Tuesday, February 12, 2019

ఏదేమైనా సఖా విడువను నిన్నే...లతా రజనీకాంత్ గారి ఈ పాట విన్నారా

ఒక్కోసారి మనకి అర్ధం అయ్యీ కాని భాష ఛానెల్స్ చూస్తే కూడా ఉపయోగమే. నిన్న అలాగ ఒక తమిళ్ ఛానెల్లో లతా రజనీకాంత్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటే ఆవిడ పాటలు కూడా పాడతారని తెలిసింది. ఆ కార్యక్రమంలో ఆవిడ పాడిన పాట ని యూ ట్యూబులో వెతికితే  ఈ పాట గురించి తెలిసింది. సాధారణంగా రెహ్మాన్ మ్యూజిక్ అంటే సినిమా ఎలా ఉన్నా పాటలన్నీ వింటాను ఒక్కసారైనా. ఎందుకంటే మిగతా పాటలెలా ఉన్నా కనీసం ఒక్క పాటలో లేదా బిట్ లో అయినా రెహ్మాన్ తన మ్యాజిక్ చూపిస్తాడన్న నమ్మకం. కానీ ఎందుకో ఈ సినిమా యానిమేషన్ సినిమా కాబట్టి, ఏముంటాయిలే పాటలు అని వినలేదు. ఇదిగో ఇన్ని సంవత్సరాలకి ఈ ఆణిముత్యం దొరికింది.

విక్రమసిఁహ పేరుతో తెలుగులో విడుదలయిన రజనీకాంత్ యానిమేషన్ సినిమాలోది ఈ పాట. వేటూరి గారు కాలం చేసాక రెహ్మాన్ సంగీతానికి సిరివెన్నెల గారే తెలుగులో రాస్తున్నారని తెలుసు. ఈ పాట వింటున్నంతసేపూ రచయిత ఎవరన్న కుతూహలం పెరిగిపోయింది, ఎందుకో శాస్త్రిగారు కాదేమో అన్న చిన్న అనుమానం కూడా. అది నిజమే, దీనిని రాసినది అనంత్ శ్రీరాం గారు.

తను ట్యూన్ ఇచ్చాకా అందులోకి పదాలు కూర్చడమే గానీ ఇసుమంతయినా రెహ్మాన్ ట్యూన్ మార్చడని వేటూరిగారే అన్నట్లు ఒకసారి చదివాను. అయినా ఆ అడ్డంకిని అధిగమించి, సందర్భానుసారం పదాలల్లిన శ్రీరాం గారు అభినందనీయులు.అంతా బాగుంది కానీ "పొత్తరు చేయడం" అంటే ఏమిటి?ఈ పదం దేనికైనా వికృతా అని కూడా ఆలోచించా కానీ తట్టలేదు. ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి.


అసలు ఎంత హాయిగా ఉందో ఆ సంగీతం, సాహిత్యం, లతా రజనీకాంత్ గారి కంఠం. పాట మొదట్లో కొమరం పులి సినిమాలో బ్యాక్ గ్రౌండులొ వచ్చే
"నమ్మకమీయరా స్వామీ" లా అనిపిస్తుంది. గాత్రంలో ఒకటి రెండు అక్షర దోషాలని మన్నించెస్తే అధ్భుతమైన పాట ఇది. నిన్నటినుండీ ఒక పాతిక సార్లు విని ఉంటాను ఈ పాటని, ఇంకా వింటూనే ఉంటాను కూడా.

ఈ పాటని తమిళంలో కూడా ఈవిడే పాడారు. కానీ తెలుగు మేల్ వెర్షన్ ఉన్ని క్రిష్ణన్ గారు పాడితే తమిళ్ళో హరి చరణ్ గారు పాడారు. ఒక్కసారి వినండి, ఒక్కసారయినా రిపీట్ నొక్కడం ఖాయం.

ఈ పాట యానిమేషన్ కాకుండా చక్కటి పెళ్ళి పాటగా ఏ మణిరత్నమో చిత్రించి ఉంటే పాట అందం మరింత పెరిగి ఉండేదేమో అనిపించింది.

ఇంత బాగున్న ఈ పాట యే వెడ్డింగ్ ప్రోమోస్ లోనూ ఎందుకు వినిపించట్లేదబ్బా?

Friday, December 21, 2018

ఇ-జనరేషన్ పెద్దవాళ్ళు

ఒక పాతిక ముప్ఫై ఏళ్ల క్రితం వయసులో పెద్ద వాళ్ళు అంటే సాయంత్రం అలా ఏ గుడికో, వాకింగుకో వెళ్ళేవారు లేదా పార్కుల్లో అక్కడా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకునేవారు. మహా అయితే పేపరులో వార్తలని అక్షరం వదలకుండా చదివేవారు.

జియో ధర్మమా అని ఫోనులో డేటా లభ్యత సులభతరం కావడంతో అందరిలాగే వీరి జీవన శైలి కూడా మారిపోయింది.గుడిలో వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది అనడంలో సందేహం లేదు.ఫోనుల్లో యాక్టివిటీ వల్ల మన అందరిలో ఉన్న అపరిచితుడు బయటకి రావడం మొదలుపెట్టాడు.దీనికి పెద్దవారు కూడా మినహాయింపు కాకపోవడమే విచిత్రం.ఫేస్ బుక్కు, వాట్సాపుల్లో పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజీలతో రోజు మొదలు.అక్కడితో ఆగితే ఫరవాలేదు,శుభ మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అదనంగా జీవిత సత్యాలు బోధించే వ్యాఖ్యలు, పండగ అడ్వాన్స్ విషెస్, పండగ రోజు విషెస్, దేశం భ్రష్టు పట్టిపోతోందనే వేదన పంచే మెసేజిలూ, అసలు ధనవంతులు తమకున్న డబ్బు ఎలా నీళ్ళళ్ళా ఖర్చు పెడుతూ పేదలకి దానం ధర్మం అనేది చెయ్యకుండా ఎలా పెళ్ళిళ్లకోసం తగలేస్తున్నారో అని బాధ పడే పోస్టులు ఒకటా రెండా..

సరే వాళ్ళెవరో పెళ్ళిళకో ఇంకో ఆర్భాటాలకో ఖర్చు పెట్టారనుకుందాము, కానీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, మీకు ఆర్ధిక స్తోమత ఉంది, అయినా  కూడా మీరు పనమ్మాయికి ఒక్క ఐదు వందలు ఇవ్వగలరా? 

ఫేస్‌బుక్కులో వీళ్ళు షేర్ చేసే జోకులు చూస్తే ఒక్కోసారి జాలి వేస్తుంది, ఇంత వయసొచ్చి ఇదేమి పైత్యం అని.కానీ ఇవన్నీ వీళ్ళ అసలు స్వభావానికి అద్దం పడతాయనడంలో సందేహం లేదు. పైగా "మెమొరీస్" ఫీచర్‌తో మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి డబుల్ కోటా.నేను పోయిన సంవత్సరం, లేదా కొన్ని ఏళ్ళక్రితం ఇది పోస్టు చేసాను అంటూ, మళ్ళీ దానికి లైకులు పెద్ద హైలైట్.

కానీ కొంత మంది పెద్దవారు వారి అనుభవసారాన్నో లేదా వారికి తెలిసున్నదానినో షేర్ చేస్తూ, విఙానం  పంచుతూ రాసే పోస్టులు చూస్తే ఎన్ని వేల మైళ్ళు ఆవల ఉన్నా, వారెవరో తెలియకపోయినా గౌరవం కలుగుతుంది.

అబ్బెబ్బే ఫోను, టీవీల వల్ల సమాజం చెడిపోతోంది అంటూనే ఆ పిచ్చిలోంచి బయటకి రాలేకపోవడం చూస్తే అనిపిస్తుంది, ఇంత పెద్దవారే ఈ లంపటంలోంచి బయటపడలేకపోతే ఇంక పిల్లల పరిస్థితి ఏమిటీ అని.

అసలు పిల్లలకి కధలు, కబుర్లు చెప్తే ఈ జనరేషన్ పిల్లలు వినరు అంటారు కానీ చెప్పే పెద్దవారు ఎంత మంది ఉన్నారు అసలు?ముందు ముందు ఇంక అసలు ఉండరేమో కూడా. ఎక్కడ నలుగురు పెద్దవారు చేరినా మా పిల్లలు అదీ, మా పిల్లలు ఇదీ, ఫలానా ఫోను వాడుతున్నాను, కేబుల్ తీసేసి ఫలానా బాక్సు వాడి అన్ని ఛానెల్స్ ఫ్రీగా చూడచ్చు ఇంతే కదా. ఒకళ్ళకి పాటల ప్రోగ్రాముల పిచ్చి, ఇంకొకరికి వెకిలి కామెడీ షోల వెర్రి.

