Sunday, May 30, 2010

పదీ,పదీ,ఇరవై,ఇరవై ఐదు.....

మొన్న ఎంసెట్,10 వ తరగతి రిజల్ట్స్ వచ్చినప్పటినుండీ చూస్తున్నా,బ్లాకుల్లో టిక్కెట్లమ్మేవాళ్ళ అరుపుల్లాగ 10,10,20 అంటూ ఒకటే అరుపులు వివిధ కాలేజీ/స్కూళ్ళ వాళ్ళు.అసలే విద్యాసంస్థ ల యాడ్స్ చిరాగ్గా ఉంటాయి మామూలుగా చెప్తేనే.ఇక ఈ ర్యాంకుల ప్రకటించికోవడం లో వాళ్ళ తీరు బ్లాక్ టిక్కెట్ అమ్మేవాళ్ళని గుర్తు తెచ్చింది.ప్రతీ విద్యా సంస్థా తాము చరిత్ర స్రుష్టించామని,తిరగరాసామని ఒకటే గోల సినిమాలలో ...వారి వంశం లాగ.కొన్ని విద్యా సంస్థలయితే ఇంకో అడుగు ముందుకేసి,ఆల్ రౌండర్లని తయారు చేస్తాము అంటూ విద్యార్ధులు వివిధ క్రీడలు,సాంస్కౄతిక కార్యక్రమాల క్లిప్పింగ్స్ ఒకటి.అసలు ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో ఇవన్నీ ఉంటాయి అంతే నమ్మశక్యమా?లేదా చిన్ని చిన్ని ఎల్కేజీ పిల్లలు యోగా నో ప్రాణాయామానో చేస్తున్నట్లు చూపించడం.అసలు మన నట సింహాన్ని మించిపోతున్నాయి ఈ విద్యా సంస్థలు కామెడీ చెయ్యటంలో.

అదేదో స్కూలు అయితే గత 3-4 నెలల నుండీ చూస్తున్నా,అడ్మిషన్లు ప్రారంభమయినవి అని యాడ్.ఇంటర్నేషనల్ స్కూలు,కాన్సెప్ట్ స్కూలు,టెక్నో స్కూలు పేరు ఏదయితేనేమిటి,అన్నింటా పిల్లలని కోచింగు అనే మిక్సీ లో వేసి బయటకి తియ్యడమే కదా.

ఇలాంటి స్కూలు,కాలేజీల లో అడుగుపెట్టాకా వారు ఇచ్చే కోర్సు వివరాలు చూసి అందులో మనకి(ఇక్కడ పిల్ల గురించి ఆలొచించము కదా)సరిపడేది ఎన్నుకోవాలంటే తాతలు దిగొస్తారు.ఆ ఎంట్రన్సు,ఈ ఎంట్రన్సు కి కలిపి అనో,ఇంకేదో చెప్పి ఓ 5-6 కోర్సులు వాటి ఫీజులు మన ముందుంచుతారు.ఈ కోర్సులని ఎన్నుకోవడం కంటే ఏ కొరియా దేశపు ఫుడ్ కోర్టు కో వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చెయ్యడం తేలిక.విద్యా సంస్థలని అని ఏమి లాభం?మనమే స్వయం గా పిల్లలని వెయ్యడానికి ఏ మిక్సీ బ్లేడు పదునుగా ఉందో చూసి మరీ వేస్తోంటేను.మొన్న ఆ మధ్య సాయంత్రం 6-7 గంటల మధ్య ఒక కార్యక్రమం చూసాను.ఆరోజే ఏదో ఎంట్రన్సు ఎగ్జాం జరిగింది.ఆ పరీక్ష లో ఎన్ని మార్కులొస్తే ఎక్కడ సీటు వస్తుంది,ఏ బ్రాంచీ లో వస్తుంది వగైరా వివరాలు చెప్పే కార్యక్రమం అది.ఆ కార్యక్రమానికి పిల్లల కంటే తల్లితండ్రులే ఎక్కువ కాల్ చేసారు.మా అబ్బాయి కి ఇన్ని మార్కులు రావచ్చు సీటు రావచ్చా,రాకపోతే ఎలాగ అన్న ఆదుర్దా చాలా మందిలో.వీళ్ళ వరస ఎలా ఉందీ అంటే,ఇంజనీరింగు చెయ్యకపోతే ఇక మా పిల్ల/పిల్లాడు వేస్టు అన్నట్లు.

అసలు నాలుగు,ఐదు తరగతుల నుండీ ఐ.ఐ.టీ ఏమిటో అర్ధం కాదు నాకు.ఎంతసేపూ ఎంట్రన్సులకి బట్టీ పడుతూ కూర్చుంటే చాలా,ఆ పసిమనసులకి ఇంక ఏమీ అక్కర్లేదా? అసలు మనము పిల్లల విశ్లేషాత్మక ఆలోచన ని ఎక్కడ ఎదగనిస్తున్నాము?ఈ మధ్య విద్యా సంస్థల యాడ్స్ లలో "డిజిటల్ టీచింగు" అంటూ కొత్త కాన్సెప్టు ఒకటి.నల్ల బల్లల మీద చెప్తే విద్యార్ధులకి ఎక్కదేమో మరి.
ఎంతసేపూ ఏ స్కూలు కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది అని చూస్తున్నామే కాని,ఎవరు పిల్లలకి కాన్సెప్టు అర్ధమయ్యేలా పాఠాలు చెప్తున్నారో అని ఆలోచించట్లేదు.అందుకే,ఇలాంటి ఆర్భాటాలకి దూరం గా ఉన్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కార్పోరేటు కి ధీటు గా నిలిచారు.

Monday, May 24, 2010

సింహా చూసొచ్చాను

హా,మొత్తానికి సింహాన్ని చూసొచ్చా మొన్న శనివారం.ఆరోజు పొద్దున్నే నేవీ షో ఉంటే వెళ్ళి సాయంత్రానికి అలసిపోయి వచ్చాను.మానేద్దామా అని ఒక్క నిమిషం అనిపించింది.కానీ,ఇన్ని రోజులూ ఎదురు చూసి ఇలా చివర్లో మానెయ్యడం నాకే నచ్చక,నాలుగు మెతుకులు తిని కాస్త ఎనర్జీ తెచ్చుకుని బయలుదేరా.

