Thursday, August 22, 2019

సుప్రీం మెగా హీరో

(ఒక చిరంజీవి వీరాభిమాని భావాలకి అక్షర రూపం ఇది )
చిరంజీవి..ఈ పేరు మొదట విన్నది తుమ్మినప్పుడు అమ్మమ్మో,అమ్మో,నాన్నో  "చిరంజీవా" అన్నప్పుడు. ఆ తరువాత సినిమాల్లో ఆ పేరుతో ఒక హీరో ఉన్నాడని తెలిసి తుమ్మితే ఆ హీరో పేరే ఎందుకు తలుస్తారో అర్ధమవ్వలేదు.మా ఫ్రెండు శ్రీనుగాడయితే ఇంకొక అడుగు ముందుకేసి సుప్రీం హీరో కదరా అందుకే అని శలవిచ్చాడు.

మొట్ట మొదట నిన్ను టీవీలో చూసినది మామయ్యా వాళ్ళింట్లో హైదరాబాదులో చిత్ర లహరి కార్యక్రమంలో "అందం హిందోళం"పాటలో.ఆ తరువాత నాగార్జున సాగర్ రైట్ బ్యాంకులో చూసిన స్టేట్ రౌడీ సినిమా. ఆ సినిమాలో అన్ని పాటలున్నా కూడా ఎందుకో నువ్వు నీలి రంగు షర్టు, డిస్కో ప్యాంటూ వేసుకున్న "చుక్కల పల్లకిలో" పాట మదిలో అలా ముద్రించుకుపోయింది."శుభ లేఖ" రాసుకున్నా అన్నా లేదా ఆ తరువాత "అబ్బనీ తియ్యనీ దెబ్బా" అన్నా, ఇంకొన్నేళ్ళకి "చమకు చమ్మకు చాం" అన్నా అన్నింటిలో నేను చూసినది నీకు మాత్రమే సొంతమైన ఒక రకమైన ease and grace.

నీ ప్రతీ పాటలో ఉండే నీ సెంటిమెంటు తెల్లటి  ప్యాంటు వేసి స్టెప్పులేసినా లేకపోతే తెల్లటి(అది తెలుపేనా లేక మా బ్లాక్ అండ్ వైట్ టీవీ మాహత్యమా?)లాల్చీ వేసుకుని "నమ్మకు నమ్మకు" అన్నా నీలో ఉన్న ఆ  Grace కోసమే నీ పాటలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేవి.

డ్యాన్సుల్లో నీ కదలికలని చూస్తే "నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ"వి అనిపించేవాడివి. ప్చ్చ్హ్.. ఆ తరువాత నీ వారసులమని చెప్పుకుని ఎంత మంది వచ్చి ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా డ్యాన్సుల్లో కానీ నటనలో కానీ వారు ఏ మాత్రం నీకు సరితూగరు.కానీ ఏమి చేస్తాం.."తినగ తినగ" అన్నట్లు ఒకళ్ళకి "స్టైలిష్ స్టార్" బిరుదిచ్చేసాము, ఇంకోళ్ళని నీకు అసలు సిసలైన వారసుడిగా అంగీకరించేసాము, ఇంకొకళ్ళని "సుప్రీం హీరో"ని చేసేసాము.

స్వయం కృషి,రుద్ర వీణ సినిమాల్లో నీ నటనకి పెద్ద వాళ్ళు కూడా ఫిదా అయ్యారంటే నమ్ము.మధ్యలో పైత్యం వెర్రి తలలు వేసిన నీ సినిమాలు కొన్ని చూసి బాధ పడ్డాననుకో, అంత కంటే ఎక్కువ బాధ నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుభవించాను. 

చిరూ, ఒక జనరేషన్ సినీ అభిమానులకి నువ్వొక సుప్రీం హీరోవి అంతే.నీకు అప్పట్లో ఉన్న అభిమాన గణం చూస్తే ఆశ్చర్యమేసేది.నీ సినిమా పేరు "అభిలాష" ని మిలీనియంలో పుట్టిన
వాళ్ళ అమ్మాయికి పెట్టుకునేంత అభిమానం అన్నమాట.నువ్వు ఫలానా సామాజిక వర్గానికి చెందినవాడివి అని కూడా  దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు నిన్ను అభిమానించే చాలా మందికి తెలీదనుకుంటా కూడా.నీ కులంతో పని లేకుండా నిన్ను నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళు.