ఇంకొకాయన తన సెల్ఫ్ డిసిప్లిన్ గురించి గొప్పలు, మరొకావిడ తాను చేసే పూజలూ, చేయించగలిగే హోమాల గురించి డాంబికాలు. నేను ఉపనిషత్తులు, వేద వేదాంగాలు చదివాను, అన్ని రకాల యఙాలు, యాగాలు చేయించగలను అన్నారు ఆ మధ్యన పార్కులో పరిచయం అయిన ఒక తెలుగావిడ. మన పెద్దలు చేసిన కట్టుబాటుని అధిగమించి నేను ఇది చేయిస్తాను అని సగర్వంగా పెద్దవారే చెప్పుకుంటోంటే ఏమనాలి?


ఏదైనా ప్రదేశానికో ఇంకెక్కడికో వెళ్ళినా అందాన్ని ఆస్వాదించడం మరచి ఫోనులో ఫొటోలు తీసుకోవడంలో బిజీ. గుడిలో కూడా ఫోటోలు తీసే పెద్దవారిని చూస్తే ఆశ్చర్యం వేసింది . ఆ మధ్య ఒక ఫ్రెండు చెప్పింది, తనతో ఎప్పుడూ మాట్లాడని అత్తగారు  ఒక వాట్సాప్ మెసేజీ ఫార్వార్డ్ చేసిందిట, దాని సారాంశం కొడుకు, కోడలు ఒక అత్తగారికి బంగారు నాణేలతో తులాభారం వేసారుట.ఇంక ఏమంటాము? చదువుకోకపోతే స్మార్టు ఫోను వాడుకోవడం రాదు అనేది ఒకప్పటి మాట, ఏ మాత్రం చదువు లేకపోయినా ఫోనులో వీడియోలు అందరూ చూసెయ్యగలరు ఇప్పుడు అనేది కాదనలేని సత్యం. అదీ చేతకాకపోతే టీవీలున్నాయి కదా.ఇవి పెద్దవారి ఆలోచనా విధానాన్ని కూడా మార్చెయ్యడమే విచారించదగ్గ విషయం. మా మనవలకి సినిమా పాటలూ, డ్యాన్సులూ రావు అని బాధ పడేటట్లు కూడా చెయ్యగలుగుతున్నాయి మరి.

న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయి మమ్మల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు అనేది పెద్దవాళ్ళు చెప్పే మాట. అసలు మీరు ఫోన్లు, టీవీలూ వదిలి చొరవ తీసుకుంటున్నారా? తీసుకున్నా వాళ్లు పట్టించుకోకపోతే మీరు కూడా వారి దారిలో నడవక్కర్లేదు కదా.మీకంటూ ఒక మంచి వ్యాపకం పెట్టుకోవచ్చు. ఒక పెద్దాయన ఒక సభలో చెప్పినట్లు "పిల్లలింటికి వచ్చినప్పుడు మీకు కావాల్సినట్లుగా పూజా మందిరం లేదు అని మీ దైనందిన పూజ మానేసి టీవీలూ, ఫోన్లలో మునిగిపోవడం ఎంత వరకూ సబబు? మీ పిల్లలు మిమ్మల్ని ఏ కారణం చేతనయినా పూజ చెయ్యనియ్యకపోయినా మీరు మనసులో స్మరణ ఆపక్కర్లేదు కదా".

దేవుది మీద నమ్మకం లేకపోతే ఇంకో వ్యాపకం పెట్టుకోండి అంతే కానీ అలా ఖాళీగా కూర్చుని ప్రభుత్వాలనో, ఇతరులనో నిందిస్తోంటే అది మీ వయసుకి అందాన్నివ్వదు అని గుర్తు పెట్టుకోండి. వాన ప్రస్థానికి వెళ్ళకపోయినా అందరి మధ్యా ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ, మార్పులని స్వీకరిస్తూ, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా తన ఆరోగ్య జీవన విధానాన్ని  కొనసాగించి ఓ రెండేళ్ళ క్రితం కాలం చేసిన ఒక పెద్దాయనని  చూస్తే భయం వేసింది అసలు ఈ రోజుల్లో ఇలా ఉండగలగటం సాధ్యమా అని.

ఇన్ని సంవత్సరాలూ పిల్లల కోసం కష్టపడ్డారు కదా,ఇకనైనా ప్రశాంతంగా జీవించండి ప్లీజ్.డబ్బు, నగలు, టీవీ షోల కబుర్లు లేదా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల మనసు ఉద్విగ్నత పొందటం తప్ప ఏమీ ఉండదు. హాయిగా ఒక మంచి పుస్తకం చదవండి లేదా అలా బయటకెళ్ళి కాసేపు కూర్చుని చూడండి, సమాజంలో చెడే కాదు మంచి కూడా ఇంకా బ్రతికే ఉంది అని తెలుస్తుంది.

పెద్ద వారు వారి హుందాతనాన్ని నిలబెట్టుకుంటూ, పిల్లలు వారికి గౌరవం ఇస్తూ ఉండే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అలాంటి కుటుంబాలలో పెరుగుతున్న పిల్లలే మన సమాజం పూర్తిగా పాశ్చాత్య ప్రభావానికి లోనవ్వదు అనే ఆశకి ఆలంబన.


Wednesday, July 11, 2018

రుణం


Image result for gollapudi maruthi rao runam

ఇండియా వెళ్ళినప్పుడల్లా గుళ్ళు, గోపురాలు, షాపింగ్ మాల్సు తిరిగినట్లే విశాలాంధ్ర సందర్శనం కూడా ఒక భాగమయిపోయింది. ఆ మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు విశాలాంధ్ర కి వెళ్తే కావాల్సిన పుస్తకాలేమీ పెద్దగా లేవు. దానిలోని వారు కూడా పెద్ద ఉత్సుకత చూపించలేదు ఇది చూడండి అది చదివారా అంటూ. విజయవాడలో విశాలాంధ్ర సందర్శనం మాత్రం మరచిపోలేనిది. అక్కడ కౌంటర్లో ఉన్న ఆయన దగ్గర నుండీ షాపులో పనిచేసే అందరికీ పుస్తకపఠనం ఆసక్తి అని తెలిసింది. ఎన్ని మంచి పుస్తకాలు తీసిచ్చారో. ఒక్క అరగంటలోనే నాలుగు సంచీలు నింపేసేంత అన్నమాట.

ఈసారి తెచ్చుకున్న పుస్తకాలలో ఆణిముత్యం అనదగినది గొల్లపూడి మారుతీరావు గారి "రుణం". ఆయనది సాయంకాలమయ్యింది చదివాకా గుండె బరువెక్కిపోయి ఒక రెండు రోజులు పట్టింది తేరుకోవడానికి. అందువల్ల ఈసారి తెచ్చిన పుస్తకాన్ని చదవకుండా అలా వాయిదా వేస్తూ వేస్తూ నిన్న రాత్రి తీసి చూద్దును కదా, ఏక బిగిన చదివించేసింది. కానీ గుండె బరువెక్కడం షరా మామూలే.


ముక్కామలలో కర్రా వేంకట శ్రీనివాస పెద చయనుల వారి శిష్యుల వేద పన్నాలు వల్లె వేస్తుండగా నవల ప్రారంభం.

శ్రీరాములు కోనసీమనుండి కొబ్బరి వ్యాపార నిమిత్తం ఇండొనేషియా వెళ్ళి లీలా థాంప్సే అనే వనితని పెళ్ళి చేసుకుని వస్తాడు.లీలా థాంప్సే కొడుకు మరిడి నాయుడిని కని కన్నుమూస్తే కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుతాడు శ్రీరాములు మరో పెళ్ళి చేసుకోకుణ్డానే. కానీ భార్యా వియోగంతో మరో పదేళ్ళకే కన్నుమూస్తాడు.

మరిడి  నాయుడిని లీల దూరపు తమ్ముడు రతన్ వచ్చి తీసుకెళ్తాడు. కొన్నాళ్ళ తరువాత హఠాత్తుగా కోనసీమలో దిగిన మరిడి నాయుడు, చంపావతిని పెళ్ళి చేసుకుని బొంబాయికి తిరిగివెళ్ళిపోతాడు. వీరికి ఒక కొడుకు. మరిడి  నాయుడు తన కొడుకుకి తండ్రి పేరు శ్రీరాముల నాయుడు అని పెడ డు.

