Friday, July 9, 2010

ప్చ్.వైయెస్సారు మరణించకపోయుంటే..
ఏమిటో ఈ టపా రాద్దామని ఎన్ని రోజుల నుండో అనుకుని అలా పోస్టుపోన్ చేస్తూ వచ్చాను కానీ ఈరోజు జరిగిన ఒక సంఘటన ఈ టపా కి ప్రేరణ.

చాలా రోజులయ్యింది మన తెలుగు చానెళ్ళు చూసి అని చూడటం మొదలెట్టా."మహా నేత" జయంతిట కదా ఈరోజు.నిన్నే అనుకున్నా,ఎట్టి పరిస్థితిలోనూ ఈరోజు "సాక్షి" టీవీ చూడకూడదని.ఉత్తప్పుడే వైయెస్సార్ మహా నేత,యుగపురుషుడు అని కీర్తిస్తూ పాత పాటే పాడే ఆ చానెల్ ఇక ఎంత హడావిడి చేస్తుందో తెలుసు కదా.ఛానెల్ ప్రసారాలలో ఆయన ఫోటో ఎల్ల వేళలా స్క్రీను మీద ఉండెటట్లు చూడటం తప్ప కార్యక్రమాల నాణ్యత మీద ఫోకస్ పెట్టినట్లు అసలు అనిపించదు."రావణ్" సినిమా గురించీ ఇలాగే ఏవో ఏవో ఊహించేసుకున్నా,చివరికి అది తుస్సంది కదా,అలాగే మొత్తానికి మన సాక్షి చానెల్ ఈరోజు మూగబోయింది.

హమ్మయ్యా,ఆ గోల లేదు అనుకుంటోంటే,వనితా టీవీ ఆ బాధ్యత తీసుకుంది.ఎలాగూ ఆ చానెల్ పెద్దగా చూడను కాబట్టి ఓకే.వారు చెప్తే నిజం అవుతుంది ఏ వార్త అయినా కానీ అని గాఢం గా నమ్మే వేమూరి వారి చానెల్ వారు ఎప్పుడో జగన్ వెనకాల పడటం మొదలెట్టారు.పొగిడో తెగిడో జగన్ జగన్,ఇది తారకనామం అయిపోయింది వారికి.ఇక టీవీ 9 అయితే ఈరోజు జయంతి మీద ప్రోగ్రాం చేస్తూ ఆ ప్రోగ్రాం నిండా ఆయన మరణ తాలూకు ద్రుశ్యాలే.

ఇక ఆయన వర్ధంతి రోజు వెయ్యడానికి ఏమీ మిగల్లేదు వీరికి. అయినా రీ యూజ్ కాన్సెప్ట్ ని బాగా వంట పట్టించుకున్న ఆ చానెల్ కి ఇది ఒక సమస్య కాదు కదా.

ఆయన చనిపోతే రాష్ట్రం కన్నీటి సంద్రం అయ్యిందిట.చిన్న సైజు స్విమింగు పూలు కూడా కాలెదనిపిస్తుంది నాకు.మీడియా ఆయన అద్రుశ్యం అయినప్పటినుండీ ఆ ఎపిసోడ్ ని బాగా స్లో పాయిజన్ లాగ జనాల్లోకి ఎక్కించేటప్పటికి మరునాటికల్లా పిచ్చి జనాలు సెంటిమెంటు కార్చెసారు.ఇక ఆయన మరణ వార్త కన్ ఫర్మ్ అయ్యింది మొదలు "సూర్యుడే శెలవని","రాజువయ్యా" పాటలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి.
ఇక ఆయన మరణ వార్త విని ఆగిన గుండెల గురించి చర్చ చాటభారతమే అవుతుంది.ఆగితే ఆయనతో ఆర్ధిక లావాదేవీలున్న వాళ్ళ గుండెలు ఆగాలి కానీ...ఇంకా నయం, పశు పక్ష్యాదులు కూడా తట్టుకోలేక ప్రాణం విడిచాయి అనలేదు.

సీరియళ్ళలో కోడలి కష్టాలు చూసే కన్నీరు కార్చేసే జాతి మనుష్యులు ఎక్కువ రియాక్ట్ అయిన మాట వాస్తవం.ఆయనే కాదండీ,ఎవరయినా పోయాకా వారి గురించి అంతా మంచే కనిపిస్తుంది,వినిపిస్తుంది మనకి. ఎక్కడో మన పీవీ లాంటి వాళ్ళ గురించి తప్ప.

అప్పుడెప్పుడో దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు ఎవరయినా రాష్ట్రపతో ప్రధానమంత్రో మరణిస్తే కార్యక్రమాలు అన్నీ ఆపేసి టూ... అంటూ వయోలిన్ వాదం వినిపించేది అంతే.

ఇప్పుడు ఎంత అంగబలం అర్ధ బలం ఉన్నవాడు మరణిస్తే అంత ప్రచారం.తాను బతికుండగా కూడా ఎప్పుడూ ఇంత ప్రచారాన్ని వైయెస్ పొంది ఉండరు.

