Saturday, January 15, 2011

నేను చూసిన నాలుగు సినిమాల రివ్యూ

గత నెలలో ఓ నాలుగు సినిమాలు చూసాను.

1)రక్త చరిత్ర 2: దీని పార్టు 1 నెట్ లో చూసి పార్ట్ 2 లో ఏమి చూపిస్తాదో అన్న ఆత్రుతతో 2 చూసాను. సినిమా మొదలయిపోయుంటుంది అన్న తొందరలో గబగబా బండి పార్క్ చేసి టికెట్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి 500 నోటిస్తే చిల్లరలేదన్నాడు. మరలా పక్కన షాపు కి వెళ్ళి చిల్లర తెచ్చి హాల్ లో కి వెళ్ళాకా అర్ధం అయ్యింది 500 కి కూడా చిల్లర ఎందుకు లేదో. బాల్కనీ లో ఓ 5-6 మంది కింద ఓ పది మంది ఉన్నారంతే. మొత్తానికి రాం గోపాల్ వర్మ పీల కంఠం వాయిస్ ఓవర్ తో సినిమా మొదలు. విసిగించాడు సినిమా అంతా. ఎక్కడా ఆకట్టుకునే సన్నివేశాలే లేవసలు. ఈ సినిమా స్పూఫ్ వచ్చింది యూట్యూబ్ లో. దాని యూఆర్ ఎల్ ఇది:

http://www.youtube.com/watch?v=Cp0JKBKuvwI

2)రగడ : అయ్యబాబోయ్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది లెండి. ఎంత సేపూ సినిమాలో నాగార్జున ని మన్మధుడనో,కింగ్ అనో పొగడటమే తప్ప సినిమాలో అసలేమీ లేదు.స్టార్ హీరో కి ఏదో ఒక పంచ్ డైలాగ్ పెట్టాలి కాబట్టి "రగడ,చెరకుగడ" అనే డైలాగ్ పెట్టినట్లుందంతే.యధావిధి గా హీరోయిన్ల నటన శూన్యం. గిన్నీసు బుక్కెక్కిన మన డాక్టర్ బ్రహ్మానందం గారికి ఈ మధ్య సినిమాలలో "బట్టతల","ఏజ్ బార్ అయిపోయి పెళ్ళి కాకపోవడం" టాపిక్కుల మీద తప్ప కామెడీ ట్రాక్ దర్శకులు పెట్టట్లేదెందుకో మరి.

3)నాగవల్లి: రగడ కంటే కాస్త ఫరవాలేదు ఈ సినిమా లాజిక్కులని వదిలెస్తే. కొన్ని సినిమాలు లాజిక్ లేకపోయినా పకడ్బందీ స్క్రీన్ ప్లే తో సూపర్ హిట్టయిపోతుంటాయి బాలీవుడ్ లో ప్రియదర్శన్ సినిమాల లాగ. ఈ సినిమాలో వెంకటేష్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే అనవసరం మరియు చెత్త అనిపించింది నాకు. ఈ సినిమాలో గుర్తు పెట్టుకోవాల్సినంతగా కూడా ఎవ్వరి పాత్రలూ లేవు.వెంకటేష్ రాజు పాత్ర లో ఫన్నీ గా అనిపించాడు, ముఖ్యం గా హావ భావాల విషయం లో. గుర్రపు స్వారీ అయితే అసలే నప్పలేదు. గుర్రం స్వారీ చేస్తున్నట్లు కాక చల్ చల్ అని గేదెనో ఎద్దునో తోలినట్లనిపించింది.
ఇక వెంకటేష్ మూడో పాత్రయితే దారుణం.

4)తీస్ మార్ ఖాన్: నాకు ఈ సినిమా నచ్చింది అన్నింటిలోకల్లా. పైన చెప్పినట్లు లాజిక్కులని వదిలెస్తే మంచి ఎంటర్టెయినర్. రెండ్రోజుల తరువాత చూస్తే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని తెలిసి షాక్ అయ్యాను నేను. Nasty కామెడీ ఉన్న సినిమాలు సూపర్ హిట్లయ్యి ఈ సినిమా ఎందుకు ఆడలేదో అర్ధం కాలేదు.ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది అక్షయ్ ఖన్నా నటన.ఆస్కార్ అవార్డ్ కోసం గుడ్డి గా ఏదయినా చేసే హీరో పాత్ర తో చక్కగా నవ్వించాడు.

