
వినాయక చవితి ఉదయం. టీవీ ల వాళ్ళు పండగయినా పబ్బమయినా తమ వాయింపుడిని ఆపేది ఉండదు కాబట్టి జగన్ ఓదార్పు లాగ "సాగి"పోతున్నాయి రొటీన్ కార్యక్రమాలు.
రంజానూ,చవితి పండగల హడావిడిలో బ్రేకడానికి న్యూసు కూడా ఏమీ లేక గోళ్ళు గిల్లుకుంటున్నారు ఛానెళ్ళవాళ్ళు. ప్రతీరోజూ ఉదయం చర్చా కార్యక్రమమం పేరుతో జుట్లు ముడేసే యాంకర్లకి టాపిక్కేదీ దొరకట్లేదు. చూడబోతేనేమో స్టూడియోలో నాయకులొచ్చేసి కూర్చున్నారు.
కార్యక్రమం మొదలయ్యింది.
టీవీ 9 స్టూడియో:
స్టూడియో లో బెల్లంనాయుడు,పులకేశి,బీహెచ్ ఆశీనులై ఉన్నారు.తానో పెద్ద చర్చల నిర్వాహుకుడిని అని ఫీలయ్యే గజనీ కాంత్ చర్చ మొదలెట్టాడు.
బెల్లమ్నాయుడు గారూ మీరు చెప్పండి ఈనాటి రాజకీయ పరిస్ఠితి మీద మీరేమంటారు?
ఏముందయ్యా అనడానికి ఆరేళ్ళనుండీ విసిగిపోయాము అధికారం కోసం ఎదురు చూసీ చూసీ. కాంగ్రెసు వాళ్ళు కొట్టుకు చస్తే మాకు లాభం అనుకుంటొంటే మధ్యలో ఈ పులకేశి ప్రత్యేక నినాదం,ఓ పక్క నుండి ఆ సుప్రీం హీరో మా ఓట్లకి చిల్లెట్టేసినారు. మా పార్టీ సీయీవో స్పీచ్చి లాగా ఇసిగించకు నన్ను.
పులకేశి గారూ మీరు చెప్పండి.
ఏంది భాయ్ నీ లొల్లి? ఓ పక్క నేనడిగింది యాడిస్తరోనని పరేసాంతో నాకు దిమాక్ పని జేస్తలే. ఏందయ్యా,నాకు ఎర్ర బుగ్గ కారు ఈయలే అని పరేసాన్ తో నేను ఏదో పార్టీ పెడితే నా సుడి బాగుండి నాకు నాలుగు డబ్బులొస్తన్నయ్.పిచ్చ్చి స్టూడెంట్స్ ఆవేశం తో నేను జాతీయ ఫిగర్ అయి ఖుశిగుంటే నా రాష్ట్రం నాకు ఇప్పుడు ఇచ్చెస్తారు అప్పుడు వచ్చెస్తది అని మీ మీడీయ రాసి నాకు ఠీక్ సె నిద్ర గూడా పట్టనీయట్లా.
ఇట్లా కలిసి ఉంటేనే గదయ్యా నేను ప్రత్యెక రాష్ట్రం పేరు మీదా మా వాళ్ళు సినిమాల పేరు మీద దందాలు చేసుకునేది.మమ్మల్ని ఖుశీగుండనీయరా ఏంది?
బీహెచ్ గారూ మీరేమంటారు?
ఆయనున్నప్పుడు మమ్మల్ని తొక్కేసిండు.ఆయన పోయేపాటికి మా వయసైపోయింది.ఏదో మాట వరసకి పదవులక్కర్లేదు,పార్టీ బాగుండాలి అంటాం గానీ నా కంటే పెద్దాయన ఆ సీట్లో కూర్చుంటే మా మనసాగుతుందా?
సాక్షి టీవీ లో గజన్ యాత్ర నుండి లైవ్ వస్తోంది.
ఏదో ఎమోషన్లో ఓదారుస్తా అన్నాను అందరినీ.మా నాన్న సీటు నాకిచ్చెస్తే మాట దాటేసినా ఏమయ్యేది కాదు.ఆ సీటంటే ఎవరికి మోజుండదు?సీటు కోసం ఎండనక వాననకా తిరుగుతున్నా కానీ నన్నెవరూ పట్టించుకోవట్లేదు.ఛా..నేను చేసే యాత్ర రాజకీయం కాదు అని చెప్పడం పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది. ఎంతసేపూ "మా నాన్న బ్రతికే ఉన్నారు మీ గుండెల్లో" అనో ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారనో ప్రతీ ఊరిలో చెప్పడం బోరు కొడుతోంది.. నా అక్కసు వెళ్ళ గక్కుకుంటే కానీ నాకు త్రుప్తి ఉండదు.
హెచ్చెం టీవీ వారు సీయం ఇంటి నుండి లైవ్:
ముఖ్యమంత్రి గారూ ప్రజలకి మీ సందేశం ఏమిటి?
ఏమాటకామాటే చెప్పుకోవాలయ్యా,ఇంతకముందెప్పుడూ ఇలా నన్ను ప్రత్యేకంగా పట్టించుకున్న పాపాన పోలేదు ఎవ్వరూ. ఈ సీటు మహిమ అంతా.కొత్తలో ఏదో నేను దానయ్యని అన్నా కానీ,సీటు వదలబుద్ధికావట్లేదు.అమ్మ జపం చేస్తూనే ఉంటాను తోక జాడించే సీను లేదు కాబట్టి అమ్మ కూడా నన్నేమీ తొలగించదు.
టీవీ 5 లో మహిళలకి పండగ సీజన్లో సరైన డిస్కౌంట్స్ లభించలేదు అన్న అంశం మీద మాట్లాడటానికి మహిళా నాయకురాలు వింధ్య స్టూడియోలో రెడీగా ఉన్నారు.
పండగ పూట కూడా ఏమిటండీ మహిళలు మహిళలు అంటూ మీ గోల?ఎవరెలా పోతే మాకేమిటి?ప్రతీ వాళ్ళూ మహిళల సమస్య మీద మమ్మల్ని కలవడమే.ఏదో గొంతు చించుకు అరవమంటే మగవారు అడ్డ గాడిదలు అనో మరోటొ తిడుతూ అరుస్తా కానీ నేనేమన్నా ఆరుస్తానా తీరుస్తానా?మనలో మన మాట,రోజూ అలా హై పిచ్చ్ లో అరవాలన్నా వీజీ కాదమ్మాయ్.
టీవీలు చూస్తున్న ప్రజలు నిర్ఘాంత పోతున్నారు అలా నాయకులు నిజాలు కక్కేసరికి.
ఇంతకీ నాయకులు ఎందుకు నిజాలు మాట్లాడారంటారు?
-----------------------------
-----------------------------
-----------------------------
-----------------------------
-----------------------------
-----------------------------
మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న శుక్రవారం శలవు మార్చినంత హడావిడిగా వినాయకుడు రాజకీయ నాయకులకి కొత్త శాపాన్ని ఇచ్చాడు శుక్రవారం రాత్రి.
శాపమేమిటి అంటే,వినాయక చవితి నాడు టీవీలో కనిపించే ప్రతీ నాయకుడు/నాయకురాలు నిజాలే మాట్లాడతారు అని :).