Thursday, November 19, 2015

సత్య కంగారు వ్రతం

(జిలేబి గారి టపా చూసి దానిలోంచి శర్కరి గారి బ్లాగులోకి దారి తీస్తే సత్య నారాయణ వ్రతం గురించి గరిక పాటి వారి వీడియోకనిపించింది.. ఓ మూడు నాలుగేళ్ళ క్రితం రాసుకుని డ్రాఫ్ట్ లో ఉంచిన టపా కి దుమ్ము దులిపాను)

ఇంటి ముందు మామిడి తోరణాలు,వరుసలుగా కట్టిన బంతి ఇతర రంగు రంగుల పూలు అదే గృహ ప్రవేశం జరిగే ఇల్లని చెప్తున్నాయి.ఇంటి సింహ ద్వారం ముందు పేరుకున్న చెప్పుల గుట్ట అతిధుల సంఖ్య ని చెప్తోంది. "కలశస్య ముఖే విష్ణు..."..హలో ఆ.. ఆ థాంక్యూ పిన్నీ...ఆ..ఏమిటీ అసలు వినబడ్డం లేదు..సాయంత్రం చేస్తాను,  బాయ్ ..వినాయకుడికి చిన్న బెల్లం ముక్క పెట్టండి...ఆ పూర్తిగా రినోవేట్ చేయించామండీ..మొత్తం ..

అమ్మా హారతి ఇవ్వండి. "బుధ గ్రహం స్థాపయామి పూజయామి..అమ్మా ఇక్కడ ఈ తాంబూలం ఉంచి అక్షింతలు వెయ్యండి "చిల్డ్రన్ రూం డిజైన్ వాళ్ళే చేసుకున్నరండీ..ఆ ఆ...మోడర్న్ కిచెన్ కాన్సెప్ట్ అని కిచెన్ ఇలా ఓపెన్ గా వదిలేసాము".. "సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం"..ఏమండీ స్కైప్ లో వీడియో రావట్లేదుట..ఇండియా నుండి అక్క మెసేజ్ పెట్టింది. కాస్త చూడమని చెప్పండి ఎవరికైనా..మనం పీట్ల మీద ఉన్నాం కదా..   లక్ష్మీ కాంతం కమల నయనం..హెలో బాగున్నారా..జానకీ అటు చూడు మా బాస్ వచ్చాడు ఫ్యామిలీ తో.షీ ఈజ్ మై వైఫ్...హలో అండీ...రండి కూర్చోండి ఆ అక్షింతలు ఇలా వెయ్యండమ్మా..


 "హస్తయో అర్ఘ్యం సమర్పయామి,పాదయో పాద్యం సమర్పయామి"..రేవతీ క్యాటరర్ కి ఫోన్ చేసి కనుక్కో ఎక్కడ ఉన్నాడో, స్వీట్ ఎక్స్ ట్రా తెస్తున్నాడో లేదో,లేదంటే సారధి ని పంపించి తెప్పించు "సర్వాణ్యంగాని పూజయామి.." అయ్యో పదకొండున్నర అయిపోయిందండీ..ఇంకా కధ మొదలవ్వలేదు.అందరికీ లేటయిపోతుందేమో. "అమ్మా ఈ అక్షింతలు పట్టుకుని అందరూ కధ శ్రద్ధ గా వినండి..రేవతీ కనుక్కున్నావా..హమ్మయ్య తెస్తున్నాడన్నమాట..ఎందుకైన మంచిది సారధి ని కూడా కాస్త తెమ్మను. "ప్రధమోధ్యాయం  సంపూర్ణం..శ్రీ సత్యనారాయణ స్వామి కీ జై"...