తెర మీద అక్షయ్ ఖన్నా ని చూస్తున్నంత సేపూ నాకు మన తెలుగు హీరో లు(?) తరుణ్,ఆకాష్,ఉకి(ఉదయ్ కిరణ్) etc మెదుల్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా ఇలా సపోర్టింగ్ రోల్స్ వేసుకోవచ్చు కదా వేషాలు లేనప్పుడు. ఎదురు డబ్బులు పెట్టో, బకరా నిర్మాత దొరికినప్పుడో హీరో లు గా చేసి ఆ సినిమా బయ్యర్స్ కోసం ఎదురు చూపులు చూసే కంటే ఇది నయం కదా!

ఈ మధ్య అక్షయ్ కుమార్ సినిమాలు చాలా చూసాను. ఒకప్పుడు యాక్షన్ సినిమాల హీరో ఇలా కామెడీ హీరో గా చెయ్యడం చాలా ఆశ్చర్యమనిపించింది.పైగా చాలా సినిమాలు మల్టీస్టారర్స్. మన టాలీవుడ్ మూల విరాట్లు కలలో కూదా ఊహించలేరేమో తమకి ఇలాంటి మార్పు ని.


సోలో హీరో లుగా పరమ వీర చెత్త లని తీస్తూ రగడ చేస్తారే తప్ప సినిమాల నుండి విరమించు కోవడమో లేదా ఇద్దరు కలిసి మంచి సినిమా చెయ్యడమో జరగదనుకుంటా.

అయ్యబాబోయ్ ఇప్పుడే వచ్చింది ఒక వేళ కనుక మన హీరోలు బాలక్రిష్ణ, నాగార్జున కలిసి ఒక సినిమా ఒప్పుకుంటే ఎలా ఉంటుందో అన్న ఊహ.బాలక్రిష్ణ అభిమానుల కోసం ఓ అరవై డెబ్భై సూమోలని గాలి లోకి లేపాలి,ఆయన వివిధ గెటప్పుల కోసం ఓ ముగ్గురు అవుట్డేటెద్ నటన రాని బాలీవుడ్ హీరోయిన్లు,మరోపక్క మన్మధుడి కోసం ఇద్దరు హీరోయిన్లు హడావిడి......వద్దు లెండి ఎందుకొచ్చిన గోల.

కొత్త సంవత్సరం లో మొదటి టపా

ఎలా ఉన్నారు ?సంక్రాంతి అరిశెలు తినే బిజీ గా ఉన్నారనుకుంటాను అందరూ.

మొత్తానికి మరలా రొటీన్ లో పడ్దాము ఇండియా హ్యాంగ్ ఓవర్ వదిలించుకుని.

అయ్యబాబోయ్, ఏంటండీ ఇండియా లో అలా పెరిగిపోయాయి రేట్లన్నీను. కూరగాయలు దాదాపు అన్నీ అరకిలో పదీ పదిహేను మినిమం రైతు బజార్లలో కూడా . సూపర్ మార్కెట్ పక్షులకి ఇంకా ఎక్కువ వదులూతుందేమో చేతి చమురు.

ఇక్కడనుండి వెళ్ళిన రెండో రోజు సంచీ తీసుకుని రైతు బజారు కి వెళ్లాను. ఏవో కూరగాయలవాడు ఇరవై ఇరవై అని అరుస్తోంటే కిలో ఇరవై అనుకున్నాను. కూరగాయలే కాదు అన్నీ మండిపోతున్నాయి ధరలు.ఆయా సీజన్ లలలో దొరికే పళ్ళు,కూరలూ కూడా అంతంత రేటయితే పాపం బడుగులు ఎలా బతుకుతున్నారో అనిపించింది.ఇక ఇండీయాలో మరొక అతి కామన్ ప్రాబ్లం "పని మనిషి". ఏరోజుకారోజు టెన్షనే ఈరోజు వస్తుందా రాదా,పొద్దున్నే వచ్చినా భయమే,ఎక్కడ సాయంత్రం రానంటుందో అని.

