
నిజంగా ఇప్పటి విద్యార్ధులు ఎంత అద్రుష్టవంతులో. వీరిని చూస్తోంటే నాకు అనిపిస్తోంది, ఛా!! నేను ఒక 10-15 ఏళ్ళు లేటుగా పుట్టి ఉండాల్సిందని.
అప్పుడు "శివ" లేదా మరోటో చూసి నేర్చుకోవాల్సి వచ్చేది కాలేజీ ఫైట్లు గట్రా. ఇప్పుడు 2-3 గంటలు సినిమా చూసి పోరాటాలు నేర్చుకోక్కర్లేదు కదా!!. ఎంచక్కా మన నాయకులు ఒక అరగంట లో ఉపదేశిస్తారు "దాడి" ఎలా చెయ్యాలో.
సెమిస్టరంతా లెక్చరర్లని పట్టించుకోకపోయినా చివరాఖరికి ఇంటర్నల్సు,ప్రాక్టికల్సు ఎదురుగా కనపడేసరికి మన బాల్కి "నిప్పురవ్వో","ధర్మ క్షేత్రమో" చూసినంతగా జడుసుకుని చదవాల్సొచ్చేది. పరీక్షలు దగ్గర పడగానే లెక్చరర్లు కనిపిస్తే రాని నవ్వు మొహాన పులుముకుని విష్ చెయ్యల్సి రావడం ఎంత బాధాకరమో అనుభవిస్తే కానీ తెలీదు.
అదే ఇప్పటి విద్యార్ధులకి ఎన్ని ఆప్షన్సో. లెక్చరర్స్ నచ్చకపోతే ఏదో ఒక "కాస" (కార్యాచరణ సమితి) పేరు చెప్పి చితక్కొట్టచ్చు..లేదా నేనే ఒక "ఫలానా" కాస అని పెట్టి నాయకుడయిపోవచ్చు.మార్కులు తక్కువొస్తే నేను ఫలానా ప్రాంతానికి చెందుతా కాబట్టే మార్కులు వెయ్యలేదని ఆందోళన చెయ్యచ్చు. లేదా ఇంకేదో చెప్పి కాలికి వేస్తే మెడకి,మెడకి వేస్తే కాలికి అన్నట్లు మాట్లాడి నాకు మార్కులు తక్కువ రావడానికి కారణాన్ని ఎటో తోసెయ్యచ్చు.
నేను చదువుకునేటప్పుడు నాన్నగారికి ఫీజు విషయం చెప్పలంటే ఒకింత భయం వేసేది. పాపం ఆయనకి ఇబ్బంది అని. ఇప్పట్లా "బోధనా రుసుము" అడిగితే చితగ్గొట్టండి అని పిలుపునిచ్చే మా గొప్ప నాయకులెవ్వరూ అప్పుడు లేరాయె.
ఇప్పుడు విద్యార్ధులకి ఎన్ని శెలవలో.ఒక నెల రోజులు సరిగ్గా తరగతులు జరుగుతాయో లేదో ఏదో "కాస" నాయకులకి ఈ నిశ్శబ్దం నచ్చదు. వారి ఆందోళన మూలంగా శెలవులు.
ఈ "...విద్యార్ది కాస" నాయకులు మన టాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోరు. ఈ నాయకులలో ఒక్కరూ "విద్యార్ధి" అనుకుందామన్నా కానీ అనుకోలేము.మన అగ్ర హీరోలు సినిమాలలో కాలేజీ స్టూడెంట్ వేషం వేసి "యూత్" అని అరిచి గీ పెట్టినా మన మనసు అంగీకరిస్తుందా?
(అదేదో పార్టీ "యూత్" వింగ్ లీడర్ కూడా ఏమీ తీసిపోడు లెండి ఈ విషయంలో.)
నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా చెప్పండీ?అయినా "నేతి" బీరకాయ అనట్లేదూ..అలాగే వీళ్ళనీ అంగీకరించాలేమో.
(ఈ నెల 28 న జరిగిన దాడిలో గాయపడ్డ లెక్చరర్లకి సానుభూతి మరియు క్షమాపణలతో)