో లాగ మీ వెంట కదలడంతో ప్రపంచ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం లో మీ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మే లో రొజంతా పెట్టండి సార్ ఈ కార్యక్రమాన్ని, ప్రజల అనుమతే గా కావాల్సింది మీకు.ఇచ్చెస్తున్నాము తీసుకోండి.

పైగా మే లో విద్యార్ధులందరూ ఖాళీ గా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని ఉండే సమయం. జర సోచాయించుడ్రి మరి.

Tuesday, March 1, 2011

ఈలలు,కేకలు,చప్పట్లు,విజిల్సు,వీరతాళ్ళు...ఇంకా మరెన్నో

సామాజిక బాధ్యత అనే తెర అడ్డం పెట్టుకుని బురద చల్లడమే అజెండా గా కార్యక్రమాలు రూపొందించే ఒక తెలుగు ఛానెల్ కి వీక్షకుల సాక్షి గా తమ మీదే బురద పడేసరికి దిమ్మ తిరిగి ఉండాలి పోయిన వారం.

అసలు ఆ ఛానెల్ కీ,బాలీవుడ్/టాలీవుడ్ దర్శకుడికీ ఏమి జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం తో నిన్న ఇంటర్నెట్ లో వీడియో లు చూసాను.

అసలు వివాదానికి ఆజ్యం పోసిన వీడియో చూడలేదు కానీ ఆ కధనం మీద జవాబు చెప్పేందుకు ఆ ఛానెల్ స్టూడియో కి వచ్చి ఏ మాత్రం తొణకక,బెణకక సమాధానాలిస్తూ ఆ ఛానెల్ యాంకర్ ని మొదటి నిమిషం నుండే డిఫెన్స్ లో పడేసిన ఆ దర్శకుడి వాక్పటిమకి జోహార్లు.

ఈ ఛానెల్లో నాకు సరైన విషయ పరిఙానం ఉన్న న్యూస్ ప్రెజెంటర్లు,చర్చా నిర్వాహకులే కనపడరు. ఒక వేళ ఉన్నా,జుట్లు ముడేయడం తప్ప సరైన మార్గం లో కార్యక్రమమం జరపకూడదు అన్న తమ సంస్థ నియమాలకి లోబడి పనిచేస్తున్నారేమో తెలీదు మరి.

ఇక విషయానికి వస్తే తాము ప్రసారం చేసిన కధనం మీద కేసేసిన సదరు దర్శకుడిని ఛానెల్ కి పిలిచారు. ఈ ఛానెల్లో చర్చ(రచ్చ)లు నిర్వహిస్తూ తానేదో గొప్ప యాంకర్ ని అని భావించే యాంకర్ గారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత.

మొదట తాము ప్రసారం చేసిన కధనం లో కొన్ని భాగాలని చూపించి చర్చ మొదలెట్టారు.

ఆ తరువాత ఈ దర్శకుడు రాసిన ఒక పుస్తకాన్ని విమర్శిస్తూ, ఒకప్పుడు ఆంగ్ల పుస్తకాలని తెలుగు లో విజయానికి నిచ్చెనలు మెట్లూ అంటూ తర్జుమా చేసేసి పర్సనాలిటీ డెవలపర్ గా అవతరించిన ఒక ప్రసిద్ధ రచయిత గారు ఓ కోతి కధని ఉదాహరణ గా చెప్పారు. అంతా విని దానికి ఈ దర్శకుల వారి సమాధానం ఎలా మొదలెట్టారనౌకున్నారు?

"నాకెందుకో ఆ రచయిత గారి మొహం కోతి లా అనిపించింది ,బహూశా కోతి కధ చెప్పబట్టి కాబోలు" అని అందుకుని ఇక ఆయన శైలి లో కొనసాగి చివాఖరున
"నాకు సలహాలు ఇవ్వకుండా ఆ రచయిత గారు తన పుస్తకాల మీద శ్రద్ధ పెడితే ఆయన బుక్స్ బాగా అమ్ముడవుతాయి" అంటూ ముక్తాయించారు.

ఖంగు తిన్న వ్యాఖ్యాత వెంటనే ఒక ఫిలిం క్రిటిక్ మేధావి ని లైను లోకి తీసుకొచ్చారు.


ఆయనేమో, మీరు చెత్త సినిమాలు తీస్తున్నారు ఎందుకు జనాలని చంపుతారు,శివ సినిమాల్లాంటి హిట్ సినిమాలు ఎందుకు తియ్యరు అని ప్రశ్నించి తానెంత మేధావినో బయటపెట్టుకున్నారు.

అంతా ఆలకించిన దర్శుకుడేమో

"నేను కావాలని ఫ్లాపు సినిమా తియ్యాను. నిజం చెప్పాలంటే ప్రేక్షకుల కంటే మేము ఎక్కువ సమయం,డబ్బు ఖర్చు బెట్టి సినిమా తీస్తున్నాము. ఏదయినా సరే హిట్టవుతుందనే తీస్తాము,మీకు నచ్చలేదా,సరే నేను తీసే మరో సినిమా కి వెళ్ళకండి" అని కుండబద్దలుకొట్తేసాడు.

వెంటనే ఇంకొక మేధావి గారొచ్చారు లైన్లోకి.ఆయన గారేమో ఈ దర్శకుడు కేసెయ్యడం చూసి హాచ్చర్యపోయారు.పైగా,ఏ ఛానెల్ మీద కేసేసారో అదే ఛానెల్ ఆఫీసు కొచ్చి కూర్చోవడం ఎక్కడా చూడలేదుట ఈ మేధావి గారు.