హాల్ లో చూద్దునా ఒక వందమంది కూడా లేరు.సినిమా హిట్టు అని టాక్ వచ్చేసరికి ఓవర్సీస్ లో కలక్షన్స్ డ్రాప్ అయ్యాయి అని డిసైడయిపోయా.సగం మంది వచ్చేది సింహం చేసే చిత్ర విచిత్ర విన్యాసాల కోసమే కదా.హిట్టు సినిమా లో ఆ విన్యాసాల మోతాదు తగ్గిందని ఎక్కువ మంది రాలేదేమో అనుకున్నా.

ఇక సినిమా సంగతి చూద్దాము.సినిమా మొదలే ఒక ఫైటు తో.సింహం ఎంట్రీ ఎలా ఉంటుందో ఎనీ గెస్?ఒక సఫారీ లో వచ్చి,దానిలో నుండి మామూలుగా డోర్ తీసి మొదట షూ చూపిస్తూ దిగడం కాదు.డోర్ బద్దలు కొట్టుకుని దిగుతాడు "బాబు".
మన సింహం కొట్టగానే పక్కనే అంబులెన్స్ లో ఉన్న ఒకడు కోమా లో నుండి బయట పడతాడు.

కాలేజీ లో బాబు ని ఆకర్షించాలని చూసే కొలీగ్,ఈవిడ కోసం పడి చచ్చే బొంగురు గొంతు వేణు మాధవ్ అక్కడ తెలుగు లెక్చరర్.
ఈ తెలుగు లెక్చరర్ పాత్ర తో కామెడీ చేయించామనుకున్నట్లున్నారు.ఎంత సేపూ హైటూ,వైటూ,ఏజి గురించిన కుళ్ళు జోకులే కామెడీ అనుకుంటే చేసేది ఏమీ లేదు.ఈ పాత్ర గురించి ఇంతకు మించి వేస్ట్.

ఫస్ట్ హాఫ్ లో "బాబు" అందరినీ కొడుతుంటాడు.సెకండ్ హాఫ్ లో నరుకుతుంటాడు అంతే,ఎలా కొట్టినా రక్తం ఏరులై పారుతుంది తెర మీద ఇదీ కధ ఒక్క మాట లో చెప్పాలంటే.పాత కక్ష లని గుర్తు చేసి కర్తవ్య బోధ చేసే బామ్మ,స్టూడెంట్ రూపం లో ఉన్న హీరోయిను,ఓ నాలుగు కామెడీ క్యారక్టర్ లు,ఎప్పటి లాగే ప్రిన్సిపాల్ గా ధర్మవరపు ఇదీ స్టొరీ.


ఆరోజు నేను నేవీ షో లో అన్ ఆర్మ్ డ్ కంబాట్(Unarmed Combat) గురించిన డెమో చూసా.మన క్రిష్ణ బాల అదే విన్యాసాన్ని తెర మీద చేసేసరికి ఒహో అనుకున్నా.

మన బాబు ఫోర్డో, మరోటో అలాంటి కారుతో సఫారీ లాంటి పెద్ద వాహనాలని ఢీకొని గెలుస్తాడు కూడా.ఇది చూడగానే మా కజిన్ గుర్తొచ్చాడు.తను తన దగ్గర ఉన్న ఫోర్డ్ కారు తీసేసి ఎస్.యూ.వి కొందామనే ఆలోచన లో ఉన్నాడు మరి.మన బాబు విన్యాసం చూడగానే మా కజిన్ తన కారు మార్చడం దండగ అనిపించింది.


తెర మీద "ఇంటర్మిషన్" అని రాగానే ఠక్కున లేచా,మాకు ఇక్కడ విశ్రాంతి ఉండదు అని మర్చిపోయి.వెంటనే వెనకాల నుండి "నో ఎస్కేప్,కూర్చోవాల్సిందే" అని అరిచారెవరో.

సింహం నన్ను డిసప్పాయింటు చేసాడు తన ట్రేడ్ మార్కు విగ్గు లేకుండా.డైలాగులలో అతి కూడా తగ్గింది.కానీ వంశం,రక్తం డైలాగులు మామూలే.


సెకండ్ హాఫ్ లో "బాబు" బొబ్బిలి దగ్గర డాక్టర్.ఈయన భార్య నయన తార నడిచొచ్చిన చమన్ లాల్ బ్రదర్స్ దుకాణం లా ఉంది.మన డాక్టర్ బాబు ఒక సారి రైల్వే స్తేషన్ లో విలన్ లని కొడుతూ ఉంటాడు.ఆ కొట్టే 5-6 నిమిషాలలోనే ఒక 5-6 రైళ్ళు వెళ్ళాయి ఆ స్టేషన్ లో.అదేమిటో ఈ స్టేషన్ విజయవాడ కంటే బిజీ అనిపించింది.


డైలాగులు మాత్రం కరక్ట్ గా సూట్ అయ్యేవి పెట్టారు.
1)ఈ వంశం వాళ్ళని లేవనీయకూడదురా..లేస్తే ఆపలేము
కరక్టే కదా,ఒక్క హిట్టు వస్తే ఇంకో 10 పైత్యపు సినిమాలు చేసి ప్రాణం తీస్తారు.దాని కంటే ముందు విజయ యాత్ర లలో నేనే ఆక్సిజన్,గాలి ఫలానా పార్టీ కి అని మాట్లాడతారు అప్పటి వరకు కుక్కిన పేను లా ఉన్నవారు కాస్తా.