"పరుగు ఆపడం ఒక కళ" చిరూ.కానీ ఇంకా పాత గెటప్పులు,స్టెఫ్ఫులతోనే  మీ అబ్బాయి సినిమాలో గెస్టు అప్పియరెన్సులూ లేదా  విలన్లని ఎగిరి తన్నే హీరోయిజం ఉన్న సినిమాలు,యూత్ కోసం అంటూ బూతు పాటలకి స్టెప్పులు వేస్తాను  అంటే...

Wednesday, August 21, 2019

బాలూ గారికి....

వేటూరి వారి కలం నుండి జాలువారిన ఒక పాట దాదాపు రోజూ ఒకసారైనా వింటూ ఉంటాను.సాహిత్యం, సంగీతం, గాత్రం,చిత్రీకరణ అన్నీ సమ పాళ్ళల్లో కుదిరితే పాట ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ ఈ పాట.అంత అందమైన పాట ఖచ్చితంగా పాడుతా తీయగా కార్యక్రమంలో పాడే ఉంటారు అని వాళ్ళు పాడినవి విందామని యూట్యూబ్ చూస్తుంటే ఒక ఎన్నారై పాడిన ఎపిసోడ్ కనపడింది.ఆ గాయని/గాయకుడి పేరు,పాట వివరాలూ ఇక్కడ అప్రస్తుతం కానీ కర్ణ కఠోరం అనేది వారు పాడిన విధానానికి సరైన పదం అనచ్చు. కానీ బాలూ గారూ, మీరు వాళ్ళని ఆకాశానికెత్తిన విధానం చూస్తే మీ డబుల్ స్టాండర్డ్స్ అర్ధమయ్యాయి. 

ఓ రెండేళ్ళ క్రితం అనుకుంటా, ఇండియాలో పిల్లల ఎపిసోడ్లో  వాళ్ళు పాడిన పాటల్లోని చిన్ని చిన్ని తప్పులని వీర విహారం చేస్తూ వర్ణించిన విధానం చూస్తే ప్రేక్షకులైన మాకే గుండె కలుక్కుమంది.ఇంక ఆ చిన్ని గుండెలు ఎంత బాధ పడి ఉంటాయి పాపం.చిన్న పిల్లలనే కాదు, పెద్ద వారి తప్పులని కూడా అలాగే చీల్చి చెండాడెస్తారు మీరు ఇండియా ఎపిసోడ్లలో.

ఇక్కడ పిల్లలు లేదా పార్టిసిపెంట్స్ చేసే చిన్ని దోషాలని మన్నించలేని మీరు ఎన్నారై ఎపిసోడ్లలో మాత్రం ఎన్నారై పిల్లలు లేదా పెద్దవారు ఏది పాడినా అధ్భుతం అంటే ఎలాగండీ?"ఆ మెరక"లో ఏదో తెలుగు పాట పాడటమే గొప్ప కాబట్టి అలా అంటున్నాను అంటే ఇంక మేము ఏమీ అనలేము.

అలాగే మీరు వస్త్ర ధారణ గురించీ, తెలుగుదనం గురించీ చేసే కామెంట్లు.మీరు విగ్గు పెట్టుకోకుండా, పూల చొక్కాలు వేసుకోకుండా కేవలం తెలుగుదనమైన పంచె కట్టుతో మాత్రమే అన్ని సినిమా కార్యక్రమాల్లోనూ, ఇతర పాటల కార్యక్రమాల్లోనో కనపడరు కదా.అలాంటప్పుడు ఇతరులని వారి వస్త్ర ధారణ మీద కామెంటితే ఎలాగండీ?మీ అంతటి వారు ఆచరించి చూపితేనే కదా మిమ్మల్ని అనుసరించేవారికో అభిమానించే వారికో ఒక మార్గం అంటూ ఏర్పడేది?


మీ గొంతు ఇప్పటికీ మా చిన్నప్పటి బాలూ గొంతు లాగే ఉంది అని మా లాంటి వాళ్ళకి మీరంటే విపరీతమైన గౌరవం.ఇలా ద్వంద్వ ప్రమాణాలతో మిమ్మల్ని మీరు చులకన చేసుకోకండి ప్లీజ్..