దీనికి ఆ దర్సకుడి సమాధానం ఏంటనుకున్నారు?

" మీరు ఇప్పటివరకు నిద్రపోతున్నారో,వింటున్నారో నాకు తెలీదు కానీ నేను కేసు వేసినది మీ కధనం లో ఉన్న ఒకే ఒక్క లైను మీద అభ్యంతరం వ్యక్తం చేసి. ప్రేక్షకుల గురించి నేనేమనుకుంటున్నానో నా తరపున చెప్పటానికి మీరెవరు?"
ఇంతలో వ్యాఖ్యాత అందుకుని వర్మ గారూ మీరు సినిమాలలో జర్నలిస్టులని నీచాతినీచం గా చూపిస్తారు,మేము కంప్లైంట్ చేస్తున్నామా అనే వేగ్ ఆర్గ్యుమెంటొకటి.


నాలాంటి వాళ్లకి అర్ధమయ్యిందేమిటయ్యా అంటే జర్నలిస్టుల మీద కామెడీ యో సెటైరో పడేసరికి వీళ్ళకి ఒళ్ళుమండింది. ఎన్ని సంవత్సరాలనుండీ పోలీసులని నాయకులనీ నీచం గా చూపట్లేదు సినిమాలలో? ఈ మధ్య కాలం లో టీచర్లు తల్లి తండ్రులు లమీద పెట్టిన కామెడీ ట్రాక్స్ ని ఖండించడానికి వీళ్ళకి నోర్లు రావెందుకు?

ఆద్యంతం ఏ మాత్రం సహనం కోపోకుండా తన వాదనని డెఫెండ్ చేసుకుంటూ, తాను చెప్పల్సినది క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్న దర్శకుడి ప్రతిభ కి ఖంగు తిన్న మన యాంకర్ గారి మొహం చూసి తీరాల్సిందే.

ఇన్ని రోజులూ వీరు నిర్వహించే చర్చలకి రాజకీయ నాయకులో లేదా ఆ ఇజం ఈ ఇజం అంటూ ఆవేశం గా మాట్లాడే నాయకురాళ్ళో వచ్చి ఒకళ్ళమీద ఒకళ్ళు నోర్లు పారేసుకుంటోంటే వినోదించే ఛానెల్ నిర్వాహుకలకి ఇలాంటి మనుషులు ఎదురు పడటం మింగుడు పడని విషయమే.

పూర్తిగా డెఫెన్స్ లోకి వెళ్ళిపోయిన యాంకరు ఇక ఆ దర్శకుడి సినిమాలలో అమ్మాయిలని చూపించే విధానం మీద పడ్దారు.మీకు సామాజిక బాధ్యత లేదా అంటూ."కామ రాజులు-రాసక్రీడలు" లాంటి ప్రోగ్రాం పేర్లు పెట్టి రోజంతా బూతు క్లిప్పింగులని చూపించిన రోజు ఏమయ్యిందో ఈ ఛానెల్ వారి బాధ్యత? అసలే మెరుగైన సంఘం కోసం అనే నినాదం ఒకటి.

ఆ దర్శకుడు క్లియర్ గా చెప్పాడు నేను సందేశాలిస్తే చూడటానికి ఎవ్వరూ రెడీగా లేరు నేను టీచర్నో ఇంకొకరినో కాదు పాఠాలు చెప్పడానికి అంటూ. అయినా అదే ప్రశ్న మీకు బాధ్యత లేదా అంటూ.

అటు చేసి ఇటు చేసి చర్చని ఆ దర్శకుడు తీసిన ఫ్యాక్షన్ సినిమా మీదకి మళ్ళించి వెటకారం గా ప్రశ్నించి కడిగేద్దామనుక్కున యాంకర్ ఆశలు ఆవిరయ్యాయి గొడ్డు కారం లాంటి ఆయన సమాధానాలకి.

మీ సినిమాల వల్ల ఫలాన జిల్లాలో మరలా ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి తెలుసా,మీ సినిమాలలో ఎంత హింస ఉందో అని వ్యాఖ్యాత అనగానే నవ్వాగలేదు నాకు.

ఈ దర్శకుడిని సమర్ధించడం కాదు కానీ అసలు ఇంతకుముందు ఫ్యాక్షన్, హింస తో నిండిన సినిమాలే రాలేదా మనకి? వాటిల్లో ఎన్ని సినిమాలని ఆహా ఓహో అని ఈ ఛానెల్ మోసెయ్యలేదూ?

అన్నింటికంటే నాకు నచ్చిన సమాధానం,"నేను సినిమాలో కక్షలని చూపించాను అని,మరచిపోయిన కక్షలని అర్జంటుగా గుర్తు చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కోరు".

తాము చెప్పినదే వేదం అని విర్రవీగి తమకి నచ్చని వారి మీద బురద చల్లే ఛానెళ్ళకి ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ఝలక్కులు ఇస్తే కానీ తాము ఏమి పొరపాటు చేస్తున్నామో తెలుస్తుంది.

వీళ్లడిగే చెత్త ప్రశ్నలకి అంతే ధీటుగా సమాధానాలిచ్చి నన్ను ఆగకుండా నవ్వించిన ఆ దర్శకుడికే ఈ విజిల్సూ,వీరతాళ్ళూ,ఈలలూ,కేకలూ..మరెన్నో. మీకూ ఆ ప్రోగ్రాం నచ్చితే మీరూ ఏదో ఒకటి వెయ్యండి.