ఈ రెండోతరం శ్రీరాములు తన తాత కి ఫక్తు కార్బన్ కాపీ. బాగా తెలివైనవాడు కానీ నిర్ణయాలు ఆచరణలో పెట్టడానికి పరిస్థితులు అనుకూలించలేదు రెండో తరం శ్రీరాములుకి. ఇతను బొంబాయిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబపు పిల్ల ముత్తేలమ్మని వివాహం చేసుకుంటాడు. ముత్తేలమ్మ తమ్ముడు రాజశేఖర్.. చిన్న శ్రీరాములు, ముత్తేలమ్మ తమ ఒక్కగానొక్క కూతురికి లీల అని నామకరణం చేస్తారు. ఈ పిల్ల చుట్టూనే కధ అంతా తిరుగుతుంది.

చయనులు గారు, వారి ధర్మ పత్ని సోమిదెవమ్మలు తమ ఇంటి అరుగుమీద వదిలిపెట్టబడిన రోజుల పిల్లవాడిని చేరదీసి అబ్బు శాస్త్రి అని పేరు పెట్టి కొడుకులా సాకుతారు.పెద చయనులిగారి శిష్యులలో అందరి కంటే చిన్నవాడు అబ్బు శాస్త్రి.

ఒకసారి అబ్బు శాస్త్రి తోటి వారితో కలిసి చెట్ల కొమ్మ మీద అటూ ఇటూ దూకుతూ వేదం వల్లె వేస్తుండగా, తాను ఒక కొమ్మ విడిచి చటుక్కున మరొక కొమ్మ మీదకి దూకగానే, మొదటి కొమ్మ విరిగి కింద రోడ్డు మీద వెళ్తున్న  లీల వాళ్ళ కారు మీద పడుతుంది. అంతే, కారు అదుపు తప్పి నీటిలోకి దూసుకుపోయి లీల తల్లి తండ్రులు మరణిస్తారు. కానీ లీల తన టెడ్డీ బేర్తో బయటకి నడచి వచ్చి ఎటో వెళ్ళిపోతుంది. ఈ ఘోరానికి తానే కారణం అని కుమిపోతూ అబ్బు శాస్త్రి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకూ పన్నాలన్నీ వల్లె వేస్తూ తిరిగినవాడు కాస్తా అలా జడుడయిపోతాడు. ఎన్ని చికిత్సలు చేసినా ఫలించవు. హోమాలూ, జపాలూ చేసినా అబ్బులో చలనముండదు కానీ అబ్బు నోటి నుండి అకస్మాత్తుగా రెండు మంత్రాలు మాత్రం వచ్చేవి .

చవనుల గారితో సహా ఎవ్వరికీ అబ్బులు ఆ రెండే ఎందుకు పఠిస్తున్నాడో అర్ధమవ్వదు.
అబ్బు శాస్త్రిని ఎలాగైనా దక్కించుకోవాలని తక్కిన పది మంది శిష్యులూ తల్లులలాగ సేవ చేస్తారు కానీ ఫలితముండదు. అబ్బు శాస్త్రి సహపాఠులందరిలోకి సర్వ మంగళానికి అబ్బులు అంటే చాలా ప్రీతి.అబ్బులుని ఎలాగైనా దక్కించుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని సర్వ మంగళం గురువుగారిని విడిచి స్వగ్రామనికి బయలుదేరుతాడు


ఒకసారి సర్వమంగళానికి రామ శాస్త్రి తో పరిచయం కలుగుతుంది. ఈ రామ శాస్త్రి పూర్వాశ్రమంలో అగ్రహారీకుడైనా కానీ ఏవో కొన్ని కారణాల చేత నిత్య నైమిత్తికాలు విడిచిపెడతాడు కానీ వేదాలలో చెప్పిన విధుల గురించి అనర్గళంగా మాట్లాడగలడు అవసరమయితే ధైర్యంగా ఈ ఆచారం తప్పు అని చెప్పగలవాడు. ఈ గుణమే నిత్య నైమిత్తికాలని నిష్ఠతో అనుసరించే సర్వమంగళాన్ని రామ శర్మ కి దగ్గర చేస్తుంది.

ఒకసారి రామ శర్మ సర్వ మంగళం ద్వారా అబ్బు శాస్త్రి రోగం గురించి విని చయనులగారింటికి వస్తాడు.చీకట్లో వేసిన రాళ్ళల్లో ఇది నూరవది అనుకుంటూ చయనులుగారు రామ శర్మ అబ్బులు గురించి అడిగిన ప్రశ్నలకి అన్యమనన్స్కరంగానే జవాబిస్తారు.అబ్బుశాత్రిని పరీక్షించిన రామ శర్మకీ అర్ధం కాదు యజుర్వేదం కృఇష్ణ సమ్హితలోని ఆ రెండు మంత్రాలనే అబ్బులు ఎందుకు పఠిస్తున్నాడొ. చేసేదేమీ లేక సర్వమంగళంతో తిరుగుప్రయాణమయ్యి, కొంత సేపటికే మళ్ళీ చవనులగారికి తిరిగొస్తాడు.

అబ్బు శాస్త్రి పఠించే ఈ రెండు మంత్రాల మధ్య ఎంత దూరం అని చవనులగారిని అడుగుతాడు.చవనులగారు లెక్కగట్టి మొదటిది 14వ మంత్రం రెండవది 25వది అని చెప్పగానే "పద్నాలుగు ఇరవై ఐదు" అన్న అబ్బు శాస్త్రి కేకకి ఇంటిల్లిపాదీ తుళ్ళిపడతారు.సంవత్సరాల తరువాత ఆ రెండు మంత్రాలు కాకుండా అబ్బు శాస్త్రి నొటి వెంట వినపడిన మరొక మాట ఇది మరి.

ఆ సంఖ్య  లీల తన తల్లి తండ్రులతో ఉండగా ప్రమాదానికి గురైన కారు నెంబరు. తన వల్ల ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయిని కలిసి యోగక్షేమాలు తెలుసుకోవాలని అబ్బు శాస్త్రి సాగించిన వెదుకులాటే మిగతా నవల.

అసలు అబ్బు శాస్త్రి లీలని ఆ పాత కాలం నాటి  కారు నెంబరుతో ఎలా కలుసుకుంటాడు, లీల ఎటువంటి పరిస్థితులలో ఉంది, తరువాత అబ్బు శాస్త్రి ఏమి చేసాడనేది తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

లీలని కలుసుకునేవరకూ కళ్ళు అక్షరాల వెంబడి పరుగెడతాయంటే నమ్మండి, అంత ఉత్కంఠ ఉంది. మధ్యలో సోమిదేవమ్మ గారి మరణం, చయనులు గారు సతీ వియోగాన్ని  తట్టుకోలేక పడిన వేదన గుండెల్ని పిండేస్తుంది.

సాంఘిక నవలలలోలాగ అబ్బు శాస్త్రి లీలని పెళ్ళి చేసుకుంటాడేమో అనుకున్నాను, కానీ ఒక చోట "నేను సీతమ్మ కోసం లంకలో వెతికిన హనుమ వలే వెతుకుతాను" అన్న అబ్బుశాస్త్రి మాటలతో వారిద్దరూ పెళ్ళి చేసుకోరు అని అర్ధమవుతుంది.

గొల్లపూడి వారు రోజంతా పుస్తకాలే చదువుతారేమో అనిపిస్తుంది ఆయనకి వివిధ విషయాల మీద ఉన్న పట్టు చూస్తే. ఒక్కోసారి ఆయన పంచిన విషయాలు ఇన్‌ఫర్మేషన్ ఓవర్ డోస్ అనిపించింది కధా గమనానికి అడ్డుపడుతూ. కధ తెలిసిపోయింది కాబట్టి వీటిని మళ్ళీ తీరికగా చదవటానికే ఈ పుస్తకాన్నీ రెండోసారి మొదలుపెట్టాను.

Wednesday, January 17, 2018

నెపోలియన్-నా నీడ పోయింది సార్సినిమా పేరు వినగానే ఏదో అలా గాలి వాటం గా వచ్చి పోయే తెలుగు సినిమాలలో ఒకటి అనిపించింది.ఆ మధ్య థ్రిల్లర్, వగైరా అని ప్రెస్ మీట్లో ఊదరగొట్టిన సినిమాని తీరా  చూస్తే ఒక సీ గ్రేడు సినిమా అయ్యేసరికి  ఈ సినిమా పెద్దగా ఆకర్షించలేదు. ఆ మధ్య నారా వారి అసుర చూసాకా యూ ట్యూబులో కమర్షియల్‌గా హిట్టు కాకపోయినా కొన్ని మంచి సినిమాలు  దొరుకుతాయి అని అర్ధమయ్యింది.