అసలు ఆయనని ఏ ప్రాతిపదికన యుగ పురుషుడు అంటారో అర్ధం కాదు.ఏదో ఎఫ్.యం. రేడియో చానెల్ వారి ట్యాగ్ లైన్ "విను వినిపించు" లాగ ఈయన అధికారం లో ఉన్నన్నాళ్ళూ "తిను,తినిపించు" అంటూ దర్జాగా ఖజానా ఖాళీ చేసారు అంతే కదా.ఏవో కొన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేసారు కాదనను కానీ యుగపురుషుడు అని కీర్తించడం మాత్రం తగునా చెప్పండి.

ఊరూరా గాంధీ విగ్రహాలున్నట్లు,ఇక వైయెస్సార్ విగ్రహాలు కూడా ఉంటాయేమో అన్ని విడతల ఓదార్పు యాత్ర పూర్తయ్యేసరికి.
అసలు ఛానెల్స్ వార్తలు చూస్తే జగన్,పేపర్ తిరగేస్తే జగన్.లేదా ఎక్కడో ఎవరినో ఓదారుస్తూ జగన్.ఏమిటండీ ఈ గోల.ఈ గోలంతటికీ కారణం వైయెస్సార్ మరణమే కదా.

అదే ఆయనే మరణిచకపోయి ఉంటే..అన్నది అందుకే.

Friday, July 2, 2010

"ఓదార్పు" సక్సెస్ కి నా సలహాలు
పాపం అదేదో యాత్ర చేసి జగన్ మైలేజీ తెచ్చుకుందామంటే "అమ్మ" పడనీయట్లేదాయే.అడగనిదే అమ్మయినా పెట్టదంటారని కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి మొరపెట్టుకున్నా కానీ "అమ్మ" 15 నిమిషాలలో మొత్తం "సావధానం" గా ఆలకించి నో అందిట పాపం.పరస్పర పలకరింపులు గట్రా అవ్వడానికే ఒక 5 నిమిషాలు పడుతుంది,అలాంటిది సావధానం గా ఆవేదన మొత్తం ఆ పావుగంట లో అమ్మ ఎలా విందో అర్ధం కాలేదు నాకు.

ఏదయినా సాధ్యమే లెండి ఆవిడకి.ఆ పార్టీ వ్రుద్ధులలో కొంతమందికి రాహుల్ ని ప్రధాని గా చూసి కన్ను మూస్తే చాలుట.రాను రాను "అమ్మ" పైత్యం ముదురుతోంది అందరికీ.ఇక 2014 ఎన్నికలప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో.ఇక ఈ "అమ్మ"ని పోల్చటానికి ఉపమానాలు ఏమీ మిగలవేమో మన నాయకులకి అప్పటికి.

ఈ మహాతల్లికి మన పీవీ పేరంటేనే పడదనుకుంటా.రాజీవు,ఇందిరల పేర్లు పెడితే సులభ్ కాంప్లెక్సులయినా వచ్చి ఓపెన్ చేసెస్తుంది ,కానీ మన పీవీ గారికోసం ఒక్క పది నిమిషాలు కేటాయించదు.చనిపోయిన వాళ్ళందరూ "మహా నేత" లు కదూ,కానీ మన పీవీ ఎందుకు మినహాయింపో దానికి.

ఇంతకీ నేను చెప్దామనుకున్నదేమిటంటే,జగన్ వెళ్ళి ఓదార్చడం మాట దేవుడెరుగు కానీ,తల పక్కకి వాల్చి అలా దీనం గా మొహం పెట్టిన జగన్ ని చూసి అర్జంటుగా వెళ్ళి అతన్ని ఓదార్చాలనిపించింది.అస్సలు జగన్ కి మైలేజీ తెచ్చుకోవడం ఎలాగో బొత్తిగా తెలీదనుకుంటా.మన రాములమ్మ,అదేదో సంఘం నేత ఒకాయన,బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఓవర్ నైట్ పాపులర్ అయిపోలేదూ డ్రామాలు నడిపి.


రాములమ్మ చూడండి,ఒక్క మాటతో రాత్రికి రాత్రే పాపులర్.మీడియ అంతా ఆవిడ ఇంటి ముందు హడావిడి. రాములమ్మ తన స్పీచ్ తో నిప్పులు చెరిగింది,బొగ్గులు రాల్చింది అని మీడియా గోల పెడుతోంటే,టీవీ క్లిప్పింగులలో చూసాను ఆవిడ గారి వివాదాస్పద(?) స్పీచ్."నరికెయ్యండి" అని అంటున్నాప్పుడు అసలు ఆవేశమే లేదు మనిషిలో.కనీసం గొంతు కూడా పెంచి అరవలేదు."ఈ పెద్దోళ్ళున్నారే" అనే డైలాగ్ చెప్పేటప్పుడు కనీసం మన ఉ.కి.(ఉదయ్ కిరణ్) గొంతు లో పలికిన రోషం కూడా లేదు.


అయినా మీడియా నోట్లో నానుతోందా లేదా.పైగా ఈవిడ గారిని అరెస్టు చేస్తే,రేపు బందుట తెలంగాణాలో.తమ "పొమ్మంది నాదం" సినిమాకి "మంచు" ఫ్యామిలీ చేస్తున్న హడావిడి కామెడీ ని మించిపోయింది రాములమ్మ నాటకం.కాబట్టి ఆ యాత్రేదో దిగ్విజయమవ్వాలంటే మన రాజకీయ నాయకులని చూసి మైలేజీ తెచ్చుకోవడం ఎలాగో జగన్ కాస్త నేర్చుకుంటే చాలు టూరు సక్సెస్.