Tuesday, February 12, 2019

ఏదేమైనా సఖా విడువను నిన్నే...లతా రజనీకాంత్ గారి ఈ పాట విన్నారా

ఒక్కోసారి మనకి అర్ధం అయ్యీ కాని భాష ఛానెల్స్ చూస్తే కూడా ఉపయోగమే. నిన్న అలాగ ఒక తమిళ్ ఛానెల్లో లతా రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటే ఆవిడ పాటలు కూడా పాడతారని తెలిసింది. ఆ కార్యక్రమంలో ఆవిడ పాడిన పాట ని యూ ట్యూబులో వెతికితే  ఈ పాట గురించి తెలిసింది. సాధారణంగా రెహ్మాన్ మ్యూజిక్ అంటే సినిమా ఎలా ఉన్నా పాటలన్నీ వింటాను ఒక్కసారైనా. ఎందుకంటే మిగతా పాటలెలా ఉన్నా కనీసం ఒక్క పాటలో లేదా బిట్ లో అయినా రెహ్మాన్ తన మ్యాజిక్ చూపిస్తాడన్న నమ్మకం. కానీ ఎందుకో ఈ సినిమా యానిమేషన్ సినిమా కాబట్టి, ఏముంటాయిలే పాటలు అని వినలేదు. ఇదిగో ఇన్ని సంవత్సరాలకి ఈ ఆణిముత్యం దొరికింది.

విక్రమసిఁహ పేరుతో తెలుగులో విడుదలయిన రజనీకాంత్ యానిమేషన్ సినిమాలోది ఈ పాట. వేటూరి గారు కాలం చేసాక రెహ్మాన్ సంగీతానికి సిరివెన్నెల గారే తెలుగులో రాస్తున్నారని తెలుసు. ఈ పాట వింటున్నంతసేపూ రచయిత ఎవరన్న కుతూహలం పెరిగిపోయింది, ఎందుకో శాస్త్రిగారు కాదేమో అన్న చిన్న అనుమానం కూడా. అది నిజమే, దీనిని రాసినది అనంత్ శ్రీరాం గారు.

తను ట్యూన్ ఇచ్చాకా అందులోకి పదాలు కూర్చడమే గానీ ఇసుమంతయినా రెహ్మాన్ ట్యూన్ మార్చడని వేటూరిగారే అన్నట్లు ఒకసారి చదివాను. అయినా ఆ అడ్డంకిని అధిగమించి, సందర్భానుసారం పదాలల్లిన శ్రీరాం గారు అభినందనీయులు.అంతా బాగుంది కానీ "పొత్తరు చేయడం" అంటే ఏమిటి?ఈ పదం దేనికైనా వికృతా అని కూడా ఆలోచించా కానీ తట్టలేదు. ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి.


అసలు ఎంత హాయిగా ఉందో ఆ సంగీతం, సాహిత్యం, లతా రజనీకాంత్ గారి కంఠం. పాట మొదట్లో కొమరం పులి సినిమాలో బ్యాక్ గ్రౌండులొ వచ్చే
"నమ్మకమీయరా స్వామీ" లా అనిపిస్తుంది. గాత్రంలో ఒకటి రెండు అక్షర దోషాలని మన్నించెస్తే అధ్భుతమైన పాట ఇది. నిన్నటినుండీ ఒక పాతిక సార్లు విని ఉంటాను ఈ పాటని, ఇంకా వింటూనే ఉంటాను కూడా.

ఈ పాటని తమిళంలో కూడా ఈవిడే పాడారు. కానీ తెలుగు మేల్ వెర్షన్ ఉన్ని క్రిష్ణన్ గారు పాడితే తమిళ్ళో హరి చరణ్ గారు పాడారు. ఒక్కసారి వినండి, ఒక్కసారయినా రిపీట్ నొక్కడం ఖాయం.

ఈ పాట యానిమేషన్ కాకుండా చక్కటి పెళ్ళి పాటగా ఏ మణిరత్నమో చిత్రించి ఉంటే పాట అందం మరింత పెరిగి ఉండేదేమో అనిపించింది.

ఇంత బాగున్న ఈ పాట యే వెడ్డింగ్ ప్రోమోస్ లోనూ ఎందుకు వినిపించట్లేదబ్బా?