అలా చూసినదే నా నీడ పోయింది సార్ సినిమా. అనవసర కామెడీ లేదు, ప్రతీ సినిమాలో ఒకే పాత్రతో విస్గించే తాగుబోతు కమెడియన్ లేడు,అసలు పేరున్న వారెవరూ లేరు. కానీ పట్టు సడలని కధనం కొత్త నటుల నటనలో లోపాలని వెదకనివ్వదు.రచయిత ఆనంద్ రవి నటించి నిర్మించిన ఈ సినిమా తప్ప చూడాల్సిన సినిమా.

కమర్షియల్‌గా ఎంత హిట్టో తెలీదు గానీ ఒక గొప్ప సినిమా అనదగ్గదే ఇది. ప్రతీ సినిమానీ చీల్చి చెండాడేసే విమర్శకుల దృష్టిలో ఈ సినిమా ఎందుకు పడలేదబ్బా? అసలు ఈ మధ్య కాలంలో రివ్యూల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా. ఎవరో నమ్మకస్తులు చెప్తే తప్ప నమ్మలేని రివ్యూలు ఇవన్నీ.

అబు ఉస్మాన్

అబు ఉస్మాన్..టైగర్ జిందా హై(కృష్ణ జింకలు చనిపోయాయనుకోండి అది వేరే విషయం)చూసిన వారెవరికైనా అన్ని పాత్రల కంటే ఎక్కువ గుర్తుండిపోయే పాత్ర. సజ్జద్ డెలాఫ్రూజ్ అనబడే ఇరానీ మూలాలున్న ఈ  నటుడు విలనీని అధ్భుత రీతిలో పండించాడు.

విలనీ అంటే సూట్లేసుకుని, చుట్టూ అమ్మాయిలతో, స్విమ్మింగ్ పూల్ దగ్గర సేద తీరుతూ ఠపీ ఠపీ మని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసే విలనీ కానేకాదు.


ఒంటి మీద ఖరీదైన సూట్లు లేవు,పేద్ద విలన్ డెన్ అసలే లేదు కానీ, అమ్మో!!
బందీలుగా పట్టుకున్నవాళ్ళని ఏమి చేస్తాడొ అని ప్రేక్షకులు భయపడేటట్లు అబూ ఉస్మాన్ పాత్రలో జీవించాడనే చెప్పాలి.ఒక సీనులో డైలాగేమీ చెప్పకుండా అలా అభావంగా చూసి కూడా భయాన్ని రేకెత్తించాడు.

కొత్త సంవత్సరంలో మనకి ఒక చక్కటి నటుడు దొరికాడు. మన వాళ్ళు ఈయనని దిగుమతి చేసుకుని షరా మామూలుగా హెలికాప్టర్లలోంచి మాత్రమే దిగే విలన్ని చేసెస్తే చూస్తూ ఊరుకోవడం తప్ప చేసేదేమీ లేదు.

ఈ సినిమా చూడకపోతే ఈ కొత్త ఇరానీ నటుడి కోసమైనా చూడండి. 

Picture Courtesy:Indian Express

Tuesday, September 13, 2016

బామ్మ

ఎన్నెన్ని టెరా బైట్ల ఙాపకాలు బామ్మా నీతో.. వాటిల్లోంచి ఓ నాలుగు ముక్కలు


బామ్మ..ఇప్పుడొక ఙాపకం మాత్రమే.బామ్మ ట్రేడ్ మార్క్ తొక్కుడు లడ్డూలూ,వేసవి కాలంలో తన చేత్తో కలిపిన ఆవకాయ సాయంత్రం తులసి కోట దగ్గర కూర్చుని తిన్న గుర్తులు, నేను కాలేజీలో ఉండగా రాసిన ఉత్తరాలు,వంటింట్లో దండెం మీద ఆరేసిన చీరని ముట్టుకుంటా ముట్టుకుంటా అని అడిగి తిన్న తిట్లు, అందరూ ఎంత ఎగ్జైట్ అయిపోతున్నా కానీ తొణక్కుండా బెణక్కుండా అలా నిండు కుండలా ఉండే వ్యక్తిత్వం ఒక్కటేమిటీ అన్నీ ఇక ఙాపకాలు మాత్రమే.వేసవి కాలంలో మామిడికాయ పులుసు పెట్టి టెంక వద్దు వద్దు మొర్రో అంటోంటే కంచంలో వేసి ఇలా జుర్రుకోవాలీ, ఆ జుర్రెయ్యి అంటూ అంటూ నువ్వు అప్పుడు చెప్పిన మాటలు అవీ తలచుకుంటే ఇంకా నువ్వు విసనకర్రపట్టుకుని విసురుకుంటూ మాకు వడ్డిస్తున్నట్లే ఉంటుంది.నువ్వు మజ్జిగా లాంటి వాటిని డైనింగ్ టేబుల్ మీద ఎందుకు పెట్టవో తెలిదేసి కాదు.డైనింగ్ టేబుల్ అంటే నీ దృష్టిలో "అంట మంగళం" కదా..నవ్వొస్తుంది తలచుకుంటే.నిలువెత్తు నువ్వు అలా వంటింట్లో విసనకర్రతో విసురుకుంటూ మడిగా నిల్చుని వంట చెయ్యడాన్ని ఎలా మర్చిపోగలను బామ్మా??


 నేనిప్పుడు ఖమ్మం వస్తే బామ్మ దగ్గరకి వెళ్ళాలి అన్న తొందరుండదు, ఆ ఇంటికి వస్తే గుర్తొచ్చే గుర్తులు తప్ప ఏముందక్కడ ఇప్పుడు??  తేలు మంత్రం నాకు నేర్పించవూ అని చిన్నప్పుడు అడిగితే కసురుకునే దానివి,కాస్త పెద్దయ్యాకా చెప్పావు అది నేర్చుకోవడం ఎంత కష్టమో, నేర్చుకుంటే ఎలా పాటించాలో వగైరా వివరాలతో.ఇప్పటికీ నాకు పజిలే బామ్మా తేలు మంత్రం ఎలా పని చేస్తుందో కదా అని.

ఎన్నడూ అలా అచేతనంగా పడుకోని నువ్వు హాస్పిటల్లో చేరావని తెలియగానే దేవుడా బామ్మని ఇబ్బంది పెట్టకు అని కోరుకున్న నేనే నువ్వు లేవని తెలిసిన మరుక్షణం అలా ఏడ్చానెందుకు??

నీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కంచం ముందు కూర్చున్నానే కానీ ఛీ నేను అన్నం తింటున్నానా అని నా మీద నాకే కోపం వచ్చింది బామ్మా.. కానీ నువ్వే చెప్పేదానివి కదా ఈశ్వరుడు తనకి దూరంగా జరగమని ఎప్పుడూ చెప్పడమ్మా, సమయానికి కొన్ని చెయ్యాలంతే, వీలు పడకపోతే నాలుగు పాల చుక్కలు తాగి పూజ చేస్తే తప్పు లేదు అని..అప్పుడనుకున్నాను..లేదు నేను తప్పు చెయ్యట్లేదు ఇక్కడ నా రోజు వారీ కార్యక్రమాల కోసం తినాలి అనుకుని నాలుగు ముద్దలు తిన్నాను.


అంత మంది పిల్లల్ని పెంచావు అంతా బాగానే ఉంది కానీ బామ్మ నీకు మనవలలో మగ పిల్లలంటేనే ఎందుకు ఇష్టమో కదా అని చిన్నప్పుడు కోపం ఉండేది అది ఇప్పటికీ పోలేదు తెలుసా.పోయిన వాళ్లతోటే కోపాలూ అన్నీ వదిలేయ్యాలి అంటారు కదా వదిలెస్తాలే బామ్మా..అలాగే నువ్వు చేసిన కొన్ని పనులు చూస్తే కోపం కూడా వచ్చేది అన్నీ తెలిసీ ఇది తప్పు అని తప్పు చేస్తున్న వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు అని.అది అతి ప్రేమో లేక మరేమిటో ఇప్పటికీ అర్ధం కాదు ఇక కాబోదు కూడా. కానీ ఒక్కటి మాత్రం నిజం బామ్మా నువ్వు లేని ఆ ఇల్లు మూల విరాట్టు లేని గర్భ గుడే.ఎక్కడున్నా హాయిగా తాతగారితో కలిసి ఉండు.