2)చూడకు,రెండో వైపు చూడకు,చూస్తే తట్టుకోలేవు
ఇదీ కరక్టే...మీకు అర్ధమయ్యింది కదా
3)రికార్డులు రాయాలన్నా మేమే....
అవును,ఇది ఈ వంశం వాళ్ళకే చెల్లు

బ్రహ్మానందం,అలీ,క్రిష్ణ భగవాన్,వేణు మాధవ్ లు అనవసరం అనిపించారు.ఈ నలుగురికి బదులు ఇంకో నలభై రౌడీలని పెట్టుంటే ఇంకాస్త రక్తం చిమ్మి కొంచం పెద్ద హిట్టు అయ్యేదేమో.

గిన్నీసు పుటల్లోకేక్కిన హాస్య నటుడి నటన మూస ధోరణి లో ఉంటోది ఈ మధ్య.పైన చెప్పినట్లు ఏజ్ మీదో,బట్ట తల మీదో,లేదా పర్సనాలిటీ మీదో జోకులు లేదా చెంప దెబ్బలు తినడం, ఇంతే సగం సినిమాలలో ఈయన హాస్యం అంటే.

మొత్తానికి సింహాన్ని చూసొచ్చిన త్రుప్తి తో ప్రశాంతం గా నిద్రపోయా

Wednesday, May 19, 2010

భలే మంచి రోజు....
ఎన్నాళ్ళో వేచీన ఉదయం,....నేను ఈ శనివారం గత కొన్ని వారాలుగా ఎదురు చూసిన సినిమా చూస్తున్నానోచ్.

సింహం లాంటి చిన్నొడే సింగపూరొచ్చాడే,
మెర్క్యురి లాంటి మెదళ్ళని ఆరగించాడే

నేను మా ఫ్రెండ్ కి చెప్పి పెట్టా,సింహం కానీ ఇటు వైపు వస్తే ఒక కేకెయ్యరా, జీవితమే ఒక ఆట,సాహసమే పూబాట అనుకుంటూ వచ్చెస్తా అని.

కానీ ఆ మిత్ర ద్రోహి నాకు చెప్పకుండా చూసొచ్చేసాడు. తీరికగా సోమవారం చెప్పాడు ఆఫీసులో మొన్న సింహాన్ని చూసా అని.

అంతే,వేంఠనే నేనూ ఈ శనివారం కి బుక్ చేసి పడేసా. ఈ సినిమా కి వెళ్తున్న,మీరూ ఏమయినా చూసి తరిస్తారా అని మా కజిన్ని అడగ్గానే,ఏంటి ఆ ధైర్యం అసలు నీకు,ఏదో డీవీడీ లో చూసిన అర్ధం కానీ అంది.క్రిష్ణ బాల లో హీరో ని కాదు చూడాల్సింది,స్టార్ కమెడియన్ ని చూడు నా కళ్ళతో,ఆ పాము కుబుసం విగ్గు,ఆ డైలాగులు అంటూ నేను ఎందుకు ఆ సినిమా కి వెళ్తున్నానో చెప్పా,వాళ్ళని కూడా (తోడు) తీసుకుపోవడానికి..ఆహా కన్విన్స్ అవ్వదే,పైగా బాబోయ్ నేను ఆయన సినిమాలు మానేసి కొన్ని సంవత్సరాలు అయ్యింది,నేను హాల్ లో చూసిన ఆయన చివరి సినిమా "...ద్వీపం" అంది.

అక్కడే,నువ్వు మరి తప్పు లో కాలేసేది,అప్పటికి ఇంకా సారు ఎదగలేదు,మీరు సింహం,పులి అనే మంది మాగధులు లేరు చుట్టూ..సార్ ఫ్యాక్షన్ సినిమాల నుండీ నేను మిస్ కాకుండా సినిమాలు చూస్తున్నా,ఒక్కసారి రండి మజా తెలుస్తుంది అన్నా.ఊహ్హూ,ససేమిరా అంది,పైగా నాకు మర్నాడు ఒకసారి నిద్ర లేచాకా ఫోన్ చెయ్యి,నీ లాంటి వాళ్ళే ఇలాంటి సినిమాలని హిట్ చేసేది అంటూ కాసేపు దీవించింది.నేను నాకు కావాల్సినప్పుడల్లా "సీతయ్య" ని అయిపోతుంటా.ఐ మీన్,కాసెపు చెవిటి వాణ్ణయిపోయి ఎవరి మాటా వినను.

ఈ సినిమా చూడటం "ఒక చారిత్రక అవసరం" అని నా అభిప్రాయం.బాగోలేదా ఈ పదం?ఏమో,ఈ మధ్య అందరూ ఈ పదాన్ని వాడుతోంటే నేనూ వాడేసా.

ఆ మధ్య చదివా,తన 150 వ చిత్రం గా ఈ హీరో తో తెలుగు సినిమా పెద్ద దిక్కు(?) గారు "పరమ వీర చెత్త" తీస్తున్నారుట.ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేటట్లు తీస్తారుట.ఆ దర్శక రత్న గారు అంత కష్టపడకుండా తన మామూలు బోరింగ్ పంధాలో తీసినా కానీ క్రిష్ణ బాల గారి సినిమా అనగానే అందరూ మాట్లాడుకుంటారు అని తెలీదు కాబోలు.

ఇకపోతే వెరయిటీ సినిమా పేర్లు పెట్టే దర్శకుడు ఈ హీరో తో సినిమా తీస్తున్నారుట."బాబు" ఫ్యాన్స్ పవర్ఫుల్ పేర్లు కోరుకుంటారు,ఈ దర్శకుడు వెరయిటీ రెండూ కలగలిసి టైటిల్ "నరికేసా" ట్యాగ్ లైన్ "ఔను,వాళ్ళందరూ అడ్డొచ్చారు" అని పెడితే?

టైటిల్ నచ్చకపోతే,సజెస్ట్ చెయ్యండి మరి.

