Friday, July 22, 2011

సింఘం

మొదటి రోజు చివరి ఆట లో "సింఘం" నిన్న చూసి ఇవాళ ఇంటికొచ్చాను. సింఘం పంజా కి పడిపోయి లేట్ అవ్వడం కాదు ,ఇవాళ వచ్చానంటే, నిన్న రాత్రి 11.59 కి సినిమా మొదలయ్యి తెల్లవారుఝామున ముగిసింది.

నేను తమిళ్ తెలుగు వెర్షన్లు చూడలెదు కాబట్టి ఫ్రెష్ మైండు తో సినిమాకి వెళ్ళాను.టికెట్ తీసుకునే ముందు పోస్టర్ లో కాజల్ ని చూసినప్పుడు మాత్రం అనిపించింది అజయ్ దేవగణ్ పక్కన అనుష్క అయితే బాగుండేదేమో ఈ అమ్మాయి మరీ చిన్నగా కనపడుతుంది అతని సరసన అని.

ఎనభయ్యో వంద మందో పట్టే చిన్న స్క్రీన్ అది.పాప్ కార్న్,శీతలపానీయం తో మా సీటుకి వచ్చాను. అదేమి సీటండీ బాబూ,పేరు కి కపుల్ సీటే కానీ కాస్త కాలు మీద కాలు వేసుకుని కూర్చుందామని కాలు అటూ ఇటూ ఏమరుపాటుగా కదిపానంటే నా ముందు సీట్లో నెత్తి మీద ఏరియల్ వ్యూ లో కనపడ్డట్టు అక్కడక్కడ మాత్రమే జుట్టున్న ఆసామి కి నా కాలు తగిలేటట్లు ఉంది.

అయినా సినిమాలో అంత మైమరిచి చూసే సీన్లేమీ లేవు కాబట్టి ఈ సమస్య ఎదురవలేదు.

సినిమా కధ మీ అందరికీ తెలుసు కదా పోలీసు విలన్ మధ్య జరిగే పోరాటం.ఇలాంటి కధలో హీరో ఇంట్రడక్షన్ మామూలుగా ఉంటే బాగోదు కాబట్టి,ఫార్ములా ప్రకారం ఒక గుడి కోనేరు లో మునిగి లేచి తన ఆరు పలకల బాడీ నీ చూపిస్తూ మన సింఘం నడచి వస్తాడు. వచ్చీ రాగానే రెఫ్యూజీ లో అభిషేక్ కి డ్యాన్సులలో పోటీ గా అన్నట్లు ఒకటే స్టెప్పుతో ఓ పాట. ఈ పాట అనవసరం.

మంచివాళ్ళకి మంచివాడూ,ఆపదలో ఆదుకునే వాడు,చెడ్డవారిని చితకబాదే పోలీసు గా ఓ నాలుగైదు సీన్లలో మనకి హీరో ని చూపిస్తారు.

హీరోయిన్ ఇంట్రడక్షన్ లో కళ్ళనో,కాళ్ళనో మొదట చూపించకుండా కాజల్ చెంగున కారు లోంచి దూకి మన ముందుకొచ్చెస్తుంది ఏ ఆర్భాటం లేకుండా.

ఈ అమ్మాయి సినిమా అంతా చుడీదార్ లలో నే కనపడింది ఒక పాటలో చీర లో మెరిసింది. నటన కి పెద్దగా ఏమీ లేదు. మగధీర లో చాలా అందం గా ఉన్న ఈ అమ్మాయి ఎందుకో ఈసారి డల్ గా కనపడింది. మన రాజమౌళి టేకింగ్ డిఫరెంటో లేక ఈ అమ్మాయి లో కళ తగ్గిందో.

హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు.అనవసరం గా ఫార్ములా ప్రకారం ఇరికించిన రెండు పాటలు కూడా వేస్ట్.

ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమా కి హై లైట్ అవుతుంది. పైగా హిందీ సినిమాలలో పెద్ద గా వినిపించని అంత్య ప్రాస డైలాగులు ఇతని కోసమే రాసారా అన్నట్లు ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి, బాలీవుడ్ ప్రేక్షకులకి ఇవి కొత్త కాబట్టి కొన్నింటికి చప్పట్లు పడ్డాయి మల్టీప్లెక్సు లో కూడా.

యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలం ఈ సినిమాలో. బెల్టు తో గూండాలని చితకబాదడం,వట్టి చేత్తో నడి బజార్లో రౌడీలని చావగొట్టడం వంటివి చూస్తే పోలీసు ప్రధాన పాత్రలో వచ్చిన పాత సినిమాలు గుర్తొస్తాయి.

మన టాలీవుడ్ కి చెందిన ఒక అగ్రకధానాయకుడి ని మైమరిపించే సీన్ ఒకటుంది.హీరో కొట్టగానే గూండా తన సూమో తో సహా తలకిందులయ్యి గాల్లోకి లేస్తాడు. పైకి లేచిన ఆ సూమో కింద పడుతుండగా గూండా ని మెరుపులా బైటికి లాగి మరలా చితక్కొట్టే సీన్ కి చప్పట్లు,విజిల్సూ ను. ఈ సీన్ కి విజిల్స్ పడ్డాయంటే.. :)

మధ్య మధ్య లో మరాఠీ డైలాగులు నా లాంటి వారికి అర్ధం కావు. మన సాయి కుమార్ పోలీస్ స్టొరీ లో పలికిన డైలాగ్ తెలియకపోవడం వల్ల కావచ్చు అజయ్ దేవ్ గణ్ పలికిన "నాలుగో సిం హం నా బుర్ర లో ఉంది" అనే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా మొదటి కాసేపు Slapstick కామెడీ తో కామెడీ పార్ట్ ని నడిపించెస్తే ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యి విలనీ ని కామెడీ ని తన భుజస్కంధాల పై మోసెసాడు చివరి దాకా.క్లోజప్ సీన్ లలో తన విగ్గు పై కాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేది.


చివరి సీన్ లో అతని నటన బాగుంది. ఎలా నటించినా కానీ "మార్పు" పేరుతో పరాయి నటులని ఆదరించి అందలమెక్కించే మనకున్న సుగుణం హిందీ ప్రేక్షకుల వద్ద లేదు కాబట్టి ప్రకాష్ రాజ్ భవితవ్యం చెప్పలేము.

కానీ ఇతని నటన,డైలాగ్ డెలివరీ ప్రత్యేకం గా ఉన్నాయి కాబట్టి రాణిస్తాడనే అనిపించింది అట్లీస్ట్ కొన్ని సినిమాల వరకూ.

సహాయ నటులు అందరూ బాగున్నారు ఎక్కువ మంది మరాఠీ నటుల లాగ అనిపించారు.

ఇలాంటి సినిమాల ఫార్ములా ప్రకారం విలన్ అంతమయ్యేముందు అనవసర ఆర్భాటపు ఐటెం సాంగ్ లేకపోవడం పెద్ద రిలీఫ్.

చివరికి విలన్ అంతమవ్వాలి కాబట్టి హడావిడి గా పోలీసులందరూ హీరో కి సపోర్ట్ చేసెయ్యడం అనేది నాటకీయం గా ఉన్న స్క్రీన్ ప్లే బాగుండటం వల్ల ఆలోచించే లోపే సినిమా అయిపోతుంది.

ఒరిజినల్ వెర్షన్ చూసి స్క్రీన్ లో అటు సూర్య ని ఇటు అజయ్ దేవ్గణ్ ని ఊహించుకోకుండా ఇది చూస్తే ఓ టైంపాస్ సినిమా చూసామన్న త్రుప్తి మాత్రం గ్యారెంటీ.

2 comments:

  1. భీభత్సమైన అనుభవం అన్నమాట!!

    ReplyDelete
  2. అబ్బా నాకు ఇక్కడ దియేటర్లు చిరాకండీ బాబు ..ముందు సీట్ వచ్చిందంటే మరీ చండాలం..కళ్ళు ,మెడ కంబైండ్ గా లాగేస్తాయి..

    ReplyDelete