Saturday, January 30, 2016

అయ్యాబాబోయ్ ఒక వేళ అలా అయితే???నో, నహీ....

మొన్న ఫేస్‌బుక్ తిరగేస్తోంటే ఒక నడివయసు ఆయన తన ఊర్లో సంక్రాంతి సంబరాల గురించి పెట్టిన ఫోటో చూసాను. అంత వరకూ బాగానే ఉంది. అందరూ చేసే పనే. వాళ్ళింట్లో కన్న కూతురు చనిపోయి ఆర్నెల్లు(చదువుకుంటున్న అమ్మాయే. పోనీ పెళ్ళయ్యి అత్తారింటికి సాగనంపిన పిల్ల కూడా కాదు)అయ్యిందేమో అంతే.అసలు అందరూ అలా ఎలా పట్టు బట్టలు కట్టుకుని పండగ జరుపుకుంటున్నారో అర్ధం కాలేదు.

ఇంకో పెద్ద కట్టె కాలకముందే ,మా అమ్మా వాళ్ళు భోజనాలు ఓ మూడొందల మందికి ఆర్డరిచ్చారు తిని వెళ్ళండి, భోజనాలు వేష్టయిపోతాయి అని ఆరాటపడిపోతున్న కోడలి ఉదంతం విని షాకయ్యాను.సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే, ఈ పెద్ద కట్టె సహచరేమో ఇంటికి రాగానే రేపటి కర్మ కి ఏ కూరలు వండాలి అని తర్జన భర్జన పడిపోతూ, పది రోజులైనా గడవకముందే అమెరికా నుండి మనవరాలొచ్చిందని(ఏదో అత్తెసరు మార్కులతో సీటు తెచ్చుకుని  ఊరూరా వెలుస్తున్నా ఇంజనీరింగ్ కాలేజీలలాంటి కాలేజీలో చదువుతున్న) కేక్ కట్ చేసి ఇంటిల్లిపాదీ సంబరం చేసుకుంటుంటే  Wow, They really bounced back so fast అని సంబర పడాలా లేక    ఏమనాలి??


జీవితాంతం కుటుంబానికే అంకితం చేసి కోడళ్ళతో కూతుర్లతో చేయించుకోకుండా హాయిగా సొంతింట్లో  కన్ను మూసిన ఓ పెద్దావిడ కర్మ కాండలు పూర్తి చెయ్యడానికే ఏమిటి ఈ తతంగాలు అంటూ విసుక్కుని, పంతులుగారూ వీటికి ప్రత్యామ్న్యాయాలు లేవా అని అడిగి, షార్టు కట్ల ద్వారా కానిచ్చేసి, అబ్బా నెల మాసికం అయ్యింది, సంవత్సరీకం అయ్యాకా, కాశీ వెళ్ళొచ్చెస్తే ఇంక ఈ గోల ఉండదు అనుకుంటున్న వాళ్ళకి ఏమని చెప్పగలము??

వాళ్ళని చూస్తుంటే ఏమైపోతున్నాయి మానవ సంబంధాలు అనిపిస్తోంది.


అలా అని ఆవిడేమీ పిల్లలని సంస్కార హీనులుగా పెంచలేదు. అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ ఆచరణ మాత్రం శూన్యం.

అయ్యాబాబోయ్, ఎవ్వరి చేతా చేయించుకోకుండా వెళ్ళిపోతేనే ఇన్ని అగచాట్లు, న్యూక్లియర్ ఫ్యామిలీలున్న మా లాంటి వాళ్ళు ఓ ఇరవై ముప్ఫై న్సంవత్సరాల తరువాత ఒక వేళ మంచాన పడితే?? తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది

ఆహా ఏమి చెప్పారండీ రాహుల్ గాంధీ గారూ

పాపం ఇంట్లో మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్ళిన ఆడవాళ్ళని రేప్ చేసి చంపెస్తేనో లేదో రేప్  కి గురి కాబడ్డ ఆ మహిళలు వెలి వేయబడితేనో మనకెందుకు?? వీళ్ళేమైనా మన ఓట్లకి పనికొస్తారా, రాబోయే ఏఎన్నికలకైనా ఏమాత్రమైనా ఉపయోగబడతారా??

వీలయితే రేప్ కి గురి అయిన ప్రదేశమో, వారు ఆత్మ హత్య చేసుకుంటేనో కాసేపు వృత్తాలు గీసి , జూం చేసి, అయిన వాళ్ళ ఏడుపులతో చూపిస్తే ఛానెళ్ళకి ఓ న్యూస్ ఐటెం.రాజకీయ నాయకులకీ, ఫేస్‌బుక్ మేధావులకీ ఆ మాత్రం తీరిక కూడా ఉండదు వీటి మీద పోస్ట్లు పెట్టడానికి.

అదే రిజర్వేషన్ కోటాలో సీటొచ్చి(లేదా మెరిట్టే అనుకుందాం), ఉగ్రవాదికి మద్దత్తుగా మాట్లాడుతూ సాక్ష్యాలతో దొరికి, సస్పెన్షన్ కి గురి కావాల్సిన పనులు చేసి, ఏవో కారణాలతో ఆత్మ హత్య చేసుకుంటే పండగే పండగ.

పాపం గాంధీ గారిలా ఈ దళిత విద్యార్ధి కూడా అవమాన పడ్డాడు అని గాంధీ గారి పేరు ని ఇంటి పేరుగా చేసుకున్న ఓ మేధావి గారొచ్చి శలవిస్తే చక్కాగా మన మీడియా సిగ్గు లేకుండా ముఖ్యాంశంగా ప్రసారం చేస్తుంది.

అసలు మొదట ఈ హెడ్డింగ్ చూసి ఆస్ట్రేలియా టూర్లో ఉన్న రోహిత్ శర్మకి ఏమైనా అవమానం జరిగిందా అనుకున్నాను. రోహిత్ అంటే ఏవో రెండు మ్యాచ్చుల్లో శతకాలు బాదే ఆ రోహిత్ గుర్తొస్తాడు గానీ అవమానాలు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న  మా దళిత విద్యార్ధి గుర్తుకురాడా అనుకునే  మేధావులారా వినండి.

అవును, నాకు రోహిత్తంటే రోహిత్ శర్మే గుర్తొస్తాడు. తల్లి తండ్రులు కష్టపడి చదివిస్తుంటేనో లేదా అర్హత ఉన్నవాడిని తోసి కేవలం రిజర్వేషన్ వల్ల హెచ్ సీయూ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు తెచ్చుకుని  కాని పనులు చేసి సస్పెండయ్యింది కాక ఆత్మ హత్య చేసుకుని, అదేదో పెద్ద విషయమయినట్లు, అతన్ని ఎవరో హత్య చేసేసినట్లు మీడియా, సో కాల్డ్ మేధావులతో కొనియాడబడే రోహిత్ గుర్తు రాడు కాక రాడు.

ఒకప్పుడు చవుకున్న వాళ్ళు అంటే సంస్కారవంతులు అన్న అభిప్రాయం ఉండేది. ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్ మెసేజీల్లోనూ ఆత్మ హత్య చేసుకున్న రోహిత్ కి సానుభూతిగా వెల్లువెత్తుతున్న మెసేజీలకి తమ వంతు సహకారం అందిస్తున్న చదువు"కొన్న" వాళ్ళని చూస్తోంటే ఛీ కుల రాజకీయలు, కుల డ్రామాలు ఎక్కువవుతున్నాయే అని చిరాకొస్తోంది.

ఎప్పుడూ కూడా కిందున్నవాడికి పై వాడి మీద ఏదో తెలీని ద్వేషం ఉంటుంది. మనం పుట్టి పెరిగిన పరిస్థితులు కానీ మరోటి కానీ కొన్ని కులాల మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచి ఉంటాయి.చదువుకునే కొద్దీ వివేకం పెరగాలి కానీ మనలో అణిగి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టడానికి అవకాశం వచ్చింది కదా అని నిస్సిగ్గుగా, నిజాలు తెలీకుండా ప్రచారం చేసేయ్యడమే??ఆత్మహత్య చేసుకున్నవాడేదో చాలా అమాయకుడయినట్లు.

