Saturday, April 2, 2011

వరల్డ్ కప్పు-తాజ్ క్రిష్ణా

కపిల్ డేవిల్స్ కపిల్ డేవిల్స్,కపిల్ పట్టిన "అధ్భుత" క్యాచ్..ఇవే కదా మనము ప్రతీ వరల్డ్ కప్పు కి ముందూ వినేవీ చూసేవీ టీవీలలో,పత్రికలలో. 1983 లో మనవాళ్ళు కప్పు గెలిచినప్పుడు నాకు తెలీదు ఇక ఆతరువాత నుండీ ఇదే గోల వరల్డ్ కప్పు అన్నప్పుడల్లా.

పత్రికలయినా మరేమి చేస్తాయి పాపం ఇంకో కప్పు మన ఖాతాలో లేకపోతే. ఛానల్సు,పత్రికలు ఇబ్బడి ముబ్బడి గా పుట్టుకొచ్చి ఇచ్చిన "కపిల్ డేవిల్స్" కవరేజ్ వల్ల వచ్చిన విరక్తి ఇది అంతే కానీ 1983 విజయాన్ని తీసి పారెయ్యడం కాదు.


ప్రస్తుత టీం కనుక ఇప్పుడు కప్పు గెలిస్తే మనకి విముక్తి "కపిల్ డేవిల్స్" నుండి ఇక మన పిల్లకాయలు పడతారు "ధోనీ సేన" బారిన.


వరల్డ్ కప్పు ఫైనల్ అంటే నాకు గుర్తొచ్చేది "తాజ్ క్రిష్ణా హోటల్,హైదరాబాదు". నేను హైదరాబాదు లో ఉన్నప్పుడు తాజ్ క్రిష్ణా ముందు నుండి వెళ్తున్నప్పుడల్లా అనిపించేది ఎప్పటికయినా దీనిలో ఒక్కరోజయినా ఉంటానా అని. అన్నీ కలిసొచ్చి 2003 మార్చ్ 22 న నా పేరు మీద ఓ మూడు రోజులు బుక్కయ్యింది.


మధ్యాహ్నానికి చెక్ ఇన్ చేసాను. అలసట వల్ల బాగా నిద్ర పట్టేసింది. సాయంత్రం లేచి కాస్త తిని కాసేపు అలా తిరిగొచ్చి మరలా పడుకున్నాను,రేపు హోటల్ అంతా ఎక్స్ ప్లోర్ చెయ్యచ్చు లే అని.మరునాడు మార్చి 23,2003 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య.ఇంకో రెండు రోజులుంది అప్పటికి ఇంకా హోటల్ బుకింగ్.ఒక్కళ్ళం ఏమి ఎంజాయ్ చేస్తాము హోటల్ లో హాయిగా అక్క దగ్గరకి వెళ్ళి అందరితో కలిసి చూద్దామనిపించి బయటకొచ్చాను. బయటకొచ్చి నిల్చున్నా,ఒక్క ఆటో కూడా దొరకదే.మరలా లోపలకి వస్తోంటే రిసెప్షనిస్టు చెప్పాడు క్యాబ్ బుక్ చెయ్యమంటారా అని.సరే అన్నాను చేసేది లేక. అక్కడ నుండి ఆటో వెళ్తే ఎక్కువలో ఎక్కువ ఇరవై అయ్యేదేమో(2003 ఆటో మీటర్) ప్రకారం. క్యాబ్ వచ్చింది, 400 రూపాయలు అనేసరికి గుండె జారిపోయింది నాకు ఒక్క నిమిషం.

అయినా ఈరోజు ఫైనల్స్,మన వాళ్ళు గెలిస్తే సంబరాలలో పడి ఎప్పటికి వస్తానో రూం కి మళ్ళీ అనిపించింది. మన విజయాన్ని ఊహించేసుకుని ఆ ఊపులో హోటల్ రూం ఖాళీ చేసి పడేసా.

క్యాబ్ ఎక్కి మధ్యలో ఏదో గుర్తొచ్చి ఒక షాపు దగ్గర ఆగి మొత్తం ఓ పది ఇండియా టీ చొక్కాలు(టీ షర్టులు) కొన్నాను ఇంట్లో అందరికీ ప్లస్ క్యాబ్ డ్రైవర్ కి కూడా ఒకటి. అప్పట్లో వచ్చిన బ్లూ పెప్సీ బాటిల్సు ఓ నాలుగు,మరి కాసిని స్నాక్స్ కూడా కొని బయలుదేరాను అక్క దగ్గరకి.
పొద్దున్నే పేద్ద ప్యాకెట్టు పట్టుకుని దిగిన నన్ను చూసి షాక్ అందరూ ఇంట్లో.



మొత్తానికి మ్యాచ్ మొదలయ్యింది. జహీర్ కొత్త బంతి పట్టుకుని నిలుచున్నప్పుడు టీవీలో 0-0 అని వచ్చినప్పుడు ఓ ఫోటో కూడా తీసా టీవీని.నాకేం తెలుసు పాంటింగ్ అలా వీర విహారం చేస్తాడని. వాళ్ల ఉతుకుడు అయ్యాకా మన వాళ్ళు బ్యాటింగ్ మొదలు,మధ్యలో వర్షం వచ్చేసరికి ఇంట్లో ఉన్న కాసిని టపాకాయలు కూడా కాల్చాము మ్యాచ్ వాయిదా పడుతుంది అన్న గాట్ఠి నమ్మకంతో.




ఫలితం మీకు తెలిసిందే. ఏటి సేత్తాం మ్యాచు పోయినాకా,ఈసురోమంటూ మరునాడు లేచి భారంగా బయలుదేరాను ఆఫీసుకి. పొద్దున్న పదింటికి మా ఫ్రెండు ఫోను,ఎలా ఉంది ఫైవ్ స్టార్ హోటల్ స్టే అంటూ...


హ్హ్మ్..అలా ముగిసింది హాఫ్ డే తో నా ఫైవ్ స్టార్ హోటల్ స్టే.

అందుకే బ్లాగు ముఖం గా ఇండియన్ టీం ని కోరుతున్నాను నాకు మరలా తాజ్ క్రిష్ణా లో ఓ మూడు రోజులు రూం బుక్ చెయ్యాల్సిందిగా.

1 comments:

  1. కప్పు గెలిచింది మన టీం.. మీరెక్కడ???

    ReplyDelete