Saturday, May 15, 2010

ఏమి చేస్తాం?మన రాష్ట్రం లో ఈ మధ్య ఎండలకి ప్రజలు అల్లాడినట్లు,మాంచి న్యూస్ లేక న్యూస్ ఛానెళ్ళ పరిస్థితీ ఇంచుమించు అలాగే ఉంది.నిన్నే పాత బస్తీ లో ఒక ఘటన జరిగింది,ఏమో మరి అది కూడా మన ఛానెళ్ళకి పెద్ద "కిక్" ఇచ్చినట్లు లేదు.ఏమో లెండి,ఆ ఘటన జరిగిన "స్థల మహత్యం" అని మనం సరిపెట్టేసుకోవడమే.

హక్కుల సంఘాలు కూడా కిక్కురుమన్నట్లు లేదు.బాధితుడు "పౌరుడు" కాడో,మరి ఆయనకి హక్కులు ఉండవు అనుకున్నారో మరి.

మళ్ళీ న్యూస్ ఛానెళ్ళ దగ్గరకి వస్తే,వార్తలు లేవు కాబట్టి తాగుబోతులు తప్ప తాగి గొడవ చేస్తే అది కూడా న్యూసే.ఒకసారి కాదు,ప్రతీ బులిటన్ లోనూ..ఈరోజే మెరుగయిన సమాజం కోసం పాటుపడే ఒక ఛానెల్ వారు తిరుమల కొండ మీద డ్రగ్స్ అవీ దొరుకుతున్నాయి అంటూ తాము చేసిన స్టింగ్ ఆపరేషన్ చూపించారు.పాపం ప్రాణాలకి తెగించి ఈ ఆపరేషన్ చేసారుట.

ఎవరికోసమో ఆ తెగింపు? ఎంచక్కా,ఏవి ఎక్కడ దొరుకుతాయో అన్ని డీటెయిల్సూ ఇచ్చారు.వీరి కధనం చూసి అధికారుల్లో చలనం సంగతి ఏమో కాని,తిరుమల లో అవి ఎక్కడ దొరుకుతాయో తెలియని వాళ్ళకి చక్కటి విషయఙానాన్ని అందించారు.

మళ్ళీ ఈ ఛానెళ్ళలో"ప్రాస" కోసం ప్రాకులాట ఒకటి. ఉదాహరణ:"హార్ట్ ఆఫ్ హైదరాబాద్" "హార్ట్ ఎటాక్ ఆఫ్ హైదరాబాద్" అని మొన్న ఒక ఛానెల్ లో ప్రయోగం విన్నాను.ఏమిటి ఈ అర్ధం పర్ధం లేని ప్రయోగాలు.ఎండల వల్ల పైత్యం ఎక్కువవుతోందేమో.

మా అమ్మ పైత్యానికి విరుగుడు "బెల్లం" అని చెప్తూ ఉంటుంది.మీడియా లో పైత్యం వాళ్ళందరికీ రోజూ పొద్దున్నే కాస్త బెల్లం ముక్క పెడితే సరి చేతిలో. ఇలాంటి పైత్య ప్రయోగాలు తగ్గుతాయి.


ఇంకా మన మీడియా ధోనీ అన్న మాటలు పూర్తిగా వినకుండా,ఆయన అన్న మాటలని "ఐపీ ఎల్ లేట్ నైట్ పార్టీలు" అన్న దగ్గర ఆపేసి ఇంక ఆ పార్టీల ద్రుశ్యాలు,వాటి గురించి కధనాలు.


మన రిపోర్టర్ లకి గడ గడా మాట్లాడెయ్యాలి అనే సూత్రాన్ని నర నరానా జీర్ణించుకుపోయేలా చేసినది ఎవరా అన్నది సమాధానం దొరకని బేతాళ ప్రశ్న. ఒక న్యూస్ ఛానెల్ లో ,కాస్త అందరి కంటే బెటర్ అనుకున్నావిడకి కూడా గడ గడా మాట్లాడెయ్యాలి అనే తాపత్రయమే.తన సినిమా సక్సెస్ సందర్భం గా ఒక హీరో గారు యాత్ర చేస్తున్నారు.దానిని ఈవిడ ఇలా చెప్పారు

"సింహం" సక్సెస్ అయినందుకు క్రిష్ణ బాల రాష్ట్ర వ్యాప్త యాత్ర చేపట్టారు.ఆయన ఇంకా X,Y,Z పుణ్య క్షేత్రాలు కూడా సందర్శిస్తారని సమాచారం.దీనిని బట్టి రాబోయే రోజులలో సింహం రాష్ట్రమంతా పర్యటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పరిస్థితులు కనిపించడం అనే ప్రయోగం అసహజం గా అనిపించింది నాకు ఈ సంధర్భంలో.ఏమంటారు.

గడ గడా మాట్లాడటం కొంతమందికి స్వతాహా గా వస్తుంది,కొంతమంది అభ్యాసంతో నేర్చుకుంటారు.నేర్చుకోవాలి అనే స్ప్రుహ ఇప్పుడిప్పుడే ఈ రంగం లోకి వచ్చే చాలా మందికి ఉన్నట్లు లేదు.హై పిచ్ లో అరుస్తూ సంగీత దర్శకుల లాగ చేతులూపుతూ ఏదో నాలుగు ముక్కలు చెప్పడమే రిపోర్టింగ్ అనుకుంటోంటే ఏమి చేస్తాము చెప్పండి.


కొంతమంది చెప్పేది నాకు అసలు ఏమీ అర్ధం కాదు. తెలుగు సినిమా పెద్ద దిక్కు గారి సినిమా చూసినట్లు మొహం పెట్టి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటా అలాంటప్పుడు.
ఏమీ చెయ్యలేనప్పుడు మనం మన సీయం గారిని ఆదర్శంగా తీసుకోవాలి.ఆయన చూడండి కష్టంగా ఉంది అని వాపోతారు తప్ప సీటు వదలరు,అలాగే మనం కూడా ఇలా బ్లాగుల్లో రాసుకోవడమో,లేద నోరార తిట్టుకోవాలి తప్ప టీవీ చూడటం మాత్రం మానకూడదు.