అతను ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడో మనకి తెలియదు. అగ్ర కుల అహంకారం చేసిన హత్యో లేక సమాజంలో వ్రేళ్ళూనుకున్న అసమానతలు చేసిన హత్య లాంటి మాటలు వినడానికి బాగుంటాయి కానీ నిజాలు నిర్ధారించడానికి కాదు. నాకు అతని మీద కంటే అతని తల్లి తండ్రుల మీద జాలేస్తోంది. పోయిన వాళ్ళు అదృష్టవంతులు, ఉన్న వాళ్ళకే కదా బాధంతా.

ఒక్క సూటి ప్రశ్న. అగ్రకులానికి చెందిన ఒక విద్యార్ధి, ఆత్మ హత్య చేసుకుంటే ఇంత డ్రామా నడిచేదా??

ఈ దళిత కార్డు రాజకీయాలు కొత్తేమీ కాదు కానీ అసహ్యం వేస్తోంది అంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకుంటూ  వీసీ గారే ఏదో అతన్ని హత్య చేసేసినట్లు గోల చేస్తున్న విద్యార్ధులని చూస్తోంటే, దానిని సమర్ధిస్తున్న మీడియానీ, నిన్న గాంధీ గారి వర్ధంతి రోజున ఆ విద్యార్ధిని గాంధీ గారితో పోల్చిన రాహుల్ గాంధీ గారినీ చూస్తోంటే. 

Thursday, November 19, 2015

సత్య కంగారు వ్రతం

(జిలేబి గారి టపా చూసి దానిలోంచి శర్కరి గారి బ్లాగులోకి దారి తీస్తే సత్య నారాయణ వ్రతం గురించి గరిక పాటి వారి వీడియోకనిపించింది.. ఓ మూడు నాలుగేళ్ళ క్రితం రాసుకుని డ్రాఫ్ట్ లో ఉంచిన టపా కి దుమ్ము దులిపాను)

ఇంటి ముందు మామిడి తోరణాలు,వరుసలుగా కట్టిన బంతి ఇతర రంగు రంగుల పూలు అదే గృహ ప్రవేశం జరిగే ఇల్లని చెప్తున్నాయి.ఇంటి సింహ ద్వారం ముందు పేరుకున్న చెప్పుల గుట్ట అతిధుల సంఖ్య ని చెప్తోంది. "కలశస్య ముఖే విష్ణు..."..హలో ఆ.. ఆ థాంక్యూ పిన్నీ...ఆ..ఏమిటీ అసలు వినబడ్డం లేదు..సాయంత్రం చేస్తాను,  బాయ్ ..వినాయకుడికి చిన్న బెల్లం ముక్క పెట్టండి...ఆ పూర్తిగా రినోవేట్ చేయించామండీ..మొత్తం ..

అమ్మా హారతి ఇవ్వండి. "బుధ గ్రహం స్థాపయామి పూజయామి..అమ్మా ఇక్కడ ఈ తాంబూలం ఉంచి అక్షింతలు వెయ్యండి "చిల్డ్రన్ రూం డిజైన్ వాళ్ళే చేసుకున్నరండీ..ఆ ఆ...మోడర్న్ కిచెన్ కాన్సెప్ట్ అని కిచెన్ ఇలా ఓపెన్ గా వదిలేసాము".. "సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం"..ఏమండీ స్కైప్ లో వీడియో రావట్లేదుట..ఇండియా నుండి అక్క మెసేజ్ పెట్టింది. కాస్త చూడమని చెప్పండి ఎవరికైనా..మనం పీట్ల మీద ఉన్నాం కదా..   లక్ష్మీ కాంతం కమల నయనం..హెలో బాగున్నారా..జానకీ అటు చూడు మా బాస్ వచ్చాడు ఫ్యామిలీ తో.షీ ఈజ్ మై వైఫ్...హలో అండీ...రండి కూర్చోండి ఆ అక్షింతలు ఇలా వెయ్యండమ్మా..


 "హస్తయో అర్ఘ్యం సమర్పయామి,పాదయో పాద్యం సమర్పయామి"..రేవతీ క్యాటరర్ కి ఫోన్ చేసి కనుక్కో ఎక్కడ ఉన్నాడో, స్వీట్ ఎక్స్ ట్రా తెస్తున్నాడో లేదో,లేదంటే సారధి ని పంపించి తెప్పించు "సర్వాణ్యంగాని పూజయామి.." అయ్యో పదకొండున్నర అయిపోయిందండీ..ఇంకా కధ మొదలవ్వలేదు.అందరికీ లేటయిపోతుందేమో. "అమ్మా ఈ అక్షింతలు పట్టుకుని అందరూ కధ శ్రద్ధ గా వినండి..రేవతీ కనుక్కున్నావా..హమ్మయ్య తెస్తున్నాడన్నమాట..ఎందుకైన మంచిది సారధి ని కూడా కాస్త తెమ్మను. "ప్రధమోధ్యాయం  సంపూర్ణం..శ్రీ సత్యనారాయణ స్వామి కీ జై"...


మా బాస్ కి కూల్ డ్రింక్ కూడా ఇచ్చినట్లు లేరు ఎవ్వరూ.. సురేష్, ఆ బ్లూ లాల్చీ ఆయనే మా బాస్. కాస్త ఆయనని చూసుకో.." "ద్వితీయోధ్యాయం సంపూర్ణం"..ఆ అవునండీ కర్టెన్లు అక్కడే కొన్నాము కాస్త ఖరీదయినా కానీ..వాకిన్ వార్డ్ రోబ్ మా డిజైనర్ అయిడియానే, బెడ్ రూం లో అడ్డం లేకుండా" పంతులు గారూ భోజనాలు తయారు,మీదే ఆలశ్యం. "త్రుతీయోధ్యాయం సంపూర్ణం"..ఒక్క పది నిమిషాల్లో అయిపోతుంది..ప్లీజ్ వచ్చెస్తున్నాను.. యా యా.. ప్లీజ్ బీ సీటెడ్. "చతుర్ధోధ్యాయం సంపూర్ణం.." రేఖా బెడ్ రూం లో ఏసీ లు ఆన్ చేసేసి పిల్లలు బయటకి వెళ్ళిపోయినట్లున్నారు కాస్త ఆఫ్ చెయ్యి. పంతులు గారు, కాస్త త్వరగా ముగించండి అందరికీ ఆకళ్ళవుతున్నాయి..


"పంచమోధ్యాయం సంపూర్ణం"..ఆ ఆ పెట్టెయ్యండి ఐదు నిమిషాల్లో మొదలుపెట్టెయ్యచ్చు. అబ్బా...మొన్న రంగారావు గారింట్లో వాళ్ళింట్లో హోమం,వ్రతం కలిపే గంట లో ముగించేసారే, ఈయనేంటో వ్రతానికే గంట తీసుకున్నాడు. నేను ఖచ్చితం గా 12 గంటలకి భోజనం చెయ్యల్సిందే అండీ..లేటయితే అస్సలు ఊరుకోను.మా వాళ్ళకి ఈ సంగతి తెలుసు అందుకే నన్ను పిలిస్తే అన్నీ 12 కల్లా ముగించేటట్లు చూసుకుంటారు ఇంకొకాయన సెల్ఫ్ డబ్బా.. పంతులు గారూ ఆ పళ్ళెం ఇటివ్వండి మేము ఇస్తాము అందరికీ అక్షింతలు, మీరు మంత్రాలు చదవండి.


బ్రహ్మ గారు మాత్రం తన కేమీ పట్టనట్లు మంత్ర పుష్పం సావధానం గా చదువుతూ అందరికీ తన చేత్తోనే అక్షింతలు ఇచ్చి దాదాపు 20 నిమిషాల తరువాత వ్రత మంటపానికి తిరిగి వచ్చేటప్పటికి అందరి కళ్ళల్లో &కాళ్ళల్లో నీరసం. ఏమీ చెయ్యలేరు, పైగా అప్పుడే కధ విన్నారాయే, వ్రతం చేసి ప్రసాదం తీసుకోకపోతే జరిగే పర్యావసానాలు. మంత్ర పుష్పం అయ్యీ అవ్వగానే అక్షింతల జల్లు స్వామి ప్రతిమ మీద మూకుమ్మడిగా కురిసింది.బ్రహ్మ గారి చేతిలోంచి ప్రసాదం పళ్ళెం లాక్కుని వెళ్ళి భోజనాల దగ్గర పెట్టేసారెవ్వరో.అంతే అందరికీ వంటకాలతో పాటు ప్రసాదం కాస్త కాస్త వడ్డిస్తూ భోజనాలు మొదలయిపోయాయి. పోనీ అక్కడయినా సావధానం గా తింటారా అంటే అదీ లేదు. అక్కడా కంగారే,చెయ్యి కడుక్కునే దగ్గరా కంగారే.హోస్ట్ లకి గిఫ్ట్ ఇచ్చి ఫోటో లకి ఫోజులు ఇవ్వటానికి మాత్రం సహనం గా వేచి ఉంటారు.

