Sunday, August 14, 2011

ఈరోజు పొద్దున్నే టీవీ పెట్టాను....

హాయిగా బయట వర్షం కురుస్తోంటే, నేను సుష్టుగా బ్రేక్ఫాస్టు చేసి, అందరికీ ఓ స్వాతంత్ర్య దినోత్సవ మెసేజీ కొట్టి, రిప్లయిలు అందుకుని మరలా నేను రిప్లయ్ పెట్టి ఆన్ లైన్ లో మన ఛానెళ్ళు చూద్దామని కూర్చున్నాను.

మొదట టీవీ తొమ్మిది పెట్టాను.సమాజాన్ని ఉద్ధరించే పని లో బిజీగా ఉండే వారు ఎందుకో ఈరోజు నన్ను కరుణించలేదు. టెక్నికల్ డిఫికల్టీ అని వచ్చింది. సరే అని టీవీ 1 పెట్టాను. ఎవరో ఒకావిడ కూర్చుని ఏదో చెప్తోంది. ఖుష్భూ లా ఉందే అనుకున్నా. సౌండ్ పెంచాను. "నాకు ఏడుపొచ్చేసేది" అంటూ సడెన్ గా ఏడ్చేసింది. అప్పుడు చూసాను అదొక యాడ్ అనీ, ఆవిడ ఏదో పూసలు,మాలలని ఎండార్స్ చేస్తోంది అని. కిందేమో బ్రేకింగు న్యూసు లో "శ్రీరామ రాజ్యం" ఆడియో ఆవిష్కరణ అని న్యూసు.

ఇంకేదో టీవీలో రాందేవ్ బాబా ఆసనాలతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధులని చేసే పని లో బిజీ గా ఉన్నాడు.ఇంకో ఛానెల్లో వెంకీ బాబు "నేను పుట్టిన రోజు,ప్రేమ పుట్టిన రోజు" అంటూ హీరోయిన్ని అలరిస్తుండగా ఆయన 25 సంవత్సరాల ప్రస్థానం బ్యాక్ గ్రవుండ్ లో వినిపిస్తోంది.ఇంకాస్త ముందుకెళ్ళి చూస్తే షాయాజీ షిండే "ఎవర్రా నాకు బెయిలు ఇప్పించింది,ఎవరు" అని పిచ్చి గెంతులు వేస్తుండగా "సింహం" గుడ్లు గుండ్రంగా తిప్పుతూ చూపుడి వేలితో ఎవరినో శాసించడం మొదలెట్టాడు.ఎందుకు లే "బాబూ",పొద్దున్నే, అనుకుని వేమూరి వారి ఛానెల్ పెడితే వారు కూడా ఏవేవో ఉంగరాల ద్వారా ప్రజల కష్టాలని అర్జెంటు గా తీర్చేసే పని మీద ఉన్నారు. వీళ్ళకే ఎప్పుడూ సెన్సేషనల్ న్యూస్ దొరికే ఉంగరం ఏదో కనుక్కుని పెట్టుకుంటే పోలా,సగం కష్టాలు తీరుతాయి రిపోర్టర్లవి.

మరేదో ఛానెల్లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రోగ్రాం వస్తోంది. మొట్టమొదటి సారి ఎగిరిన జాతీయ ఝండా కరీం నగర్ జిల్లా నుండే తయారయినదిట.ఈ మాట మన ...కి తెలియదేమో ఇంకా, ఎక్కడా వాడలేదు.వాళ్ళ నాయకుడిని తలచుకున్నానో లేదో ప్రత్యక్షం వారి అనుచరులు.

అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది, అలాగే చిదంబరం అర్ధరాత్రి(?)ప్రకటన చేసారు కనుక, ఆ మాట కి కట్టుబడి ఉండాలి అని సింబాలిక్ గా చెప్పేందుకు రెండు ఝండాలు ఎగరేస్తున్నారుట వీరు. వాహ్వా వాహ్వా..

సరే, ఇంకో ఛానెల్ కి మారాను, వారేమో కామెడీ పేరడీ తో బిజీ గా అనిపించి యువనేత ఛానెల్ పెట్టాను. వీరేమో యధావిధి గా తమ ప్రియతమ నేత మీద పూలవర్షం కురిపిస్తూ 2009 సెప్టెంబరు రెండవ వారం నుండీ పక్కనే పెట్టుకుంటున్న కిలోల కొద్దీ బురద నుండి కొంచం కొంచం తీసి ప్రభుత్వం మీదా అధిష్టానం మీదా వేస్తూ, మువ్వన్నెల సంబరాలని చెప్తున్నారు తమ వార్తలలో.
అలాగే జరగబోయే యువనేత "ఓదార్పు" గురించి కూడా.

మన నాయకులు కొంత మంది స్వాతంత్ర్య సంబరాలకి అటెండ్ అయ్యి విధులకి మాత్రం దూరం గా ఉండాలి అని నిర్ణయించుకున్నారుట.ఛీ సిగ్గుండాలి, పని చెయ్యము అని పబ్లిగ్గా చెప్పుకోవడానికి.

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నేనూ మా అబ్బాయి మన్మోహన్ సింగ్ తో కలిసి జనగణ మణ పాడే టైం అవుతోంది మరి.

3 comments:

  1. "సింహం" గుడ్లు గుండ్రంగా తిప్పుతూ చూపుడి వేలితో ఎవరినో శాసించడం మొదలెట్టాడు.
    మొత్తానికి సింహాన్ని వదలను అంటారు!! ఇకపై 'రాముడు' అనాలో ఏమిటో.. ఆలోచించండి :)

    ReplyDelete
  2. ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. నేను చిన్నప్పుడు నందమూరి తారక రామారావు గారి ఆటోగ్రాఫ్ ని ఆయన హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద మౌనవ్రతం, నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు తీసుకున్నాను. ఇప్పటికీ గొప్పగా ఫీల్ అవుతాను.

    ReplyDelete
  3. తొలకరి గారూ,
    ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారన్నమాట,బాగుంది,

    మురళిగారూ,
    అయ్యో నేను వదిలేదేంటండీ సింహమే నాకెదురొస్తేను :).

    ఏ మాటకామటే చెప్పుకోవాలి రాముడి గెటప్ లో బాగున్నాడు కానీ ఒక్క నాలుగైదేళ్ళముందు ఈ పాత్ర చేసుంటే మొహం లో ఆ ముడుతలు అవీ లేకుండా ఇంకా బాగుండేవాడేమో అనిపించింది

    ReplyDelete