Monday, May 10, 2010

అమ్మాయిల జనన రేటు పెరగాలిమొన్న ఆదివారం సాయంత్రం సడెన్ గా అనుకున్నాను నేను,మన దేశం లో ఇక ఆడపిల్లల జన రేటు పెరిగితే బాగుండు అని.
భ్రూణ హత్యలు చూసో,ఏదో కమీషన్ సమర్పించిన నివేదిక చదివో ఇలా అనట్లేదు.నాకు అంత సామాజిక స్ప్రుహ కూడా లేదు.కానీ ఒక్కటి మాత్రం నిజం,మన మంచి కోసం,మన పిల్లల బాగు కోసమే చెప్తున్నా.

విషయం లోకి వస్తే,ఆదివారం సాయంత్రం నేను మన "గిగా స్టార్" నటవారసుడి "మగ ధీరుడు" వీక్షించడం జరిగింది.ఒకసారి హాల్ లో చూసేసా ఈ సినిమా ని.టికెట్,పాప్ కార్న్,కూల్ డ్రింక్ ఖర్చులు,లేట్ నైట్ షో కాబట్టి,సినిమ అయ్యాకా,అదనపు చార్జీ ఇచ్చి ఎక్కాల్సిన క్యాబ్ ఇవన్నీ గుర్తొచ్చి మొదటి సారి ఏమీ ఆలోచించకుండా సినిమా చూసా :).


ఇంట్లొ కూర్చుని రెండో సారి కాబట్టి వారసుడిని పరిశీలించా బాగా.

ఓ 13 సర్జరీలు,కాస్మోటిక్ ట్రీట్మెంట్లు ఇప్పించిన తరువాత గానీ తెర మీదకి వదల్లేదు ఈయన గారిని అని చదివాను.అయ్యబాబోయ్,లేకపోతే...ఊహకి అందట్లేదు కదా..

ఈ సినిమా లో,గిగాస్టార్ పాట ని వారసుడి మీద రీషూట్ చేసారు కదా,ఏమన్నా బాగుందా అసలు ఈ కొత్త పాట. స్టయిల్ అంటూ వారసుడికి ఆ పిలక...


అప్పట్లో అంటే మన గిగాస్టార్ గారికి లెగసీ లేదు కాబట్టి ఫ్రీ గా బాడీ కదుపుతూ,మంచి ఎక్స్ప్రెషన్స్ తో ఎటువంటి టెన్షన్ లేకుండా నటించారు.
వీరి వారసుడి దగ్గరకి వచ్చేసరికి గిగాస్టార్ వెనకేసుకున్న ఇమేజీ బరువు ఇటు షిఫ్ట్ అయిపోయింది.సో.మొదటి సినిమా నుండీ మనకీ,వారసుడికీ ఇద్దరికీ పరీక్షే.అసలే మన వారసులలో చాల మందికి నటన రాదు.వారసత్వం గా వచ్చే ఆ ఇమేజీ బరువు,సర్జరీలూ,కాస్మోటిక్ ట్రీట్మెంట్లు ఇచ్చి ఇచ్చి తనకు తానే కొత్త గా కనిపిస్తూ,కన్ ఫ్యూస్ అవుతూ నటించే సినిమాలు మనకి పరీక్ష కాదూ?


ఇదంతా వదిలెస్తే,మన తెలుగు సినిమా నాలుగు స్తంభాలకీ మగ పిల్లలు ఉన్నారు.వీరిలో ఒక ఇద్దరు అప్పుడే మన ముందుకు వచ్చేసారు కూడా.

వస్తే వచ్చారు,వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటే పోలా,వీరి తండ్రుల సినిమా లకి సీక్వెల్ అనో,రీ మేక్ అనో "సూపర్"ఐడియా అనుకుని,సినిమా తీసి ఆ కళా ఖండాలని మన మీదకి వదుల్తారు.దానిలో మళ్ళీ వంశపు తొడ చప్పుళ్ళు,రికార్డులు మాకే సొంతం లాంటి డైలాగులు,వారి మీద పాటలు ఇవన్నీ అదనం కొత్త నటుల "అసమాన" నటనకి.


అప్పుడే "బ్లాగార్జున" గారి 'సీతాంజలి" రీమేక్ అని టాక్.బ్లాగార్జున అప్పట్లో అలా నిజం గా ఏదో జబ్బు చేసిన వాడిలా మొహం పెట్టి డైలాగులు చెప్పినా దర్శకత్వ ప్రతిభ,కెమేరా పనితనం,సంగీతపు మాధుర్యం లో అవన్నీ మనకి కనపడలేదు కాబట్టి ఆనందిచేసాము చూసి.

మళ్ళీ ఇప్పుడంటే ఎలా...


రాబోయే 10-15 సంవత్సరాలలో మనము తప్పకుండా "మగవారి మాటలకి మీనింగ్స్ వేరులే", "సవాలు-2","సైకిల్ చెయిన్ శివ" ఇంకా చాలా చూడాలి.ఇవన్నీ ఒక ఎత్తు,మన నట "సింహ" వారసుడు వచ్చినప్పుడు ఎవరయినా నట సింహం గారి సినిమా లకి సీక్వెల్స్ అనో రీమేక్ అనో మొదలెడితే ఎలా అనే నా భయం."గ్రైండ్ చెయ్యవే ఆంటీ కూతురా" అని నట "సింహ" వారసుడు పాడతాడేమో....

కానీ ఇక్కడ ఒకరి వారసులని మాత్రం అభినందించాలి.తానేదో ముక్కు సూటి మనిషి,పంక్చూఅలిటీ,నిజాయితీ లాంటి కబుర్లు చెప్పే ఆ హీరో గారి వల్గర్ సినిమాలకి రీమేక్,సీక్వెల్స్ ఐడియాలు ఇంకా ఆయన గారి వారసులకి రాకపోవడం.ఎప్పటికీ రాకుండా ఉండేటట్లు కరుణించు భగవంతుడా!


ఇప్పుడు ఇక ఈ సీక్వెల్స్ ఎలాగూ తప్పవు.అందుకని ,కనీసం ఈ వారసులకయినా అబ్బాయిలు లేకపోతే మనకి రీ రీ మేక్ లు,రెండో సారి సీక్వెల్స్ బాధ తప్పుతుంది."బంగారు కోడి పెట్ట" అని మన పిల్లలు/మనుమలు పాడుకోక్కర్లేదు.