తరువాత ముఖ పుస్తకం లో మనల్ని ట్యాగ్ చేసి ఫోటో పోస్ట్ చేస్తారు కదా. ఫోటో బాగోక పోతే ఎలాగండీ..ఆ.. ఎలాగ అని అడుగుతున్నా. అందుకే మరి చక్కగా సావధానం గా నిలబడి ఓపికగా ఫోటోలకోసం నిల్చునేది.  దాన్ని కూడా తప్పు పడుతున్నారే మీరు..భలేటోళ్ళే సుమా.


మనం ఇలా ఉన్నాము, శాస్త్రోక్తం గా చేయించే వారూ కరువయ్యారు.


అందరూ ఇలా చేసుకుంటారని కాదు, ఈ మధ్య చూసిన ఓ రెండు మూడు  పూజలు గమనించి రాసిన టపా ఇది.

Thursday, November 12, 2015

ఒక మధుర ఙాపకం -ముప్ఫై ఐదేళ్ళనాటి కార్తీక మాస వన భోజనాలు
దీపావళి తరువాత కొన్ని రోజులకి పిక్నిక్ కి వెళ్తామని చిన్నప్పుడు ఎంత ఉత్సాహం గా అనిపించేదో. వాటినే కార్తీక వన భోజనాలంటారని చాలా యేళ్ళు తెలీదు.

చిన్నప్పుడు మేము మోతుగూడెం అనే ఒక చిన్ని ఊర్లో ఉండేవాళ్ళము.ఊరిలో ముప్పావు మంది  మంది ఆం. ప్ర. విద్యుత్ సంస్థ ఉద్యోగులే.మిగతా పావు వంతు జనాభా అక్కడ ఉన్న ఒకటి రెండు బట్టల కొట్లు, ఒక స్టేషనరీ షాపు, ఒక హోటల్, ఒక పాన్ షాప్,ఒక ఫోటో స్టూడియో లాంటి దుకాణాల  యజమానులన్నమాట.

అక్కడ ఆం. ప్రా. విద్యుత్ సంస్థ ఆధ్వర్యం లో నఢిచే  ఒక ప్రాజెక్టు హై స్కూల్,హాస్పటలు, అప్పుడే ఇంగ్లీషు మీడియం , ఆంగ్లో ఇండియన్ టీచర్లు అన్న కాన్సెప్టుతో ఆ ఊరిలో వెలసిన శ్రీ సీతారామా పబ్లిక్ స్కూలు, ఒక రామాలయం, రెండు అమ్మవారి గుళ్ళు, ఒక మశీదు, చర్చి ఉండేవి.

అప్పట్లో కార్తీక మాసం అన్న లెక్క్ఖ తెలీదు కానీ దీపావళి అవ్వగానే పిక్నిక్ కి వెళ్తామ ని మాత్రం తెలుసు. ఆరు రోజుల పని దినాలు కాబట్టి అందరికీ శెలవు రోజైన ఆదివారం వెళ్ళేవాళ్ళము.

ఫలానా రోజు వెళ్తున్నాము అంటే ఎంత ఎదురు చూసే వాళ్ళమో ఆరోజు కోసం పిల్లకాయలందరమూను.

ఆరోజు రానే వచ్చేది. ఇంకేముంది స్కూలు ఫస్టు బెల్లు కొట్టారు తెమలండర్రా అని అరిచి గీ పెట్టినా వినిపించుకోని పిల్లలు ఆరోజు మాత్రం ఏడింటి కల్లా తయారయ్యి లారీ కోసం ఎదురు చూసుండేవాళ్ళము. అవును లారీ లో నే వెళ్ళే వాళ్ళము.

ఆం.ప్ర. విద్యుత్ సంస్థ వారి సిమెంటు రంగు లారీ ఒకటి ఉండేది.ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయినా, పిక్నిక్కులకి వెళ్ళాలన్నా దాంట్లోనే మా ప్రయాణం.

పిక్నిక్ కి వెళ్ళే రోజు లారీ రాగానే మొదట అక్కడ వండటానికి కావాల్సిన డేగిసాలు, గిన్నెలు, గరిట్లు, చాపలు, జింభఖానాలూ ఎక్కించాకా, పిల్లల్ని ఎక్కించేవాళ్ళు.ఆడవాళ్ళు కూడా ఎక్కాకా లారీ బయలుదేరేది.

మా పక్కూరు  పొల్లూరు దగ్గర అడవిలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర మా పిక్నిక్. అక్కడకి చేరి ఆడవాళ్ళు ముందర చెట్లకి ఉయ్యాలలూ అవీ కట్టి వంటల్లోకి దిగి పోయేవారు. కాస్త పెద్ద పిల్లలు పొయ్యి అమర్చడానికి రాళ్ళు తెస్తే చిన్న పిల్లలం కర్రలూ అవీ ఏరుకొచ్చేవాళ్ళము.


ఇప్పట్లో లాగ ఆట బొమ్మలు, పాం టాప్, ల్యాప్ టాప్ లు అవీ లావు కనుక హాయిగా పిల్లలందరమూ వయసులవారీగా ఆడుకునేవాళ్ళము. టెంత్ క్లాస్ చదువుతున్న దినేష్ అన్నయ్య మ పిల్లల గ్యాంగు కి పెద్ద దిక్కు లాంటివాడు. ఆ వాటర్ ఫాల్ కి మధ్యలో ఉన్న పెద్ద బండ రాయి మీదకి ఎక్కడం, వాటర్ ఫాల్ల్ నుండి  పారుతున్న నీటిలో నడుస్తూ అటు నుండి ఇటు వెళ్ళడం మర్చిపోలేని అనుభూతులు.

ఉయ్యాలలు ఊగడమో, కాస్త పక్కన ఉన్న కొండ ఎక్కడమో చేసి అలసి పదకొండున్నరా పన్నెండింటికి తిరిగొచ్చేసరికి వంటలు తయారు.లారీ సెకండ్ ట్రిప్ లో అక్కడకి చేరుకున్న మగవాళ్ళు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.

భోజనాల వేళకి వరుసలో అందరినీ కూర్చోపెట్టి విస్తరాకులు వేసి వడ్డించేసేవారు ఆడవాళ్ళు.

అన్నాలు తినీ మళ్ళీ ఆటలు మొదలు. మూడింటికి మా అమ్మమ్మ చేసిన చేగోడీలు అమ్మ బయటకి తీస్తే, పాపారత్నం అత్తయ్యగారు తన ట్రేడ్ మార్క్ కారబ్బూందీ తలా పిడికెడు పిల్లల చేతుల్లో పోసేవారు.
కారబూందీ చేగోడీలే కాదు ఇంకా ఎన్ని రకాలుండేవో స్నాక్స్ మాకు.

టీలు అవీ తాగి, వంట గిన్నెలు  ఆ వాటర్ ఫాల్ లో కడుక్కుని, అన్నీ సర్దేసి మూడున్నరకల్లా ఆడవాళ్ళు కూడా పిల్లల ఆటల్లో భాగమయ్యేవారు. చాకలి బాన(అందరూ గుండ్రం గా కూర్చుని రుమాలు ఎవరి వెనకాల వేస్తే వాళ్ళు లేచి దొంగ వెనకాల పడటం), తాడాట(అటూ ఇటూ రెండు జట్లు నిలబడి తాడు లాగడం), రాముడూ సీతా లాంటి ఆటలన్నమాట.

ఆశ్చర్యం వేస్తుంది నాకు, ఇప్పటికీ హోటల్లో తిని ఎరుగని అమ్మమ్మ కూడా ఉత్సాహం గా ఎలా పాల్గొనేది అప్పట్లో, తను ఇబ్బంది లేకుండా ఎలా తినేదో అని.

కులమతాలు ఏవీ అడ్డు లేవు మాకు అప్పట్లో. క్రిస్టియన్ అయిన ఏయత్తయ్యగారు(ఆవిడ భర్త ప్రసాదరావు గారు మా మోతుగూడెం క్యాంప్ కి A.E. అన్నమాట,అందుకని ఆవిడ A.E. అత్తయ్యగారు.అది కాస్త మా పిలుపులో ఏఅత్తయ్యగారయ్యింది) కూడా మాతో కలిసి చక్కగా ఆ పిక్నిక్ కి వచ్చే వారు.  మా డ్రైవరు సులేమాన్ కూడా తన కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఆనందం గా గడిపేవాడు మాతో.