ఏమిటో అంతా హడావిడి హడావిడి, ఉరుకులు, పరుగులు అయిపోయింది అక్కడ కూడా జీవితం.ఏదన్నా పబ్లిక్ హాలిడే రోజన్నా ఎవరింటికి వెళ్దామన్నా కానీ భయమే, ఎక్కడ వాళ్ళు ఆరోజు టీవీలలో వచ్చే "బ్లాక్ బస్టర్" మూవీ మూడ్ లో ఉంటారో అని.

ఒకళ్ళింటికి వెళ్ళాను పలకరిద్దామని. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు,మరీ పెద్ద కాదు లెండి జస్ట్ రిటైర్ అయ్యారంతే.

నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ సడెన్ గా టీవీ కి కళ్ళప్పగించి కూర్చున్నారు. అదేదో డ్యాన్సో,పాటల పోటీయో విజేతలని ప్రకటించారు. అయ్యో ఈ అమ్మాయి ఉంటుంది అనుకుంటే ఎందుకు ఎలిమినేట్ చేసారో అని ఆవిడ బాధపడితే, ఏమీ కాదులే, వీడే బాగుంటాడు అని ఆయన.నాకేమో దాని గురించి అస్సలు అవగాహన లేదు. నాతో మాట్లాడటం ఆపేసి ఇంక ఆ టీవీ ప్రోగ్రాం గురించి చర్చిస్తూ పనిలోపనిగా నన్నూ ఎడ్యుకేట్ చేసే పని పెట్టుకున్నారు. హూ,,ఇప్పుడు కాదు కానీ మరలా వద్దామనుకుని లేచి బయట పడ్డాను.

ఈసారి భద్రాచలం వెళ్ళి అక్కడ నుండి పర్ణశాల వెళ్ళాను.ఎవరికయినా వెళ్ళే ప్లానుంటే వేంఠనే విరమించుకోండి. అస్సలు ఏమీ లేదక్కడ. పైగా భద్రాచలం నుండి అతి చెత్త సింగిల్ రోడ్డు. ఆరోడ్డు మీద ఆటోలు జనాలని టాపు మీద తప్ప తక్కిన చోటల్లా కూర్చోబెట్టుకుని మిస్సైల్స్ లాగ దూసుకొస్తుంటాయి మీదకి. వాటిని తప్పించుకుని కారు నడపాలంటే చాలా లాఘవం కావాలండీ బాబూ.

ఇంతా కష్టపడి అక్కడకీ వెళ్ళినా అక్కడేమీ ఉండదు.సరే ఇక వచ్చాము కదా అని మిట్టమధ్యాహ్నం బోటెక్కి గోదారిలో తిరిగి(ఎప్పుడెక్కామన్నది ముఖ్యం కాదు,ఎక్కామా లేదా...)అక్కడ ఉన్న రాములవారి గుడిలో సహ జీవనం చేస్తున్న మేక,కోతి,కోడి,కుక్క లని చూస్తూ గుడి తెరిచే వరకు కూర్చుని మరలా తిరుగు ప్రయాణమయ్యాము.

పల్లెటూళ్ళ రూపు రేఖలన్నీ మారిపోయాయనిపించింది మధ్యలో వచ్చే గ్రామాలని చూస్తే. ప్రతీ గ్రామం లో మాత్రం మిగతా సౌకర్యాల సంగతెలా ఉన్నా ప్రతీ ఇంటికీ కేబుల్ కనెక్షనో,మరీ పల్లెటూరయితే టాటా స్కై కనెక్షనో తప్పక ఉన్నాయి.ఇక ఊరూరా "మహా నేత" విగ్రహాలు సరేసరి.

మన రాజధాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది లెండి. ఏమిటా ట్రాఫిక్కసలు? హైదరాబాదీ సగం జీవితం ట్రాఫిక్ లో గడచిపోతుందేమో పాపం.

అదేమిటో శలవలకని ఇంటికెళ్ళి అలసిపోయాము.మరలా ఇక్కడికొచ్చి రెస్టు తీసుకున్నాము రెండు రోజులు.అప్పుడూ తీరింది ఆ అలసట. అయినా మనసు మళ్ళీ ఇండియా ట్రిప్ కోసం ఎదురు చూస్తూనే ఉంది :).