అందుకే అన్నాను,ఆడపిల్లల జనన రేటు పెరిగితే బాగుండు అని.

((ఈ పోస్ట్ కి ప్రేరణ అయిన ప్రదీప్ కి ధన్యవాదాలతో)

Friday, May 7, 2010

బ్యాక్ ప్యాక్ జర్నీలు-లగేజీ రాంబాబులుఅర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడవటం ఏమో కాని,విదేశాలనుండి ఒంటరిగా అబ్బాయిలు ప్రయాణం అంటే భయపడే రోజులండీ బాబూ ఇవి. ఎవరయినా ఒంటరిగా ఇండియా వెళ్తున్నారు అని అలా వినడం ఆలశ్యం,కొంచం ఇది మా వాళ్ళకిద్దురూ అంటూ చేతిలో లగేజీ తో ప్రత్యక్షం అయిపోతారు కొందరు రాంబాబులు.పోనీ ఆ లగేజీ అందుకునే వాళ్ళు ఏమయినా ఈ అబ్బాయి ఇంటి దగ్గర ఉంటారా అంటే అదీ లేదు.ఈ అబ్బాయి కూకట్ పల్లి అయితే లగేజీ ఓనర్లు ఎల్బీనగరో మరి కాస్త అవతలో ఉంటారు.


ఈ అబ్బాయి కరక్ట్ గా ఏ సినిమా కో బయలు దేరినప్పుడో ఫోను వస్తుంది మేను వస్తున్నాము అని లగేజీ తీసుకోవడానికి.సరే, అని ఇంట్లో వాళ్ళకి ఫలాన లగేజీ వీళ్ళకి ఇవ్వండీ అని చెప్పి బయలుదేరుతాడా,సినిమా మొదలయ్యిందో లేదో వీళ్ళ ఫోన్లు మొదలు.ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము,మీ ఇల్లు ఎక్కడ అని.చీ ఈ గొడవంతా ఎందుకు అని పోనీ ఎయిర్ పోర్టు కి వచ్చి లగేజీ తీసుకోండి అంటే, దానితో మరో తలనెప్పి.తీరికగా వస్తారు మహానుభావులు మెల్లిగా తీరిక చేసుకుని.అప్పటివరకు మన హీరో పాపం ఆటో,టేక్సీ,హొటెల్ బుకింగ్ మనుషుల నుండి ఎలా వేగుతాడో ఊహించుకోండి.

ఒకరోజు నేను మన శంషాబాద్ ఎయిర్ పోర్టు లో లగేజీ కోసం ఒక్క 15 నిమిషాలు ఎక్కువ సేపు ఎదురు చూడటానికే మా ముత్తాతలు అందరూ కనిపించేసారు లైన్ గా నిలబడి,టేక్సి,హోటెల్ బుకింగు రాజాల వేధింపులకి.

అసలు ఈ గోల అంతా విదేశాలలోనే మొదలవుతుంది.కొంత మంది ఉంటారు,ఎవరయినా ఇండియా వెళ్తున్నారు అని చూచాయిగా తెలిసిందా,వెళ్ళేవాడు చచ్చాడే.

అస్సలు మొహమాటం ఉండదు ఈ రాంబాబులకి.కొంచం ఈ టీవీ పట్టుకెళ్ళండి అంటారు ఏదో చాక్లెట్టు తీసుకెళ్ళండి అన్నంత ఈజీ గా. మా కొలీగ్ ఒకడు ఇండియా వెళ్ళాడు.వాడి ప్రయాణ ప్రహసనమే ఈ పోస్టు కి స్ఫూర్తి.

మా ఊరే కావడం తో ఏమయినా ఇస్తావా మీ నాన్నగారికి అన్నాడు.మా అక్క ఒక బ్యాక్ ప్యాక్ పంపించమని అల్లప్పుడెప్పుడో పడేసిన ఆర్డర్ గుర్తొచ్చి ఆ బ్యాగ్ ఇస్తాను నీకు క్యాబిన్ బ్యాగేజీ లాగ యూజ్ చెసుకో అని ఒక ఉచిత సలహా కూడా పారేసా.సరే అన్నాడు మన వాడు.వీడికి ఈ లగేజీ తప్ప వేరేది ఏమీ లగేజీ లేదు అన్న విషయం మా ఆఫీసులో రాంబాబు కి తెలిసింది అంతే,చెకిన్ లగేజీ నేను ఇస్తాను అండీ అన్నాడు ఏదో దానం ఇస్తున్నంత ఉదారంగా.ఓన్లీ క్యాబిన్ లగేజీతో వీడిని ఫ్లయిట్ ఎక్కనీయరేమో అని మన రాంబాబు ఒత్తిడికి గురయ్యడేమొ అనిపించింది నాకు.


అసలే మా కొలీగు మనసు వెన్న కంటే మెత్తనిది.స్టవ్ మీద పెట్టకుండానే కరిగిపోయే వెన్న లాంటి మనసన్నమాట. సరే,అన్నాడు.తను ఇండియ వెళ్ళడం ఏమో కాని నాకు హింస మొదలు మా రాంబాబుతో.ఒకసారి ఫోను చేసి ఆ మీరు ఎంత లగేజీ ఇస్తున్నారు అంటాడు.నాది ఒక్క బ్యాగేనండీ అన్నాను.ఓ అలాగా అని పెట్టేసాడు.మళ్ళీ కాసేపటికి ఫోను,నా దగ్గర ఉన్న బ్యాగు సరిపోవడం లేదు,మీ దగ్గర వేరేది ఉంటే తెస్తారా అని.సర్లే అని పెట్టేసాను ఫోను.ఇలా ఒక 2-3 సార్లు చేసి విసిగించాడు రాంబాబు నన్ను.మొత్తానికి మా కొలీగ్ తో అందరము ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాము.మా రాంబాబు మాత్రం రాలేదు ఇంకా. హీరో గ్రాండ్ ఎంట్రీ లాగ చేతిలో ఒకసూట్ కేసు తోసుకుంటూ మరొక చేతిలో చందనా బ్రదర్స్ ఇచ్చే ఒక బిగ్ షాపర్ లాంటి సంచీ నిండుగా సామానులు కుక్కుకుని వచ్చాడు.రాంబాబు ని దూరం నుండి చూసిన మేము చటుక్కున తల తిప్పేసాము,ఎలాగూ వచ్చాకా వీడి సుత్తి తప్పదు గా అని.