ప్రతీ ఆదివారం అత్తయ్యగారు మమ్మల్ని చర్చి కి తీసుకెళ్ళేవారు. అక్కడ పాడిన నడిపించు నా నావ పాట ఇప్పటికీ ఆసాంతం గుర్తుంది నాకు.అమ్మే కాకుండా ఇతర హిందువులు కూడా చర్చికొచ్చేవారు.ఇప్పట్లో లాగ మీ ప్రసాదం తినకూడదు లాంటి మూర్ఖత్వం లేదు ఆనాటి క్రిస్టియన్లలో అనుకుంటాను. కనీసం మా ఊళ్ళో వాళ్ళకి. అబ్బే మీ చర్చి కి మేమేంటి అన్న పంతం కూడా హిందువులకి లేదు.

అలాగే అందరం శనివారం రాత్రి "సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం  శివ శివ సుబ్రహ్మణ్యం" అంటూ భజన కూడా చేసేవాళ్ళము. దానిలో క్రిస్టియన్ మతస్తుల పిల్లలు కూడా వచ్చి మాతో గొంతు కలిపేవారు.

పిక్నిక్ నుండి ఎక్కడికో వెళ్ళిపోయాము కదా, మళ్ళీ వెనక్కొద్దాము.

శీతా కాలం అందునా అడవి ప్రాంతం కాబట్టి త్వరగా చీకటి పడిపోయేది. అందుకే నాలుగున్నర ఐదింటికల్లా అన్నీ సర్దేసి లారీలో ఎక్కించేసేవాళ్ళు.

పొయ్యిలో ఇంకా నిప్పు ఏమన్నా వెలుగుతుంటే నీటితో ఆర్పేసి పొయ్యి  కోసమని అమర్చిన రాళ్ళు మళ్ళీ ఓ వారగా పెట్టి ఏమన్నా తినుబండారాలూ అవీ కింద పడితే వాటిని చీపుళ్ళతో ఓ పక్కగా ఊడ్చేసేవారు.మేము వచ్చినప్పుడు ఎలా ఉందో మేము వెళ్ళేటప్పుడు కూడా అక్కడి నేల అంత శుభ్రం గా ఉండేది. తెలీకుండానే ఎంత ఎకో ఫ్రెండ్లీ గా ఉండేదో జీవితం అప్పట్లో.

పొద్దున్న వచ్చినట్లే పిల్లలు, స్త్రీలు మొదటి ట్రిప్పులో మా ఊరు చేరుకుంటే, పురుషులు సెకండ్ ట్రిప్పులో వచ్చేవారు.


********************************************************************

2010/2011 లో ఓ కార్తీక మాసపు ఆదివారం అత్తగారింట్లో ఉన్నాను.అత్తయ్యగారు మామయ్యగారు వన భోజననాలకి వెళ్దామని తయారవుతున్నారు.ప్రయాణ బడలిక గా ఉండటం తో మమ్మల్ని రమ్మని అత్తయ్యగారు బలవంతం చెయ్యలేదు.మాకు ఇంట్లో వంట కూడా చేసి బయలుదేరబోతుంటే ఏమయ్యిందో కానీ అకస్మాత్తుగా అడిగారు. మీరు కూడా రాకూడదూ అంటూ.

అత్తయ్యగారూ, నాకెవ్వరూ తెలీదు అక్కడ అని తప్పించుకోచూసాను.ఈ మధ్య కార్తీక భోజనాలు ఎలా ఉన్నాయో ఫోటో లు చూసేసి ఉన్నందువల్ల.కొంతమందైనా నీకు తెలిసున్న వాళ్ళుంటారు, వాడికి దాదాపు అందరూ తెలుసు, మనవలని చూళ్ళేదని చాలా మంది అంటున్నారు కూడా. ఓ సారి వచ్చి కనిపించి వెళ్ళండి చాలు అనడం తో కాదనలేక తయారయ్యి వెళ్ళాము.

ఓ పక్కగా వాడేసిన థర్మో కోల్ గ్లాసులు ప్లేట్లు కుప్పగా పోసి ఉన్నాయి. పోయిన వారం ఫలాన కులం వాళ్ళ వన(కుల) భోజనాలయ్యాయి అని తెలిసింది అక్కడున్న వారి మాటల ద్వారా. ఏదో సభ లాగ ప్లాస్టిక్ కుర్చీలు వేసున్నాయి. అక్కడ అందరూ కలిసేమీ కూర్చోలేదు. ఎవరి సామాజిక స్థాయి ని బాట్టి వారు వర్గాలుగా విడిపోయి కబుర్లలో పడ్డారు.  కుశల ప్రశ్నల కంటే స్థాయీ ప్రదర్శన ఎక్కువయ్యింది అక్కడ.

కుర్చీలకి ముందు అమర్చీన డయాస్ మీద ఓ నేత గారు మన కులాన్ని అభివృద్ధి పధం లో పయనింపచేయడం ఎలా అంటూ ఊగిపోతూ ఉపన్యసిస్తున్నారు. మా పక్కనే ఉన్న స్థలం లో ఇంకొక కులం వారి భోజనాలు కూడా అవుతున్నాయి. అక్కడా సేం సీన్.
పోయిన వారం ఇక్కడ వన భోజనాలకొచ్చిన వాళ్ళ క్యాటరర్ వంటలు బాగా చెయ్యలేదుట అందుకే ఇంకోళ్ళని మాట్లాడి మంచి వంటలు ఆర్డరిచ్చాము అని ఆర్గనైజర్ గారు గర్వం గా చెప్తోంటే వెళ్ళి చూద్దును కదా... ఎందుకు లెండి ఆ వంటల వర్ణన.కాంటినెంటల్, చైనీస్, సూడాన్, ఆఫ్రికా, అంటార్కిటికా వంటలంటూ మన అచ్చ తెలుగు వంటల్ని మర్చిపోయేటట్లు యధా శక్తి కృషి చేసిన టీవీల వాళ్ళని చంపెయ్యాలన్నంత కసి వచ్చింది ఆ క్షణం లో.  


అక్కడి పరిస్థితి, వంటలూ అవీ చూసి కాసేపుండి అందరినీ పలుకరించేసి ఉండబుద్ధి కాక వెనక్కొచ్చేసాము నేనూ శ్రీవారూ.


అపార్టుమెంట్లలో ఇలా కులాల వారీగా విడిపోము, కలిసి చేసుకుంటాము అంటారా?? ఆ సంబరం కూడా చూసాను. పేరుకి కలిసి వెళ్ళినా అక్కడా ఇంచు మించుగా ఇదే సీన్. ఉపన్యాసాలూ వగైరా ఉండకపోవచ్చు కానీ స్థాయీ ప్రదర్శనలు మామూలే.


కుల మత నిర్మూలన అంటూ ఎలుగెత్తి చాటే కొద్దీ అవి మనలో మరింతగా చొచ్చుకుపోయాయి అనిపిస్తోంది నాకు.అన్ని గోడలూ కూల్చేసి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం అనే పెద్ద కార్యం చెయ్య లేకపోయినా మా చిన్నప్పటి లాగ ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఎంత బాగుంటుందో కదా.

దాదాపు ముప్ఫై ఐదేళ్ళయినా మేము మోతుగూడెం లో ఉన్నన్నాళ్ళూ  వెళ్ళిన ఆ పిక్నిక్ ఙాపకాలు ఎప్పుడూ తాజా గానే ఉంటాయి. ఒక్కోసారి కేవలం స్త్రీలూ, పిల్లలు మాత్రమే పిక్నిక్ కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.నిర్భయం గా, భేషజాలు లేకుండా ఆరోజుల్లో  పిక్నిక్ కి వెళ్ళిన వాళ్ళందరిలో కూడా అనుభూతులు తాజా గా నే ఉండి ఉంటాయి అనడం లో సందేహం లేదు.

(మోతుగూడెం వాటర్ ఫాల్స్ అని గూగుల్లో వెతికితే పైన ఇచ్చిన  ఫోటోల్లాంటివే   వస్తున్నాయి. కానీ నాకు గుర్తున్నంతవరకూ ఆ వాటర్ ఫాల్ చాలా ఎత్తు లో నుండి జారి పడేది. నా ఙాపకం తప్పో లేక 35 సంవత్సరాలలో రాళ్ళు నీటి కోతకి గురయ్యాయో. )