మా బాస్ కి కూల్ డ్రింక్ కూడా ఇచ్చినట్లు లేరు ఎవ్వరూ.. సురేష్, ఆ బ్లూ లాల్చీ ఆయనే మా బాస్. కాస్త ఆయనని చూసుకో.." "ద్వితీయోధ్యాయం సంపూర్ణం"..ఆ అవునండీ కర్టెన్లు అక్కడే కొన్నాము కాస్త ఖరీదయినా కానీ..వాకిన్ వార్డ్ రోబ్ మా డిజైనర్ అయిడియానే, బెడ్ రూం లో అడ్డం లేకుండా" పంతులు గారూ భోజనాలు తయారు,మీదే ఆలశ్యం. "త్రుతీయోధ్యాయం సంపూర్ణం"..ఒక్క పది నిమిషాల్లో అయిపోతుంది..ప్లీజ్ వచ్చెస్తున్నాను.. యా యా.. ప్లీజ్ బీ సీటెడ్. "చతుర్ధోధ్యాయం సంపూర్ణం.." రేఖా బెడ్ రూం లో ఏసీ లు ఆన్ చేసేసి పిల్లలు బయటకి వెళ్ళిపోయినట్లున్నారు కాస్త ఆఫ్ చెయ్యి. పంతులు గారు, కాస్త త్వరగా ముగించండి అందరికీ ఆకళ్ళవుతున్నాయి..


"పంచమోధ్యాయం సంపూర్ణం"..ఆ ఆ పెట్టెయ్యండి ఐదు నిమిషాల్లో మొదలుపెట్టెయ్యచ్చు. అబ్బా...మొన్న రంగారావు గారింట్లో వాళ్ళింట్లో హోమం,వ్రతం కలిపే గంట లో ముగించేసారే, ఈయనేంటో వ్రతానికే గంట తీసుకున్నాడు. నేను ఖచ్చితం గా 12 గంటలకి భోజనం చెయ్యల్సిందే అండీ..లేటయితే అస్సలు ఊరుకోను.మా వాళ్ళకి ఈ సంగతి తెలుసు అందుకే నన్ను పిలిస్తే అన్నీ 12 కల్లా ముగించేటట్లు చూసుకుంటారు ఇంకొకాయన సెల్ఫ్ డబ్బా.. పంతులు గారూ ఆ పళ్ళెం ఇటివ్వండి మేము ఇస్తాము అందరికీ అక్షింతలు, మీరు మంత్రాలు చదవండి.


బ్రహ్మ గారు మాత్రం తన కేమీ పట్టనట్లు మంత్ర పుష్పం సావధానం గా చదువుతూ అందరికీ తన చేత్తోనే అక్షింతలు ఇచ్చి దాదాపు 20 నిమిషాల తరువాత వ్రత మంటపానికి తిరిగి వచ్చేటప్పటికి అందరి కళ్ళల్లో &కాళ్ళల్లో నీరసం. ఏమీ చెయ్యలేరు, పైగా అప్పుడే కధ విన్నారాయే, వ్రతం చేసి ప్రసాదం తీసుకోకపోతే జరిగే పర్యావసానాలు. మంత్ర పుష్పం అయ్యీ అవ్వగానే అక్షింతల జల్లు స్వామి ప్రతిమ మీద మూకుమ్మడిగా కురిసింది.బ్రహ్మ గారి చేతిలోంచి ప్రసాదం పళ్ళెం లాక్కుని వెళ్ళి భోజనాల దగ్గర పెట్టేసారెవ్వరో.అంతే అందరికీ వంటకాలతో పాటు ప్రసాదం కాస్త కాస్త వడ్డిస్తూ భోజనాలు మొదలయిపోయాయి. పోనీ అక్కడయినా సావధానం గా తింటారా అంటే అదీ లేదు. అక్కడా కంగారే,చెయ్యి కడుక్కునే దగ్గరా కంగారే.హోస్ట్ లకి గిఫ్ట్ ఇచ్చి ఫోటో లకి ఫోజులు ఇవ్వటానికి మాత్రం సహనం గా వేచి ఉంటారు.

తరువాత ముఖ పుస్తకం లో మనల్ని ట్యాగ్ చేసి ఫోటో పోస్ట్ చేస్తారు కదా. ఫోటో బాగోక పోతే ఎలాగండీ..ఆ.. ఎలాగ అని అడుగుతున్నా. అందుకే మరి చక్కగా సావధానం గా నిలబడి ఓపికగా ఫోటోలకోసం నిల్చునేది.  దాన్ని కూడా తప్పు పడుతున్నారే మీరు..భలేటోళ్ళే సుమా.