రాంబాబు సూట్ కేసు వెయ్ చేస్తే 25 కిలోలు ఉంది,ఇంకా ఆ సంచీ సామాను బోనస్.సూట్ కేసు చెకిన్ లో వేస్తాను,కానీ ఈ సంచీ కుదరదేమో అన్నాడూ మా కొలీగ్

రాం.బా.:అయ్యో అలా ఎలాగండీ అన్నీ తీసుకెళ్ళాలి.
కొలీగ్: మీరే అడ్జస్ట్ చేసి ఇవ్వండి నాకు ఇబ్బంది లేదు.నా క్యాబిన్ బ్యాగేజీ మీ సూట్ కేసు లో వేసెస్తాను,ఓపెన్ చెయ్యండి సూట్ కేసు .
రాం.బా: అబ్బెబ్బే అస్సలు ఖాళీ లేదండీ,తెరవడం కుదరనే కుదరదు

ఆఖరుకు గత్యంతరం లేక ఓపెన్ చేసాడు.చూద్దుమా,ఆ సూట్ కేసు నిండా బోలెడు కొత్తా,పాత వస్తువులు.కొత్తవాటివి అట్టపెట్టెలు తీసెద్దము అంటే ఒప్పుకోడు.మీ వాళ్ళకే కదా,అమ్మడానికి అయితే అట్టపెట్టెలు కావాలి కాని అన్నా విసుగ్గా.

ఆహా,కుదరదు అంటాడు రాంబాబు.మీ ఇష్టం మరి,త్వరగా ఇస్తే నేను బయలుదేరుతా,అని కొలీగ్ అనటంతో అన్యమనస్కం గా రాంబాబు ఒక 2 అట్టపెట్టెలు తీసి పారేసి మమ అనిపించాడు.

అలా చెకిన్ బ్యాగేజీ అయ్యింది,ఉండాల్సిన దాని కన్న ఒక 2-3 కిలోలు ఎక్కువ ఉన్నా కాని ఏ కళనుందో కౌంటర్ లో తెల్ల పిల్ల మాట్లాడలేదు.

ఇక క్యాబిన్ బ్యాగేజీ వంతు.ఆ సంచీ ఒక 12 కిలోలు ఉంది.కౌంటర్లో తెల్లపిల్ల,ఎప్పుడూ ఫ్లయిట్ ఎక్కలేదా అన్నట్లుగా లుక్కింది దాని బరువు చూసి.మేము చాలా సార్లు ఇలా పట్టుకెళ్ళాము తెలుసా అన్నాడు రాంబాబు.నాతో కాదు,దానితో చెప్పు అని పక్కకి తప్పుకున్నాడు కొలీగ్.ఇదే మాట ఆ కౌంటర్ లో ఉన్న పిల్లతో అంటే అది అప్పుడు,ఇప్పుడు కుదరదు,లోపల తీసేస్తారు నీ ఇష్టం అని చెప్పి విసుగ్గా మొహం పెట్టింది.

ఏమీ కాదండీ,వీళ్ళు ఇలాగే అంటారు,లోపల ఆపితే అప్పుడు చూద్దాము అంటాడు.ఏంటి చూసేది,ఇంత లగేజీ నేను తీసుకెళ్ళనంతే,మొహం చిటపటలాడించాలని ప్రయత్నిచాడు కొలీగ్.రాంబాబు ముందా ఆ కుప్పిగెంతులు?."ఏంటండీ,మీరు తీసుకెళ్తారని నమ్మకంతో తెస్తే?"అంటాడు ఏదో వీడు కావాలని వద్దు అన్నట్లు.

రాంబాబు మొహం చూసిన వాళ్ళు పాపం వీడికి ఏదో ఎక్కువ లగేజీ ఇచ్చి విసిగిస్తున్నాడు మా కొలీగ్ అనుకునే ఉంటారు.

అసలు,ఏమి ఉన్నాయి దీనిలో...^%&*%$#@ అని తిట్టుకుని ,మా కొలీగ్ కాస్త పై పైన చూసాడు.దాని నిండా పాత లుంగీలు,చెప్పులు,మన్ను,మశానం.
ఓ,వీడు ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు కదూ,ఏమీ వదలడన్నమాట అనుకున్నాము.

మొత్తానికి మా కొలీగ్ చేతిలో ఆ బిగ్ షాపర్ పెట్టి,లోపలకి పంపి కానీ కదల్లేదు రాంబాబు.లోపల ఏమి జరిందో నాకు తెలీదు.ఇంకా లోపల డ్యూటీ ఫ్రీ బాటిళ్ళు 2 కూడా పురమాయించాడండోయ్.

కొసమెరుపేమిటంటే,ఇంత లగేజీ అక్కడకి పట్టుకెళ్ళాకా,ఈ లగేజీ ని రాంబాబు బావమరిది కలక్ట్ చేసుకుంటాడుట కార్ లో వచ్చి.సరే, అయితే నన్ను ఆ అర్ధ రాత్రి కాస్త బస్ స్టాండ్ లో దింపమను మీ బావమరిది ని అని కొలీగ్ అడిగితే,అబ్బే,వాడు ఉండేది సికిందరాబాదు అండీ,మీరేమో
ఇంలీబన్ అంటున్నారు,రెండూ చెరోవైపూ కదూ అంటూ దీర్ఘం తీసాడు.

ఇలా ఉంటారు,మనుషులు.

