Wednesday, December 1, 2010

ఎలా ఉంది ఈ ఆలోచన?ఈ అసంతృప్తులు,రాజీనామాలేమిటో. నిన్నటి వరకు వాళ్ళ "అన్న" కి మంత్రి పదవి వస్తుందా రాదా అన్న టెన్షన్. తీరా వచ్చాకా మా "అన్న" కి ఫలానా "షాఖ"(శాఖ అని చదువుకోండి తెలుగు సరిగ్గా వచ్చినవాళ్ళు)ఇవ్వలేదని బైఠాయింపులు,నిరసనలు.

రాజకీయ నాయకులు ఎంత అద్రుష్టవంతులసలు. తమ మీద ఈగ వాలితే రోడ్డెక్కి వెంటనే ఆందోళన చేసే అనుచరులు ఉండటం మన లాంటి వాళ్ళకి సాధ్యమా?

ప్రజలకి మంచి పాలన అందించటమే తమ ధ్యేయంగా ఎన్నికలప్పుడు ప్ర్రకటించి డబ్బు ప్రభావం వల్లో మరొకటి వల్లో ఎన్నికయ్యాకా మంత్రి పదవి కోసం నానా గడ్డీ కరవడం. తీర పదవొచ్చాకా హోం శాఖో,రెవెన్యూ శాఖో మరో "ముఖ్యమయిన" శాఖో దక్కలేదని ఆగ్రహించడం.

2009 లో కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకయితే వచ్చారు కానీ ఆ డబ్బుని మన నుండి వసూలు చేసుకునే అవకాశం దక్కలేదు ఎవ్వరికీ ఇంకా. అదీ ఈ ఏడుపుల వెనకసలు కారణం.

ఇదంతా చూస్తోంటే నాకో ఆలోచన వచ్చింది.నాకూ ప్రజా సేవ చెయ్యాలని చాలా కాలం నుండీ కోరికతో ఉన్నాను.నా మీద ఎలాంటి రౌడీ షీటు కానీ కేసులు కానీ లేవు.ఏ శాఖ ఇచ్చినా నోరు మూసుకుని తీసుకుంటాను.అధిష్టానానికి ఎదురు అసలే చెప్పను.రేపు ఇండియా వెళ్తున్నా కాబట్టి హైదరాబాదు లో మన సీయం గారిని కలిసి ఇదే విన్నవించుకుంటాను.

ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేకపోతేనేమి రాజు తలచుకుంటే దెబ్బలకి కొదువుండదు కదా.మన సీయం గారు కనుక ఓకే అంటే ఇక ఉద్యోగం సజ్జొగం అన్నీ మానేసి మూడున్నరేళ్ళు పెజా సేవ చేసుకుంటూ బతికేస్తాను.అధమం కోటో రెండు కోట్లో సంపాదించుకోవచ్చు. ఏలాగూ ఇప్పుడున్న ఉద్యోగంతో మూడున్నరేళ్ళల్లో అంత వెనకేసుకోలేను.

పైగా ఎక్కడికయినా ఉచిత ప్రయాణం,ఫోను ఫ్రీ,ఇల్లు ఫ్రీ,స్టడీ టూరు పేరుతో విదేశీ యానం.2014 ఎన్నికలలో నిలబడకుండా సహ్రుదయంతో మీలో ఎవరికయినా నా స్థానం ఇచ్చెస్తాను. (ఆ ఎన్నికలలో నిలబడితే నేను వెనక,పక్క,ముందు వేసుకున్న నా కోటి రూపాయలేంగాను?అందుకని)

మన సీయం గారు కాదూ కూడదంటే అటునుంచటే వెంకటాద్రి ఎక్కి ఇడుపులపాయ వెళ్ళి జేబులో నుండి ఓ పది ఫోటొలు తీసి "యువ నేత" ముందు పెడతా.ఆఫొటోలేంటి అనుకున్నారు?జగన్ కి జరిగిన అవమానానికి నా ఆధ్వర్యం లో "సింగపూరు" లో జరిగిన నిరసన కార్యక్రమాలన్నమాట.(ఉత్తుత్తినే. ఇక్కడ ఇవన్నీ చేస్తే శ్రీక్రిష్ణ జన్మస్థానమే. అందుకే మా ఇంటి కిందే చుట్టూ నలుగురు జగన్ ఫోటో లతో,మధ్యలో నేను సోనియా ఫోటో ని రెండు ముక్కలు చేస్తూ నిలబడినవన్నమాట)

మర్చిపోయా,ఇడుపులపాయలో ముందు "మహా నేత" కి శ్రద్ధాంజలి ఘటిస్తా.ఆ తరువాతే "యువ నేత" ని కలవడం. అన్నని ఓదార్చి నేనూ కాస్త జగన్ మొహం పెట్టి అన్న పెట్టబోయే కొత్త పార్టీ విదేశి శాఖ కి కార్యదర్శి,కోశాధికారి గా నియమించమని అడుగుతా.

ఈ ఐడియా బౌన్స్ అయ్యే అవకాశమే లేదుకదా...అన్నతో రెగ్యులర్ టచ్ లో ఉంటూ నా ఆధ్వర్యం లో ఇక్కడ నిరసనలు చేపట్టడమే గా చెయ్యల్సింది.చేసి పారెస్తా.ఎంచక్కా ఉన్న ఉద్యోగం చేసుకుంటూనే యువనేత కొత్త పార్టీ కి "కోశాధికారి"నైపోతా.

అంతా కలిసొచ్చి అన్న సీయం (ఎప్పటికయినా) అయితే నా సుడి కూడా తిరిగినట్లే కదా. ఏమంటారు? రోడ్లెక్కి గొంతెత్తి అరవక్కర్లేదు,పోలీసు దెబ్బలు తినక్కర్లేదు. ఓ పది ప్రింటవుట్ల ఖర్చు అంతే కదా ఈ నిరసన కి అయ్యేది...కోశాధికారి ని నేనే కాబట్టి చింత,పులుపు ఏమీ ఉండవు ఖర్చు విషయానికి.


(రేపు ఇండియా వెళ్తున్నాను. మరలా కొత్త సంవత్సరం లో కలుసుకుందాము.అందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు)

గమనిక: పై రెండు కార్యక్రమాలలో నాతో భాగస్వాములు కావాలనుకునే వారు నా బ్లాగు ని ఆహాఓహో అని పొగడాలి మరి.