మనం ఇలా ఉన్నాము, శాస్త్రోక్తం గా చేయించే వారూ కరువయ్యారు.


అందరూ ఇలా చేసుకుంటారని కాదు, ఈ మధ్య చూసిన ఓ రెండు మూడు  పూజలు గమనించి రాసిన టపా ఇది.

10 comments:

 1. All purohiths in chennai are like this only..

  ReplyDelete

 2. అరవ దేశమున అయగారు దొరుకుట అంత సులభమా !

  జిలేబి

  ReplyDelete
 3. బాగా వర్ణించారు. చేసేవారు (గృహస్తు) మాత్రమే కాదండీ, చేయించేవారు (పురోహితులు) కూడా కొంతమంది ఇలాగే తమ సెల్ ఫోన్ లో వచ్చే కాల్స్ మాట్లాడుతూ మరో వైపు ఈ పూజా కార్యక్రమాన్ని నడిపించేస్తుంటారు. ఎలాగయినా పూజ పూర్తైపోతుంది. విష్ణుమాయ !

  ReplyDelete
 4. Wanderer గారూ,
  ధన్య వాదాలు.

  Astrojoyd గారూ,
  పురోహితుల మాట అటుంచితే చేసుకునే వాళ్ళం మనమూ చాలా మటుకు అలాగే హడావిడి పడుతుంటాము కదా.

  విన్నకోట నరసింహా రావుగారూ,

  గృహస్తు requirements ని బట్టి మరియు పురోహితులని బట్టి ఈ వ్రతం 45 నిమిషాల నుండీ గంటలోపు పూర్తి చేసేస్తున్నారు ఈ వ్రతాన్ని.మాయా మాయా అంతా మాయ :)

  ReplyDelete
 5. టపా బాగుంది. ఈ రోజుల్లో ఇలాగే చేస్తున్నారు. మాయింట్లో మా నాన్నగారి కాలం నుండి స్వయంగా సత్యనారాయణస్వామివారి పూజ చేసుకోవటం ఆనవాయితీ. ఒకప్పుడు అంటే నేను కుఱ్ఱవాడిగా ఇరవైల్లో ఉన్నరోజుల్లో ఒకసారి వ్రతకార్యక్రమం అంతా నాలుగ్గంటలు నడిచింది. ఆ రోజులే వేరు!

  ఆ మధ్య ఒకప్పుడు సాక్షాత్తూ అన్నవరం శ్రీసత్యనారాయణస్వామివారి గుడిలో వారి సన్నిధానంలోనే సామూహిక సత్యనారాయణవ్రతం జరగటం ఎలాగుందో చూసాను. సంకల్పంనుండి ... ఇంకమీరు లేవాలమ్మా... తరువాతి బేచ్ రావాలి త్వరగా వరకూ మొత్తం 20 నిమిషాల్లో కానిచ్చేసారు. ఔరా అనిపించింది.

  ReplyDelete
 6. శ్యామలీయం గారూ,

  ధన్యవాదాలండీ.నాలుగ్గంటలా.. ఎప్పూడూ చూడలేదు అంత సేపు జరిగే వ్రతాన్ని. నాకు గుర్తున్నంత వరకూ ఓ రెండున్నర మూడుగంటలు చేయించిన వ్రతం చూసాను.

  అయ్యో, అన్నవరం లో కూడా ఇలాగేనా. చాలా సంవత్సరాలక్రితం మేము వెళ్ళినప్పుడే అదేమిటి ఇంత షార్ట్ కట్టు అనిపించింది,ఇప్పుడు మరీ 20 నిమిషాలే అన్నమాట.