నాయకులూ జిందాబాద్


ఊరికే నాయకులని ఆడిపోసుకుంటాము కాని అది తప్పు అని ఈ మధ్య నాకు ఙానోదయం అయ్యింది.చదవండి మరి ఎందుకంటున్నానో

ఏదో అనుకుంటాము కానీ,మన నాయకులు నిజంగా గ్రేట్ అండీ బాబూ.వీళ్లకి ప్రజల నాడి తెలీదు,ఏదో అలా ఎలెక్షన్లలో నిలబడి డబ్బు మంచినీళ్ళలా ఖర్చుబెట్టి గెలుపుకి కౄషి చెస్తారు అనుకుంటామా,అక్కడే మనం పప్పులో కాలేసేది మరి.

కొంత మంది "మహా" నాయకులకి తాము గెలుస్తామో,ఓడతామో ముందే తెలుస్తుందండోయ్.


ఆ మధ్య పేపర్ లో చదివాను,2009 ఎన్నికలలో తాను ఓడిపోతాను అని అసలు నోరు సరిగ్గ తిరగని,కుర్చీ మీద బోలేడు ఆశలు పెట్టుకున్న నాయకుడికి ముందే తెలుసుట.అదే విషయాన్ని అధిష్టానికి కూడా చెప్పారుట ఆయన.ఆహా,ఓహో ఏమి నిజాయితీ,ఎంత ముందు చూపు.గెలిచినా కూడా అధిష్టానం అమ్మ అంటే భయపడే నాయకులున్న ఆ పార్టీలో ఏకం గా "అమ్మ"కే ఓడిపోతాను అని చెప్పటానికి నిజం గా ఎంత ధైర్యంఉండాలంటారు.ఇంతకీ,ఇది నిజమా,అని కనుక్కోవడానికి స.హ.(సమాచార హక్కు)చట్టం దీనికి వర్తించదేమో కదా.ఓడిపోతానని తెలిసి ఎందుకు పోటీ చెయ్యటం అని మనము అనుకోకూడదంతే.పాపం అధిష్టానానికి ఆయన్ని మించిన నాయకులు దొరక్క బతిమాలి ఆయనని నిలబెట్టినట్లుంది అనుకోవాలన్నమాట.అలాంటప్పుడు వాళ్ళకి ప్రజల నాడి తెలీదు అనడం మరి తప్పా కాదా


ఏంటో, మనలాంటి వాళ్ళకి ఒక మాట అన్నాకా మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వుండదు.పర్యావసానాలు భరించాల్సిందే.అదే నాయకులకయితే,ఉందిగా బ్రహ్మాస్త్రం."నా వ్యాఖ్యలని వక్రీకరించారు" అని ఒక మాట పడేస్తే పోయే.ఎంచక్కా బయటపడిపోవచ్చు
అదే,నా లాంటి వాళ్ళు ఆ మాట అంటే,ఏరా అబద్ధాలు కూడానా అంటూ మీదకొస్తారు.

మన నాయకులు అపర "గజినీ" లండీ బాబూ.ఈ వరం వల్లే వీళ్ళకి ఎంచక్క, ఏమీ గుర్తు వుండవన్నమాట.హన్నా,ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అని ఆడిపోసుకోవడం తప్పు కదూ.

పొద్దున రాగానే బ్రేక్ఫాస్ట్,11 కి టీబ్రేక్,మళ్ళా లంచ్,టీబ్రేక్,6 కి బస్ ఎక్కడం ఇలా ఎవరయినా సాఫ్ట్ వేర్ వాళ్ళని అభివర్ణిస్తే నాకు మా చెడ్డ కోపం వస్తుంది సుమా.ఊరికే మమ్మల్ని ఆడొపోసుకుంటారు కానీ,అసలు పని లేనిది మన ప్రజాప్రతినిధులే.(మహా అయితే ఒక 10 మంది సిన్సియర్ ఏమో లెండి వీళ్ళళ్ళో,వాళ్ళకి నా క్షమాపణలు). పొద్దున్నే సభకి వస్తారు,ఏదో ఒక అంశం మీద సభ ని స్తంభింపచేసి వాయిదా వేయిస్తారు సభని 12 వరకు.మళ్ళా మామూలే,సభ 4 కి వాయిదా పడుతుంది.కాసేపు సజావుగా సాగుతుందో లేదో,సమయం మించిపోవడమో,మరలా వాయిదానో.ఒకోసారి ఏకంగా 2,3 రోజులు సభ వాయిదా పడి ఎంచక్కా లాంగ్ వీకెండ్ అన్నమాట.

ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అని నాయకులని అంటారు కానీ,పైన చెప్పినట్లు వాళ్లు "గజిని" లు కదండీ, పోనీలే అది వాళ్ళ తప్పు కాదు అని సరిపుచ్చుకోవాలంతే.కాని కొంత మంది నాయకులు ,ఎలాగోలా ఇచ్చిన మాట నిలబెట్టేసుకుంటారు,ఎందుకంటే ఇంకా వీళ్ళు రాజకీయాలకి కొత్త కాబట్టి."మార్పు" అంటూ దూసుకొచ్చిన నాయకుడొకరు ఎంచక్కా తన పార్టీ స్వరూపాన్ని ఎలా మార్చేసారో మనము చూసాము కదా,ఏదో ఒకటి మార్పు సాధించారా లేదా.

ఇంకొక నాయకుడేమో,అదేదో రాష్ట్ర సాధనే తన జీవిత ధ్యేయం అంటాడు.10 సంవత్సరాలు అయ్యింది,ఇంకా ఎప్పుడు సాధించేది అని పెదవి విరవకండి ,ఆయన మనకేమి ఫలాన రోజు సాధిస్తాను అని చెప్పారా ఏమిటి,జీవిత ధ్యేయం అన్నారు అంతే కదా.ఆయన జీవితం ఇంకా ఉంది కాబట్టి మనము ఇంకా ఓపిక పట్టాలన్నమాట.


మరి చెప్పెద్దామా అందరము....నాయకులూ జిందాబాద్