  ReplyDelete
 7. అన్నవరం మరీ దారుణం అయిపోయందండి. అంతా డబ్బు మయం. 5 కథలు 10 నిమిషాలలో ముగించేసారు. మాములుగా ఒక కథ అవగానే కొబ్బరి కాయ కొట్టి హారతి ఇవ్వాలి. కానీ అన్ని ఒకే సారి కొట్టించేసారు. కథలు కూడా చాలా అంటే చాలా క్లుప్తంగా ముగించేశారు. నాకు చిన్నపట్నుంచి ఒక సందేహం దేవుడు అరిశ్డ్వర్గాలకి అతీతుడు అంటారు కదా ఆయనకి కోపం ఎందుకు వస్తుంది. నాకు తెలిసి ఏ దైవం పూజ చేయలేదనో , మరే ఇతర కారణం చేత ప్రజలని శిక్షించారు అని నా అభిప్రాయం. ఈ సందేహం ఎంతో మందిని అడిగాను కానీ ఎవరు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. ఎవరైనా చెప్పగలరా ?

  ReplyDelete
  Replies
  1. అసలు దేవుడు అని ప్రత్యేకంగా ఎవరూ లేరు.మనిషి రెండు రాళ్ళతో నిప్పుని కనిపెట్టిన తరువాత తిండిని కనుక్కున్నాడు.తరువాత గూడు,తరువాత ఆ గూటిని రక్షించుకోవడం కోసం, ఇతరులు తన గూడుని నాశనం చేయకుండా ఉండటం కోసం భయాన్ని సృష్టించాడు.ఆ భయం పేరే దేవుడు.మనిషికి భయం అనేది కాస్తో కూస్తో ఉండాలి.భయంలేనివాళ్ళే ఉగ్రవాదులవుతారు.ఉగ్రవాదులకూ భయం పుట్టించేది ఎవరు ? దేవుడే !

   దేవుడు అంటే మనిషే ! మనిషి చేయలేనిపని కోర్టులూ చేయలేవు,దేవుడూ చేయలేడు.మీరు దేనికి భయపడుతున్నారో మీరే ఆలోచించుకోవాలి.ఉన్నాడో లేడో తెలియని దేవుడికోసం బ్రతికే ఉన్న మనిషి భయపడుతుంటే లేని దేవుడేమనుకుంటాడు ?

   ఇదివరకు అగ్రహారంలో ఉండే బ్రాహ్మలే ఉగ్రవాదులుగా ఉండేవారు.ఇపుడు హిందూఉగ్రవాదులెవరో మీకు తెలుసు ! నేను చెప్పనక్కరలేదు.

   ఇక పూజలంటారా మనిషికి క్రమశిక్షణ అనేది అవసరం.క్రమశిక్షణ కోసం ఒక పద్ధతి ప్రవేశపెట్టారు.మళ్ళీ ఆ మంత్రాలు ఎవరూ చదవకూడదని బ్రాహ్మలే చేయాలి అని బ్రాహ్మణుడే వర్ణాలలోకి గొప్పవాడన్నారు.ఇపుడు బ్రాహ్మలకీ సాంకేతికత ఎక్కువైపోయి మంత్రాలు అవసరంలేదు ధ్యానం చేస్తే చాలన్నారు.ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ! మన ధ్యాస దేనిమీద ఎక్కువగా ఉంటుందో అదే మనకు దక్కుతుంది.మీకు దేవుడి మీద ధ్యాస ఉంటే దేవుడు దక్కుతాడు,కత్రినా కైఫ్ మీద ధ్యాస ఉంటే కత్రినా కైఫ్ దక్కుతుంది.

   ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అత్యంత స్వేచ్చకోసం అత్యంత క్రమశిక్షణ అవసరం అని ఒక మహానుభావుడి ఉవాచ ! ఎవరు చెప్పారో తెలియదు కానీ పాటిస్తే పోయేదేముంది ?

   Delete
 8. అశోక్ గారూ, హ్హ్మ్మ్.. అన్నవరం లో అలా ఎందుకు చేస్తున్నారో??

  ఇక మీ ప్రశ్న ని బ్లాగుల్లో ఈ విషయ పరిఙానం ఉన్న వారిని అడగాలి. లేదా వింటుంటే వింటుంటే చాగంటి గారి ప్రవచనాల్లో సమాధానం దొరకచ్చు. ప్రయత్నించండి.

  ReplyDelete